ఓల్గా అక్షరం నిత్య చైతన్య ప్రవాహం..
పోపూరి లలిత కుమారి. ఇలా చెప్తే చాలా మందికి తెలియదు. కానీ ఓల్గా అంటే- తెలియని సాహితీ ప్రియులు లేరు. తెలుగునాట ఆమె పరిచయం అక్కర్లేని రచయిత్రి. ఓల్గా అంటే వేయి వోల్టుల ఒక అక్షర ప్రవాహం. ఆమె రచనలు కణకణమండే నిప్పుకణికలు. ఆమె ప్రసంగాలు భగభగ మండే నినాదాలు. విముక్త అనే కథాసంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించిన సందర్భంగా ఓల్గా గురించి హర్ స్టోరీ తరుపున నాలుగు మాటలు.
1950 నవంబర్ 27న గుంటూరులో జన్మించిన ఓల్గా- 1972లో ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఎంఏ తెలుగు లిటరేచర్ చేశారు. తర్వాత తెనాలి వీఎస్‌ఆర్-ఎన్‌వీఆర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు రైటర్ గా వ్యవహరించారు. ఓల్గా రాసిన స్వేచ్ఛ, ఆకాశంలో సగం నవలలు ఉత్తమ నవలలుగా అవార్డులు అందుకున్నాయి. విముక్త, కుటుంబ వ్యవస్థ, కన్నీటి కెరటాల వెన్నెల, మానవి, మాకు గోడలు లేవు, ఉరికొయ్య అంచున, మృణ్మయనాదంతో పాటు ఇంకా కొన్ని పుస్తకాలను రచించారు. ఇవేకాక అనువాదాలు, నాటికలు, చిన్న కథలు, వ్యాసాలు రాశారు.
స్త్రీవాద రచయిత్రిగా ఓల్గా అక్షరానికి తిరుగులేదు. విమర్శలు జడివానలా కురవనీగాక బెదరని నైజం ఆమెది. చిన్నప్పటి నుంచే అంతే. ఎందుకంటే పెరిగిన నేపథ్యం, చుట్టూ ఉన్న సాన్నిహిత్యం, చదువుకున్న సాహిత్యం- అన్నీ గళమెత్తి గర్జించేలా చేశాయి. అప్పట్లో అన్ని పత్రికలు ఇంటికి వచ్చేవి. వాటితో పాటు ఎన్నో పుస్తకాలు. అందులో గోర్కీలాంటి అనువాద పుస్తకాలు. పదో ఏటనే శ్రీశ్రీ మహాప్రస్తానం తనపై ఎంతో ప్రభావం చూపింది. ఆ వయసులో ఏం అర్ధమైంది అనే ప్రశ్నకు తావులేదు. చదవాలనిపించింది చదివేశారు. అలా వందలసార్లు. పుస్తకాల మీద ఇష్టం అంతకంతకూ పెరిగింది. అభిమానం-అనుబంధం పెనవేసుకున్నాయి. క్రమంగా పుస్తకం మీద ఇంట్రస్టు రచయితగా మార్చింది. పుస్తకం-సాహత్యం. ఇంతకు మించి వేరేలోకం లేదు. ఆ తర్వాత విరసంలో సభ్యత్వం. 1974లో అభిప్రాయ బేధాలొచ్చి విరసం నుంచి వైదొలగారు. పైగంబర కవుల్లో ఒకరిగా ఉన్నారు. తెలుగు సాహిత్యంలో నెలకొన్న నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది పైగంబర కవిత్వం. తర్వాత జనసాహితీ సాంస్కృతిక సమాఖ్యలో చురుగ్గా పాల్గొన్నారు.
అయినా ఏదో అసంతృప్తి. విప్లవ రాజకీయాలు ప్రత్యేకంగా ఒకవర్గం గురించే మాట్లాడటం నచ్చలేదు. స్త్రీ గురించి మాట్లాడరేం? అందరూ సమానం అంటారు. కానీ మహిళా సమస్యల గురించి పట్టించుకోరేం? పురుషాధిపత్యం అనే మాట వాడనీయరేం? ఆ ధోరణి ఓల్గాకు నచ్చలేదు. ఆ విబేధాలతో విప్లవ రాజకీయాల నుంచి బయటకొచ్చి ఫెమినిజం బాటపట్టారు. మహిళల కోసం సాహిత్య ప్రక్రియ చేపట్టారు. అన్నాళ్లూ తోచినప్పుడు కవిత్వం రాయడమే జరిగేది. ఏప్పుడైతే స్త్రీ వాదం ప్రజలకు తెలియజేయాలి అనుకున్నారో- వారి హక్కుల గురించి మాట్లాడాలనుకున్నారో- ఆ సాహిత్యాన్నే ఆయుధంగా మలుచుకున్నారు. నాటికలు, కవితలు, వ్యాసాలు, పద్యాలు, పాటలు- ఇలా అన్నిటిలోనూ స్త్రీ వాదమే.
మామూలు స్నేహాలు చేయగలిగారు. రాజకీయ స్నేహాలు చేయగలిగారు. సాహిత్యా స్నేహాలూ చేయగలిగారు. ఆ రోజుల్లో ఓల్గా అందరమ్మాయిల్లా కాదు. కొంచెం అగ్రెసివ్. ఆవేశం ఎక్కువ. ఒక్కంటంటే తిరిగి నాలుగు అనే రకం. కాలేజీకి వెళ్లే పిల్ల తలవొంచుకుని వెళ్లి- తలవంచుకుని రాకుండా ఏంటిది అని అందరూ అన్నారు. చదువుకున్న అమ్మాయి ఇంట్లో సాహిత్య చర్చలు జరపడమేంటని ఇరుగుపొరుగు చెవులు కొరుక్కునేవారు. వాళ్లమాటలు పూచికపుల్లలా తీసిపడేశారు. ప్రాంపంచిక దృక్పథం కాలేజీ రోజుల నుంచే అలవడింది. సమాజంలో కూడా- స్త్రీవాదం అంటూ ఒకటి రావాలనే తహతహ అంతర్లీనంగా ఉందంటారు ఓల్గా. అందుకే ఆమె ఫెమినిజం గురించి ఏం రాసినా ఆసక్తిగా చదివారు. ఆమె ఏం మాట్లాడినా వాటిమీద ఆరోగ్యకర చర్చలు జరిపారు. విమర్శలూ చేశారు. కానీ వాటిని ఆమె పట్టించుకోలేదు.
కొంతమంది కలిసివస్తారు. కొంతమంది రారు. అయినా ఇవాళ మహిళ గురించి మాట్లాడకుండా ఎవరూ ఉండలేరు. కారణం స్త్రీవాద ఎజెండా రాజకీయాల్లో కూడా రావడం. ఓల్గా లాంటి రచయితలు దాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగారు. సారా ఉద్యమం దగ్గర్నంచి మొదలుపెడితే రాజకీయం వరకు- మహిళలు మాట్లాడుతున్నారు. మహిళలు వాదిస్తున్నారు. మహిళలు ఫైట్ చేస్తున్నారు. ఇదంతా చూసి పురుషులకు భయం పట్టుకుందంటారు ఓల్గా. నిజమే. ఇదొక సంధి సమయం. బలమైన ఉద్యమాలను నిర్మించుకుంటూ వెళ్తే తప్ప ఆకాశంలో సగం- అవకాశంలో సగం లాంటి పదాలకు జస్టిఫికేషన్ రాదు. ఫ్యూడల్ భావాలు ఇంకా బుసలు కొడుతునే ఉన్నాయి. సారా ఉద్యమం ఆనాడు ఉంది. ఈనాడు ఎందుకు లేదు. ఈ ప్రశ్నకు సమాధానం సంక్లిష్టమైంది. దానికోసం వ్యూహాలు మార్చాలి. ఇవాళ్టితో ఈ సంకెళ్లు తెగినాయంటే రేపు కొత్త సంకెళ్లు రెడీ అవుతాయి. బానిసత్వం తాలూకు వేర్లు ఇంకా బలంగానే ఉన్నాయనేది అనేది ఓల్గా భావన.
పురుషస్వామ్యం రకరకాల రూపాల్లో ఉంటుంది. విషయ పరిజ్ఞానం ఉన్న స్త్రీలు ఎక్కడ నిలదీస్తారో అని మగవాళ్లకు భయం పట్టుకుంటుంది. ఈ విషయాలను మీద ఓల్గా చాలా లోతుగా చర్చించారు. రచించారు. ఆ తిరుగుబాటు తత్వం ఓల్గా రచనలన్నింటిలోనూ ప్రతిబింబిస్తుంది. ఫెమినిజం- మేల్ ఛావనిజం ఈ రెండు క్లాసిఫికేషన్స్ కల్పితాలు కావంటారు ఓల్గా. అవి స్త్రీల జీవితాలను నియంత్రించే కమాండర్లు. బట్టల దగ్గర్నుంచి తినే తిండి, చేసే స్నేహాలు- అసలు స్త్రీ ఆలోచనా విధానాన్నే ఈ వర్గీకరణ నియంత్రిస్తున్నదని ఓల్గా నిరూపించారు.
అప్పటిదాకా ఒక సిద్ధాంతానికి కట్టుబడి పని చేశారు. ఒక పార్టీని ఇష్టపడ్డారు. కొన్ని సంఘాల్లో పని చేశారు. వాటన్నిటిని కాదని బైటకు వచ్చి నిలబడ్డారు. స్త్రీ గొంతుకై మాట్లాడారు. చెప్పాలంటే అది ఒకరకమైన మానసిక సంఘర్షణ. అకస్మాత్తుగా వచ్చింది కాదు. సంఘాల్లో పనిచేసిన రోజుల్లోనూ సంఘర్షణ వుంది. బైటికి వచ్చాకా ఉంది. స్త్రీవాదిగా మారుతూ క్రమంగా దాని తాలూకు రాజకీయాల్లోకి లోతుగా వెళుతున్నా కొద్దీ సంఘర్షణ తీవ్రమైంది. అది ఒక ప్రాసెస్. ఆ క్రమంలోనే ఓల్గా స్త్రీ వాదిలా మారారు. ఆమెకు స్త్రీవాదమే సందర్భం. స్త్రీవాదమే ఉద్యమం. స్త్రీవాదమే సాహత్యం. స్త్రీవాదమే నేపధ్యం. స్త్రీవాదం సాహిత్యంలోనూ, సమాజంలోనూ బలంగా నాటుకుపోవాలన్నదే ఆమె సంకల్పం. కేంద్ర సాహిత్య అకాడెమీ రావడం కొలమానం కావొచ్చు.. కాకపోవచ్చు. కానీ అదొక తృప్తి. కష్టపడ్డారు. విమర్శలు ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు వ్యక్తిగత విషయాలపైనా దాడి చేశారు. అట్లాంటివి జరిగినపుడు బాధ పడ్డారే తప్ప.. భయపడలేదు. ఆమాటకొస్తే అలాంటి సందర్భాలు ఎదుర్కొన్న రచయిత ఓల్గా మొదటివారూ కాదు చివరివారూ కాదు. ప్రపంచంలోని అన్ని భాషల్లోని రచయిత్రులకూ అది అనుభవమే. తను కూడా అందులో భాగమనుకున్నారు. పేరుకు తగ్గట్టే ఓల్గా నదిలా ముందుకు సాగిపోతున్నారు. ఆ సాహితీ ప్రవాహంలో ప్రతీ అక్షరం భగభగ మండే నిప్పుకణంలా జ్వలిస్తునే వుంటుంది. పురుషాధిక్యపు భావజాలం వున్నంతకాలం ఆ జ్వాల రగులుతునే వుంటుంది.