సింగిల్ యాప్.. మల్టీపుల్ టాస్క్.. హైదరాబాదీ ట్రిపుల్ ఐటీ గ్రాడ్యుయేట్ల వినూత్న ఆలోచన !

క్యాబ్స్, ఫుడ్,రీఛార్జ్ యాప్స్ ను అనుసంధానిస్తున్న బకర్

సింగిల్ యాప్.. మల్టీపుల్ టాస్క్.. హైదరాబాదీ ట్రిపుల్ ఐటీ గ్రాడ్యుయేట్ల వినూత్న ఆలోచన !

Saturday January 23, 2016,

4 min Read

మోడ్రన్ టెక్నాలజీ మనిషి లైఫ్ స్టైల్ ను పూర్తిగా మార్చేసింది. గతంలో దూరంగా ఉన్నవారితో మాట్లాడటానికి ఉపయోగపడిన మొబైల్ ఫోన్ ఇప్పుడు కనీస అవసరంగా మారింది. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లే కనిపిస్తున్నాయి. ఇక యాప్స్ పుణ్యమాని ఎవరికి ఏం కావాలన్నా మునివేళ్ల మీద ఆర్డర్ చేయడమే ఆలస్యం కళ్లెదుట ప్రత్యక్షమైపోతుంది. పొద్దున్నే నిద్రలేపడం మొదలు షాపింగ్, రైల్వే, సినిమా, ఫ్లైట్ టికెట్స్ బుకింగ్, ఫుడ్ హోం డెలివరీ, క్యాబ్ బుకింగ్.. ఇలా ఒక్కటేమిటి అన్ని పనులకు యాప్స్ అందుబాటులోకి వచ్చేశాయి. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు కోకొల్లలుగా పుట్టుకొస్తున్న యాప్స్ యాజర్లను కన్ఫ్యూజన్ లో పడేస్తున్నాయి.

సర్వీసు ఒక్కటే.. కానీ దాన్ని అందించే కంపెనీలు అనేకం. ఒక్కో కంపెనీకి ఒక్కో యాప్. ఒక్కో యాప్ ను పరిశీలించి వాటిలో బెస్ట్ డీల్ ను సెలెక్ట్ చేసుకోవడమంటే జనానికి పెద్ద పరీక్షే. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ గ్రాడ్యుయేట్స్ అయిన వెన్నెల మిర్యాల, రవ్ నీత్ సింగ్, నిఖర్ అగర్వార్ కూడా సరిగ్గా ఇలాంటి సమస్యే ఎదుర్కొన్నారు. ఈ ప్రాబ్లెంకు చెక్ పెట్టేందుకు బకర్ పేరుతో కొత్త యాప్ డెవలప్ చేశారు.

image


అనుభవం నుంచి ఆలోచన

ముగ్గురూ కాలేజ్ స్టూడెంట్స్ కావడంతో పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీలో ఒక్కో రూపాయి ఆలోచించి ఖర్చు చేసేవారు. ఫేక్ ఈ మెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేసి యాప్స్ ఇచ్చే ఫస్ట్ టైం డిస్కౌంట్స్, ఆఫర్లు సొంతం చేసుకునేవారు. అయితే ఇలాంటి యాప్స్ ను వెతకడం కొత్త ఈ మెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి చాలా సమయం పట్టేది. యాప్స్ ఇచ్చే ఆఫర్ల కోసం వెతుకతూ టైం వేస్ట్ చేసుకోకుండా అన్నీ యాప్స్ ఇస్తున్న ఆఫర్లను ఒకేచోట చూసుకునే అవకాశం ఉంటే బాగుండేదన్న ఆలోచన బకర్ యాప్ కు ప్రాణం పోసింది. ఇక ఇళ్లలో పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ మొబైల్ రీఛార్జ్ కోసం, క్యాబ్ బుక్ చేేసుకునేందుకు పిల్లల సాయం అడగడం వెన్నెల, రవ్ నీత్, నిఖర్ కు అనుభవమే. దీంతో యాప్స్ పై అవగాహన లేక వారు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపేలా బకర్ ను డెవలప్ చేశారు.

“పెద్ద పెద్ద సంస్థలు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిజానికిదో క్లిష్టమైన సమస్య. యూజర్లు రకరకాల సర్వీసుల గురించి వివరాలు సేకరించి తక్కువ ధరకు లభించే దాన్ని ఎంపిక చేసుకుంటారు. చిన్న మొబైల్ స్క్రీన్ లో ఇలా చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్న లక్ష్యంతోనే బకర్ యాప్ డెవలప్ చేశాం.”- వెన్నెల

బకర్ ఎలా పనిచేస్తుంది.

ఒకే రకమైన సర్వీసు అందించే కంపెనీల యాప్స్ ఆఫర్లను పరిశీలించి వాటిలో బెస్ట్ ఆఫర్ ను యూజర్ల ముందుంచుతుంది బకర్. క్యాబ్స్, ఫుడ్, రీఛార్జ్ కు సంబంధించి వివిధ యాప్స్ అందిస్తున్న ఆఫర్లును క్రోడీకరించి వాటిలో బెస్ట్ ఆప్షన్లను చూపిస్తుంది. ఉదాహరణకు ఒక కన్జ్యూమర్ క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటే బకర్ యాప్ లోని క్యాబ్స్ సెక్షన్ లో ఏయే క్యాబ్ కంపెనీ ఎంత ఛార్జ్ చేస్తుంది.. కస్టమర్ ఉన్న ప్రాంతానికి ఎంత దూరంలో క్యాబ్ ఉందన్న విషయాలు తెలుసుకునే వీలు కలుగుతుంది.

పెరుగుతున్న ఆదరణ

బకర్ యాప్ ను అందుబాటులోకి తెచ్చిన రెండు నెలల్లోనే 9 వేల మంది యూజర్లుగా మారారు.. ఈ యాప్ లో క్యాబ్స్, ఫుడ్ ఆర్డరింగ్, మొబైల్ రీఛార్జ్ కు సంబంధించి 15 యాప్స్ అనుసంధానమై ఉన్నాయి. యాప్ కు ఆదరణ పెరుగుతుండటంతో దాన్ని మరింత డెవలప్ చేసేందుకు సిద్ధమవుతున్నారు ముగ్గురు మిత్రులు. ట్రిపుల్ ఐటీలో తమకున్న పరిచయాలతో వివిధ సర్వీసులు అందించే యాప్ లను బకర్ లో భాగస్వాముల్ని చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. బకర్ కమిషన్ బేసిస్ పై పనిచేస్తుంది. యాప్ సాయంతో కన్జ్యూమర్ ఏ యాప్ లేదా సర్వీస్ ను ఎంచుకుంటారో సదరు కంపెనీ బకర్ కు కమిషన్ చెల్లిస్తుంది.

“కొందరు కసమర్లు కేవలం ఉబెర్ తప్ప ఓలా, టాక్సీ ఫర్ ష్యూర్ క్యాబ్ లలో ప్రయాణించేందుకు ఇష్టపడరు. వారికి సదరు కంపెనీ ఎంత ఛార్జ్ చేస్తుందన్న అంశం లెక్క కాదు. కానీ కాలేజ్ స్టూడెంట్స్ ఇందుకు పూర్తి భిన్నం. అవసరాలకు తగ్గట్లుగా వ్యక్తుల ప్రాధాన్యతలు ఉంటాయి. యాప్స్ విషయంలో యూజర్ల ఆలోచన విధానాన్ని అధ్యయనం చేశాం. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తున్నాం.”- వెన్నెల

ఇన్వెస్టర్ల ఆసక్తి

ఏంజిల్ ఇన్వెస్టర్లైన సిలికాన్ వ్యాలీ, 50కె వెంచర్స్ సాయంతో బకర్ ఈ మధ్యే సీడ్ రౌండ్ ఫండింగ్ ను పూర్తి చేసుకుంది. ఐఎఎన్ కు చెందిన మునీష్ జౌహర్, వేదాంతుకు చెందిన పుల్ కిత్ జైన్, సింగపూర్ బేస్డ్ 314 క్యాపిటల్ రోహిత్ నారాంగ్ బకర్ కు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. టీం మెంబర్స్ లో ఉన్న తపన, నైపుణ్యం బకర్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రేరేపించిందంటారు 50కె వెంచర్స్ ఫౌండర్ సంజయ్ ఎనిశెట్టి.

యువర్ స్టోరీ టేక్

చాలా స్టార్టప్ లు మార్కెట్లో ఉన్న ఇతర కంపెనీలతో అనుసంధానం కావాలనుకుంటున్నాయి. 2015 నాటికి ప్లే స్టోర్ లో 1.6 మిలియన్లు, యాప్ స్టోర్ లో 1.5 మిలియన్ల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. 2017 నాటికి ప్రపంచవ్యాప్తంగా యాప్ యూజర్ల సంఖ్య 4.4 బిలియన్లకు చేరుతుందని.. వారిలో 47 శాతం ఆసియా పసిఫిక్ దేశాలకు చెందినవారే ఉంటారన్నది మోబీఫోర్జ్ అంచనా. బకర్ ఆదాయంలో వృద్ధి ఇతర యాప్ ల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. బకర్ లోని మూడు సెగ్మెంట్లలో ఉన్న కంపెనీలు ఈ యాప్ అవసరం లేకుండానే చాలా సులువుగా కస్టమర్లను ఆకర్షించగలుగుతాయి. క్యాబ్స్ సెక్టార్ లో ఇప్పటికే క్యాబ్ అగ్రిగేటర్, స్కూట్ యాప్ సేవలందిస్తున్నాయి. మిగతా వాటి కోసం మైబెస్ట్ ప్రైస్ డాట్ కాం లాంటి సైట్లు ఉండనే ఉన్నాయి. పోటీ ఎక్కువగా ఉన్న రంగాలకు మాత్రమే తమ సేవలు పరిమితమన్నది బకర్ టీం చెబుతున్న మాట. కానీ మార్కెట్ లో సత్తా చాటిన వారిదే భవిష్యత్తు అనే విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగాలి.