సంకలనాలు
Telugu

ఐబిఎం ఉద్యోగం వదిలి ఆదివాసీలకు ఆప్తుడయ్యాడు !

ఆదివాసీల సమస్యల గురించి అందరం మాట్లాడతాం. కానీ అవి ఎంత తీవ్రమైనవో వారిలో ఒకరిగా జీవిస్తే కానీ అర్థం కావు. ఐబిఎంలో ఐటి కన్సల్టెంట్‌గా చేసిన వికాశ్ రెండు నెలలు ఆదివాసి గూడెంలో వారిలో ఒకరిగా గడిపాడు. ఆదివాసీల ఆకలికేకలవెనుక ఆవేదనేంటో అనుభవరీత్యా తెలుసుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వికాశ్ .. గిరిజనగూడెంలో ఎందుకు గడిపాడు.. ? వారి కష్టాలను తెలుసుకుని ఏం చేసాడు..?

22nd Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

''వట వృక్ష'' ఇది ఓడిశాలోని ఒక సోషల్ ఎంటర్‌ప్రైజ్. ఆదివాసీలు తమ సంస్కృతిని కాపాడుకుంటూనే ఆర్ధికంగా స్వశక్తి మీద నిలబడే ఆధారం ఈ వటవృ క్ష. ఇప్పటిదాకా ఆదివాసీ ప్రాంతాల్లో మూడు గ్రామాల్లోని 368 కుటుంబాలతో కలిసి పనిచేసింది ఈ వట వృక్ష. ఒడిశాలోనే పుట్టిపెరిగిన వికాశ్ దాస్ ఈ సంస్థ వ్యవస్థాపకుడు.

వికాశ్ సంప్రదాయ కుటుంబంలో పుట్టాడు. తన కులం దాటి వేరే వ్యక్తులతో స్నేహం కూడా నిషిద్ధమనే వాతావరణంలో పెరిగాడు. ముఖ్యంగా ఆదివాసీలను తాకడం కూడా వికాశ్ కుటుంబంలో పెద్ద నేరమే. 'చిన్నప్పుడు నేను ఓ గుడికి వెళ్లాను. అదే సమయంలో ఓ ఆదివాసీ మహిళ తన మనమడితో కలిసి గుడిలో అడుగుపెట్టబోయింది. అంతలోనే ఎవరో వచ్చి, ఆమెను తిడుతూ, గుడి ఆవరణ నుంచి బయటికి విసిరేసారు. కేవలం ఆదివాసీ కావడమే ఆమె నేరం' వికాశ్ చిన్నప్పటి ఈ అనుభవం అతనిలో ఎన్నో ప్రశ్నలను రేపింది.

image


పెరిగి పెద్దయ్యాక వికాశ్ సాఫ్ట్ వేర్ లో మాస్టర్స్ డిగ్రీ చేసాడు. ఐబి ఎమ్ లో ఐటి కన్సెల్టెంట్ గా ఉద్యోగం సంపాదించాడు. ఇంత జరిగినా, వికాశ్ మనసులో చిన్నప్పుడు చెలరేగిన ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. కాలంతో పాటు ఆ ప్రశ్నలు సమాధాన పడకపోగా,.. వికాశ్ లో మరింత అలజడి రేపాయి. 2013లో వికాశ్ తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసాడు. గిరిజనులతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ, ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు సాయం చేయాలనుకున్నాడు.

‘‘నేను చిన్నప్పుడు ఆదివాసీ కుటుంబాల మధ్యే పెరిగినా, వారితో నాకెప్పుడూ సాన్నిహిత్యం లేదు. వారికష్టాలను నేను అద్దం వెనుక నుంచే చూసాను తప్ప, అసలు జీవితాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. వారి కష్టాలు ఈనాటివి కావు. అందుకే ఆ కష్టాలేంటో తెలుసుకోవడానికి వారి మధ్యే గడపాలని నిర్ణయించుకున్నాను. అలాగే రెండు నెలలు గడిపాను. అప్పుడే జీవితంలో మొదటి సారి కడుపుకాలిపోవడమంటే ఏంటో తెలిసింది. ఆకలితో అల్లాడిపోవడమంటే ఏంటో తెలిసింది. ఈ ప్రయోగం తర్వాత వారి జీవితమేంటో పూర్తిగా అర్థమయింది. ఆ కష్టాల నుంచి పుట్టిన ఆలోచనే ఈ వట వృక్ష’’ అని వివరించారు వికాశ్.

image


‘‘నిజానికి గిరిజనుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రాస్తే పెద్ద గ్రంధమే అవుతుంది. స్థూలంగా చెప్పాలంటే, భౌగోళికంగా ఒంటరితనం, నిరుద్యోగం, భూమి లేకపోవడం, నిరక్షరాస్యత, పోషకాహార లోపం, అనారోగ్యం, అపరిశుభ్రత, నష్టదాయకమైన వ్యవసాయం, దళారీల దోపిడీ, తలకుమించిన అప్పులూ, ఇవన్నీ సమస్యలే. వీటి పరిష్కారానికి మా ఫౌండేషన్ గిరిజనులతో కలిసి పనిచేస్తుంది. ’’ అని వికాశ్ వివరించారు.

వాళ్లకు ఉపాధిని కల్పించడంతో భాగంగా...

వాళ్లకు ఉపాధిని కల్పించడంతో భాగంగా...


ఆదివాసీల కనీస అవసరాలకు సరిపడా ఆర్థిక వనరులు సృష్టించడం మీదనే వట వృక్ష ప్రధానంగా పనిచేస్తోంది. ముందు ఫౌండేషన్ 2000 రూపాయల ప్రాథమిక నిధిని సమకూరుస్తుంది. దీనికి గిరిజన కుటుంబాలు వారి శక్తి మేరకు ఎంతో కొంత జతచేరుస్తాయి. ‘‘మూల ధనం తక్కువే అయినా, ఈ ఆదివాసీ మహిళల్లో వున్న నైపుణ్యం వల్ల ఆదాయం బాగానే వస్తుంది. ఇంతకు ముందు వారి ఆదాయంతో పోలిస్తే, ఇప్పుడు మూడు నాలుగు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు.

మొదట వ్యవసాయంపై దృష్టి పెట్టారు. సంవత్సరానికి ఒకే పంటను వేయడం వల్ల అది పోతే, వారికి వేరే జీవనాధరం వుండదు. దీంతో రైతు ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. అందుకే ఇక్కడి రైతులను వ్యవసాయ శాస్త్రవేత్తల దగ్గరకు తీసుకెళ్ళి, బహుళ పంటలు పండించే మార్గాలను వారికి నేర్పించాం. ఇప్పుడు ఒక పంట పోయినా, మరో పంట వారిని ఆదుకుంటుంది’’ అని తన ప్రాధాన్యాలను వివరించారు వికాశ్.

ఆదివాసీలు నేసిన వస్త్రాలు

ఆదివాసీలు నేసిన వస్త్రాలు


ఇక్కడి ఆదివాసీ మహిళలు తయారు చేసిన హస్తకళాకృతులు, మూలికలు, ఆవకాయలు వంటి వాటికి నగరాల్లో మార్కెట్ కల్పించడం ద్వారా వారిని ఇంటి యజమానులుగా తీర్చిదిద్దే పని కూడా వట వృక్ష చేస్తోంది.

జనధన యోజన, సబ్సిడీలు, రుణాలు లాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి వారిలో అవగాహన పెంచడం, తక్కువ కష్టంతో ఎక్కువ రాబడిని ఇచ్చే పుట్టగొడుగుల పెంపకం, ఇతరత్రా వృత్తి విద్యలు నేర్పించడం కూడా వట వృక్ష చేపడుతున్న మరికొన్ని ప్రాజెక్టులు. ‘‘మాతో కలిసి పనిచేస్తున్న ఆదివాసీలలో సామాజిక చైతన్యం కూడా పెరగడం గమనించాం. వారిలో కొందరు అన్యాయాలపై గొంతెత్తుతున్నారు. ఈ చైతన్యం ఫలితాలను కూడా ఇస్తోంది. ఇంతకు ముందు వీరంతా పిల్లల్ని పొలం పనులకు పంపించే వారు. ఇప్పుడు ఆ ధోరణి కూడా మారింది. చదువు మధ్యలో స్కూలు మానేసే పిల్లల సంఖ్య 90 శాతం నుంచి 32 శాతానికి తగ్గింది. ఈ పిల్లల తెలివితేటలు తరవాత తరాలకు మార్గదర్శకాలవుతాయి’’ అని నమ్ముతున్నారు వికాశ్.

వట వృక్ష సంపాదించే లాభాల్లో పది శాతం తిరిగి ఆ ఫండ్‌కే వెళ్తుంది. ఈ ఫండ్‌ను 12 మంది ఆదివాసీ మహిళలు నిర్వహిస్తారు. ఈ నిధిని కూడా ఆదివాసీ మహిళల విద్యా ఆరోగ్యాలను మెరుగుపరిచేందుకు వాడతారు. ఒక్కో గ్రామం నుంచి ప్రతినిథులు వుంటారు. వీరే ఆయా గ్రామాల్లో వున్న సమస్యలు, వాటి పరిష్కారంలో సాధిస్తున్న పురోగతని ఎప్పటికప్పుడు వివరిస్తుంటారు. ‘ఏడాది నుంచి ఐదేళ్ళ వరకు పిల్లల బరువు, స్కూళ్ళలో చేరుతున్న, మధ్యలో మానేస్తున్న పిల్లల సంఖ్య, కుటుంబాల ఆదాయంలో వస్తున్న మార్పులు, వ్యవసాయ ఉత్పత్తుల్లో పెరుగుదల వంటి అంశాలకు సంబంధించి నెలవారీ డాటా మా దగ్గరుంటుంది. ఆ డాటాను బట్టీ మేం తరవాత నెల లక్ష్యాలను నిర్దేశించుకుంటాం’’ అని తమ సంస్థ కార్యకలాపాలను వికాశ్ వివరించారు. అభివృద్ధికి బాటలు వేస్తూనే, స్థానిక ఆదివాసీ సంస్కృతిని, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నామని వికాశ్ చెప్పారు. 

అయితే, వికాశ్ ప్రయత్నం అంత పూలబాటేమీ కాదు. ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి, పేదలను ఉద్ధరించడానికి నిరుపేదగా బతకాలని నిర్ణయించుకున్నప్పుడు వికాశ్‌కు పిచ్చిపట్టిందనుకున్నారు ఆయన కుటుంబసభ్యలు. ఇటు గిరిజనులు కూడా వికాశ్‌ను అంత తేలికగా నమ్మలేదు. పట్నం నుంచి వచ్చిన వ్యక్తిగానే అనుమానస్పదంగా చూసారు. కానీ వికాశ్ పట్టుదల, కార్యదీక్ష ఇప్పుడు అద్భుతాలని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు వాళ్లు అతనని తమలో ఒకరిగా చూస్తున్నాయి. తనకు ఇంత మంది కుటుంబ సభ్యులుండడం కంటే ఆనందకరమైన విషయం ఇంకోటి లేదంటారు వికాశ్. 

‘‘వాళ్లు నాకోసం ఏమైనా చేస్తారు. ఎంత దూరమైనా వెళ్తారు. వాళ్ళ గౌరవాన్ని సంపాదించడం కంటే గొప్ప సంపాదన జీవితంలో ఇంకేముంటుంది’ అంటారు వికాశ్.
image


మరి కేవలం ఆదివాసీల మద్దతుతో ఈ సంస్థ ఎన్నాళ్ళు కొనసాగుతుంది ? ఈ ప్రశ్నకు వికాశ్ చాలా ధీమాగా సమాధానమిస్తారు. ‘‘ మంచి పని చేస్తున్నప్పుడు డబ్బు దానంతట అదే వస్తుంది. ఇప్పటి దాకా అలాగే కొనసాగుతున్నాం. మా పని మీద మాకు నమ్మకం వుంది. ఇందులో మాకు తిరుగు లేదు. ఆదివాసీ పర్యావరణాన్ని కాపాడినంత కాలం.. మా ఆదాయం మాకు ఉంటుంది..’’ అని వికాశ్ నమ్మకంగా చెప్పారు.

‘‘ అభివృద్ధి అంటే, పట్టణీకరణ కాదు. ఆదివాసీలను జాతీయ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం కాదు. ఆదివాసీలకు తమదైన అపురూపమైన సంస్కృతి వుంది. దాని ఉనికి ప్రమాదంలో వుంది. దాన్ని కాపాడాలి. 3,500 ఏళ్ళుగా ప్రకృతితో మమేకమై జీవిస్తూ తమదైన సంస్కృతి ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న ఆదివాసీల ప్రయత్నానికి మా వంతు సాయం చేస్తున్నాం’’ అంటారు వికాశ్.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags