ఒక హిందువు పాడె మోసి అంతిమ సంస్కారాలు చేసిన ముస్లిం పెద్దలు

29th Apr 2017
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మానవత్వానికి మించిన మతం లేదని నిరూపించారు పశ్చిమబెంగాల్ కి చెందిన కొందరు ముస్లిం సోదరులు. కేన్సర్ సోకి కన్నుమూసిన ఒక నిరుపేద రజకుడి పాడెమోసి, అంతిమ సంస్కారం చేసి, అస్తికలు గంగలో కలిపి పెద్దమనసు చాటుకున్నారు. చనిపోయిన వ్యక్తిది ఏ కులం ఏ మతం అన్న ప్రశ్నను కాసేపు పక్కన పెట్టి, మనుషులంతా ఒకటే అని, మానవత్వమే అందరి కులం అని చాటిచెప్పారు. వాళ్లంతా ముస్లింలే అయినా, చనిపోయిన వ్యక్తి హిందువు కావడంతో, వాళ్ల సాంప్రదాయం ప్రకారమే దహనం చేసి ఆ ఊరి ప్రజల మనసులు గెలుచుకున్నారు.

image


వెస్ట్ బెంగాల్ మాల్దా జిల్లాకు చెందిన 35 ఏళ్ల బిస్వజిత్ రజక్ దినసరి కూలీ. రెక్కాడితేగానీ డొక్కడాని జీవితం. భార్య ముగ్గురు ఆడపిల్లలు, ఒక ముసలి తండ్రి. వాళ్లంతా ఇతడి రెండు రెక్కల మీదనే ఆధారపడ్డారు. ఒకపూట తింటూ మరోపూట పస్తులంటూ సాగిపోతున్న జీవితంలో పిడుగులాంటి వార్త. బిస్వజిత్ కు లివర్ కేన్సర్. అప్పటికే తుది దశకు చేరుకుంది. పూర్తిగా మంచానపడ్డాడు. తోడబుట్టిన వాడు ఉన్నాడు కానీ, అతని స్వార్ధం అతడు చూసుకున్నాడు. కనీసం మందులకు కూడా పైసా ఇవ్వలేదు.

ఆ సంగతి తెలిసిన చుట్టుపక్కల వాళ్లు చలించిపోయారు. బిస్వజిత్ కన్నుమూస్తే ముగ్గురు ఆడపిల్లలు అన్యాయమైపోతారు. ఏం చేసైనా అతడిని బతికించాలని చుట్టుపక్కల ఉండే కొన్ని ముస్లిం కుటుంబాలు ముందుకొచ్చాయి. ఊరంతా తిరిగి చందాలు పోగు చేశారు. బిస్వజిత్ ని మంచి ఆసుపత్రికి తీసుకెళ్దాం.. మీ వంతు సాయం చేయండి అని ఇల్లిల్లూ తిరిగారు. వాళ్లు తీసుకున్న చొరవ, మంచి పనికోసం ముందుకు వచ్చిన తీరు ఊరి వాళ్లకు నచ్చింది. కాదనకుండా ఎంతోకొంత సాయం చేశారు. వచ్చిన డబ్బుతో బిస్వజిత్ ని కోల్ కతాకు తీసుకుపోయారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. ఇక్కడ కష్టం.. ముంబైకి తీసుకెళ్లండి అని అక్కడి డాక్టర్లు సలహా ఇచ్చారు. అప్పటికే ఉన్న డబ్బులు అయిపోయాయి. తప్పని పరిస్థితుల్లో బిస్వజిత్ ని మళ్లీ తమ గ్రామానికి తీసుకొచ్చారు. వచ్చిన మూడు రోజులకే అతను కన్నుమూశాడు.

అంత్యక్రియలు చేయాలి. చేతిలో చిల్లిగవ్వా లేదు. దానికంటే ముందు బిస్వజిత్ కు మగపిల్లలు లేరు. ముగ్గురు ఆడపిల్లలే. తలకొరివి పెట్టడానికి తండ్రి ఉన్నా, అతను మంచం మీదనుంచి లేవలేని పరిస్థితి. భార్య పుట్టెడు దుఖంలో ఉంది. ఆ కుటుంబ శోకాన్ని అర్ధం చేసుకున్న ముస్లిం యువకులు – కాసేపు తమ మతాన్ని పక్కన పెట్టి- అంత్యక్రియలకు నడుంబిగించారు. అదికూడా హిందూ సాంప్రదాయంలోనే చేయాలని అనుకున్నారు. పాడె, పూలదండలు, గులాల్ సిద్ధం చేశారు. దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానికి పాడె మోసుకుంటూ వెళ్లారు. తలకొరివి పెట్టడానికి ఒకరు నిప్పు చేతపట్టారు. దహనం చేశాక అస్తికలను నదిలో కలిపారు.

కొడుకు చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్నాం. ఆ సమయంలో దేవుడిలా వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. వాళ్లేగనుక రాకపోతే అంత్యక్రియలు ఎలా జరిగేవో ఊహకే అందడం లేదని బిస్వజిత్ తండ్రి గుడ్లనీరు తీసుకున్నాడు.

మతం కంటే మానవత్వం గొప్పదంటాడు హాజీ అబ్దుల్ ఖలేక్. అంత్యక్రియలను ముందుండి నడిపించింది అతనే. చనిపోయింది హిందువా ముస్లిమా అన్నది ముఖ్యం కాదు.. బిస్వజిత్ మాకు సోదరుడితో సమానం.. ప్రతీదాన్నీ మేం మతం కోణంలోనే ఆలోచిస్తే, అల్లా మమ్మల్ని క్షమించడు అని అంటాడు ఖలేక్.

వాళ్లు ముస్లిం మతానికి చెందినవాళ్లే కావొచ్చు.. కానీ నాకు తోడబుట్టిన వాళ్లతో సమానం. నేను వాళ్ల రుణం ఎలా తీర్చుకోవాలి. వాళ్లే లేకుంటే నా భర్తకు కనీసం అంతిమ సంస్కారమన్నా దక్కేదా అంటూ భోరున విలపించింది బిస్వజిత్ భార్య సరిత .

మతం కులం పేరుతో కమ్ములాటలు జరుగుతున్న నేటి సమాజంలో ఇలాంటి సంఘటనలు-మనలో నిద్రాణమై ఉన్న మానవత్వాన్ని తట్టిలేపుతుంటాయి. ఛాందసవాద లోకంలో మంచికీ, మానవత్వానికి ఇంకా చోటుందని చెప్పడానికి బిస్వజిత్ అంత్యక్రియలే ఉదాహరణ. 

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India