హెల్త్ కేర్ రంగంలో 8 స్టార్టప్స్ సృష్టిస్తున్న విప్లవం

27th Feb 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

షుగర్, బీపీ, ఈసీజీ, హార్ట్ బబీట్ తెలుసుకోవాలంటే ఏ డాక్టర్ దగ్గరకో… డయాగ్నస్టిక్ సెంటర్ కో పరిగెత్తాల్సిందే. వేళకాని వేళలో మందులు అవసరమైతే… అంతే సంగతులు. ఇకపై ఆ సమస్య లేదు. హెల్త్ కేర్ రంగంలో వచ్చిన స్టార్టప్స్… స్మార్ట్ గా సేవలందిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు… ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్లే. 

ప్రపంచంలోనే జనాభాలో రెండో అతిపెద్ద దేశం భారత్. అయితే హెల్త్ కేర్ రంగంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. 2005-06 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేను పరిశీలిస్తే… నగరాల్లో 70 శాతం మందికి, గ్రామాల్లో 63 శాతం మందికి ప్రైవేట్ ఆస్పత్రులే దిక్కు. ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షే. 2005-15 మధ్యకాలంలో 80 శాతం పడకలు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే వచ్చాయి. హెల్త్ 2.0ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ రంగంలో స్టార్టప్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. 90 శాతం స్టార్టప్ లు 2015లోనే ప్రారంభమయ్యాయి. ప్రైవేట్ హెల్త్ కేర్, పర్యవేక్షణ రంగంలో స్టార్టప్ లు సేవలందిస్తున్నాయి. ఆస్పత్రులు, మెడికల్ డివైసెస్, క్లినికల్ ట్రయల్స్, ఔట్ సోర్సింగ్, టెలి మెడిసిన్, మెడికల్ టూరిజం, హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ ఎక్విప్ మెంట్ అన్నీ ఉంటేనే హెల్త్ కేర్ రంగం బాగుంటుంది. నిజానికి ఇవన్నీ ఆరోగ్య రంగానికి మూల స్తంభాల్లాంటివి. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు నచ్చిన ఆస్పత్రి, డాక్టర్, డయగ్నస్టిక్ సెంటర్ చేతిలో ఉన్నట్లే. ఈ రంగంలో ఉత్తమ సేవలందిస్తున్న యాప్స్ పై ఒక లుక్కేద్దాం.

ఈకిన్ కేర్

కేర్ ఇండస్ట్రీల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈకిన్ కేర్ హైదరాబాద్ కేంద్రంగా 2014లో ప్రారంభమయ్యింది. మామూలు స్టార్టప్ తో పోల్చితే ఇది చాలా ఉపయోగకరం. ఈ వెబ్ సైట్ లో ఒకసారి రిజిస్టర్ అయితే క్లైంట్స్ వివరాలు ఎప్పటికీ ఉంటాయి. ఏ ఆస్పత్రికి వెళ్లినా… మనం తీసుకున్న ట్రీట్మెంట్ వివరాల జాబితా ఆన్ లైన్లో భద్రంగా ఉంటుంది. హెల్త్ రికార్డులను అప్ లోడ్ చేస్తే చాలు…వాటి ఆధారంగా పూర్తి విశ్లేషణ జరుపుతారు ఈకిన్ కేర్ సిబ్బంది. రికార్డులను పరిశీలించి… డయాబెటిస్, బీపీ లాంటి సమస్యలు వస్తాయో లేదో ముందుగానే చెబుతారు. పేపర్ పై రాసిన మెడికల్ రికార్డులను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేస్తారు. డాక్టర్ దగ్గరకు వెళ్లేటప్పుడు ఫైల్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈకిన్ కేర్ సంస్థలో 21 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

మెడిబాక్స్ టెక్నాలజీస్

మెడిబాక్స్ టెక్నాలజీస్ సంస్థను భావిక్ కుమార్, కపిల్ కన్బార్కర్ కలిసి బెంగళూరులో స్థాపించారు. దేశవ్యాప్తంగా మంచి ఆస్పత్రులు, ఫార్మసిస్, బ్లడ్ బ్యాంక్స్ కోసం మెడిబాక్స్ లోకి వెళ్లి సెర్చ్ చేయవచ్చు. ఇది సమస్యకు పరిష్కారం చూపే ఒక యాప్. లక్షా 70వేల ఫార్మసీ రిటైలర్స్, 20వేల ఫార్మా – హెల్త్ కేర్ ప్రోడక్ట్ సప్లయర్స్, లక్ష హెల్త్ కేర్ మార్కెటింగ్ కంపెనీలతో మెడిబాక్స్ టెక్నాలజీస్ కు సంబంధాలున్నాయి. మెడిబాక్స్ లో ప్రస్తుతం 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదో మెడికల్ సెర్చ్ ఇంజన్.

