సంకలనాలు
Telugu

ఆ నాలుగేళ్లలో ఎన్నో అవమానాలు.. మరెన్నో ఎదురుదెబ్బలు..

team ys telugu
11th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


కష్టాలు కలకాలం ఉండవంటారు. నిజమే చీకటి తర్వాత వెలుగులాగే కష్టాలు అనుభవించాకే సుఖపడే రోజులొస్తాయి. అయితే అందుకోసం అలుపెరగకుండా శ్రమించాలి. అప్పుడే కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. మనసులో నిరాశ ఆవహించినా మనకు మనం సర్దిచెప్పుకుని ముందుకు సాగాలి. అసలు అలాంటి పరిస్థితి రాకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. అప్పుడే లక్ష్యానికి చేరువవుతాం. ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాం. 

ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఉన్నత స్థానానికి చేరినా మనం ఎక్కడి నుంచి వచ్చామన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. అప్పుడే నలుగురులో ఒకరిగా కాకుండా మనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకోగలుగుతాం. జీవితంలో ఇలాంటి ఎన్నో ఎత్తుపల్లాలు చూసి ఉన్నత శిఖరాలను అధిరోహించినవాడే మనోజ్ తివారీ. నటుడు, గాయకుడు, రాజకీయ నాయకుడిగా అందరికీ సుపరిచితుడైన వ్యక్తి. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని పెద్ద మనసుతో ఆదుకోవడమే కాదు నలుగురికీ తలలో నాలుకలా మారిన ఈ 43 ఏళ్ల వ్యక్తి తన వ్యక్తిత్వం కారణంగానే దేశ ప్రముఖుల్లో ఒకడయ్యారు.

ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గ ఎంపీ అయిన మనోజ్ తివారీ జీవితం నల్లేరుమీద నడకలా సాగలేదు. ఆయన ఈ స్థాయికి చేరుకోనేందుకు ఎంతో కష్టపడ్డారు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. పట్టుదల ఉంటే అసాధ్యమంటూ ఏదీ ఉండదనేందుకు ఆయనే ఉదాహరణ. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని యాక్టర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ గా రాణించడంతో పాటు రాజకీయ నాయకుడిగానూ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న మనోజ్ తివారీ యువర్ స్టోరీకి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలవనుంది.

బీహార్ లోని కైమూర్ జిల్లాకు చెందిన మనోజ్ తివారీ తన బాల్యం గురించి ఏం చెప్పారంటే...

“ఊరిలో ఉన్న అందరి పిల్లల్లాగే నా బాల్యం కూడా కష్టాల మధ్యే గడిచింది. చదువుకునేందుకు రోజూ 4 కిలోమీటర్లు నడిచి స్కూల్ కు వెళ్లడం, రోజంతా చదువుకుని మళ్లీ 4కిలోమీటర్లు నడిచి ఇంటికి రావడం. హాఫ్ ప్యాంట్, బనియన్. పేదరికం కారణంగా ఇదే మా డ్రెస్ కోడ్ అయిపోయింది.”

జీవితంలో ఈ స్థాయికి చేరుకునేందుకు తాను ఎదుర్కొన్న పరిస్థితులు, అనుభవించిన కష్టాలు తలుచుకుంటే అదంతా ఓ కలలా అనిపిస్తుందంటారు మనోజ్ తివారీ. ప్రస్తుతం తన వద్ద ఉన్నవన్నీ దేవుడిచ్చినవే అంటారాయన. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ పోషణ భారం మనోజ్ తల్లిపై పడింది. ఆమే తల్లి తండ్రి అయి కుటుంబాన్ని నడిపించింది. తన తల్లిని గుర్తుచేసుకుని ఉద్వేగానికి గురైన మనోజ్ తివారీ కళ్లు చెమ్మగిల్లాయి.

“ప్రస్తుతం నేను ఉన్నతస్థితిలో ఉన్నానంటే అందుకు కారణం ముమ్మాటికీ మా అమ్మే. అమ్మ నాకు కావాల్సింది ఇస్తూనే ఉండేది. ఇప్పటికీ ఏదో రూపంలో ఇస్తూనే ఉంది. నా జీవితంలో నేను టెన్షన్ పడ్డ సందర్భం ఏదైనా ఉందంటే అది మా అమ్మ ఆందోళనలో ఉన్నప్పుడే. అమ్మను సంతోషంగా చూసినప్పుడే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందుకే అమ్మ కోరికలన్నీ తీరుస్తాను.”అని గర్వంగా చెప్పారు మనోజ్ తివారీ.

undefined

undefined


స్కూల్ లో ఉండగా ప్రభుత్వం ఇచ్చే స్కాలర్ షిప్ తో చదువు నిర్విరామంగా సాగినా... పై చదువుల విషయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు మనోజ్ తివారీ.

“1992లో బనారస్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. అప్పుడు కూడా డబ్బు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అమ్మ ఎంతగా కష్టపడి నా కోసం డబ్బు పంపుతున్నదన్న విషయం తెలుసు. ధాన్యం అమ్ముడు పోయినప్పుడు అమ్మ డబ్బు పంపేది. చాలాసార్లు పంట చేతికి రాక ఇబ్బందులు ఎదురయ్యేవి.”

ఎలాగోలా చదువు పూర్తైంది. ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కానీ సరైన ఉద్యోగం దొరకలేదు. అప్పుడే తనలో దాగిఉన్న ప్రతిభను గుర్తించాడు మనోజ్ తివారీ.

“గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత ఉద్యోగం దొరకకపోవడంతో ఏం చేయాలో తెలియలేదు. ఆ సమయంలోనే ఒక ప్రోగ్రాంలో పాట పాడాను. అందుకుగానూ 1400 రూపాయలు ఇచ్చారు. ఒక్కసారి చేతిలో అంత డబ్బు చూసిన నాకు సింగర్ గా ఎందుకు ప్రయత్నించకూడదు? తన తండ్రి సంగీత వారసత్వాన్ని ఎందుకు కొనసాగించకూడదు? అనిపించింది. సింగర్ కావాలన్న పట్టుదలతో ఢిల్లీకి చేరుకున్నా. ఓ ఎంపీ సర్వెంట్ క్వార్టర్స్ లో ఉన్నా. మ్యూజిక్ డైరెక్టర్లకు పాట వినిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశా. ఆ నాలుగేళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. కొంతమంది తమ ఆఫీసుల నుంచి వెళ్లగొట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఓటమి అంగీకరించలేదు. మరింత పట్టుదలతో ప్రయత్నించా. మనలో ప్రతిభ ఉంటే మనకూ ఓ రోజు వస్తుందన్న నమ్మకం నిజమైంది. టీ సీరీస్ యజమాని గుల్షన్ కుమార్ నా పాట విన్నారు. నేను పాడిన పాట సూపర్ హిట్టైంది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.”

పంజాబీ కవి అవతార్ సింగ్ అన్నట్లు కలలను సాకారం చేసుకోకపోవడం కన్నా దారుణం మరొకటి ఉండదు. మనోజ్ తివారీ కూడా ఇదే అంటారు. యువతీయువకులు ముందుగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికి సంబంధించి కలలు కనాలి. వాటిని నిజం చేసుకోవాలన్నది మనోజ్ తివారీ అభిప్రాయం.

“జీవితంలో కన్న మూడు కలలు నిజమయ్యాయి. ఓ పెద్దింటి అమ్మాయి నా పాట విని ఇష్టపడాలనుకోవడం మొదటిది. అది నిజమైంది. రెండోది అమితాబ్ బచ్చన్ ను కలిసినప్పుడు ఆయన తన కొడుకు అభిషేక్ బచ్చన్ ను పరిచయం చేయడం. ఈ కల కూడా నూటికి నూరుపాళ్లు నిజమైంది. 

యశ్ రాజ్ ఫిల్మ్ షూటింగ్ సమయంలో అమితాబ్ గారిని కలిశా. ఆయనతో పాటు అభిషేక్ బచ్చన్ కూడా ఉన్నారు. నేను ఏ కలైతే కన్నానో అక్షరాలా నిజమైంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ ను కలవాలనుకున్నది మూడో కల. కానీ వాజ్ పేయ్ అనారోగ్యం కారణంగా ఆయనను కలవడం సాధ్యం కాకపోయినా... ప్రధాని నివాసానికి వెళ్లినప్పుడల్లా వాజ్ పేయ్ కూడా గతంలో ఈ ఇంట్లోనే ఉండేవారన్న ఆలోచన ఎంతో ఉత్తేజాన్నిస్తుంది.”

జీవితంలో ఎంతో సాధించినా మనోజ్ తివారీ కల ఒకటి ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. అదే భోజ్ పురిని అధికారిక భాష హోదా కల్పించడం. “భోజ్ పురి భాషా తల్లిలాంటిది. అందులోని కమ్మదనం వెలకట్టలేనిది. ఎనిమిది దేశాల్లో భోజ్ పురికి అధికారిక గుర్తింపు లభించినప్పుడు మనదేశంలో మాత్రం ఎందుకు గుర్తించరు. తల్లిలాంటి భోజ్ పురిని అమ్మను గౌరవించినట్లే గౌరవించాలి. 22-24 కోట్ల మంది మాట్లాడే ఈ భాషకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు ప్రధానమంత్రి ప్రయత్నిస్తారనుకుంటున్నా. భోజ్ పురికి అధికారిక భాష హోదా కల్పించేందుకు కృషి చేస్తున్నా.”

వర్తమానంలో బతకడమంటే మనోజ్ తివారీకి ఇష్టం. ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని కచ్చితంగా పూర్తి చేస్తారు. వేర్వేరు రంగాల్లో అడుగుపెట్టినా ప్రతి పనిని అంతే శ్రద్ధగా చేస్తారు. ఇదే ఆయన విజయ రహస్యం.

“పాట పాడేటప్పుడు అందులో నిమగ్నమైపోతాను. ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ప్రజల మనిషినై పోతాను. వర్తమానానికి ఎప్పుడూ ప్రాధాన్యమిస్తాను.”

నిజాయితీతో లోటుపాట్లను సవరించుకున్నవారే విజయం సాధిస్తారు. తనలోని లోపాలను, ప్రతిభను అర్థం చేసుకున్నపుడే మనిషి పరిపూర్ణుడవుతాడు. జీవితంలో ఎదరయ్యే సమస్యల్ని ధీటుగా ఎదుర్కొని ముందుకు సాగినప్పుడే గమ్యం చేరుకోగలం. మనోజ్ తివారీ ఈ మూడు సిద్ధాంతాలను ఆచరించి విజయం సాధించారు. స్వశక్తితో ఆయన సాధించిన విజయం కోట్ల మందికి స్ఫూర్తిదాయకం.

అనువాదం: ఉదయ్ కిరణ్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags