సంకలనాలు
Telugu

పొగచూరిపోతున్న బతుకుల పాలిట భాస్కరుడు !

దేశవ్యాప్తంగా ''స్టౌవ్స్ మ్యాన్‌''గా పేరుతెచ్చుకున్న సాయిభాస్కర్ రెడ్డి

Nagendra sai
31st Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ఇల్లంతా పొగచూరి ఉంటుంది. ఏ గోడ చూసినా నల్లగా పెయింట్ వేసినట్టు నిగనిగలాడుతూ ఉంటుంది. ఇక వంటింట్లోకి వెళ్తే.. అదేదో పరిశ్రమలోకి వెళ్లినంత సీన్ ఉంటుంది. సాధారణంగా ఇదీ మారుమూల గ్రామాల్లో మనకు ఇప్పటికీ కనిపించే పరిస్థితి. పొగ గొట్టాలు పెట్టుకుని.. ఊపిరిపోయేంతగా ఊదితేతప్ప కూడు నోటికి అందని జీవులు ఎన్నో కోట్ల మంది ఇప్పటికీ ఉన్నారు. ఇలా ఈ మట్టిపొయ్యిల కారణంగానే ఏటా కనీసం 16 లక్షల మంది మృత్యువాతపడ్తున్నారు. ఇది చదివిన వెంటనే.. మనం ఎవరైనా అయ్యో.. అని నిట్టూరుస్తాం. ఇప్పటికీ.. ఇలా ఉందా.. అంటూ.. నోరెళ్లబెట్టి ఓ సానుభూతి పారేస్తాం. అక్కడితో మరిచిపోతాం.

కానీ ఐఐటిలో ఉన్నత చదువులు చదివి.. అత్యున్నత ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా.. వాటన్నింటినీ కాదనుకుని ఓ యువకుడు ముందుకొచ్చాడు. వంటింటి కుంపట్లలో కాలిపోతున్న బతుకులను ఒడ్డున పడేయడమే ధ్యేయంగా కదిలాడు. వాళ్ల వాళ్ల స్థోమతను బట్టి కేవలం 5 -10 రూపాయలతో వాళ్లకో పరిష్కారం చూపించాడు. అవును.. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. మసిపొయ్యిల మధ్య మగ్గిపోతున్న మహిళలకు ఆయన నిజంగా దేవుడే. వాళ్ల ఆయుష్షను పెంచి, ఆరోగ్యాన్ని కాపాడే సోషల్ ఆంట్రప్రెన్యూర్. అలా దేశవ్యాప్తంగా ''స్టౌవ్స్ మ్యాన్‌''గా పేరుతెచ్చుకున్న సాయిభాస్కర్ రెడ్డి.. మన తెలుగువాడు కావడం నిజంగా గర్వకారణమే.

పొయ్యిలను గ్రామాలకు తీసుకెళ్తున్న డా.సాయిభాస్కర్ రెడ్డి

పొయ్యిలను గ్రామాలకు తీసుకెళ్తున్న డా.సాయిభాస్కర్ రెడ్డి


ప్రకృతితో ఏదో తెలియని బంధం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం, గుండాల గ్రామానికి చెందిన వ్యక్తి నక్కా సాయిభాస్కర్ రెడ్డి. పుట్టింది అక్కడే అయినా పెరిగింది.. చదివింది మాత్రం హైదరాబాద్‌లోనే. చిన్నప్పటి నుంచి ఆ కుర్రాడికి ప్రకృతి అంటే చెప్పలేని ప్రేమ. కొండలను, కోనలను, పక్షులను, చెట్లను చూస్తూ.. అలా గంటలకొద్దీ కాలం గడిపేసేవాడు. చెట్లు, పుట్టలతో ఏదో తెలియని బంధం అతనితో పెనవేసుకుంది. వయస్సు పెరిగే కొద్దీ ఆ ఆలోచనలు కూడా విస్తృతమవుతూ వచ్చాయి. ప్రకృతిపై ప్రేమ నుంచి పర్యావరణానికి ఏదో చేయాలనే తాపత్రయం అతనిలో బలపడ్తూ వచ్చింది.

భూమి గురించి తెలుసుకోవడానికే ఐఐటికి పయనం

ఈ భూమిని అంతటినీ తన ఆస్తిగా భావించే సాయిభాస్కర్‌కు.. ఈ మదర్ ఎర్త్ గురించి ఇంకా ఇంకా.. తెలుసుకోవాలనే ఆరాటం పెరిగింది. అందులో భాగంగా.. దేశమంతా తిరిగి.. కొత్తకొత్త విషయాలు తెలుసుకోవాలని ఆతృత అతడిని ఐఐటివైపు నడిపించింది. ఐఐటి బాంబేలో అప్లైడ్ జియాలజీ చదివారు. అక్కడితో ఆగకుండా జాగ్రఫీ కూడా చదివి డబుల్ మాస్టర్స్ చేశారు. అతనికి ఉండే సున్నితత్వం, స్పందించే గుణమే ఈ రోజు వేలాది మంది ప్రాణాలను కాపాడుతోంది.

''పర్యావరణంపై అవగాహన అందరికీ ఉంటుంది. ఈ రోజు అవగాహన పెంచుకోవడానికి ఇంటర్నెట్ ఉండనే ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా స్పందించే గుణం, సెన్సిటివిటీ చాలా ముఖ్యం. ఈ ఒక్క గుణమే మనలో చాలా మార్పులు తీసుకువస్తుంది. నేను ఈ మాత్రం దూరం ప్రయాణించగలిగాను అంటే దానికి కారణం సెన్సిటివిటీనే'' అంటారు సాయి భాస్కర్.
image


''పొయ్యిల సారు''గా మారిన పేరు

తన పరిశోధనల్లో భాగంగా అనేక గ్రామాలు తిరిగిన భాస్కర్ రెడ్డికి ఒక్క విషయంపై మాత్రం తీవ్రమైన ఆందోళన మొదలైంది. మట్టిపొయ్యిల మధ్య మగ్గిపోతున్న మహిళలకు ఏదో ఒకటి చేయాలని అప్పుడే బలంగా నిశ్చయించుకున్నారు. తాను చదివిన చదువేంటి ? తన ఆలోచన ఏంటి ? దీని వల్ల మనకేం మిగుల్తుంది ? అనే ఆలోచనలు పొరపాటున కూడా తన దరిచేరలేదు. ఇంతకీ పొగ ఎందుకు వస్తుంది ? కట్టెల వినియోగం తగ్గాలంటే ఏం చేయాలి ? పొగరాని కుంపట్లను ఎలా తయారుచేయాలనే దానిపై అధ్యయనం మొదలుపెట్టాడు. పూర్తిగా గ్రామీణలను దృష్టిలో ఉంచుకుని తయారుచేయాలి కాబట్టి.. ఖర్చు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వాడేసిన నూనె డబ్బాలను సైతం వదల్లేదు. పొగరాకుండా.. తక్కువ ఇంధనంతో మండే పొయ్యిలను తయారు చేశారు. అలా పరిశోధనలు చేస్తూ.. ఇప్పటి వరకూ దాదాపు 50 రకాల పొయ్యిలను సృష్టించారు. ఎవరికి వారు ఇంట్లో సొంతంగా తయారుచేసుకునేంత సింపుల్ టెక్నాలజీ.. వీటిలో గొప్పదనం. ఇంత చేసినా.. ఏ ఒక్కదానికీ పేటెంట్ తీసుకోలేదు. ఎందుకంటే.. పర్యావరణానికి మేలు చేసే మహద్భాగ్యం తనకు లభించిందని, దీన్ని పేటెంట్ చేసి దాచుకుని, సొమ్ము చేసుకోవాలనే ఆలోచనకు తనకు లేదంటారు సాయి భాస్కర్. ఎవరైనా తయారు చేసుకుని ఉపయోగించుకుంటే తనకు అంతకు మించి కావాల్సిందేమీ లేదని మురిసిపోతారు.

పొయ్యిలు వాటి పనితీరు గురించి గ్రామస్థులకు వివరిస్తున్న సాయిభాస్కర్

పొయ్యిలు వాటి పనితీరు గురించి గ్రామస్థులకు వివరిస్తున్న సాయిభాస్కర్


ఆంధ్రా, తెలంగాణ, జార్ఖండ్, ఉత్తరాఖండ్.. సహా.. 16 రాష్ట్రాల్లో ఇలాంటి పొయ్యిలను వేలాది సంఖ్యలో తయారుచేసి ఇచ్చారు. కొంత మంది ఔత్సాహికులకు వీటి తయారీని నేర్పించి వారిని కూడా ఈ యజ్ఞంలో భాగస్వామ్యం చేశారు. అయితే ఊరికే.. అలా ఊళ్లోకి వెళ్లి మీ పొయ్యిలను మార్చండి.. అనగానే.. ఎవరూ ఒప్పుకోలేదు. మొదట అనుమానంగా చూశారు.. ఆ తర్వాత ఇతనికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనుకున్నారు. ఆ తర్వాత తాను అన్నీ వివరించి చెప్పాక ట్రై చేసి చూశారు. ఫలితం కనిపించడంతో వేలాది మంది ఇప్పుడు వీటికి మారారు. అప్పటి నుంచి సాయిభాస్కర్‌ను "పొయ్యిల సారు" అని ఊళ్లలో ప్రేమగా పిలుచుకుంటారు. అంతేకాదు వాళ్ల స్థోమత, అవసరాన్ని బట్టి వారికి రూ.200-300ల్లోపే పొయ్యిలను తయారు చేసి కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పటికీ గ్యాస్ స్టౌవ్‌ను వాడేందుకు గ్రామాల్లోని ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపించరనే ఆసక్తి విషయాన్ని కూడా భాస్కర్ రెడ్డి వివరిస్తారు.

image


ఎరువుల వాడకాన్ని తగ్గించే బయోచార్

వ్యవసాయం కోసం ఇప్పుడు మన వాళ్లు టన్నుల కొద్దీ ఎరువులను వాడుతూ.. భూమిని నాశనం చేస్తున్నారనే బాధ అతనిలో నిత్యం ఉండేది. రైతు కుటుంబం నుంచి రావడం వల్ల వాళ్లకు ఏదో ఒకటి చేయాలని అనిపించింది. ఇందులో భాగంగా.. తాను చదివిన అప్లైడ్ జియాలజీ పూర్తిగా పనికొచ్చింది. భూమిలో సారం పెంచి, ఎరువుల శాతాన్ని గణనీయంగా తగ్గించే ''బయోచార్''ను రూపొందించారు. మామూలు మట్టి, బొగ్గు, వర్మికంపోస్టును కలిపి.. దానిపై బెల్లం నీళ్లను చిలకరిస్తూ.. రెండు రోజులకు ఒకసారి తిప్పడం వల్ల పదిహేను రోజుల్లో బయోచార్ తయారవుతంది. సాధారణంగా బొగ్గుకు శుద్ధి చేయడం, లాక్కునే గుణం ఎక్కువ. అనేక పరిశోధనల తర్వాత దీన్ని గుర్తించిన సాయిభాస్కర్.. ఈ బయోచార్‌ను తయారుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దీనికి మంచి గుర్తింపు లభించింది. బిబిసి వంటి చానళ్లు కూడా భారత్ వచ్చి ఈ బయోచార్ గురించి ప్రత్యేక కథనాలను రూపొందించాయి. ఈ బయోచార్ వాడడం వల్ల పంటల్లో అనూహ్యంగా 30 నుంచి 50 శాతం దిగుబడి పెరగడాన్ని రైతులు, శాస్త్రవేత్తలు గమనించారు.

ఒరిస్సాలోని ఓ రైతు పొలంలో బయోచార్ తయారీని రైతులకు వివరిస్తున్న సాయిభాస్కర్

ఒరిస్సాలోని ఓ రైతు పొలంలో బయోచార్ తయారీని రైతులకు వివరిస్తున్న సాయిభాస్కర్


పొయ్యిలు, బయోచార్‌పై చేసిన విశేష పరిశోధనలన్నింటినీ క్రోడికరిస్తూ.. అండర్‌స్టాండింగ్ స్టౌవ్స్, బయోచార్‌కల్చర్ పేరుతో రెండు పుస్తకాలను కూడా రాశారు.

కూకట్‌పల్లి, పటాన్‌చెరు ఇండస్ట్రియల్ ఏరియాల్లోని నాలాలో కాలుష్యం, విషవాయువుల కారణంగా అక్కడి జనాలు, జీవజాలంపై ప్రభావాన్ని వివరిస్తూ ఏకంగా పిహెచ్.డి. చేశారు. ఆసియాలోనే అత్యంత తీవ్రంగా కలుషితమైన పారిశ్రామికవాడల్లో ఒకటిగా పటాన్‌చెరు ఉందని విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు.

తృటిలో తప్పించుకున్న సంఘటనలు ఎన్నో

పర్యావరణంపై ప్రేమ ఎన్నోసార్లు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. అయితే వీటిని ఆయన ఏవీ లెక్కచేయలేదు. ప్రతీ సారీ ఏదైనా కొత్తవిషయం తెలుసుకోవడానికి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతూ ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఎన్నో ప్రాజెక్టుల్లో పాల్గొన్నారు సాయి భాస్కర్. వాతావరణంలో మార్పులు - ప్రభావం అనే ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. డిఎఫ్ఐడి - ఎపి సర్కార్ చేపట్టిన ఏపి రూరల్ లైవ్లీహుడ్స్ కార్యక్రమానికి అడిషనల్ కో ఆర్డినేటర్‌గా పనిచేసి 2500 గ్రామాలను సందర్శించారు. అడవుల నిర్వాహణకు సంబంధించిన ఏపి, కర్నాటక ప్రభుత్వాలతో పనిచేశారు.

వీటితోపాటు వరదలు, తుఫాన్లు, భూకంపాలు వచ్చినప్పుడు.. తక్షణం స్పందించాల్సిన తీరును, ఆ తర్వాతి ప్రభావాలను అంచనా వేయడానికి దేశవ్యాప్తంగా ఎన్నోప్రాంతాలు తిరిగారు. కృష్ణా వరదలు, ఉత్తరాఖండ్ భూకంపం వంటివి వాటిల్లో కొన్ని. ఉత్తరాఖండ్‌లో ఒకసారి భూకంప తీవ్రతను అంచనా వేయడానికి వెళ్లినప్పుడు.. కొండచరియలు విరిగిపడి.. తృటిలో ప్రమాదం తప్పింది. మరోసారి మహారాష్ట్రలో కొండలపైకి ఎక్కి నీటిలభ్యత వివరాలను సేకరించే పనిలో ఉన్నప్పుడు జారిలోయలోకి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇక ప్రాణాలపై ఆశ వదులుకుంటున్న తరుణంలో పట్టుచిక్కి బయటపడినట్టు ఆ రోజులను గుర్తు చేసుకుంటారు భాస్కర్. కొద్దికాలం క్రితం కూకట్‌పల్లి పరిసర నాలాలను పరిశీలిస్తూ.. బురదలోకి దిగి అక్కడి మట్టిలోకి నడుంలోతు కూరుకుపోయి నానా ఇబ్బందులతో బయటపడ్డారు. తనను రక్షించడానికి వచ్చిన డ్రైవర్ కూడా ఇరుక్కోవడంతో.. చేసేదిలేక తానే ఏదో విధంగా బయటపడి డ్రైవర్‌ను రక్షించిన రోజులను గుర్తుచేసుకుని నవ్వుకుంటారు సాయి భాస్కర్.

నీటిపై తేలియాడే పంటలపై ప్రయోగం

పొయ్యిలు, బయోచార్‌లపై విస్తృత ప్రయోగం పూర్తైన తర్వాత ఇప్పుడు తక్కువ ఖర్చులో సెన్సార్లు, డ్రోన్‌లు, నీటిపై తేలియాడే పంటలపై ప్రయోగాన్ని తీవ్రతరం చేశారు సాయిభాస్కర్. పొలాల్లో నీటి శాతం ఎంత ఉంది ? నీళ్లు ఎప్పుడు అవసరమవుతాయి ? ఎంత అవసరమవుతాయో చెప్పే సెన్సార్లను కొంత మంది విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటి విలువ లక్షపైనే ఉంది. అలాంటి సెన్సార్లను కేవలం మూడు - నాలుగు వేలకే తయారుచేసిన ఘనత కూడా ఈయనది. అవసరమైన వాళ్లకు వాటిని తయారు చేసి ఇస్తూ ఉంటారు. 

భూమిలోకి ఇంకిన నీటి శాతాన్ని విశ్లేషించే సెన్సార్

భూమిలోకి ఇంకిన నీటి శాతాన్ని విశ్లేషించే సెన్సార్


పెద్ద పెద్ద సాగునీటి ప్రాజెక్టుల్లో ఏకంగా నీటిపై తేలియాడే వరిని కూడా పండించే అవకాశం ఉందని, దానిపైనే ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నట్టు తెలిపారు. అవసరమైతే నాగార్జున సాగర్‌లో ఏకంగా వరిపొలాన్ని పండించే అవకాశం ఉందని, దీనివల్ల నీళ్లు ఆవిరైపోవడం కూడా తగ్గుతుందనేది ఆయన విశ్లేషణ. ఈ మధ్య కాలిఫోర్నియాలోని మూడు రిజర్వాయర్లలో కార్బన్ బాల్స్‌ వేసి నీటిఆవిరిని తగ్గించేందుకు వాళ్లు చేస్తున్న ప్రయత్నాన్ని గుర్తుచేశారు సాయిభాస్కర్.

నీటిపై తేలియాడే పంటల గురించి పరిశోధన

నీటిపై తేలియాడే పంటల గురించి పరిశోధన


వీటితో పాటు జియోస్పిరిట్ పేరుతో క్యాంపులు కూడా నిర్వహిస్తుంటారు. అడవుల్లో సంచరిస్తూ.. ప్రకృతికి దగ్గరగా ఉండడం, పర్యావరణంపై యువతను చైతన్యం చేయడం దీని ముఖ్య ఉద్దేశం.

సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్లకు సలహా..

''చిన్న సమస్యల గురించి కాకుండా పెద్ద సమస్యలను పరిష్కరించేలా మీ ఆలోచనలు ఉండాలి. బిగ్ ఇంపాక్ట్ ఉండాలి. లక్షలు, కోట్లాది మందిని ఇబ్బందిపెడ్తున్న సమస్యకు పరిష్కారమో లేక వాళ్ల జీవనాన్ని మెరుగు చేసే విధంగా ఉండేలా మీ ఆలోచనలు సాగాలి. అప్పుడే అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. ప్రాంతం, రాష్ట్రం, దేశానికి మీ ఆలోచలను పరిమితం చేయొద్దు. ఈ భూమాత మనందరిదీ. అందరం కలిసి పర్యావరణానికి మేలు చేసే విధంగా ఏదో ఒక చిన్న అడుగైనా వేయాలి''.

website

photo credits- www.saibhaskar.com

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags