సంకలనాలు
Telugu

కుక్, డ్రైవర్, గార్డ్... కేరాఫ్ 'హెల్పర్ ఫర్ యు'

పనిమనుషులు, డ్రైవర్ల కోసం 'హెల్పర్ ఫర్ యు'ట్రైనర్ల కోసం 'క్లిక్ ఫర్ కోచ్'జాబ్ పోర్టల్ లో సరికొత్త ట్రెండ్ స్టార్టప్ కోసం టాటాలో జాబ్ కి బైబై చెప్పిన మీనాక్షి

Sri
4th Sep 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

మీరు చేయాలనుకున్నది మనస్ఫూర్తిగా చేసెయ్యండి. ఫలితాల గురించి అస్సలు చింతించొద్దు. విజయం మిమ్మల్ని అనుసరిస్తుంది. ఇదీ గీతలోని ఓ శ్లోకం తాత్పర్యం. మీనాక్షి గుప్తా సరిగ్గా ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. చేయాలనుకున్నది చేసేస్తున్నారు. ఫలితాలెలా ఉంటాయని ఏరోజూ ఆలోచించలేదు. అందుకేనేమో విజయం ఆమెను వరిస్తోంది. ఇంతకీ మీనాక్షి గుప్తా ఏం సాధించారు? ఎలా సక్సెస్ అయ్యారు?

క్లిక్ ఫర్ కోచ్

మీనాక్షి గుప్తా... తొలితరం ఆంట్రప్రెన్యూర్‌గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ప్రయాణం ఐదేళ్ల క్రితం మొదలైంది. naukri.com గురించి అందరికీ తెలుసు. ప్రొఫెషనల్స్‌కి ఉద్యోగాలు వెతికిపెట్టే వెబ్‌సైట్ అది. ప్రొఫెషనల్స్ సంగతి సరే... పనిమనుషులు, సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్ల లాంటి అన్‌స్కిల్డ్ ఉద్యోగులకు ఇలాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం లేదా? ఎందుకు లేదూ... ఉంది. మీనాక్షి గుప్తా మదిలో మెదిలిన ఐడియా ఇదే. సెమీస్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగుల కోసం ' హెల్పర్ ఫర్ యు 'ని ప్రారంభించారామె. ఐదేళ్ల క్రితం కుటుంబంతో కలిసి ఢిల్లీ నుంచి ముంబై వెళ్లారు మీనాక్షి.

"మేం ఢిల్లీలో ఉన్నప్పుడు నా చిన్న కూతురు కీబోర్డ్ క్లాసులకు వెళ్లేది. నా భర్త తబలా నేర్చుకునేవారు. మేం ముంబైకి వెళ్లినప్పుడు అక్కడ తబలా, కీబోర్డ్ లాంటివి నేర్పించేవాళ్లెవరూ కనిపించలేదు. వాళ్లిద్దరికీ ట్రైనర్లను వెతకడం చాలా కష్టమైంది" అని అప్పటి కష్టాన్ని వివరిస్తారు మీనాక్షి.

ఆ సమస్య నుంచి పరిష్కారాన్ని కనుగొన్నారామె. అన్ని రంగాల్లో శిక్షణ ఇచ్చే ట్రైనర్ల వివరాలతో ఆన్‌లైన్ డైరెక్టరీ తయారు చేశారు. విద్య, క్రీడలు, ఇతర హాబీలకు సంబంధించిన వారి వివరాలను పొందుపర్చారు. లాగిన్ అవడం, టైమ్, ఫీజ్, ప్రాంతం, ఇతర వివరాలతో ట్రైనర్ ను వెతుక్కోవడం ఆన్ లైన్ లో సులువయ్యేలా చేశారు. అలా రెండున్నరేళ్ల క్రితం క్లిక్ ఫర్ కోచ్ ప్రారంభమైంది.

మీనాక్షి గుప్తా

మీనాక్షి గుప్తా


హెల్పర్ ఫర్ యు

క్లిక్ ఫర్ కోచ్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో అదే ఉత్సాహంతో మరో ప్రాజెక్టు చేపట్టారు మీనాక్షి. అదే హెల్పర్ ఫర్ యు. ఆఫీసుల్లో, ఇళ్లల్లో సహాయకులను నియమించుకోవడానికి ఉపయోగపడే ఆన్‌లైన్ ప్లాట్ ఫాం ఇది. ABCD- ఆయా, బాయ్, కుక్, డ్రైవర్ లాంటి వాళ్లందర్నీ ఆన్ లైన్లోనే నియమించుకోవచ్చు. ఇంజనీర్లు, డాక్టర్ల లాంటి ప్రొఫెషనల్సే కాదు... కిందిస్థాయిలో ఉండే ఉద్యోగులకు సైతం ఉద్యోగం సంపాదించుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడేలా చెయ్యడమే వీరి ప్రయత్నం. ఈ ప్రక్రియలో ఎలాంటి ఏజెంట్ అవసరం ఉండదు. అంటే ఈ ఆన్ లైన్ డైరెక్టరీ మధ్యవర్తిగా వ్యవహరిస్తుందన్నమాట.

ముంబైలోని పొవై ప్రాంతంలో నివసించేవాళ్లు నిత్యం పనిమనుషుల కోసం వెతుకుతుంటారు. మరోవైపు పనికావాల్సిన మహిళలు మధ్యవర్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతున్నారు. సెక్యూరిటీ గార్డుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ పరిస్థితి చూసి బాధపడ్డ మీనాక్షి పనిమనుషుల్ని నేరుగా యజమానులతో కలిపేందుకు ప్రయత్నించారు. అలా మెయిడ్ ఫర్ యు ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. అయితే రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టగానే మహిళలతోపాటు పురుషులు కూడా పేర్లు నమోదు చేసుకోవడం చూసి ఆశ్చర్యపోయారామె. అందుకే ప్రారంభించడానికి ముందే మెయిడ్ ఫర్ యు పేరును హెల్పర్ ఫర్ యుగా మార్చారు.

అనుభవాల నుంచి పాఠాలు

మీనాక్షి తండ్రి ఇంజనీర్. సాయుధ దళాల్లో పనిచేసేవారు. తరచూ మారుమూల ప్రాంతాల్లో పోస్టింగ్ వచ్చేది. దీంతో కుటుంబ బాధ్యతల్ని తల్లి చూసుకునేది. "నా చిన్నప్పటి నుంచే ఇంటిని చూసుకోవడంలో మా అమ్మకు మేము సాయపడేవాళ్లం. ఆ విధంగా స్వతంత్రంగా ఎదగగలిగాం. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్లాం" అంటారు మీనాక్షి. తండ్రికి తరచూ ట్రాన్స్‌ఫర్స్ అవుతుండటం వల్ల కొత్తకొత్త ప్రదేశాలను చూడగలిగారు మీనాక్షి. కొత్త వ్యక్తుల్ని కలుసుకోగలిగారు. తన చదువు ఎక్కువగా కేంద్రీయ విద్యాలయాల్లోనే సాగింది. ఎనిమిదో తరగతి నుంచి ప్రైవేట్ పాఠశాలలో చదివారు. ఇంగ్లీష్ మీడియం బాలికల పాఠశాలలో అడ్మిషన్ దొరికింది. ధనవంతుల పిల్లలు చదివే పాఠశాల అది.

"స్కూల్లో తొలి రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడలేక చాలా ఇబ్బందిపడ్డాను. ఆ రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ స్కూల్లో నాకు స్నేహితులెవరూ లేరు. కానీ కుంగిపోలేదు. సవాల్ గా తీసుకొని టాలెంట్ చూపించడం మొదలుపెట్టాను. ఆటలు, చదువులు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నా. స్కూల్ లో టాప్ అథ్లెట్ నేనే. బాస్కెట్ బాల్ టీమ్ మెంబర్ కూడా. ఆ అనుభవం తనకెంతో నేర్పించింది. నీ విధులు నువ్వు నిర్వర్తించు. తర్వాత చాలా మంది నిన్ను గౌరవిస్తారు. అప్పుడు నేర్చుకున్నవే ఇప్పటికీ నాకు రోజూ మార్గదర్శకంగా నిలుస్తాయి" అంటూ స్కూలు రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు మీనాక్షి.
image


టాటాలో జాబ్ కి టాటా

మూడు మార్కులు తక్కువున్న కారణంగా ఢిల్లీలోని మెడికల్ కాలేజీలో అడ్మిషన్ దొరకలేదు. ప్రతీ చిన్న విషయం జీవితంపై పెను ప్రభావం చూపిస్తుందని అప్పుడే తనకు అర్థమైంది. మనం చేసే అదనపు కృషి మనల్ని లక్ష్యానికి మరింత చేరువ చేస్తుందన్నది ఆమె నమ్మకం. గ్రాడ్యుయేషన్ తర్వాత ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి లింగ్విస్టిక్స్ లో ఎంఫిల్ చేశారు. ఆ తర్వాత స్కూల్ లో కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు. తర్వాత కార్పొరేట్ ట్రైనర్‌గా కెరీర్ మొదలుపెట్టారు. ట్రైనర్‌గా ఉన్నప్పుడే ఓ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ గా అవకాశం వచ్చింది. దాంతో పాటు ఎన్ఐఐటిలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేశారు. ట్రైనింగ్ కు సంబంధించిన మేనేజింగ్ ప్రాజెక్టులను తీర్చిదిద్దారు. టాటా ఇంటరాక్టీవ్ సిస్టమ్స్ లో లీడ్ ఇన్ స్టక్షనల్ డిజైనర్ గా పనిచేశారు. స్టార్టప్ కోసం తన ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. ఆ తర్వాత స్టార్టప్ ని అభివృద్ధి చెయ్యడంలో బిజీ అయ్యారు.

ఏ ఉద్యోగం కావాలన్నా ఓకే

హెల్పర్ ఫర్ యులో ఏ ఉద్యోగి కావాలన్నా దొరుకుతారు. డాగ్ వాకర్స్ నుంచి ఇంటి పనిమనుషుల వరకు ఎవరినైనా నియమించుకోవచ్చు. కొరియర్ బాయ్స్ కి పార్ట్ టైమ్ జాబ్స్, ఎలక్ట్రిషియన్స్, పేషెంట్ కేర్ లాంటి వారి వివరాలను అందిస్తున్నారు. "చిన్న, మధ్యతరహా పరిశ్రమలకూ ఉద్యోగుల్ని పంపిస్తాం. యజమానుల నుంచి తక్కువ మొత్తంలో ఫీజులు తీసుకుంటాం" అంటారు మీనాక్షి. నిరక్షరాస్యుల్ని, చదువు మధ్యలో ఆపేసినవారిని కూడా మేం రిజిస్టర్ చేసుకుంటాం. నిరుద్యోగుల వివరాలను యజమానులు వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. వారి ప్రొఫైల్స్ నచ్చితే... ఫీజ్ చెల్లించి వారి ఫోన్ నెంబర్లు తీసుకోవచ్చు. నేరుగా వాళ్లతో మాట్లాడుకోవచ్చు. ఒక్కసారి చెల్లించే ఫీజు కొన్ని రోజుల వరకే వర్తిస్తుంది. వెబ్ సైట్ రూపకల్పన, నిర్వహణ, మార్కెటింగ్, ప్రమోషన్ లాంటివన్నీ మీనాక్షి చూసుకుంటున్నారు. ఐఐటి-ఐఐఎం గ్రాడ్యుయేట్ అయిన ఆమె భర్త స్ట్రాటజీ, టీమ్ మెంటరింగ్ వ్యవహారాల్ని చూసుకుంటున్నారు. మిగతా వాళ్లంతా ఫ్రీలాన్సర్లే. వాళ్లంతా కాల్ సెంటర్ వ్యవహారాలు చూసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కగా మేనేజ్ చేయడం, గ్రోత్ కి ఇబ్బంది లేకుండా నిర్వహణ ఖర్చులను నియంత్రించుకోవడం, ఉద్యోగాలు ఇప్పించడం లాంటివి ఆమెకు ఎదురవుతున్న సవాళ్లు. వాటిని ఎదుర్కొంటూ, విజయం సాధిస్తున్నారామె.

"అన్ స్కిల్డ్ ఉద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు ఇప్పించడమే మా లక్ష్యం. మంచి ఉద్యోగం దొరికినప్పుడు వారిలో కనిపించే కృతజ్ఞతాభావం, సంతోషం ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. మేం సరైన మార్గంలో పయనిస్తున్నాం అని గర్వంగా చెప్పుకోవడానికి కొన్ని సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి" అంటారు మీనాక్షి.

అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఉద్యోగులతో పాటు పట్టణాల్లో ఉండే దిగువ తరగతి ఉద్యోగులకు తమ వెంచర్ naukri.comలా చెయ్యాలన్నది మీనాక్షి లక్ష్యం. ముంబై, పూణె, ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాల నుంచి పనిమనుషుల కోసం ఫోన్ కాల్స్ వస్తున్నాయి. త్వరలో హైదరాబాద్ లో కూడా కార్యకలాపాలు ప్రారంభించనున్నారు.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags