సంకలనాలు
Telugu

నిత్యహరిత స్వాప్నికుడు వనజీవి రామయ్య

కోటి మొక్కలు నాటిన అభినవ అశోకుడికి పద్మ పురస్కారం

team ys telugu
26th Jan 2017
1+ Shares
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

వనజీవి రామయ్య లేదా చెట్ల రామయ్య అని గూగుల్లో కొడితే ఫటాఫట్ ఒక పది పేజీల ఆర్టికల్స్ కనిపిస్తాయి! సినిమా పర్సనాలిటీ కాదు. వ్యాపారవేత్త అంతకన్నాకాదు. విద్యావేత్త అనుకోడానికి వీల్లేదు. రాజకీయనాయకుడు అసలే కాదు. ముతక ధోతీ,లాల్చీ, మెడలో ఒక ప్లకార్డు! ఇంత సాధారణ వ్యక్తి గురించి పేజీల పేజీలు వ్యాసాలు, ఒక వికీపీడియా! చదివినా కొద్దీ ఆశ్చర్యమేస్తుంది. వెళ్లి కలుసుకుని మాట్లాడాలనిపిస్తుంది! ఆయన సైకిలెక్కి ఒక రోజంతా తిరగాలనిపిస్తుంది.

మాటలు చాలామంది చెప్తారు! చేసి చూపించినవాడే నిజమైన ఆదర్శవంతుడు! రామయ్య సరిగ్గా అలాంటి ఇన్‌ స్పిరేషనే ! వృక్షోరక్షతి రక్షితః! ఈ సూక్తి రామయ్య నరనరాల్లో స్ఫూర్తి నింపింది. అశోకుడో-ఇంకెవరో! అడుగుజాడ ఎవరిదైతే ఏంటి? ఆ జాడ నీడనిచ్చిందా లేదా అన్నది ముఖ్యం! నీడ అనే పదం రామయ్య జీవితం నిండా పరుచుకుంది!

image


చల్లగా, హాయిగా, వెచ్చగా, పచ్చగా. అసలు పచ్చదనం అనే పదం నిత్యం ఆయన పెదాలమీద ఆడుతుంది! ఆయనకు ధనం లేదు. పచ్చదనమే ధనం. ఆకు-మొక్క-చెట్టు-నీడ-ఈ నాలుగు మాటల్ని రామయ్య నుంచి ఎవరూ విడదీయలేరు. ఒక్కమాటలో చెప్పాలంటే రామయ్య పుడమి తల్లికి నిత్యం పత్రాభిషేకం చేసే వనపూజారి. రాముడి పాదధూళి సోకి రాయి అహల్య అయిందంట. నిజమో కాదో తెలియదు కానీ- ఈ రామయ్య చేతి స్పర్శకు మాత్రం ప్రతీ విత్తనం వటవృక్షమవుతోంది!

ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామం. దరిపెల్లి రామయ్య అంటే ఎవరికీ తెలియదు. అదే వనజీవి రామయ్య అనండి! చిన్నపిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు. భార్య పేరు జానమ్మ. ముగ్గురు కొడుకులు, ఓ కూతరురు. సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో నుంచి ఎవరూ కదలరు. కానీ రామయ్య మాత్రం అసలు ఇంట్లోనే ఉండడు. అడవుల్లోకి వెళ్తాడు. 

అన్వేషణ. పత్రాఅన్వేషణ, వృక్షాన్వేషణ, విత్తనాన్వేషణ. ఒకటా రెండా. బోలెడన్ని చెట్ల గింజలు. రకరకాల గింజలు. ఎవరికీ తెలియని పేర్లు. ఎవరూ చూడని విత్తనాలు. వాటన్నిటినీ సేకరించి బస్తాల్లో నింపి నిల్వ చేస్తాడు. తొలకరి చినుకులు పడ్డతర్వాత వాటిని నాటే కార్యక్రమంలో మునిగిపోతాడు. రోడ్లకు ఇరువైపులా, చెరువు కట్టల వెంట, జాతరలు, ఖాళీ ప్రదేశాలు, ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తే అక్కడ గింజలు నాటుతాడు. కొన్ని వందల రకాల విత్తనాలు- అడవుల్లో తప్ప జనారణ్యంలో పెద్దగా తెలియని చెట్లెన్నో రామయ్య చేతుల మీదుగా పెరిగి వటవృక్షాలయ్యాయి.

వృక్షోరక్షతి.. రక్షితః అని రాసి ఉండే అట్ట ముక్కలను తలకు తగిలించుకుని ప్రచార పర్వంలో మునిగిపోతాడు. ఎక్కడ చిన్నబోర్డు కనిపించినా, పాతరేకులు కనిపించినా ఈ సూక్తి రాయందే రామయ్యకు మనసొప్పదు. రామయ్య ఇంటి నిండా ఇలాంటి రాతలే కనిపిస్తాయి. సినిమా పాటలను, విప్లవ గీతాలను పేరడీ చేసి మొక్కల ప్రాధాన్యాన్ని చాటిచెప్పేలా అన్వయించి పాడుతాడు.

 అంతెందుకు మనుమళ్లు, మనుమరాళ్లకుకూడా చెట్ల పేర్లే పెట్టాడు. ఒకామె పేరు చందనపుష్ప. ఇంకో మనుమరాలు హరిత లావణ్య. కబంధపుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశాడు. ప్రపంచంలో చాలామంది స్థిరాస్తులు, చరాస్తులు కూడబెడతారు. కానీ రామయ్య అలాకాదు. అవసరమైతే పస్తులుండి మొక్కలు సేకరిస్తాడు. జేబులో ఇరవై రూపాయలుంటే, అందులో పదిహేను రూపాయలు చెట్ల కోసమే ఖర్చు చేస్తాడు.

వయసు మీద పడింది. శరీరం సహకరించడం లేదు. బొటాబొటీ జీవితం. చాలీచాలని ఇంట్లో బతుకుతున్నాడు. అయినా రామయ్య భార్య జానకి ఏనాడూ ఇదేంటని ప్రశ్నించలేదు. భర్త కంటున్న పచ్చటి కలను ఆమె ఏనాడూ చెదరగొట్టే ప్రయత్నం చేయలేదు. ఇంట్లో బియ్యం నిండుకున్నా- మొక్కల కోసమే బయటకు వెళ్లిన మనిషిని- పల్లెత్తు మాట అనదు. కడుపు మాడినా- చెట్టు మాడొద్దు అనుకునే రామయ్య ఆశయాన్ని.. ఆమె ఎప్పుడూ అవమానపరచలేదు. 

పళ్లెంలో అన్నం మెతుకులు కూడా రామయ్యకు మొలకెత్తే గింజల్లాగే కనిపిస్తాయంటే- ఆయనెంత నిత్యహరిత స్వాప్నికజీవో అర్ధం చేసుకోవచ్చు. రాముడి కోసం అందరూ రామకోటి రాస్తారు. కానీ ఈ రాముడు మాత్రం వృక్షకోటి రాస్తున్నాడు. అభినవ అశోకుడిగా తెలంగాణ ఖ్యాతిని పెంచిన పద్మశ్రీ వనజీవి రామయ్య నిజంగా ధన్యజీవి.

1+ Shares
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags