సంకలనాలు
Telugu

గంటకు 50 దోశలు వేసే ఈ మెషీన్ గురించి మీకు తెలుసా..?

ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థుల ఆలోచన.. ప్రోత్సహించిన ఇన్వెస్టర్లు, మెరుగైన ఆర్డర్లు..

team ys telugu
23rd Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


వేడి వేడి దోశ అంటే ఇష్టపడని వారెవరు. ఈ దక్షిణాది వంటకానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక దోశలో వెరైటీలు బోలెడన్ని ఉన్నాయి. కొని రెస్టారెంట్లు అయితే బ్రాండ్‌ను క్రియేట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. దోశ ఏదైనా, ప్రాంతమేదైనా దోసె పెండిని పెనంపై వేసి చేతితో తిరగేయాల్సిందే. కానీ బెంగళూరుకు చెందిన ముకుంద ఫుడ్స్ ఒక అడుగు ముందుకేసి ఈ విధానాన్నే మార్చేసింది. దోశలు తయారు చేసే ఆటోమేటిక్ టేబుల్ టాప్ మెషీన్‌ను ప్రపంచంలో తొలిసారిగా రూపొందించింది.

ఆటోమేటిక్ దోశమెషీన్

ఆటోమేటిక్ దోశమెషీన్


ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విద్యార్థి అయిన ఈశ్వర్ వికాస్ ఒకరోజు ఢిల్లీలోని రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ దోశకు రూ.110 చెల్లించారు. అదే దోశ దక్షిణాదిన చాలా తక్కువ ధరలో దొరుకుతుంది. ‘మెక్ డొనాల్డ్ రెస్టారెంట్లలో బర్గర్ ధర దేశవ్యాప్తంగా ఒకే రేటుంటుంది. కేఎఫ్‌సీలో చికెన్ రుచి, ధర కూడా అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉంటుంది. మరి దోశకు ఎందుకీ వ్యత్యాసం’ అనే ప్రశ్న ఈశ్వర్‌లో తలెత్తింది.

ఈ ప్రశ్నకు జవాబు ప్రమాణీకరణ, యాంత్రికీకరణపై ఆధారపడి ఉంటుంది. బర్గర్లు, పిజ్జాల తయారీకి యంత్రాలున్నాయి. భారతీయ వంటకాలైన దోశ, పూరి తయారీ అంతా చేతులతోనే సాగుతుంది. యంత్రాల రాకతో తయారీ నిపుణులపై ఆధారపడడం తగ్గుతుందని అంటారు ఈశ్వర్. ఆలోచన వచ్చిందే తడవుగా దోశ తయారీ మెషీన్‌ను రూపొందించాలని నిర్ణయించారు. స్నేహితుడు సుదీప్ సబత్‌తో కలిసి ఈశ్వర్ రంగంలోకి దిగారు. మూడో సంవత్సరం చదువుతున్న సమయంలో 2012 మేలో కంపెనీని నెలకొల్పారు. వారి ఆలోచనను ఇండియన్ ఏంజెల్ నెట్‌వర్క్ (ఐఏఎన్) ముందుంచారు. ఇంక్యుబేటర్‌లో చోటు సంపాదించారు. అక్కడే వారి ఆలోచన కాస్తా కార్యరూపం దాల్చింది. ఐఏఎన్ ఇన్వెస్టర్లు అయిన హరి బాలసుబ్రమణియం, పి.గోపినాథ్‌ల బృందం 2013 అక్టోబరులో ముకుంద ఫుడ్స్‌లో పెట్టుబడి పెట్టింది.

ఇదీ మెషీన్ ప్రత్యేకత

ఒక టచ్ చేస్తే చాలు. మీరు కోరుకున్న రుచిలో 60 సెకన్లలో దోశ రెడీ. ఎంత సైజులో కావాలంటే అంత సైజులో దోశ వస్తుంది. ఎంత మందం ఉండాలి, రోస్ట్ ఎంత కావాలి ఆదేశిస్తే అందుకు దగ్గ దోశ సిద్ధమవుతుంది. ఫ్యాట్ ఫ్రీ దోశ కూడా చేయొచ్చు. మెషీన్‌కు ఉన్న డబ్బాల్లో పిండి, నూనె, నీళ్లు పోయాలి. గంటకు 50 వరకు దోశలను తయారు చేస్తుంది. మెషీన్‌ను సులువుగా మోసుకెళ్లొచ్చు. అంతేకాదు ఇంధనం కూడా ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది.


పరిశీలన ద్వారా డిజైన్..

మెషీన్‌కు వాడిన విడిభాగాలు బైక్ స్టాండ్, సూట్‌కేస్ తాళం, వాటర్ ఫౌంటెయిన్, అక్వేరియం డిజైన్ ఆధారంగా రూపొందినవే.

  • - వేడి పెనంపైన పిండి పడేందుకు ఆర్కిమెడిస్ స్క్రూ విధానాన్ని అనుసరించారు. నిర్మాణ సమయంలో కాంక్రీటు వేసేందుకు ఇదే విధానం ఉంది.
  • - సమయం ఆదా అయ్యేందుకు పిండి వేయడంతోపాటు వెంటనే దోశను పెనం నుంచి తీయాలి. ఇందుకు మోటార్ సైకిల్ సైడ్ స్టాండ్ సూత్రాన్ని పాటించారు.
  • - పిండి సమంగా పడేందుకు ఏసీ మోటార్ స్పీడ్‌ను 1,440 ఆర్‌పీఎం నుంచి 1 ఆర్‌పీఎంకు కుదించాలి. ఇందుకోసం ఐఐటీ ప్రొఫెసర్లు, విద్యార్థులతోనూ సంప్రదించారు. అలా చేయడం వీలు కాదన్నది వారి నుంచి వచ్చిన సమాధానం. వేరియేబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ అనే టెక్నాలజీని వాడాలని ఒకరు సూచించారు. ఇందుకు రూ.15-20 వేలు ఖర్చు వస్తుంది. చివరగా చెన్నైలోకి ఒక దుకాణదారును కంపెనీ వ్యవస్థాపకులు కలిశారు. రూ.3,500ల ఖర్చుతో పరిష్కారం లభించింది. చైన్లు, గేర్లను వాడడం ద్వారా పరిష్కారం దొరికింది. పరిశీలన ద్వారానే పరిష్కారం లభిస్తుందని అంటారు సుదీప్.

ప్రోత్సాహం ఉంటే..

పరిశ్రమలో ముకుంద ఫుడ్స్ వంటి స్టార్టప్స్ అతి కొద్ది మాత్రమే ఉన్నాయి. ఐఏఎన్ నిధులు సమకూర్చడం అదృష్టమని అంటారు ఈశ్వర్. ఉపకరణాల తయారీ రంగంలో ఎన్నో స్టార్టప్స్‌కు నిధుల లేమి ఉందన్నారు. సముచిత, వినూత్న ఆలోచన కావడంతో ఉత్పాదనను త్వరగా మార్కెట్లోకి తీసుకు రావాలన్న ఒత్తిడి ఉండేది. టయోటా వంటి కంపెనీలకు ప్రోటోటైప్ అభివృద్ధికి 4-5 ఏళ్ల సమయం పడుతుంది. వాణిజ్యపర ఉత్పాదనను తీసుకొచ్చేందుకు మరో 1-2 ఏళ్లు. ఆ తర్వాత ఉత్పాదన తయారీకి వెళుతుంది. ‘ఈ విధానం అనుసరించేందుకు మా వద్ద డబ్బు, సమయం లేదు. నిధులు వచ్చే సమయానికే చివరి ప్రోటోటైప్ రెడీ అయింది. అయినప్పటికీ రెండు వాణిజ్యపర ప్రోటోటైప్స్ తీసుకు రావాల్సి ఉంది. సాధారణ పద్ధతిలో వెళితే మరింత ఆలస్యమయ్యేది. చివరగా 234 విడిభాగాలతో దోశమేటిక్ సిద్ధమైంది’ అని అన్నారు సుదీప్.

ప్రోటోటైప్, తుది ఉత్పాదన ఒకేసారి రూపొందించిన కంపెనీ తమదేనని ముకుంద ఫుడ్స్ అంటోంది. ఈ విధానంలో సమయం, డబ్బులు ఆదా అయ్యాయని తెలిపింది.

నిజమైన సమస్యలను పరిష్కరించే స్టార్టప్స్‌కు ఏంజెల్, వీసీ కంపెనీలు నిధులు సమకూర్చాలి. ప్రధానంగా రవాణా, ట్రాఫిక్, తయారీ, వాణిజ్యం, పంపిణీ రంగాల్లో ఉన్న స్టార్టప్స్‌ను ప్రోత్సహించాలి అని అంటారు ఈశ్వర్. ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉండాలి. ప్రభుత్వ పథకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వ గ్రాంటు కోసం దరఖాస్తు చేశాం. రుణం కోసం టిఫాక్-సిడ్బికి చేసిన దరఖాస్తు పెండింగులో ఉందని చెప్పారు.

దోశమాటిక్‌లో తయారైన దోశ

దోశమాటిక్‌లో తయారైన దోశ


పరిశ్రమ పరిమాణం..

భారత్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం మొత్తం ఆహార రంగంలో 32 శాతం ఉంటుంది. పరిశ్రమ పరిమాణం సుమారు 121 బిలియన్ డాలర్లు. ఉత్పాదన, వినియోగం, ఎగుమతుల పరంగా దేశంలో అయిదవ స్థానంలో ఉంది. ప్రత్యక్షంగా 1.3 కోట్ల మంది, పరోక్షంగా 3.5 కోట్ల మంది ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు. తయారీ జీడీపీలో 14 శాతం వాటా కైవసం చేసుకుంది. భారత్ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో 13 శాతం, పెట్టుబడుల్లో 6 శాతం వాటా దక్కించుకుంది. ఏటా 10 శాతం వృద్ధి చెందుతోంది. 2015 చివరినాటికి 194 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు.

దోశమేటిక్ చిన్న రెస్టారెంట్లే లక్ష్యంగా పనిచేస్తోంది. నిపుణులైన పనివారిపై రెస్టారెంట్లు ఆధారపడాల్సిన అవసరం లేదని కంపెనీ అంటోంది. రోజుకు 500 వరకు దోశలను ఈ మెషీన్ చేసి పెడుతుంది.

కంపెనీ సవాళ్లు

నియామకంతోపాటు ఉద్యోగులు దీర్ఘకాలంపాటు కొనసాగడం కంపెనీకి పెద్ద సవాల్‌గా నిలిచింది. ఈ రంగంలో వృత్తిపరమైన బాధ్యత ఉద్యోగుల్లో ఉండడం లేదని అంటారు ఈశ్వర్. ఉద్యోగులను నిరంతరం వెన్నుతట్టడం కఠిన పరీక్షేనని చెబుతారు. హార్డ్‌వేర్ రంగం క్షేత్రస్థాయి పనులతో కూడుకున్నది. తయారీ, విక్రయం, విడిభాగాల కొనుగోలు క్లిష్టమైన పని. కంప్యూటర్ ముందు కూర్చుని కోడింగ్ చేసినంత ఈజీ కాదు. స్టార్టప్‌ను నిర్వహించడం మారథాన్ వంటిది. హార్డ్‌వేర్ రంగంలోని స్టార్టప్ అయితే అది డబుల్ మారథాన్ అని ఆయన అంటున్నారు.

దేశవ్యాప్తంగా కస్టమర్లు

కంపెనీకి దేశవ్యాప్తంగా అన్ని నగరాల నుంచి కస్టమర్లు ఉన్నారు. దోశమేటిక్ ధర రూ.1.1-1.5 లక్షల మధ్య ఉంది. సర్వీసు కేంద్రాలను ప్రధాన నగరాల్లో ఏర్పాటు చే సింది. ఇతర ఉపకరణాల తయారీని చేపట్టాలని కంపెనీ భావిస్తోంది. తయారీ కేంద్రం సామర్థ్యం పెంపుకు,సర్వీసింగ్ కేంద్రాల విస్తరణ, నిర్వహణ మూలధనం కోసం నిధులను సమీకరించాలని యోచిస్తోంది.

WEBSITE

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags