క్యాబ్ డ్రైవర్ రాసిన ఆ లెటర్ హృదయాంతరాల్లోకి వెళ్లి ఆలోచింపజేస్తోంది ..?

15th Dec 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
closeఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత మహిళలు ఒంటరిగా ప్రయాణించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నా ఎక్కడో చోట అత్యాచార వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. దాంతో మహిళలు క్యాబ్ అంటేనే హడలిపోతున్నారు. దీన్ని అవమానంగా భావించిన ఢిల్లీ ఓ క్యాబ్‌ డ్రైవర్‌ తన సహచరులకు ఒక ఉత్తరం రాశాడు. అయితే అది సాదా సీదా లెటర్ కాదు. అతను రాసిన ప్రతీ అక్షరం చదివిన ప్రతీ ఒక్కరి హృదయాంతరాల్లోకి వెళ్లి ఆలోచింపజేస్తోంది. సోషల్‌ మీడియాలో అతను రాసిన లేఖ వైరల్‌గా మారింది. అదేంటో మీరూ చదవండి.

ప్రియమైన సోదరీ సోదరులారా..

నేను సాధారణ క్యాబ్ డ్రైవర్‌ని మాత్రమే. సూక్తులు చెప్పేంత పెద్దవాణ్ని కాదు. ఎందుకంటే నేను గొప్పగా చదువుకోలేదు. అనుభవం కూడా లేదు. నీతులు చెప్తున్నాను అని అనుకోనంటే.. చిన్న సందేశం ఇస్తాను. దయచేసి ఈ ఉత్తరాన్ని పదిమందికీ చూపించండి.

నేను ఢిల్లీకి వచ్చి దాదాపు 10 ఏళ్లు కావొస్తోంది. ఒక రంగుల ప్రపంచాన్ని ఊహించుకుంటూ ఇక్కడ అడుగుపెట్టాను. 22 ఏళ్ల వయసప్పుడే పొట్టచేత పట్టుకుని ఇల్లు వదిలిపెట్టాను. బహుశ నాకు తెలిసి ఆ సమయంలో నా వయసు వాళ్లెవరూ మా ఊరినుంచి బయటకు రాలేదు. మాది ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లా. మా నాన్న దినసరి కూలీ. ఇంటిల్లిపాదికీ నాలుగు వేళ్లు నోట్లోకి పోవడమే గగనం. పేద బతుకులు. ఎలాగోలా ముక్కీ మూలిగీ పదో క్లాస్ అయిందనిపించాను. ఆ తర్వాత కొద్ది రోజులు వ్యవసాయమనీ, మిషన్ వర్కనీ, ఆ పనీ ఈ పనీ చేశాను. అదృష్టంకొద్దీ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. అందులో పర్ ఫెక్ట్ అయ్యాను. నా మీద నమ్మకంతో నాన్న నన్ను ఢిల్లీ రైలెక్కించాడు. బయల్దేరేటప్పుడు నా మనో ఫలకం ఢిల్లీ తళుక్కున మెరిసింది. ఏవేవో రంగుల కలలు. ఎడతెగని ఊహలు. ఫైనల్ గా దేశరాజధానిలో కాలుమోపాను. ఆశ్చర్యం. ఇక్కడ మనుషులు ఒకరినొకరు పలకరించుకోరు. ఎవరినీ ఎవరూ పట్టించుకోరు. ఉదయం నుంచీ పరీక్షగా చూశాను. అర్ధరాత్రయినా ఎవరూ ఎవరినీ పలకరించరే.. చుట్టూ మనుషులున్నారు గానీ ఒక్కరూ మాట్లాడరే..! నిజంగా ఆశ్చర్యమేసింది!!

ఎలాగోలా కష్టపడి క్యాబ్ డ్రైవర్ గా ఉద్యోగం సంపాదించాను. డ్రైవింగ్ మొదలైన మొదటి రోజే బిత్తరపోయాను. ముఖ్యంగా ఢిల్లీ అమ్మాయిలు. వాళ్లు గట్టిగట్టిగా మాట్లాడే తీరుకి కంగారు పడిపోయాను. ఖర్మకాలి టర్న్ తీసుకోవడం మరిచిపోయినా, చిల్లర లేదు మేడం అన్నా.. వాళ్లు వినరు. మీద పడి కరిచినంత పనిచేస్తారు. నువ్వు.. అని ఏకవచనంతో సంబోంధిస్తారు. అప్పుడనిపించేది నా ఊరికి ఇక్కడికీ ఎంత తేడా అని. అక్కడైతే అమ్మాయి అబ్బాయి పొరపాటున కూడా పక్కపక్కన నడవరు. కనీసం నడిచే ధైర్యం కూడా చేయరు. కానీ ఇక్కడ పూర్తిగా భిన్నం. ఇక్కడి కల్చర్, ఇక్కడి సంస్కృతి, కట్టుబొట్టు చూసి షాకయ్యాను. మగవాళ్లతో ఎంతైనా వాగ్వాదానికి దిగొచ్చు. కానీ ఢిల్లీ అమ్మాయిలతో అలా కుదరదు. 

ఒక్కోసారి లేట్ నైట్ పికప్స్ ఉంటాయి. ఆ టైంలో అమ్మాయిలు చిన్నచిన్న బట్టల్లో కనిపిస్తారు. అలాగే క్యాబ్ ఎక్కుతారు. ముందు సీట్లో వాళ్లు కంఫర్ట్‌ గానే కూర్చుంటారు. కానీ ఎటొచ్చీ డ్రైవింగ్ సీట్లో ఉన్న నా పరిస్థితే అయోమయంగా ఉంటుంది. వీళ్లేంటి.. ఈ అవతారమేంటి.. అని మనసులో తిట్టుకునేవాడిని. బాధపడేవాడిని.

image


అయితే రియలైజ్ కావడానికి నాకు ఎంతో టైం పట్టలేదు. మారాల్సింది వాళ్ల బట్టలు కాదు.. మన మైండ్ సెట్ అని అర్ధమైంది. రోజులు గడుస్తున్నాయి. సిటీలో నేను పాతబడ్డాను. కొంత మెచ్యూర్డ్‌ గా ఆలోచించడం మొదలుపెట్టాను. అమ్మాయిల డ్రెస్సింగ్ పట్ల నా వైఖరి మారింది. అదే షార్ట్ వేసుకుని ఒక అబ్బాయి ముందు సీట్లో కూచుంటే కనుబొమ్మలు ఎగరేసి ఎగాదిగా చూస్తామా? మరి అమ్మాయిల విషయంలో ఎందుకలా ప్రవర్తిస్తాం? ఆమె వేసుకున్న బట్టల మీద ఇష్యూ చేయాల్సిన అవసరమేంటి? మగవాళ్లయితే ఒకలాంటి చూపులు.. ఆడవాళ్లయితే మరోలా అనుకోవాల్సిన అవసరమేంటి? ఇలాంటి ప్రశ్నలన్నీ నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆధునిక పోకడల ప్రపంచం గురించి మా వాళ్లకు చెప్పాను. ఇక్కడి పద్ధతుల గురించి వివరించాను.

2014 చివర్లో అనుకుంటా. ఒక క్యాబ్ డ్రైవర్ ఒకమ్మాయిని రేప్ చేశాడనే వార్త మీరు వినేఉంటారు. సరే.. తప్పు తప్పే. కాదనను. కానీ గ్రామాల్లోంచి వచ్చే డ్రైవర్లే ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడతార అని ఏకపక్షంగా మాట వదిలేస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఎవరో ఒకరు చేసిన పనికి.. అందరినీ ఒకే గాటన కట్టేస్తామంటే ఎలా కుదురుతుంది?

డ్రైవర్ అంటే ఒక రక్షకుడితో సమానం. వాళ్లను రోడ్డుమీద జాగ్రత్తగా తీసుకెళ్లాలి. ఇంటిదగ్గరో, ఆఫీసు ముందో పదిలంగా దింపాలి. మనల్ని నమ్ముకుని వాళ్లు బండెక్కారు కాబట్టి.. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి.

అందుకే నాలాంటి క్యాబ్ డ్రైవర్లకు నేనొకటి చెప్పదలుచుకున్నాను. కేవలం ప్యాసింజర్లను పికప్- డ్రాప్ చేయడం.. డబ్బు సంపాదించడం.. ఇదే పరమావధి కాదు. మన క్యాబ్ ఎక్కేది మగయినా, ఆడయినా వాళ్ల భద్రత మనకు ముఖ్యం. దాంతోపాటు మన ప్రవర్తన కూడా బాగుండాలి. ప్యాసింజర్ల మనసు గెలవడం కంటే గొప్పతనం మరొకటి లేదు. ఈ మధ్య మహిళలు మన కారు రాగానే నాలుగైదు ఫోటోలు తీసి ఇంటికి పంపి, నెంబర్ వగైరా వివరాలు స్నేహితులకు చెప్పి, బెరుకు బెరుకుగా సీట్లో కూర్చుంటున్నారు. దయచేసి ఆ పరిస్థితి తేవొద్దని విన్నవించుకుంటున్నా.

జై హింద్!

మీ సాహిల్.

(సాహిల్ తోమర్ ప్రస్తుతం ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీసులకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు)

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India