సంకలనాలు
Telugu

అనువాదమూ ఓ సమాజ సేవే !

GOPAL
31st Aug 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

‘‘డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్’’ అన్నది ఇంగ్లీష్ సామెత. పుస్తకపు అట్టను చూసి పుస్తకాన్ని అంచనా వేయొద్దన్నది ఆ సామెత అర్థం. అలాగే మనిషి రూపును చూసి వారెలాంటివారో చెప్పడం కూడా చాలా కష్టం. అందుకు ప్రత్యక్ష్య ఉదాహరణ కర్ణాటకకు చెందిన శైలజ. అందరూ జీవితాన్ని కష్టాలు లేకుండా గడిపేందుకు ప్రభుత్వ ఉద్యోగాన్ని కోరుకుంటే, శైలజ మాత్రం తన సాహిత్య పిపాసను కొనసాగించేందుకు ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకుని అనువాద రంగంలోకి అడుగుపెట్టారు. అనువాదం అవకాశం కల్పించమని కోరేందుకు మా యువర్‌స్టోరీ కార్యాలయానికి వచ్చిన శైలజ జీవితం గురించి మా ప్రతినిధి ప్రతిక్ష నాయక్ అందిస్తున్న కథనం..

అది లంచ్ సమయం. కడుపులో కాలుతోంది. మీల్స్ కోసం ఓపికగా ఎదురుచూస్తున్నాను. భోజనం ఎప్పుడొస్తాందా అని అటూ ఇటూ తిరుగుతూ గుమ్మం వైపు చూస్తున్నాను. మరోవైపు ఓ మధ్యతరగతి మహిళ చేతిలో రెండు పెద్ద పుస్తకాలను పట్టుకుని, మా ఎడిటర్‌తో మాట్లాడటం గమనిస్తున్నాను. ఆ మహిళ తన పేరు మిసెస్ శైలజ జీపీ అని, తాను ప్రభుత్వ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్‌గా పనిచేసి, వైదొలిగానని పరిచయం చేసుకున్నారు. ప్రస్తుతం వివిధ భాషల్లో బెస్ట్ సెల్లర్స్‌ను కన్నడలోకి అనువదిస్తున్నారు. ఆమెను చూస్తే కాస్త ఆసక్తికరంగా అనిపించింది.

వయసు శరీరానికే కానీ మనసుకు కాదంటున్న శైలజ జీపీ

వయసు శరీరానికే కానీ మనసుకు కాదంటున్న శైలజ జీపీ


శైలజ జీవితం కష్టాల మయం. మానసిక వికలాంగురాలైన తల్లికి, ఓ బాధ్యత లేని తండ్రికి జన్మించారామె. బాల్యం చాలా కష్టంగా గడిచింది. అయితే ఆమె పుస్తకాలలో తన జీవితాన్ని చూసుకున్నారు. పుస్తకాలతో ప్రేమను పెంచుకున్నారు. చిన్నప్పటి నుంచే శైలజ పుస్తకాల పురుగు. వివిధ లైబ్రరీలలో గంటలకొద్దీ గడిపారు. అనుకోని ఓ ఘటన జరిగేవరకు ఆమెకు ఆ లైబ్రరీలే ప్రపంచం.

ఎక్కడైతే తాను జీవితాన్ని వెతుక్కునేందుకు ప్రయత్నించారో అక్కడే ఆమె లైంగిక వేధింపులకు గురయ్యారు. ఓ లైబ్రేరియన్ లైంగికంగా దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఆమె అక్కడి నుంచి పారిపోయారు. ఆ ఘటన ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఘటనను మర్చిపోయేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన నుంచి కోలుకుంటున్న సమయంలో అలాంటిదే మరో దాడి. ఈ సారి యోగా ట్రైనర్. రెండో ఘటనతో శైలజ భయోత్పాతానికి లోనయ్యారు. వరుసగా రెండు ఘటనలు జరిగినప్పటికీ తన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వీడలేదు. పుస్తకాలు, యోగాపై ఉన్న ప్రేమను మాత్రం చంపుకోలేదు. ఇంట్లోనే ఆ రెండింటిని ఒంటరిగా ప్రాక్టీస్‌ చేశారు.

కఠిన నిర్ణయం..

సొంతంగా రాసే నైపుణ్యం ఉన్నా ట్రాన్స్‌లేషన్ చేయడం ఎందుకు? ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే శైలజ నవ్వుతూ ఇలా బదులిచ్చారు. రాయడానికి విస్తృత పరిజ్ఞానం అవసరమని, అది తనకు లేదని ఆమె వినయంగా చెప్పారు. తన సాహిత్య జీవితంలో అనువాదం రూపంలో ఆమె రెండో ప్రయాణం మొదలైంది. అయితే ఈ ప్రయాణం కూడా అంత సాఫీగా, ఈజీగా సాగలేదు. 25 ఏళ్ల పాటు శైలజ పనిచేసిన ట్రెజరీ కార్యాలయంలో ఆమెను పుస్తకాలను చదువుకునేందుకు అనుమతి ఇచ్చేవారు కాదు.

‘‘పనికిరాని ముచ్చట్లతో మా కొలిగ్స్ గంటలు గంటలు టైమ్ వేస్ట్ చేస్తున్నా పట్టించుకోని అధికారులు, పుస్తకాలు చదివే నా హాబీపై మాత్రం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేసేవారు. ఐతే దొంగచాటుగా ఒకటి రెండు పేజీలు చదివేదాన్ని ’’ అని తన అనుభవాన్ని ఆమె వివరించారు.

ఉన్నతాధికారుల ప్రవర్తన కారణంగా శైలజ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. జీవితాన్ని సురక్షితంగా ఉంచే ఉద్యోగాన్నే వద్దనుకున్నారు. పుస్తకాలను చదివేందుకు ఏకంగా ఉద్యోగాన్నే వదులుకున్నారు.

రూ. 10 వేలకు ఓ పుస్తకం అనువాద హక్కులను తీసుకున్నారు శైలజ. కూతురు ప్రగతి సాయంతో హలేద్ హొస్సేనీ పుస్తకం ‘‘ది కైట్ రన్నర్‌’’ను కన్నడలోకి అనువదించారు. ఈ పుస్తకాన్ని ప్రభుత్వం నిర్వహించే లైబ్రరీలకు సరఫరా చేశారు. అలాగే కొన్ని రిటైల్ స్టోర్స్‌లలో కూడా పెట్టారు. విదేశీ భాషల్లో వచ్చిన మాస్టర్ పీస్‌లను కూడా కన్నడలోకి అనువదించారు. ఫ్రాన్సిస్ బుచానన్ రాసిన ‘‘ది జర్నీ ఫ్రమ్ మద్రాస్’’ అనే పుస్తకాన్ని ప్రస్తుతం అనువదిస్తున్నారు శైలజ.

శైలజలాంటి ట్రాన్స్‌లేటర్లకు ప్రభుత్వం కూడా చిన్న మొత్తంలో సాయం చేస్తోంది. సంక్లిష్టత, అనువాదంలో ఉండే కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఒక్కో పదానికి రూ.75 పైసలను అందిస్తోంది. ఈ సమస్యలకు తోడు పేమెంట్స్ కూడా చాలా నెమ్మదిగా సాగుతాయి. అలాగే రిటైలర్లు కూడా డబ్బులు ఇవ్వడంలో చాలా సమయం తీసుకుంటారని శైలజ చెప్తారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ పుస్తకాలు, సాహిత్యం అంటే ఉన్న మక్కువను ఆమె చంపుకోలేకపోతున్నారు.

‘‘ఇలాంటి పనులు చేసేందుకు మా కూతురే నన్ను ప్రొత్సహిస్తుంది. ఈ పనిని వదిలివేయాలని నాకు అనిపించినప్పుడల్లా.. అమ్మా నువ్వు చేయగలవంటూ వెన్నుతడుతుంది '' అని తన ప్రయాణ రహస్యాన్ని వివరించారు.

సమాజ సేవకి..

‘‘నేను ఆఫీసుకు వెళ్లే సమయంలో ప్రతిరోజు రోడ్డుపై ప్రమాదాలు జరుగుతుండేవి. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడేది. వాటి నుంచి తప్పించుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ నేను మాత్రం సంబంధింత అధికారులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని వివరిస్తుండేదాన్ని’’ అని శైలజ చెప్పారు. ఈ చర్యల కారణంగా పలువురి జీవితాలను రక్షించడమే కాదు, అధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారామె.

ప్రస్తుతం ఆమె చేస్తున్న ట్రాన్స్‌లేటర్ ఉద్యోగం కూడా మరో విధంగా సమాజ సేవే. మంచి పుస్తకాలను తమ మాతృ భాషల్లో చదువాలనుకునే వారికి శైలజ చేస్తున్న తర్జుమా కారణంగా ఎంతో మేలు జరుగుతోంది. శైలజ ట్రాన్స్‌లేషన్ చేయకపోయి ఉంటే మంచి మంచి సాహిత్య పుస్తకాలు కన్నడిగులు చదవలేకపోయేవారేమో !

‘డబ్బు కోసం పుస్తకాలను అనువాదం చేయడం లేదు. పుస్తకాలు, సాహిత్యం అంటే నాకు ఇష్టం’
యోగా చేస్తున్న శైలజ

యోగా చేస్తున్న శైలజ


సాహస మహిళకు వందనాలు

వయసు శరీరానికే కాని మనసుకు కాదు. 52 ఏళ్ల వయసులోనూ శైలజ చాలా ఉత్సాహంగా కనిపిస్తారు. ఉదయం నాలుగు గంటలకు లేచి యోగా, జిమ్ చేయడం, ఆ తర్వాత తనకు ఇష్టమైన వ్యక్తులను కలవడం, కొత్త కొత్త అవకాశాల కోసం వివిధ ప్రదేశాలకు వెళ్లడం ఆమె దినచర్య. కొత్త అవకాశాల కోసమే శైలజ మా కార్యాలయానికి వచ్చారు. కానీ మమ్మల్నందరినీ ఇన్‌స్పైర్ చేసి వెళ్లిపోయారు. ఆమె వెళ్తూ వెళ్తూ చెప్పిన మాటలు ఇప్పటికీ నా మస్తిష్కంలో తిరిగుతూనే ఉన్నాయి.

‘‘నా వయసును బట్టి నన్ను భారంగా పరిగణించొద్దు. ట్వంటీస్‌లో ఉన్న యువత మాదిరే అన్ని రకాల పనులు చేయగలను. ప్రపంచం మొత్తం ప్రయాణిస్తా, లేట్ నైట్స్ వరకు పనిచేస్తాను. ఇంగ్లీష్‌లో మాట్లాడగలను. ఎలాంటి పని అప్పజెప్పినా ఆ వాతావరణానికి అనుకూలంగా మారిపోతాను’’ అని ఆమె చెప్పారు. ఇరువైలలోనే ముదసలి ఆలోచనలు చేసే నేటి తరం యువతకు శైలజ స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎవరికైనా శైలజకు అనువాద సంబంధిత పనులు ఇవ్వాలనుకుంటే shailaja1.gp@gmail.com సమాచారమివ్వండి.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags