సంకలనాలు
Telugu

అభాగ్యులకు కొండంత అండ.. బ్రింగ్ ఏ స్మైల్ హైదరాబాద్

team ys telugu
11th Aug 2017
Add to
Shares
5
Comments
Share This
Add to
Shares
5
Comments
Share

బంజారాహిల్స్. రోడ్ నంబర్ 10. ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్. డిసెంబర్ నెలాఖరు. చలి విపరీతంగా ఉంది. కేబీఆర్ పార్కు మీదుగా శీతలగాలి కోత పెడుతోంది. ఫుట్ పాత్ మీద, సర్కిల్ లాండ్ స్కేప్ పైన పాతికమంది దాకా వుంటారు. దాదాపు అందరూ వృద్ధులే. కొందరు చితుకులు రాజేసుకుని మంటచుట్టూ కూచున్నారు. ఎవరి ఒంటిమీద చూసినా చింకిపాతలే. పావుగంట తర్వాత నిప్పు ఆరిపోయింది. ఇప్పుడెలా? బస్టాపులో కొన్ని కుక్కలు. వాటి మధ్యలో మనుషులు. డొక్కలోకి కాళ్లు మెల్లిగా ముడుచుకున్నాయి.

image


ఈ దృశ్యం చూసిన అర్చన కదిలిపోయింది. ఇంకొంచెం ముందుకు కదిలింది. ఎల్వీ ప్రసాద్ బస్టాపులో వరుసలు వరుసలు వృద్ధులు. వణికించే చలికి తాళలేక, నిద్రపట్టక, చుట్ట ముట్టించుకుని బిగదీసుకుని కూచున్నారు. పంజాగుట్టలో ఇంచుమించు అవే దృశ్యాలు. ప్యారడైజ్ సర్కిల్ దగ్గరా అలాంటి సీన్లే. సికింద్రాబాద్ బస్టాపులోనూ సేమ్ సిట్యువేషన్.

బిచ్చగాడిని నోట కరిచిన నిశిరాత్రిలో నడుస్తున్నా కొద్దీ మహానగరంలో ఇలాంటి హృదయ విదారకర దృశ్యాలు అనేకానేకం. ఏ దిక్కూలేనివాళ్లు, అనాథలు, ఒంటరి వృద్ధులు చలికి వణుకుతూ, వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ జీవితాల్ని వెళ్లదీస్తున్నారు.

ఇలాంటి వాళ్లకు ఏదో ఒక సాయం చేయాలి! చిన్న దుప్పటి ఇచ్చినా చాలు. వాళ్ల ముఖంలో చిన్న చిరునవ్వు చూడాలి. ఒక స్వెటర్ అందించినా చాలు. వాళ్లు అది సంతోషంగా తొడుక్కంటే చూడాలి. చేసేది చిన్న సాయమే కావొచ్చు. అందులో మాటలకందని తృప్తి కనిపిస్తుంది.

ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిల్ దగ్గర దృశ్యాలు చూసిన తర్వాత అర్చన మనసు ఒక పట్టాన ఉండనీయలేదు. వరుస సంఘటనల గురించి అమ్మతో షేర్ చేసుకుంది. కూతురు మాటలు విన్న తల్లి.. ఒక గొప్పమాట చెప్పింది.

చూడమ్మా.. మా జెనరేషన్‌ వాళ్లకు సోషల్ సర్వీస్ చేయాలని ఉన్నా, స్నేహితులను పోగేయడానికి, పదిమందిని ఏకతాటిపైకి తేవడానికి సరైన మాధ్యమం లేదు. ఇప్పటిలాగా అప్పట్లో సోషల్ మీడియా, ఇంటర్నెట్, వాట్సప్ గ్రూపులు వగైరా లేవు. మీకు ఆ బాధ లేదు. సామాజిక మాధ్యమంలో ఒక్క పిలుపునిస్తే వందలు, వేలు వస్తారు. సాంకేతిక పరిజ్ఞానం మీకున్న అడ్వాంటేజ్. కాబట్టి నీ మనసులో ఏమనకుంటే అది చేయ్ ఆల్ ద బెస్ట్ అని చెప్పింది.

అర్చనకు కొండంత బలం వచ్చింది. చలో.. నగరంలో నిర్భాగ్యుల కోసం ఒకపూట కడుపుండా తిండో, కప్పుకోడానికి బట్టో ఏదో ఒకటి ఇవ్వాలి. పొద్దుటి నుంచీ బుర్ర బద్దలు కొట్టుకుంటే మధ్యాహ్నానికి మెరుపులాంటి ఐడియా.

image


అర్చన ఉండేది హైటెక్ సిటీలోని ఇందు ఫర్చూన్ ఫీల్డ్స్ అనే గెటెడ్ కమ్యూనిటీలో. పదుల సంఖ్యలో కుటుంబాలుంటాయి. అందరి నంబర్ తీసుకుని ఒక మెసేజ్ పాస్ చేసింది. మీకు అవసరం లేని బట్టలు, దుప్పట్లు ఉంటే ఇవ్వండి.. వాటిని సిటీలోని అభాగ్యులకు చేరవేద్దాం. ఇదీ మెసేజ్ సారాంశం. అంతే, కొన్ని నిమిషాల వ్యవధిలో 40 మంది ఆన్ బోర్డ్. ఒకతను సొంత ఖర్చుతో వెయ్యి పాంప్లెట్స్ ముద్రిస్తాను అంటూ వచ్చాడు. పైసా తీసుకోకుండా ఆ కరపత్రాలను న్యూస్ పేపర్లో పెట్టి ఇంటింటికీ వేస్తాను మేడం అంటూ వెండర్. అలా మొదలైంది బ్రింగ్ ఏ స్మైల్ హైదరాబాద్ నెట్‌వర్క్‌. 40 కుటుంబాల వాళ్లు ఒకరిని మించిన ఒకరి సేవాభావంతో ఏడాదిపొడవునా జంటనగరాల్లోని బీదాబిక్కీకి తోచిన సాయం చేశారు.

మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే అంటారు. కానీ అర్చన విషయంలో అలా జరగలేదు. ఆమె మొదటి అడుగు వందల మందితో అడుగులతో జతకలిసింది.

బ్రింగ్ ఏ స్మైల్ ఫౌండర్ అర్చన సురేశ్‌ కార్పొరేట్ కమ్యూనికేషన్ ప్రొఫెషనల్. 12 ఏళ్లుగా వివిధ మల్టీనేషన్ కంపెనీల్లో పనిచేసింది. యాహూ, హెచ్‌ఎస్‌బీసీ, మైక్రోసాఫ్ట్, ఐటీ హబ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో వర్క్ చేసిన అనుభవం ఉంది. 2012లో బ్రింగ్ ఏ స్మైల్ నెట్ వర్క్ ఏర్పాటు చేసింది.

మొదట్లో బట్టలు, దుప్పట్లు లాంటి వాటితో సర్వీస్ మొదలైంది. మెల్లిగా మురికివాడల్లోని పిల్లలు చదువుకునేందుకు పుస్తకాలు, బ్యాగులు, పెన్సిళ్లు పోగేసి ఇచ్చేవారు. తర్వాత ఒక్కో ఏరియా పెరుగుతూ వచ్చింది. కమ్యూనిటీ సర్వీస్ లాంటిది డెవలప్ అయింది. ఫేస్ బుక్‌ లో పేజ్. వాట్సప్‌ లో గ్రూప్. ఎవరికి ఏ అవసరం ఉన్నా చిన్న మెసేజ్ పెడితే చాలు. వ్యక్తులైనా, సంస్థలైనా.. ఎవరికి ఏం కావాలన్నా బ్రింగ్ ఏ స్మైల్ సమీకరించి పెడుతుంది. సోషల్ మీడియా బ్రింగ్ ఏ స్మైల్‌ని ఇంతపెద్ద సేవాసంస్థను చేస్తుందని అనుకోలేదని అర్చన అంటోంది. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్ నుంచి మొదట్లో డబ్బు సాయం కోరేందుకు ఇష్టపడలేదు. కానీ అవసరాలు మొహమాటాన్ని మార్చేశాయి. ఏ సంస్థకైతే డబ్బుసాయం అవసరముందో దాతలంతా నేరుగా సంస్థలకే ఇచ్చటట్టుగా చూడగలిగింది. వీలైనంత మందికి రశీదులు కూడా పంపించాను అంటోంది అర్చన

బ్రింగ్ ఏ స్మైల్- ట్రస్టుగా రూపాంతరం చెందాక బ్యాంక్ అకౌంట్, పాన్ నంబర్ కూడా తీసుకున్నారు. డైలీ ఈ ట్రస్టు నుంచి 6,500మంది ఏదో ఒక రూపంలో సాయం పొందుతుంటారు. 2015-16లో 56 మంది అనాథ పిల్లలకు చదువు చెప్పించారు. 2016 చలికాలంలో రోడ్డుమీదనే కాలం వెళ్లదీసేవారికి 2,300 దుప్పట్లను పంపిణి చేశారు. 2017 జూన్‌లో హైదరాబాద్, ఆదిలాబాద్ లో అనాథపిల్లలకు వెయ్యికి పైగా నోటు బుక్స్ అందజేశారు. వికలాంగులు కర్రీపాయింట్ లాంటి ఏదో ఒక వ్యాపారం పెట్టుకుని తమ సొంతకాళ్లమీద నిలబడతాం అని అర్ధిస్తే, వారికి కొంత నగదు సాయం కూడా చేశారు. మరికొందరికి వీల్ చైర్లు ఇచ్చారు.

ప్రస్తుతానికి బ్రింగ్ ఏ స్మైల్ నెట్‌వర్క్‌ లో 200 దాకా ఉన్నారు. అందులో 50 మంది యాక్టివ్ పార్టిసిపేట్స్. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీల సాయం మరిచిపోలేనిది అంటారు అర్చన. హైగ్రో కెమికల్స్ వారు మియాపూర్‌లో ఒక స్కూల్ పిల్లల కోసం వ్యాన్ స్పాన్సర్ చేశారు. అంతకు ముందు ఆ పిల్లలంతా బడికి పోవాలంటే, మూడు వాహనాలు మారేవాళ్లు. ఇప్పుడు 60మంది ఒకే బస్సులో పాఠశాలకు వెళ్తున్నారు.

మెర్క్ ఫార్మాస్యూటికల్స్ వాళ్లు అర్చన చేస్తున్న సర్వీసుకు ఇంప్రెస్ అయి, ఆమెమీద ఒక వీడియో తీసి యూ ట్యూబులో పెడితే 7లక్షలపైనే వ్యూస్ వచ్చాయి. అది బీఏఎస్‌లో పనిచేసే వాళ్లందరికీ మంచి బూస్ట్ ఇచ్చింది.

బ్రింగ్ ఏ స్మైల్ వాట్సప్ గ్రూపులో ఎంతటి దయార్ధ హృదయులు ఉన్నారంటే.. ఒకసారి ఒక పేదమహిళకు రెండు ఇంజెక్షన్లేవో అవసరపడ్డాయి. వాటి ఖరీదు 70వేలు. ఆ విషయంలో గ్రూపులో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే, ఆ డబ్బంతా నేను సమకూరుస్తాను అంటూ ఒకాయన 70వేలు తీసుకొచ్చి ఆవిడకిచ్చాడు. అప్పుడు నా హృదయం ఎంతగా పొంగిపోయిందో మాటల్లో చెప్పలేను అంటారామె.

బ్రింగ్ ఏ స్మైల్ లో ఫుల్ టైమర్లున్నారు. వలంటీర్‌గా వచ్చి పనిచేసేవాళ్లూ ఉన్నారు. అయితే ఫుల్ టైం చేయడం ఛాలెంజింగ్ వర్క్ అంటారు అర్చన. 

Add to
Shares
5
Comments
Share This
Add to
Shares
5
Comments
Share
Report an issue
Authors

Related Tags