సంకలనాలు
Telugu

ఈ ఊరి గురించి మీరు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే !!

ప్రపంచం మెచ్చిన  ఆద‌ర్శ‌ గ్రామం  

HIMA JWALA
6th Jan 2016
Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share

పచ్చని చెట్ల మధ్య పోకబంతిపూలన్నీ మాలకట్టినట్టుగా ఉంటుందా ఊరు. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం అక్కడ నూటికి నూరుపాళ్లు వర్ధిల్లుతోంది. ఒక ఆద‌ర్శ‌ గ్రామం ఎలా ఉండాలి అంటే.. ఇదిగో ఇలా ఉండాలి అని చెప్పేలా వుంటుంది. పదేళ్ల క్రితం ఆ ఊరి గురించి ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. కానీ ఇప్పుడు యావ‌త్ ప్ర‌పంచ‌మే ఆ గ్రామాన్ని చూసి ముచ్చ‌టప‌డుతోంది. ఇంత‌కూ ఎక్క‌డుందా ఊరు? దాని విశేషాలేంటి? లేటెందుకు చ‌ద‌వండి!

image


మ‌నం చెప్పుకోబోయే క‌థ గుజ‌రాత్ రాష్ట్రం సబర్కాంత్ జిల్లాలోని పున్సారీ అనే గ్రామానిది. గాంధీన‌గ‌ర్ కు 80 కిలోమీట‌ర్ల దూరంలో ఉందీ ఊరు. గ్రామంలోకి ఎంట‌ర్ అవ‌క‌ముందే రోడ్డుకు ఇరువైపులా రంగుల‌రంగుల పూల‌చెట్లు రార‌మ్మ‌ని స్వాగ‌తం ప‌లుకుతాయి. ఊరి పొలిమెర‌లో ఒక బోర్డు క‌నిపిస్తుంది. వెల్ క‌మ్ టు హైటెక్ విలేజ్ పున్సారీ అని రాసి ఉంటుంది దానిమీద‌. అదొక్క‌టి చాలు ఊరు ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్ప‌డానికి.

ఊరిలోకి అడుగుపెట్టగానే ఒక స్వాగ‌త తోర‌ణం మ‌ట్టిక‌ల‌ర్‌లో క‌నిపిస్తుంది. న‌ల్ల‌గా నిగ‌నిగ‌లాడే తారు రోడ్డు చేయిప‌ట్టుకుని గ్రామంలోకి తీసుకుపోతుంది. ఆరు వేల మంది జ‌నాభా ఉన్న ఈ ఊళ్లో ఒక ప్ర‌త్యేక‌త ఉంది- ఒక‌టి లేద‌ని చెప్ప‌లేం. అడుగుకో విశేషం క‌నిపిస్తుంది. క‌రెంటు ద‌గ్గ‌ర్నుంచి సీసీ కెమెరాల దాకా గ్రామం ఆసాంతం స్ఫూర్తి ర‌గిలిస్తుంది. ఒక మెట్రో న‌గ‌రానికి ఎన్ని సౌక‌ర్యాలుంటాయో అన్ని వ‌స‌తులు ఈ ఊరికి వున్నాయి. ఇంటింటికీ శుభ్ర‌మైన నీటి ద‌గ్గ‌ర్నుంచి ఇంట‌ర్నెట్ దాకా! ఎన్నెన్నో అద్భుతాల‌కు నెల‌వు ఈ ఊరు.

24 గంట‌ల కరెంటు. ప్ర‌గ‌తి బాట‌లు ప‌రుచుకున్న‌ది ఇక్క‌డి నుంచే. ఊరికోసం ప్ర‌త్యేకంగా 66 కేవీ స‌బ్ స్టేష‌న్. 24 గంటల పాటు ఇంటర్నెట్ కనెక్షన్ ని అందించే వైఫై టవర్. దాంతోపాటు ఆప్టికల్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్. అడుగ‌డుగునా సీసీ కెమెరాలు ఊరిని డేగ‌క‌ళ్ల‌తో చూస్తుంటాయి. క‌రెంటు స్తంభాల‌కు వాటర్ ఫ్రూఫ్ లౌడ్ స్పీకర్లుంటాయి. పొద్దున సాయంత్రం భ‌జ‌నలు కీర్త‌న‌లు వినిపిస్తాయి. అవిగాక ముఖ్య‌మైన అనౌన్స్ మెంట్లు ఏమైనా ఉంటే చెప్తారు. 

అన్న‌ట్టు షేరింగ్ ఆటోలు గట్రా ఏమీ క‌నిపించ‌వు. ఊళ్లో నిత్యం ఒక‌ మినీ బస్సు తిరుగుతుంటుంది. ఎక్క‌డ ఎక్కి ఎక్క‌డ దిగినా-రూపాయి ఇస్తే చాలు. పొలానికి, పాల‌కేంద్రానికి, ఆసుప‌త్రికి. ఇలా ఎక్క‌డికైనా వెళ్తుంది. ఇంటింటికీ సుర‌క్షిత‌మైన మంచినీరు. ప‌బ్లిక్ ప్రైవేటు పార్ట్‌న‌ర్ షిప్‌లో వాట‌ర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. నాలుగు రూపాల‌య‌కే 20 లీట‌ర్ల క్యాన్. ఫోన్ చేసి చెప్తే ఇంట్లో ఇచ్చిపోతారు. ఎక్కడా చెత్తా చెదారం కనిపించదు. రోడ్ల‌న్నీ అద్దంలా మెరుస్తాయి. స్ట్రీట్ లైట్ల‌న్నీ సోలార్ శక్తితోనే నడుస్తాయి.

అద్భుత‌మైన‌ ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్. ఆప్యాయంగా ప‌ల‌క‌రించి ప్రేమ‌గా వైద్యం చేసే డాక్ట‌ర్లు. ఇంటింటికీ మ‌రుగుదొడ్డి. పాఠ‌శాల‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. స్కూల్‌కి వ‌చ్చామా వెళ్లామా అన్న‌ట్టు ఉండ‌దు. బ‌ట్టీలు ప‌ట్ట‌డం ర్యాంకులు కొట్ట‌డం లాంటి చదువు కాదు. సృజ‌నాత్మ‌క‌త వెలికితీసేలా విద్యా బోధ‌న. విద్యార్ధి టాలెంట్‌ని బ‌ట్టి చ‌దువు. కైట్స్ ఎగ‌రేస్తాడా.. కంప్యూట్ కీ బోర్డుతో ఆటాడ‌తాడా? ఏది ఇష్ట‌మైతే ఆ దిశ‌గానే చ‌దువు. స్కూల్లో కూడా సీసీ టీవీ వుంది. పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది. అన్న‌ట్టు ఏసీ కూడా ఉందట‌!

image


రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం చేస్తారు. పాడి రైతులు ఎక్కువ‌. గ్రామంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు. యువతీ యువకులకు పలు కోర్సుల్లో శిక్షణ ఇస్తుంటారు. ఇంట్ర‌స్ట్ ఉన్న అమ్మాయిల‌కు బ్యూటీషన్ కోర్సు. కుట్టు అల్లికల్లో కూడా శిక్షణ ఇస్తారు. మొత్తం 109 స్వయంసహాయక బృందాలు నడుస్తున్నాయి. మ‌హిళా సాధాకారిత వంద‌శాతం వ‌ర్ధిల్లుతోంది. గ్రామస్థులందరికీ రూ. లక్ష ప్రమాద బీమా చేయించారు. 

విరాళాలు సేక‌రించ‌లేదు. ఎన్నారైల సహాయం లేదు. మ‌రి ఎలా సాధ్య‌మైంది ఈ అభివృద్ధి! పున్సారీ గ్రామాన్ని పూల‌వ‌నంగా మార్చిన ఘ‌న‌త ఎవ‌రిది? అంత‌కుముందు ప‌క్క గ్రామానికి కూడా స‌రిగా తెలియ‌ని ఈ ఊరు ప్ర‌పంచానికి ఎలా ప‌రిచ‌య‌మైంది? పుర‌స్కారాలు స‌త్కారాలు ఎలా ద‌క్కాయి?

2006 నాటి సంగ‌తి. అప్పుడు ఊరి ప‌రిస్థితి ప‌ర‌మ ద‌రిద్రంగా ఉండేది. డ్రైనేజీ కాదుక‌దా.. కనీసం రోడ్డు కూడా స‌రిగా లేదు. ఊరా.. వల్ల‌కాడా.. అన్న‌ట్టుగా ఉండేది. ఎప్పుడైతే హిమాంశు ప‌టేల్ స‌ర్పంచ్ గా గెలిచాడో అప్ప‌టి నుంచి గ్రామ రూపురేఖ‌లే మారిపోయాయి. ఎవ‌రో వస్తారు ఏదో చేస్తారని అనుకోవ‌డం శుద్ధ దండ‌గ‌. మొద‌టి అడుగు ఎప్పుడూ ఒంట‌రిదే. న‌డ‌చినా కొద్దీ దారులు అవే ప‌రుచుకుంటాయి. ఇద్ద‌రు న‌డుస్తారు. న‌లుగురు న‌డుస్తారు. ప‌దిమంది వందమంది. అలా దారి పూల‌దారి అవుతుంది. పున్సారీ అలాంటి పూల‌దారే!

ప‌ట్టుద‌ల ఉంది. సంకల్పం ఉంది. ఆ సంక‌ల్పంతోనే గ్రామ రూపురేఖ‌లు మారిపోయాయి. ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన చైత‌న్యం ఇంత‌టి మార్పుకు కార‌ణమైంది. ప్రభుత్వం ఇచ్చిన నిధుల‌ను స‌క్ర‌మంగా వినియోగిస్తే చాలు.. అద్భుతాలు చేయొచ్చు. ఏ దాత‌లూ అక్క‌ర్లేదంటాడు హిమాంశు. అత‌ను స‌ర్పంచ్ గా ఉన్న‌ప్పుడు న‌రేంద్ర మోడీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి. ప‌ల్లెలే గ‌నుక‌ అభివృద్ధి జ‌రిగితే- ప్ర‌జ‌లు ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స ఎందుకు వ‌స్తారు అని ఆనాడు మోడీ అన్న మాట హిమాంశుని బాగా క‌దిలించింది. నిజ‌మే క‌దా అనిపించింది. ప‌ల్లెను అనాథ చేయ‌డం కంటే-అదే ప‌ల్లెను అంద‌మైన రేప‌ర్‌లో చుట్టి, ప‌ట్నం సొబ‌గులు అద్దలేమా అనుకున్నాడు. ప‌దేళ్ల‌లో అత‌ని ఆశ‌యం ఫ‌లించింది. ప్ర‌స్తుతం హిమాంశు ప‌టేల్ చిన్న‌పాటి సెల‌బ్రిటీ. నిత్యం అత‌ని ద‌గ్గ‌రికి చుట్టుప‌క్క‌ల గ్రామాల స‌ర్పంచులు వాళ్లు వీళ్లు వ‌స్తుంటారు. అభిప్రాయాలు తీసుకుంటారు. స‌లహాలు ఇమ్మంటారు.

ఊరు ఎంతో ఇచ్చింది. ఎంతోకొంత తిరిగివ్వాలి. అలా ఇవ్వ‌డంలో తెలియ‌ని ఆనందం ఉంది. జ‌న్మ‌నిచ్చిన గ‌డ్డ రుణం తీర్చుకోవ‌డంకంటే అదృష్టం మ‌రోటి ఉంటుందా చెప్పండి!

Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share
Report an issue
Authors

Related Tags