సంకలనాలు
Telugu

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి కమ్మగా వడ్డించే క్యాటరింగ్ బిజినెస్‌లోకి

కస్టమర్లకు ప్రేమానురాగాలను పంచుతున్న హోటల్ఇన్ఫోసిస్ ఉద్యోగం వదిలి కేటరింగ్ సర్వీసెస్‌కు శ్రీకారంఆహా ఏమి రుచి అంటూ కస్టమర్ల కితాబు

Sri
20th Jul 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

హోటళ్లల్లో ఎంత రుచికరమైన ఆహారం దొరికినా... ఇంటి భోజనమంటేనే ఎవరికైనా ఇష్టం ఎక్కువ. జయంతి కఠాలేకి ఈ విషయం బాగా తెలుసు. అందుకే ఆమె ఇంటిభోజనాన్ని, సంప్రదాయ వంటకాల్ని అందించేందుకు పూర్ణబ్రహ్మ క్యాటరింగ్ సర్వీస్‌ను బెంగళూరులో ప్రారంభించారు. రుచికరమైన ప్రాంతీయ వంటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది పూర్ణబ్రహ్మ. ముఖ్యంగా మరాఠీ వంటకాలకు ప్రసిద్ధి. మార్కెట్లో ఇన్ని హోటళ్లు ఉండగా పూర్ణబ్రహ్మ ప్రత్యేకత ఏంటనుకుంటున్నారా? ఇదే ప్రశ్న జయంతిని అడిగితే "ప్రేమతో, ఇష్టంతో నేను వండి వడ్డించడమే" అంటూ నవ్వుతూ గర్వంగా చెబుతారు జయంతి. ఈ విషయంలో స్టార్ షెఫ్ లు కూడా తనతో పోటీపడలేరన్నది ఆమె ధీమా. ఆమెకు వండిపెట్టడం ఎంత ఇష్టమంటే... ఇన్ఫోసిస్‌లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాన్ని కూడా వదిలేశారు. అసలు వంటలంటే ఆమెకు ఎందుకంత ఇష్టం ? తన అభిరుచిని జయంతి కెరీర్ గా ఎలా మల్చుకున్నారు ?


మరాఠీ వంటకాలకు కేరాఫ్ అడ్రస్

జయంతి కఠాలే... ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన మహిళ. 2004లో బెంగళూరు వచ్చారు. ఆ తర్వాత బ్రిస్టిల్ కోన్ సంస్థలో పనిచేశారు. కొన్నాళ్లకు ఆ సంస్థ మహీంద్రా కన్సల్టింగ్ గ్రూప్ లో భాగమైంది. అక్కడ ఉద్యోగం చేస్తూనే తన అభిరుచి అయిన వంటలపై ఆమె దృష్టిపెట్టారు. మరాఠీ వంటకం అయిన మోదక్(కుడుములు)ను ఇంట్లో తయారు చేసి ఆర్కుట్ ద్వారా జనానికి పరిచయం చేశారామె. ఒక్క ఏడాదిలోనే వ్యాపారం బాగా పుంజుకుంది. ఒకరి ద్వారా మరొకరికి రుచికరమైన మోదక్ గురించి తెలిసింది. వ్యాపారం మరింత అభివృద్ధి చేయాలనుకున్న సమయంలో విధి విచిత్రం మరోలా ఉంది. ఆమె చేసుకున్న ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. 2006లో జయంతి భర్తకు ఆస్ట్రేలియాకు ట్రాన్స్‌ఫర్ అయింది. దాంతో ఆమె భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లినా ఆమె మనస్సు వంటలపైనే ఉంది. అక్కడే ఇంపాక్ట్ డాటా అనే చిన్న కంపెనీలో పనిచేస్తూనే తన అభిరుచిని కొనసాగించారు జయంతి. ఆస్ట్రేలియాలో నివసించే భారతీయుల కోసం హోమ్ మేడ్ స్వీట్స్‌తో పాటు భారతీయ వంటకాలను పరిచయం చేశారామె. 2008లో ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చాక తన ఫేవరెట్ మహారాష్ట్ర వంటకమైన మోదక్‌ను మళ్లీ అమ్మడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు ఓ బిడ్డ పుట్టిన తర్వాత ఇన్ఫోసిస్‌లో ప్రాజెక్ట్ మేనేజర్ గా చేరారు జయంతి. ఏ ఉద్యోగం చేసినా తన కేటరింగ్ బిజినెస్ ను మాత్రం వదిలిపెట్టలేదు.

"దీపావళి సమయంలో డిమాండ్ బాగా పెరిగింది. మేం హోం డెలివరీ చేయడం మొదలుపెట్టాం. హోం డెలివరీ అందరికి కాకుండా కొందరికే పరిమితం చేశాం. యువతీయువకులెవరైనా ఆర్డర్ ఇస్తే... వాళ్లనే వచ్చి వంటకాలను తీసుకెళ్లమని చెప్పేవాళ్లం. ఒకవేళ వృద్ధులు ఆర్డర్ ఇస్తే మేమే తీసుకెళ్లి ఆహారపదార్థాలను ఇచ్చేవాళ్లం. అంతే కాదు... వాళ్లతో మాట్లాడటానికి కొంత సమయాన్ని వెచ్చించేవాళ్లం" అంటారు జయంతి.
పూర్ణబ్రహ్మ సిబ్బందితో జయంతి

పూర్ణబ్రహ్మ సిబ్బందితో జయంతి


వీళ్ల వ్యాపారం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుండగానే ఓ ఘటన వీరి వ్యాపార స్వరూపాన్ని మార్చేసింది. అప్పట్నుంచీ ఈ వ్యాపారాన్ని మరింత ఇష్టంతో చేస్తున్నారు. ఆ సంఘటనను గుర్తు చేస్తూ... చూడ్డానికి తినే వంటకాలే అయినా మానవసంబంధాలు, ప్రేమానురాగాలపై వాటి ప్రభావం ఉంటుందంటారు జయంతి. "ఓ రోజు ఓ పెద్దాయన మాకు ఫోన్ చేశారు. తాను వచ్చి కొన్ని దీపావళి వంటకాలను తీసుకెళ్తానని చెప్పాడు. మీరు రావడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన చోటికి మేమే తీసుకొచ్చి ఇస్తామని చెప్పాం. కానీ ఆయన మా మాట వినలేదు. స్వయంగా తానే వచ్చాడు. నేను డోర్ తీయగానే ఆయన నేరుగా లోపలికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన్ను చూస్తే తను ఏదో బాధలో ఉన్నాడని మాకు అర్థమైంది. ఆయన నెమ్మదించేవరకు మేం ఏమీ అనలేదు. అలాగే ఉండిపోయాం. ఆ తర్వాత ఆయన చెప్పేది వినడం మొదలుపెట్టాం. ఆయనో రిటైర్డ్ ఐఏఎఫ్ ఆఫీసర్. ఉన్న ఇద్దరు తనయులు పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు. 18 ఏళ్లుగా తన కొడుకులను చూడలేదని చెబుతూ ఆయన ఏడవడం మొదలుపెట్టాడు. మీరెప్పుడైనా అక్కడికి వెళ్లారా అని నేనడిగాను. 'వెళ్లాం కానీ అక్కడ ఉండలేకపోయాం' అని చెప్పాడు. నా భార్య 40-45 ఏళ్లుగా కొడుకులిద్దరి కోసం లడ్డూలు చేస్తోంది. కానీ ఇఫ్పుడు ఆమె కీళ్ల నొప్పులతో మంచానికి పరిమితమైపోయింది. మీరు కూడా అవే వంటకాలను ఇంట్లో తయారు చేస్తారని విన్నాను. అందుకే కొనితీసుకెళ్దామని వచ్చాను" ఆయన చెప్పడం వింటే మా గుండె తరుక్కుపోయిందని అంటారు జయంతి.

image


"మేము ఓసారి ఆయన ఇంటికి వెళ్లాం. ఆయన భార్యను చూసి మరింత చలించిపోయాం. ఎందుకంటే ఎప్పుడు కాలింగ్ బెల్ మోగినా తన కొడుకే వచ్చాడేమోనని మురిసిపోతుంది ఆ తల్లి. అమెరికా వెళ్తే అయినా కొడుకులతో కలిసి ఉండే అవకాశం ఉందని నా భర్త వాళ్లతో చెప్పాడు. కానీ 106 ఏళ్ల అత్తమ్మను ఎక్కడ వదిలివెళ్లాలని ఆ పెద్దాయన ప్రశ్నించాడు. వాళ్ల జీవితంలోని పరిణామాలన్నీ చూస్తే మా గుండెపగిలిపోయింది. ఆ రోజు రాత్రి మేం ఏమీ తినలేదు. అప్పుడే మాకు అనిపించింది. జీవితంలో చాలా కోల్పోతున్నామని బాధపడుతున్న వారికి... మా సాంప్రదాయ వంటకాలను అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపాలని, సంతోషం తీసుకురావాలని నిర్ణయించుకున్నాం" అంటారు జయంతి.
image


నిజమే. కుటుంబాలకు దూరంగా నివసించేవాళ్లు... అప్పుడప్పుడు ఇలాంటి ఇంటిభోజనాన్ని ఆస్వాదిస్తే... తమవాళ్లకి దూరంగా ఉన్నామన్న బాధ కొంతైనా తీరిపోతుందన్నది జయంతి ఆలోచన. అందుకే అలాంటి వారికోసం సాంప్రదాయ వంటకాలను అందించేందుకు జయంతి 'పూర్ణబ్రహ్మ'ను ప్రారంభించారు. "మా కంపెనీల్లో అప్పుడే బోనస్‌లు ఇచ్చారు. డైమండ్ నెక్లెస్ కావాలా లేక కొత్త కారు కావాలా అని మా ఆయన అడిగారు. కానీ వీటి బదులు ఆ డబ్బుతో 'పూర్ణ బ్రహ్మ' ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం" అని జయంతి వివరించారు. సొంతూరి నుంచి వంటమనిషిని పిలిపించి జూన్ 2013లో 'పూర్ణ బ్రహ్మ'ను ప్రారంభించారు. మిగతావాటితో పూర్ణబ్రహ్మకు ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ అన్ని పండుగలను, వేడుకలను సెలబ్రేట్ చేస్తారు. వాలెంటైన్స్ డే అయినా... రక్షా బంధన్ అయినా... ఇక్కడ సందడి కనిపిస్తుంది. అన్ని సంప్రదాయాలను గౌరవిస్తారు. వీరి హోటల్ కు వచ్చే అతిథుల పుట్టినరోజులను సెలబ్రేట్ చేస్తారంటే ఎంత ఆప్యాయంగా చూస్తారో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ మహారాష్ట్ర వంటకాలతో భోజనం తప్పనిసరిగా ఉంటుంది. వచ్చామా... తిన్నామా... వెళ్లిపోయామా... అన్నట్టు కాకుండా హోటల్ బిజినెస్ ద్వారా ఆప్యాయతలు, ప్రేమానురాగాలను పంచుతున్న పూర్ణబ్రహ్మకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. వీరి గొప్పదనం ఒకరిద్వారా మరొకరికి తెలిసి వ్యాపారం బాగా నడుస్తోంది. ఓ మాజీ ఆర్మీ ఆఫీసర్ వీరి గురించి బ్లాగ్‌లో గొప్పగా రాశాడు. అంతే కాదు ఫేస్ బుక్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. జొమాటో లాంటి వెబ్ సైట్స్ లో మంచి మంచి రివ్యూలు వస్తున్నాయి.

తన ఈ ప్రయాణం ద్వారా నేర్చుకున్న పాఠాలను జయంతి ఇలా వివరిస్తారు...

1. మీ కలల వెంట నిత్యం పరిగెత్తుతూ ఉండండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆశలు వదులుకోవద్దు.

2. అబద్ధం చెప్పొద్దు. నిజాయితీనే జీవితాన్ని నిలబెడుతుంది.

3. మీ కలలు, ఆశయాలు నెరవేర్చుకునేందుకు తోడుగా, మద్దతుగా నిలబడేవారు ఎప్పుడూ ఉండాలి.

ప్రేమానురాగాలు అనే విస్తరిలో... ఆప్యాయతలు కలిపిన భోజనాన్ని వడ్డించి... అనుబంధాలను పంచే పూర్ణ బ్రహ్మ నిజంగా అన్నం పెట్టే అన్నపూర్ణ.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags