సంకలనాలు
Telugu

టీ కప్పులపై బ్రాండ్‌ బజాయిస్తున్న 'కప్ షుప్'

8th Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

టీ వల్ల లాభాలు శతకోటి... ఆ లిస్టంతా అవుతుంది రామకోటి అన్నారో సినీ కవి. టీ వల్ల ఉండే లాభాల సంగతేమో కానీ... టీ కప్పుల వల్ల అద్భుతమైన లాభాలున్నాయంటోంది కప్ షుప్. టీవీలు, రేడియోలు ఎన్నున్నా... టీ కప్పును మించిన అడ్వర్టైజ్‌మెంట్ మీడియం లేదన్నది వీరి వాదన. చెప్పడమే కాదు... ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తున్నారు. గట్టిగా అరుపులుండవ్. అర్థంకాని డైలాగులుండవ్. కళ్లు చెదిరే గ్రాఫిక్స్ అస్సలే ఉండవ్. వాటికంటే ఎపెక్టివ్‌గా, సూటిగా సుత్తిలేకుండా ప్రకటనను అలా జనం మదిలో ముద్రించేస్తారంతే. ఇదీ కప్ షుప్ కహానీ. ఛాయ్ కప్పులపై ప్రకటనల్ని ముద్రించి జనం దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్ అవుతోంది కప్ షుప్ స్టార్టప్.

ఛాయ్ చమక్కులు

ఛాయ్ కప్పులపై అడ్వర్‌టైజ్‌లు ముద్రించాలన్న ఆలోచన ఛాయ్ తాగుతుంటేనే రావడం మరో విచిత్రం. నిజం చెప్పాలంటే ఇలాంటి అద్భుతమైన ఆలోచనలన్నీ ఛాయ్ తాగుతుంటేనే వస్తాయి. భారతీయులకు ఛాయ్‌తో ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఎంత టెన్షన్‌లో ఉన్నా ఒక్క ఛాయ్ తాగితే చాలు... అంతకు మించిన రిలాక్సేషన్ ఉండదు. అలా టీ తాగుతున్న టైమ్ లోనే సిద్దార్థ్ సింగ్‌కు ఈ ఆలోచన వచ్చింది. మజూఫర్‌పూర్‌కు చెందిన సిద్దార్థ్ సింగ్, భోపాల్‌కు చెందిన సునీల్ జైన్... చెన్నైలో ఎంబీఏ ఎంట్రెన్స్ కోసం కలిసి చదువుకున్నారు. కోర్సు చేస్తున్న సమయంలో తరచూ టీ స్టాల్ కు వెళ్తుండేవారు. కోర్సులో ఏవైనా సందేహాలుంటే కటింగ్ ఛాయ్ తాగుతూ చర్చించేవాళ్లు. అలా చాలా సార్లు చాలా సందేహాలకు పరిష్కారాలు దొరికేవి.

"భారతదేశంలో ఛాయ్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఛాయ్ తాగుతున్న సమయంలో ఎన్నో చర్చలు జరుగతుంటాయి. ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతుంటాయి. అద్భుత ఆలోచనలు వస్తుంటాయి. స్నేహితులతో రోడ్డుపక్కనున్న బండి దగ్గర టీ తాగడం నాకు అలవాటు. అక్కడ సినిమాల గురించి, రాజకీయాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఓ పదిహేను నిమిషాలు సరదాగా అలా గడిపేవాళ్లం. ఏదైనా బ్రాండ్ ని ప్రమోట్ చెయ్యాలంటే ఇంతకు మించిన సరైన ప్రదేశం లేదన్నది నా నమ్మకం. టీ కప్స్ నే బ్రాండ్ ప్రమోషన్ కు మాధ్యమంగా మార్చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది" అని చెబుతున్నాడు సిద్దార్థ్.
image


వెంటనే ఆంట్రప్రెన్యూర్షిప్ కోర్సులో జాయిన్ అయ్యాడు సిద్దార్థ్. కప్ షుప్ ఐడియాపై సీరియస్‌గా దృష్టిపెట్టాడు. ముందుగా దీనిపై మార్కెట్ సర్వే చేయాలనుకుని సోషల్ ఎక్స్‌పరిమెంట్ మొదలుపెట్టాడు. అయితే ఈ ప్రయోగానికి తక్కువ సంఖ్యలో కప్స్ ప్రింట్ చేయించడం కష్టమైంది. అందుకే ఓ వంద కప్స్ కొని వాటికి స్టిక్కర్స్ అతికించాడు. సమీపంలోని ఛాయ్ బండి దగ్గర వాటిని పంచాడు. తన క్రియేటివ్ ఐడియాకు సంబంధించి కొన్ని ప్రశ్నలు తయారు చేసుకున్నాడు. కస్టమర్లు టీ తాగడం అయిపోగానే వారిని కలిసి కొన్ని ప్రశ్నలు అడిగాడు. తన సర్వే ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి.

"నేను కస్టమర్లందరినీ పలకరించాను. ఈ ఐడియా గురించి వివరించాను. వాళ్లందరూ టీ తాగేసి కప్పు పడేసిన తర్వాత కూడా కప్పుపై ఉన్న బ్రాండ్‌ను గుర్తుంచుకోగలిగారు. ఈ కాన్సెప్ట్‌కు ఉన్న పవర్ ఏంటో అప్పుడు అర్థమైంది నాకు. ప్రమోషన్‌లో ఇది వినూత్న పద్ధతి అనిపించింది" అంటూ తొలి రోజుల్ని గుర్తు చేస్తాడు సిద్దార్థ్.

ఛాయ్ అడ్డా దగ్గర అనేక అంశాలు చర్చకు వస్తాయి. సామాజిక సమస్యల దగ్గర్నుంచీ యుగాంతం వరకు... ఇక్కడ ఎలాంటి పరిమితులుండవ్. ఇక్కడైతే ప్రకటనలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని తెలుసుకున్నానంటాడు సిద్దార్థ్. ఈ ఐడియా గురించి తన చిరకాల స్నేహితుడైన మాజీ అమెజాన్ ఉద్యోగి సనీల్ జైన్‌తో పంచుకున్నాడు. ఇక పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి కప్ షుప్ స్టార్టప్‌ని మొదలుపెట్టారు. కార్పొరేట్ జీవితాన్ని, ఆంట్రప్రెన్యూర్షిప్ ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు ఈ ఇద్దరు స్నేహితులు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు ఉద్యోగం... సాయంత్రం ఆరు నుంచి రాత్రి వరకు కప్ షుప్ కోసం సమయం కేటాయిస్తున్నారు.

image


విన్‌విన్ ఫార్ములా

కప్ షుప్ ద్వారా ముగ్గురికి లాభమంటారు నిర్వాహకులు. కప్స్ బ్రాండింగ్ చేయడం ద్వారా టీ స్టాల్స్ దగ్గర ఆ బ్రాండ్ గురించి చర్చ జరుగుతుంది. అలా క్లైంట్స్‌కి పబ్లిసిటీ వస్తుంది. ఇక జనానికి కంపెనీల గురించి, ప్రస్తుత ఆఫర్ల గురించి సమాచారం లభిస్తుంది. చివరగా టీ-వెండర్స్‌కి కూడా లాభమే. ఎందుకంటే.. ఆ ఛాయ్ కప్పుల ఖర్చును అడ్వర్టైజర్లు భరిస్తారు కాబట్టి. టీవీల్లో, రేడియోల్లో వచ్చే అడ్వర్టైజ్‌మెంట్లను కస్టమర్లు ఎక్కువసేపు గుర్తుపెట్టుకోలేరు. కానీ పేపర్ టీ కప్స్ మీదుండే ప్రకటనలతో వారి మదిలో ముద్ర పడిపోతుంది. కనీసం ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఆ బ్రాండ్‌ను గమనిస్తూ టీ తాగడం వల్ల అలా గుర్తుండిపోతుంది. దానిపై చర్చ కూడా జరుగుతుంది.

"టీ వెండర్ ఖర్చు ఆదా చెయ్యడమే మా వినూత్న కాన్సెప్ట్ ఉద్దేశం కాదు. అనారోగ్యకరమైన ప్లాస్టిక్ కప్స్‌ని వాడకుండా చూస్తున్నాం. వాటి స్థానంలో పేపర్ కప్పులను తయారు చేస్తున్నాం. మేం రీసైక్లబుల్ డిజైనర్ టీ కప్పులనే అందిస్తున్నాం. తయారీకి టాప్ క్వాలిటీ ఫుడ్ గ్రేడ్ ఇంక్, బయో డీగ్రేడబుల్ రీ సైక్లబుల్ పేపర్ మాత్రమే వాడుతూ పర్యావరణానికీ మేలు చేస్తున్నాం. అందుకే మేం ఎక్కడికి వెళ్లినా స్వాగతం లభిస్తోంది. ఆఫీసు లోపలి వరకు వెళ్లి మేం మా కప్స్ అందివ్వగలుగుతున్నాం" అంటారు సిద్దార్థ్.

క్లైంట్లు... కస్టమర్లు... కప్పులు...

వెయ్యి ఆఫీసులు, నాలుగు వందలకు పైగా కాలేజీలు, రెండు వేలకు పైగా ఛాయ్ వాలాలతో కప్ షుప్‌కి పటిష్టమైన పంపిణీ వ్యవస్థ ఉంది. ముంబై, పూణె, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, నోయిడా, గుర్గావ్‌లల్లో వీరి వ్యాపారం కొనసాగుతోంది. క్లైంట్ల ఆసక్తిని బట్టి పలు కేటగిరీల్లో కప్స్ అందజేస్తున్నారు. ఐటీపార్క్స్, కాలేజీలు, ఆఫీసులు... ఇలా పంపిణీ కోసం పలు కేటగిరీలుగా విభజించారు. కానీ పంపిణీలో వీరికి ఓ చిక్కొచ్చింది. క్లైంట్ల అవసరాలకు తగ్గట్టుగా నగరంలో మ్యాపింగ్ చేయడం కొంత ఇబ్బందిగా మారింది. క్లైంట్ల టార్గెట్ కస్టమర్లు వెళ్లే టీ వెండర్స్‌ని వెతకడం మాకు పెద్ద సమస్యగా మారింది. ఇందుకోసం సిటీ అంతా తిరిగి ఆరా తీయాల్సి వచ్చేది. టీస్టాల్‌కు వేర్వేరు రంగాల వాళ్లు వస్తుంటారు. ఆ చుట్టుపక్కల ఎలాంటి ఆఫీసులు ఉన్నాయన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఐటీ పార్క్ చుట్టూ ఉండే టీ స్టాల్ దగ్గరకు అంతా టెకీస్ వస్తుంటారు. కాలేజీల బయట టీ స్టాల్ ఉంటే విద్యార్థులు ఎక్కువగా వస్తుంటారు.

"ప్రతీ బ్రాండ్ కు టార్గెట్ కస్టమర్లు ఉంటారు. అందుకే మా క్లైంట్ల అవసరాలకు తగ్గట్టుగా కూడా కాలేజీలు, ఐటీ పార్క్స్... ఇలా ఆయా ప్రాంతాలవారీగా టీ వెండర్స్ ని గుర్తించాల్సి వచ్చింది. అలా సిటీ అంతా మ్యాపింగ్ చేయడం కష్టమైంది. అయితే జియో లొకేషన్ ద్వారా టీ వెండర్స్ ని గుర్తించేలా యాప్ ని తయారు చేసుకున్నాం" అని వివరిస్తారు సిద్దార్థ్.
image


సక్సెస్ బాటలో

నవంబర్ 2014లో పైలట్ క్యాంపైన్ ప్రారంభించారు. అప్పుడే కోకాకోలా, స్నాప్‌డీల్, ఫినోలెక్స్, కొటాక్ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, వయాకామ్ 18, ఓలా క్యాబ్స్, ఓయో రూమ్స్, అర్బన్ క్లాప్, ట్రూలీ మ్యాడ్లీ, స్విగ్గీ, టైనీఓల్, బాబాజాబ్ లాంటి ప్రముఖ బ్రాండ్లను క్లైంట్లుగా సంపాదించుకోగలిగారు. మేం సరఫరా చేసే ప్రముఖ బ్రాండ్ల కప్స్‌ని టీ తాగేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ, చెత్త కుప్పల్లో పడెయ్యడం కొంత ఇబ్బందిగా అనిపించింది వీరికి. అందుకే టీ స్టాల్స్ నిర్వాహకులకు డస్ట్ బిన్స్ అందించారు. వాడి పారేసిన కప్స్‌తో చెత్త సమస్యను తీర్చడంతో పాటు వారి టీ స్టాల్‌ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఇవి ఉపయోగడ్డాయి. ఈ కప్స్ దుర్వినియోగం కాకుండా రోజువారీగా కప్స్ సరఫరా చేస్తున్నారు. తద్వారా వేస్టేజ్ కూడా తగ్గుతుంది. ఇందుకోసం ప్రతీ నగరంలో సెంట్రలైజ్డ్ గోడౌన్ నిర్మించుకున్నారు. కప్స్ ప్రమోషన్ కోసం ఇటీవల ప్రముఖ ఎయిర్ లైన్స్ తో టైఅప్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ స్టార్టప్ లాభాల్లో నడుస్తోంది. ప్రతీ నెలా 15 లక్షల వ్యాపారం జరుగుతోంది. 70 లక్షల రూపాయల వరకు ఆదాయం లభించింది. నిస్సందేహంగా ఇది అత్యంత సమర్థవంతమైన, ప్రభావవంతమైన అడ్వర్టైజింగ్ కాన్సెప్ట్ అని రుజువు చేస్తోంది కప్ షుప్.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags