26 ఏళ్లకే 26 స్టార్టప్స్.. అద్భుత విజయాలు సాధిస్తున్న రితేశ్

26 ఏళ్లకే 26 స్టార్టప్స్.. అద్భుత విజయాలు సాధిస్తున్న రితేశ్

Thursday April 28, 2016,

5 min Read


పాతికేళ్ల వయసులో ఎవరైనా ఏంచేస్తారు. తండ్రులు, తాతలు సంపాదించిన ఆస్తులుంటే జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. లేదంటే ఏదో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ ఆరంకెల జీతాన్ని సంపాదిస్తుంటారు. ఇంకా టాలెంటెడ్ అయితే ఒక కంపెనీ పెట్టి దాన్ని విజయ పథాన ఎలా నడిపించాలో ఆలోచిస్తుంటారు. కానీ డాక్టర్ రితేశ్ మాలిక్ కాస్త డిఫరెంట్. 26 ఏళ్ల వయసులోనే 26కు పైగా స్టార్టప్స్‌లలో పెట్టి సక్సెస్‌ను తన ఇంటిపేరుగా మార్చుకున్నారు.

మీరు చదువుతున్నది నిజమే. 26 ఏళ్ల వయసులోనే 26 స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టి సీరియల్ ఆంట్రప్రెన్యూర్‌గా మారిన ఓ డాక్టర్ స్టోరీ ఇది. వృత్తి వైద్యమే అయినా ప్రవృత్తి మాత్రం స్టార్టప్స్‌లలో పెట్టుబడులు పెట్టడం. చిన్న వయసులోనే అద్భుత విజయాలను సొంతం చేసుకున్న రితేశ్.. ఫోర్బ్స్ 30 ఫైనాన్స్ అండ్ వెంచర్ లిస్ట్ (ఆసియా) 2016 జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు.

సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన 26 ఏళ్ల రితేశ్ మాలిక్

సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన 26 ఏళ్ల రితేశ్ మాలిక్


రితేశ్ స్టార్టప్ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ నుంచి 2013లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మెడిసిన్ చదువుతున్న సమయంలోనే వ్యవస్థాపక రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. మెడిసిన్ అంటే అందరు విద్యార్థులు క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్తుంటారు. కానీ రితేశ్ మాత్రం క్లాసులకు బంక్ కొట్టి 2010లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో మార్కెటింగ్ సైన్స్ 101 కోర్స్ క్లాసులకు హాజరయ్యారు. సిలికాన్ వ్యాలీలో స్టార్టప్‌లు ఎందుకు సక్సెస్ అవుతున్నాయో ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు. 2012లో రితేశ్ కెరీర్‌లో బిగ్ టర్న్. తను పెట్టుబడులు పెట్టిన యాడ్‌స్టక్ కంపెనీని టైమ్స్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసింది. ఈ విజయంతో రితేశ్ పొంగిపోలేదు. మేనేజ్‌మెంట్‌లో మరిన్ని పాఠాలను నేర్చుకోవలనుకున్నారు. మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీని హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాలని 2013లో డిసైడ్ అయ్యారు. హెల్త్‌కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఆంట్రప్రెన్యూర్‌షిప్, ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్, సోషల్ ఆంట్రప్రెన్యూర్‌సిప్, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో రితేశ్ బహుముఖ ప్ర‌జ్ఞాశాలి.

2013లో రితేశ్ స్టార్టప్ కెరీర్ ప్రారంభమైంది. మిత్రులతో కలసి హెల్త్‌కేర్ రంగంలో పెట్టుబడుల కోసం గెరిల్లా వెంచర్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ వియరబుల్ గాడ్జెట్ ఉత్పత్తి సంస్థ ఫిన్ రొబోటిక్స్‌ సిరీస్ ఏ ఫండ్స్‌ను సమీకరించింది. హార్డ్‌వేర్ ప్రాడక్ట్ సంస్థ నిధులు సమీకరించడం ఆషామాషీ కాదు. హార్డ్‌వేర్ ప్రాడక్ట్ కంపెనీ నిధులు సేకరించడం ఇదే తొలిసారి అని ఫోర్బ్స్ అంటోంది. ఆ తర్వాత రితేశ్ సీరియల్ ఆంట్రప్రెన్యూర్‌గా మారిపోయారు. ఆర్‌హెచ్‌ఎల్ విజన్, విగ్జో, యాడ్‌డాక్, మషింగా, ఫ్లిప్‌మోషన్‌ సహా 26 సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు.

ఓ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న రితేశ్..

ఓ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న రితేశ్..


దేశంలో ఆంట్రప్రెన్యూర్షిప్ వాతావరణాన్ని పెంచేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా పలు కాలేజీల్లో ప్రచారం చేస్తోంది. స్టార్టప్ ఇండియా.. స్టాండప్ ఇండియా ప్రచారంలోనూ రితేశ్ యాక్టీవ్‌గా పనిచేస్తున్నారు.

‘మా గెరిల్లా ప్రాజెక్ట్‌లో భాగంగా గతంలో ఏ ప్రధాని, ఏ రాష్ట్రపతి విజిట్ చేయని కాలేజీలకు మోదీ, ప్రణబ్‌లను తీసుకెళ్తున్నాం. ప్రెసిడెంట్ ప్రణబ్‌ను ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అగ్రికల్చరల్ యూనివర్సిటీ జీబీ పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీకి తీసుకెళ్లాం. పది వేల మంది విద్యార్థుల కోసం ఇన్నోవేషన్ వర్క్‌షాప్‌లను నిర్వహించాం. మేం ప్రస్తుతం స్మాల్, మీడియం సైజ్ స్టార్టప్ గ్రూప్స్‌పై దృష్టిపెట్టాం’’ - రితేశ్ 
ప్రధాని మోదీతో రితేశ్..

ప్రధాని మోదీతో రితేశ్..



రెండు లక్ష్యాలు..

ప్రస్తుతం తనకు రెండు గోల్స్ ఉన్నాయని రితేశ్ చెప్తున్నారు. వ్యవస్థపక రంగంలోకి మరింత మంది మహిళలను తీసుకురావడం, టెక్నాలజీ ద్వారా గ్రామీణ మార్కెట్ అవసరాలను తీర్చడం తన లక్ష్యాలని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆంట్రప్రెన్యూర్ రంగంలో కేవలం తొమ్మిది శాతం మంది మాత్రమే మహిళలున్నారు. ఆ సంఖ్యను వచ్చే ఏడేళ్లలో 45% చేయాలనుకుంటున్నారు. గ్రామీణ మార్కెట్ ప్రకారం ప్రస్తుతం వ్యవసాయ రంగమే అతి పెద్దది. ఆ తర్వాతే హెల్త్‌కేర్, రిటైల్ రంగాలు. కానీ వ్యవసాయ రంగానికి అనుకున్న స్థాయిలో మద్దతు దొరకడంలేదంటాడు రితేశ్.

డబ్బే ముఖ్యం కాదు..

చాలామంది, ముఖ్యంగా డాక్టర్లు 40 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తారు. రితేశ్ మాత్రం ఆ ఏజ్ వచ్చే వరకు వేచి చూడలేదు. తన స్వప్నాలను సాకారం చేసుకునేందుకు 26 ఏళ్లకే వ్యవస్థాపక రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. మెడికల్ రంగానికి గుడ్ బై చెప్పినట్టేనా? అంటే లేదంటున్నారాయన. వైద్యరంగం పైనే తనకు తొలి ప్రేమ అని అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే ప్రాక్టీస్ మాత్రం చేయడంలేదు. తండ్రి ప్రారంభించిన రాడిక్స్ హెల్త్‌కేర్ హాస్పిటల్ వ్యవహారాలను కూడా రితేశే పర్యవేక్షిస్తున్నారు. దాన్ని మరింత విస్తరించాలనుకుంటున్నారు. 

పూల పాన్పు కాదు విజయం..

స్టార్టప్ రంగంలోకి అడుగుపెట్టాలని రితేశ్‌ అనుకోవడానికి కారణం మద్రాస్ ఐఐటీనే. మెడిసిన్ చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు ఐఐటీ మద్రాస్‌కు వెళ్తుండేవారు. ఆ సమయంలోనే అభిషేక్ శంకర్‌ను కలిశారు. అప్పుడే అతడితో కలిసి ఓ సంస్థను ప్రారంభించారు. ఆ సమయంలో అభిషేక్ అగ్మెంటెడ్ రియాలిటీలో ఓ ప్రాడక్ట్‌ను రూపొందిస్తున్నారు. కొన్ని పేటెంట్లు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఈ అగ్మెంటెడ్ రియాలిటీని హెల్త్‌కేర్‌ రంగంతో అనుసంధానిస్తే బాగుంటుందని రితేశ్ సూచించారు. అలా ప్రపంచంలోని డాక్టర్లందరినీ ఒకేవేదికపైకి తీసుకొచ్చి గ్రామీణ రంగంలో సర్జరీలకు సరైన గైడెన్స్ ఇప్పించొచ్చని రితేశ్ సూచించారు. ఆ ఐడియా వర్కవుట్ కాలేదు. ఎందుకంటే ఆ వేదికను ఎక్కువమంది ఉపయోగించుకోలేకపోయారు. అంతేకాదు మౌలికవసతులు కూడా అంతంత మాత్రమే కావడంతో ఆ ప్రయోగం విఫలమైంది. తొలి ప్రయోగం విఫలం తర్వాత వారికి ‘ఆలైవ్’ ఐడియా వచ్చింది. ఈ ఆలోచన ఎంతోమంది మెచ్చుకున్నారు కూడా. ఆలైవ్ స్టార్టప్‌ను విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని 26 సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టారు రితేశ్.

హార్డ్‌వేర్ రంగంలో స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాల కోసం చూస్తున్న రితేశ్ కోచి స్మార్ట్ విలేజ్‌కు వెళ్లారు. ఆ స్టార్టప్ గ్రామంలో పది సంస్థలకు పెట్టుబడులొచ్చాయి. అందులో తొమ్మిది మావే అని రితేశ్ గర్వంగా చెప్పుకొచ్చారు.

సంస్థలోని ఉద్యోగులతో రితేశ్..

సంస్థలోని ఉద్యోగులతో రితేశ్..


ఇన్వెస్ట్‌మెంట్ మంత్ర.. మేనేజ్‌మెంట్ టిప్స్..

ప్రజలపై నమ్మకంతో పెట్టుబడులు పెడితే విజయాలు వాటంతటవే వస్తాయన్నది రితేశ్ ఫార్ములా. పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న సంస్థలపై తనకు అంతగా నమ్మకంలేదని రితేశ్ చెప్తారు. సంస్థ నిర్వహణలో చివరి నిర్ణయం ఆంట్రప్రెన్యూర్‌దే అంటారాయన. పొరపాట్లు, ఓటములు జీవితంలో ఓ భాగం. జీవితంలో ఓటమి చెందకపోతే, విలువైన ప్రాడక్ట్ ఏదీ చేయడం లేదని అర్థం అని రితేశ్ చెప్పారు.

‘‘స్టార్టప్‌ పెట్టి ఏం సాధించాలనుకుంటున్నావని చాలామంది ఆంట్రప్రెన్యూర్లను నేను తరచుగా అడుగుతుంటాను. చాలామంది నుంచి ఒకటే సమాధానం. వన్ బిలియన్ కంపెనీగా సంస్థను మారుస్తానని. ఈ సమాధానం నన్ను ఎంతో చిరాకు పరుస్తుంది. ప్రతి ఒక్కరి లక్ష్యం విలువలను సృష్టించేదిగా ఉండాలి. విలువైన దాన్ని కాదు’’-రితేశ్ 

టీమ్‌తో రితేశ్

టీమ్‌తో రితేశ్


ఫ్యూచర్ ప్లాన్స్..

సాధించిన విజయాలతో రితేశ్ సంతృప్తి చెందడంలేదు. మరిన్ని శిఖరాలను అధిరోహించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇన్నోవ్8 పేరుతో ఢిల్లీలో కో వర్కింగ్ స్పేస్ స్టార్టప్‌ను గత ఏడాది నవంబర్‌లో ప్రారంభించారు. స్టార్టప్ రంగంలో అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం. అలాగే స్టార్టప్‌లను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉండాలి. ఈ రెండింటిని రితేశ్ ఒడిసిపట్టారు.

‘‘స్టార్టప్ అంటే ఏంటో కాదు. ఓ వ్యక్తి మరో కొత్త వ్యక్తితో సమావేశమై, ఇరువురి మధ్య విన్ విన్ సిట్యుయేషన్‌ను క్రియేట్ చేసుకోవడమే. సంప్రదాయ వ్యాపార మోడల్‌లో ఇరువర్గాలు లాభమార్గంలో పయనించడమే సార్టప్ లక్ష్యం. మా ఇన్నోవ్8 కూడా అలాంటిదే. ఫ్రీలాన్సర్లు, ఆంట్రప్రెన్యూర్లు, కార్పొరేట్లు, టెక్ ఇన్నోవేటర్లు, ఇన్వెస్టర్ల కమ్యూనిటీని కనెక్ట్ చేస్తుంది. ఒకే రూఫ్ కింద మంచి సోషల్ ఎన్విరాన్‌మెంట్‌ను క్రియేట్ చేస్తుంది’’- రితేశ్ 

మహిళలకు చేయూత..

ఇన్నోవ్‌8 మహిళా ఆంట్రప్రెన్యూర్లకు అదనపు ఇన్సెంటివ్స్ ఇస్తోంది. దీన్ని ఇన్నోవ్84 విమెన్ అని పిలుస్తున్నారు. వ్యవస్థాపక రంగంలో మహిళలు అద్భుతంగా రాణిస్తారన్నది అతని వ్యక్తిగత అభిప్రాయం. అందుకే మహిళలకు డిస్కౌంట్స్ ఇవ్వాలనుకుంటున్నారు. వారి కోసం ప్రత్యేక విమెన్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తాం అని రితేశ్ చెప్పుకొచ్చారు. శాన్‌ఫ్రాన్సిస్కో, టెలీ అవివ్, బెంగళూరుల తర్వాత ఢిల్లీని మరో సిలికాన్ వ్యాలీని చేయాలన్నదే రితేశ్ లక్ష్యం. అందుకోసం త్వరలోనే న్యూఢిల్లీలోని కన్నౌట్ ప్లేస్‌లో ఇన్నోవ్8 ప్రాపర్టీ నిర్వహించబోతున్నారు.

image


26 స్టార్టప్స్‌లలో సక్సెస్‌ఫుల్‌గా పెట్టుబడులు పెట్టిన రితేశ్ తన తోటి ఆంట్రప్రెన్యూర్లకు, ఇన్వెస్టర్లకు విలువైన సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్స్‌కు సంబంధించిన సంస్థల్లో ఇన్వెస్ట్ చేయొద్దని, భవిష్యత్‌లో మార్కెట్‌ను ముంచెత్తే ప్రాడక్ట్‌ గుర్తించి, అందులో పెట్టుబడులు పెట్టమని సూచిస్తున్నారు. 

విజయాలను చూసే కాదు, ప్రతి పొరపాటును, ఓటమిని చూసి కూడా రితేశ్ గర్వంగా ఫీలవుతున్నారు. ఓటమిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్న రితేశ్‌ మరిన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టి విజయాలను అందుకోవాలని యువర్‌స్టోరీ ఆశిస్తోంది.