మెడికా బజార్

ఐఐఎంలో చదువుకున్న వివేక్ తివారి ముంబైలో మెడికా బజార్ స్థాపించారు. అన్నిరకాల మెడికల్, హెల్త్ కేర్ అవసరాలను తీరుస్తుంది. 2015 లోనే ఈ స్టార్టప్ వచ్చింది. కొనుగోలుదారులకు సాయంచేసేందుకు ఏర్పాటైన ఈ యాప్ లోకి వెళ్లి… మనకి కావాల్సిన డివైస్ ను వేరేవాటితో పోల్చి చూసుకోవచ్చు. నచ్చిన వస్తువును కొనుక్కోవచ్చు. 5 వేల మెడికల్ ఎస్టాబ్లిష్ మెంట్స్, సెల్లర్లు తమ ఉత్పత్తులను ఈ వెబ్ సైట్లో పెడతారు. ఈ స్టార్టప్ లో ప్రస్తుతం 60 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 3 వందల కోట్ల వ్యాపారం దీని లక్ష్యం.

మెడికల్ యునిక్ ఐడెంటిటీ

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు బెంగళూరులో మాన్యక్ హర్ లాల్కా దీన్ని స్థాపించారు. వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య సమాచారం మొత్తాన్ని ఒకేచోట స్టోర్ చేస్తుంది. ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లులో సమాచారాన్ని భద్రపరచడంలో ఈ సంస్థలో పనిచేస్తున్నవారికి ప్రత్యేక నైపుణ్యముంది. జీవితాకాలంలో ఎప్పుడైనా హెల్త్ రికార్డ్స్, డాటాను స్టోర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది మెడికల్ యునిక్ ఐడెంటిటీ. మంచి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుందన్న విషయంలో ఇది సలహాలనిస్తుంది కూడా.

థర్మర్ సాఫ్ట్ వేర్

హైదరాబాద్ లో దీన్ని 2013 లో స్థాపించారు. హెల్త్ కేర్ డెలివరీకి ఇది ఒక క్లౌడ్ బేస్డ్ ఫ్లాట్ ఫాం. ఇందులో రెండు విభాగాలున్నాయి. ఒకటి మెడ్ నెట్ వర్క్, రెండోది ఈఆర్ ఎక్స్. డాక్టర్లు, పేషెంట్లు,క్లినిక్స్, ఫార్మసీలు,డయాగ్నోస్టిక్స్, బ్లడ్ బ్యాంక్స్ ను మెడ్ నెట్వర్క్ అనుసంధానం చేస్తుంది. ఈ స్టార్టప్ లో 60 మంది ఉద్యోగులున్నాయి. ఈఆర్ఎక్స్ ఆఫ్ లైన్ సేవలు అందిస్తుంది. హెల్త్ కేర్ డాటా, పేషెంట్ మొదలుకొని ప్రతి విషయాన్ని భద్రపరుస్తుంది. రియల్ టైంలో సమస్యలకు పరిష్కారాలు, 2016 ప్రథమార్థంలోనే 5 మిలియన్ డాలర్లను సేకరించాలని ఈ యాప్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఆర్ఎక్స్ ప్రెస్

2015లో బెంగళూరులో మధుర్ గోపాల్ దీన్ని స్థాపించారు. ఇది సమగ్ర హెల్త్ కేర్ సేవలను అందిస్తుంది. ప్రిస్క్రిప్షన్ నుంచి మెడిసిన్ కొనుగోళ్లవరకు అన్ని రకాల సేవలను అందిస్తుంది. మెడికల్ టెస్టులు, హోమ్ కేర్, ఫిజియోథెరపీ, డాక్టర్ కన్సల్టింగ్, ఎక్విప్మెంట్ తయారీ వరకు అన్ని సర్వీసులను అందిస్తుంది. మందులు ఎప్పుడు తీసుకోవాలో కూడా ఈ స్టార్టప్ గుర్తు చేస్తుంది. ఇందులో 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెండు నెలల్లో కోటి రూపాయల ఫండ్స్ సేకరించడమే ఆర్ఎక్స్ ప్రెస్ ముందున్న లక్ష్యం.

బుక్ మెడ్స్ డాట్ కాం (BookMEDS.com)

మందుల చీటీ మీచేతిలో ఉంటే, మీ స్మార్ట్ ఫోన్ తోనే మెడిసిన్స్ తెప్పించుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది బుక్ మెడ్స్ డాట్ కామ్ . ఎప్పుడైనా ఎక్కడైనా, అత్యవసర సమయాల్లోనూ ఎలాంటి టెన్షన్ లేకుండా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు.. మీరున్న చోటికే డెలివర్ చేస్తామంటున్నారు మహమ్మద్ అబుబాకర్. హైదరాబాద్ కేంద్రంగా 2013లో ఆయన దీన్ని స్థాపించారు. వీల్ చెయిర్ దగ్గరి నుంచి గ్లోవ్స్ దాకా ఎన్నో రకాలైన ప్రాడక్టులు ఆన్ లైన్లో ఆర్డ్ ఇవ్వొచ్చు. మెడిసిన్స్ డైరెక్టుగా ఫార్మసీ కంపెనీల నుంచి తెప్పిస్తారు కనుక వాటిపై కస్టమర్లకు డిస్కౌంట్లను ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. ఈ కంపెనీ ఏడాది టర్నోవర్ మూడు కోట్ల రూపాయలు దాటింది. 15 నగరాల్లో 325 బడా ఫార్మసీస్ తో దీనికి సంబంధాలున్నాయి. ఈ కంపెనీకి సీడ్ క్యాపిటల్ 2 లక్షల 50 వేల డాలర్లను ఫ్లిప్ కార్ట్ వైస్ ప్రెసిడెంట్ రవి క్రిష్ణస్వామి, జావేద్ సికిందర్ (ఎక్స్ ట్రీమ్ ఐటీ సీఈఓ), క్రిష్ దత్తా ( బ్యాంక్ ఆఫీస్ అసోసియేట్స్ ఏపీఏ సీఈఓ) పెట్టుబడిగా పెట్టారు.

నవియా లైఫ్ కేర్

2015లో నవియా లైఫ్ కేర్ ను కునల్ కిషోర్ ధావన్, గౌరవ్ గుప్తా, సౌర్జో బెనర్జీ ఢిల్లీలో స్థాపించారు. ఇదో మొబైల్ అప్లికేషన్. ఎప్పుడు ట్రీట్మెంట్స్ చేయించుకోవాలో గుర్తు చేస్తుంది. ఈ స్టార్టప్ లో ప్రస్తుతం తొమ్మిది మంది ఉద్యోగులున్నారు. చికిత్సలకు పేషెంట్లను ఒప్పించడమే ఇది పనిగా పెట్టుకుంది.

హెల్త్ కేర్ మార్కెట్ ఎలా వుందంటే..

2000 నుంచి 2015 వరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ప్రమోషన్స్ విడుదల చేసిన డాటాను పరిశీలిస్తే…మన దేశ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబుడులు( FDI) 3 .21 బిలియన్ కోట్ల డాలర్లు. అంటే 21వేల కోట్ల రూపాయలు. 2015లో భారత హెల్త్ కేర్ మార్కెట్ విలువ వంద బిలియన్ డాలర్లు.. అంటే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు. 2020 నాటికి ఇది 280 బిలియన్ డాలర్లు అంటే… 20 లక్షల కోట్ల రూపాయలకు పెరగనుంది. ఇందులో హెల్త్ కేర్ డెలివరీ వాటా 65 శాతం. ప్రాక్టో, ప్రోటియాల్, మెడ్ జీనోమ్, లైబ్రేట్, మెడ్ వెల్ వెంచర్స్ లాంటి స్టార్టప్ లు ఆన్ లైన్ హెల్త్ ఇండస్ట్రీలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇక్కడితో ఈ జాబితా ఆగిపోదు. హెల్త్ కేర్ రంగంలో అపార అవకాశాలున్నాయి వాటిని అందిపుచ్చుకంటే ఆకాశమే హద్దు.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close