అదరగొడుతున్న ఆన్ లైన్ మెడికల్ సర్వీస్
ఐబీఎం కంట్రీ మేనేజర్‌గా పనిచేసే శ్రీవల్సన్- ఉద్యోగ రీత్యా తరచూ ప్రయాణాలు చేయాల్సివచ్చేది. అదికాస్తా ఆరోగ్యంపై ప్రభావం చూపించింది. ఓసారి ముంబైలో ఉన్నప్పుడు బాగా వీకయ్యాడు. ఆ రాత్రి మెడిసిన్ కోసం నానా తిప్పలు పడ్డాడు. ఎక్కడా మెడికల్ షాప్ ఓపెన్ చేసి లేదు. ఒక్క టాబ్లెట్ కోసం నాలుగు గంటలు తిరిగాడు. విరక్తి పుట్టింది. ఆ విరక్తిలోంచే ఆలోచన మొలకెత్తింది. ఆ ఐడియా పేరే మెడికో.
మెడికో. ఇదో వెబ్ బేస్డ్ మొబైల్ వేదిక. హాస్పిటల్స్, డాక్టర్లు, డయోగ్నోస్టిక్ సెంటర్లు, ఫార్మసీలు, వెల్ నెస్ సెంటర్లను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన ప్లాట్ ఫాం. కొలిగ్ రమేశ్‌తో కలిసి స్టార్టప్ ప్రారంభించారు. 2015 అక్టోబర్ 17న వీరి ప్రయాణం మొదలైంది. లాంఛ్ అయిన కొద్ది రోజుల్లోనే 800 యూజర్లు చేరారు. 200 మంది యాప్ వినియోగదారులయ్యారు.
ప్రిఫర్డ్ లిస్టింగ్, పేపర్ క్లిక్, డీల్స్ మార్జిన్, ఫోకస్డ్ క్యాంపైన్స్ ఫండింగ్ చేస్తున్నాయి. ప్లేస్టోర్. ఐఓఎస్ ద్వారా 5 వేల వినియోగదారులను చేర్చుకోవాలన్నది మెడికో టార్గెట్. దీని కోసం ఐఓఎస్ యాప్ నూ లాంచ్ చేశారు. వీరి శ్రమకు సీఎంఎస్ కంప్యూటర్స్ లిమిటెడ్ సీఈఓ అనిల్ మీనన్ రూపంలో ఆర్ధికంగా చేయూత లభించింది. అనిల్ సహకారంతో ఈ ఇద్దరు ఆన్ లైన్ హెల్త్ కేర్ లో తమదైన మార్క్ చూపేందుకు కృషిచేస్తున్నారు.
భవిష్యత్ లక్ష్యాలు
యమా స్పీడుగా దూసుకుపోతున్న మెడికోను మరో 7రాష్ట్రాల్లోని 20 సిటీలకు విస్తరించాలనేది వీరిద్దరి ప్లాన్. సర్వీసు ప్రజలందరికీ చేరువయ్యేలా ఇంగ్లీష్ తో పాటూ ఇతర ప్రాంతీయ భాషల్లోనూ అందించేందుకు యత్నిస్తున్నామని శ్రీవల్సన్ చెప్తున్నాడు.
బ్రైట్ ఫ్యూచర్
2012లో హెల్త్ కేర్ సెక్టార్ మార్కెట్ విలువ 79 బిలియన్ డాలర్లు. 2017 కల్లా ఈ రంగం రెవెన్యూ 160 దాటి, 2020కి 280 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఆదాయం-ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్న ఆరోగ్య రంగం ఇండియాలో అతిపెద్ద సెక్టార్ అని మార్కెట్ నిపుణులు చెప్తుంటారు. ఆన్ లైన్ వైద్య సేవల్లో ఇప్పటికే ప్రాక్టో, లిబ్రేట్ లాంటి వేదికలున్నాయి. వీటితో మెడికో పోటీ పడాలి. ఈ సేవలకు విస్తృత ఆదరణ ఉన్నట్లు సీఏజీఆర్ చెప్తోంది. ఆన్ లైన్ రంగంలో మార్కెట్ 33.8 శాతం చొప్పన అభివృద్ధి సాధిస్తోందని లెక్కలు చెప్తున్నాయి. భారత్ లో జనాభా సంఖ్యకు తగినట్టుగా వైద్యులు లేరు. ఆ కారణంతో ఆసియాలో హెల్త్ కేర్ యాప్స్ కు మనదేశంతో పాటూ జపాన్ మంచి అనుకూల ప్రాంతాలని ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు.