సంకలనాలు
Telugu

సన్‌రైజ్ ఏపీకి రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు

12th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

331 అవగానా ఒప్పందాలు, 4.8 లక్షల కోట్ల పెట్టబడులు, 10 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు.. ఇదీ మూడు రోజుల పాటు విశాఖ వేదికగా సాగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు సారాంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 'సన్ రైజ్ స్టేట్'గా ప్రమోట్ చేసి.. పెట్టుబడులను ఆకర్షించడమే ఏకైక టార్గెట్‌గా పెట్టుకున్న ఏపి సిఎం చంద్రబాబు ఇందులో సక్సెస్‌ సాధించారు. దేశవిదేశాల నుంచి కార్పొరేట్ ప్రముఖులను ఆకర్షించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన పెట్టుబడి హామీలనే పొందారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సారి ఐటి హంగామా తగ్గి మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్ రంగాల జోరే ఎక్కువగా కనిపించింది. శ్రీకాళహస్తి నుంచి శ్రీకాకుళం వరకూ అన్ని ప్రాంతాలూ కవర్ అయ్యేలా పెట్టుబడి ప్రతిపాదనలు రావడం కూడా ప్రోత్సాహకర విషయమే.

image


పార్ట్‌నర్షిప్ సమ్మిట్... పెట్టుబడులను ఆకర్షించడంలో బంపర్ హిట్ అయింది. మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన ఈ సమావేశాలు ప్రోత్సాహకర వాతావరణంలో మగిశాయి. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్ కంపెనీలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తమ సంసిద్ధతను వ్యక్తం చేసింది. మొదటి రోజు డిఫెన్స్, ఆటోమొబైల్ రంగాలకు పరిమితమైన అవగాహనా ఒప్పందాలు రెండో రోజు రిటైల్, అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్‌ రంగాలకు విస్తరించింది. ఈ సందర్భంగా రిటైల్ పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చివరి రోజున పర్యాటక రంగానికి సంబంధించిన అవగాహనా ఒప్పందాలు ఎక్కువగా కుదిరాయి. అంతే కాకుండా కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున హామీల వర్షం కురిసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పెట్టుబడులు విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి జాగ్రత్త పడింది. ఐటి రంగానికి మాత్రమే పరిమితం కాకుండా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్ద పీట వేశారు. పోర్టులను అభివృద్ధి చేసి గుజరాత్‌తో పోటీపడేందుకు ఏపి సర్కార్ సిద్ధమవుతోంది.

image


కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, జయంత్ సిన్హా, అనంత కుమార్ సహా.. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి ఉన్నతాధికారులు హాజరయ్యారు. కార్పొరేట్ దిగ్గజాల్లో అనిల్ అంబానీ, ఆది గోద్రెజ్, గ్రంధి మల్లికార్జున రావు, బాబా కళ్యాణి, కిషోర్ బియానీ వంటి వాళ్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. నలభైకి పైగా దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి రాష్ట్రంలోని అవకాశాలను పరిశీలించి, పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. ఫార్మా, విద్యుత్ కంపెనీలకు పరిమితమైన విశాఖ ప్రాంతం.. భవిష్యత్తులో డిఫెన్స్ రంగానికి కూడా వేదిక కాబోతోందని అనిల్ అంబానీ వెల్లడించారు. రాంబిల్లిలో నేవల్ బేస్‌ ఏర్పాటుకు రూ.5 వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్టు ప్రకటించారు. నెల్లూరులో రూ.1200 కోట్లతో ఆటోమోటివ్ హబ్ ఏర్పాటు చేయబోతున్నట్టు భారత్ ఫోర్జ్ అధినేత బాబా కళ్యాణి ప్రకటించారు. గుంటూరు, విజయవాడ, అమరావతి నగరాలకు పైప్డ్ గ్యాస్ అందించాలనే లక్ష్యంతో కృష్ణపట్నం పోర్టులో రూ.3 వేల కోట్లతో గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు చేయబోతున్నట్టు పెట్రోగ్యాస్ సంస్థ వెల్లడించింది. 11 సంస్థలో చిత్తూరు శ్రీసిటీ అవగాహన కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల విలువ దాదాపు రూ.12 వేల కోట్లు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కుదిరిన 65 ఎంఓయూల విలువ దాదాపు రూ.6 వేల కోట్లు. స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని రెట్టింపు చేస్తామని ఫాక్స్‌కాన్ సంస్థ తెలిపింది. వచ్చే మూడేళ్లలో రూ.5 వేల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌ చేయబోతున్నట్టు అమరరాజా సంస్థ కూడా ప్రకటించింది.


'' బలమైన నాయకులు ఇంపాజిబుల్‌ను పాజిబుల్ చేసి చూపిస్తారు. వాళ్ల ఆలోచనా ధోరణే వేరుగా ఉంటుంది '' - అనిల్ అంబానీ, అడాగ్ గ్రూప్ ఛైర్మన్
image


విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ నిర్మాణానికి 840 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రకటించింది. రాజధాని నిర్మాణం కోసం హడ్కో రూ.7500 కోట్లు, ఆంధ్రా బ్యాంక్ రూ.5 వేల కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని స్పష్టమైన ప్రకటనలు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తన మద్దతు తెలిపింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ రూ.38500 కోట్ల పెట్టుబడితో విస్తరణ, కొత్త ప్రాజెక్టుల అభివృద్ధి చేపడ్తామని స్పష్టం చేసింది. పుట్టపర్తిలో 4 వేల మెగావాట్లతో విద్యుత్ ప్లాంట్, ఆంధ్రలో మరో ప్రాంతంలో 2250 మెగావాట్లతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. 20 వేల కోట్లతో మెడికల్ డివైజ్ పార్క్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. 100 ఎకరాల్లో విశాఖలో నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ - (నైపర్) నెలకొల్పుతామని కూడా హామీనిచ్చారు. విజయవాడలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా ఏర్పాటు చేస్తామి ప్రకటించారు. హెచ్‌పిసిఎల్ - గెయిల్‌ భాగస్వామ్యంతో రూ.30 వేల కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ నిర్మిస్తామని కూడా కేంద్రం నుంచి స్పష్టమైన హామీవచ్చింది. విశాఖలో హెచ్‌పిసిఎల్ పెట్రోకెమికల్ రీజియన్‌ను విస్తరించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.


'' పెట్టుబడులకు ఏపి అనువైన రాష్ట్రం. ఇక్కడ ప్రస్థానం ప్రారంభించిన నేను దేశ, విదేశాలకు విస్తరించాను'' - జిఎంఆర్
image


పర్యాటక రంగంలో కూడా 7840 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదిరాయి. విజయవాడలో ఏడున్నర ఎకరాల్లో ఎనిమిది వేల సీటింగ్ కెపాసిటీ గల అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్, ఫోర్ స్టార్ హోటల్ ఏర్పాటు చేయబోతున్నట్టు మురళీ ఫార్చ్యూన్ సంస్థ ప్రకటించింది. 10 వేల ఎకరాల్లో 73 వేల కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ సిద్ధం చేస్తామని ఎస్సెల్ గ్రూప్ స్పష్టం చేసింది.

'' ఒక్క ఐటి వెంటపడకుండా అభివృద్ధిలో వివిధ రంగాల భాగస్వామ్యం ఉండేలా జాగ్రత్త పడ్డాం. ఆశ్చర్యంగా ఈ సారి చిన్న, మధ్య తరహా కంపెనీలు ఎన్నో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి'' - సురేష్ చిట్టూరి, సిఐఐ ఏపి ఛైర్మన్

మూడు రోజుల పాటు సాగిన విశాఖ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు ఏపి సిఎం చంద్రబాబులో విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. రాష్ట్ర రాజధాని నిర్మాణం సహా.. కొత్త ఉద్యోగాల రూపకల్పనకు మార్గం సుగమమైనట్టు కనిపిస్తోంది. వచ్చే ఏడాది కూడా ఈ సదస్సు విశాఖలో జరుగుతుందని సిఐఐ స్పష్టం చేసింది. దావోస్‌లా ప్రతీ ఏడాదీ పారిశ్రామికవేత్తలతో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసే అంశాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags