సంకలనాలు
Telugu

తండ్రి ల్యాబ్‌ను 2000 కోట్ల సామ్రాజ్యంగా మార్చిన అమీరా షా

గోల్డ్‌మెన్‌ సాక్స్‌లో ఉద్యోగం వదిలేశారు.తండ్రి ప్యాథాలజీ ల్యాబ్ బాధ్యతలు చేపట్టారు.దేశ,విదేశాలకు విస్తరించి ఓ బ్రాండ్ సృష్టించారు.

bharathi paluri
21st Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

1980ల‌లో మెడిక‌ల్ స్కూల్ నుంచి అప్పుడే బ‌య‌టికొచ్చారు డాక్టర్‌ సుశీల్ షా. దేశంలో అప్ప‌టికి అందుబాటులో వున్న వైద్య‌సేవ‌లు ఏ మాత్రం న‌చ్చ‌లేదు. ముఖ్యంగా వైద్య‌ప‌రీక్ష‌ల రంగం మ‌న దేశంలో మ‌రీ వెన‌క‌బ‌డిన‌ట్టు గుర్తించారాయ‌న‌. అందుకే అమెరికా వెళ్ళి అక్క‌డ అందుబాటులో వున్న అధునాత‌న ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఓ ఫెలోషిప్ చేసారు. అక్క‌డినుంచి తిరిగొచ్చాక సొంతంగా ఒక ప్యాథాల‌జీ లాబ్ ప్రారంభించారు. త‌న గ్యారేజినే లాబ్‌గా, కిచెన్‌ను క్లినిక్‌గా మార్చి డాక్ట‌ర్ సుశీల్ షా ల్యాబ‌ొరేట‌రీని మొద‌లుపెట్టారు.


‘ఈ రోజు మ‌న‌కు అందుబాటులో వున్న థైరాయిడ్, ఫ‌ర్టిలిటీ, హార్మోన్ టెస్టుల పేర్లు కూడా ఎన‌భైల‌లో పేషెంట్ల‌కు తెలియ‌వు. ఇక్క‌డ వాటిని మొద‌లుప‌ెట్టిందే ఆయ‌న‌. ఇత‌రుల‌కెవ‌రికీ తెలియ‌ని ఈ రంగంలో సేవ‌లందించ‌డానికి ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డ్డారు..’’ అని ఆయ‌న కుమార్తె అమీరా షా గ‌ర్వంగా గుర్తు చేసుకున్నారు.

ఆ రోజు సుశీల్ షా మొద‌లుపెట్టిన ఆ ఒక్క ల్యాబ‌ొరేట‌రీని ఇవాళ ఆయ‌న కుమార్తె 2వేల కోట్ల కంపెనీగా , గ్లోబ‌ల్ ప్యాథాల‌జీ సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. కొన్నేళ్ళ క్రితం, జీవితంలో ఏంచేయాలో తెలియ‌క గంద‌ర‌గోళంలో వున్న 21ఏళ్ళ యువ‌తి, ఇప్పుడు 2000 కోట్ల కంపెనీ య‌జ‌మానీ .. అమీరా షా ఒక్క‌రే అంటే న‌మ్మ‌బుద్ధికాదు.

అమీరా షా, మెట్రోపొలిస్ ల్యాబ్స్ సిఈఓ,ఎండి

అమీరా షా, మెట్రోపొలిస్ ల్యాబ్స్ సిఈఓ,ఎండి


ఏం చేయాలి..

‘‘న్యూయార్క్‌లోని గోల్డ్‌మెన్ సాక్స్‌లో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడ నా హోదా చూసి నా స్నేహితులంతా కుళ్ళుకునే వాళ్ళు. నాకు మాత్రం ఆ ఉద్యోగం ఏ మాత్రం సంతృప్తిని ఇవ్వ‌లేదు. న్యూయార్క్‌లో వుండ‌డం బాగానే వుండేది కానీ, ఆ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ మాత్రం నాకు స‌రిప‌డ‌లేదు. నేనెప్పుడూ డ‌బ్బు చుట్టూ తిర‌గ‌డమే జీవితమ‌నుకోలేదు. అందుకే డ‌బ్బు నుంచి డ‌బ్బును పిండుకోవ‌డం నా వ‌ల్ల కాద‌నిపించింది '' అంటారు అమీరా. అందుకే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆ ఉద్యోగానికి ఆమె రాజీనామా చేసారు. ఆ త‌ర్వాత ఆమె ఓ అయిదుగురు ఉద్యోగుల టీమ్‌తో చిన్న స్టార్ట‌ప్ మొద‌లుపెట్టారు. అదేమంత గొప్ప స‌క్సెస్ కాక‌పోయినా, త‌న బ‌ల‌మేంటో ఆమెకు తెలిసొచ్చింది.

కొద్దిమందితో, చిన్న కంపెనీని నిర్వ‌హిస్తూ, ప్ర‌తిరోజూ ఏదో ఒక‌టి సాధించ‌డంలోనే త‌న‌కు తృప్తి వుంద‌ని ఆమెకి అర్థ‌మ‌యింది.

ఇంకా ఏదో సాధించాలి.. అని వుండేది. కానీ, 21 ఏళ్ళ వ‌య‌సులో ఈ మాట‌ల‌ని ఎవ‌రూ సీరియ‌స్‌గా తీసుకోలేదు. అమెరికాలో చేస్తున్న ప‌నితో తానేమీ సాధించ‌డం లేద‌ని అనిపించింది. తండ్రి ద‌గ్గ‌ర‌కెళ్ళి స‌ల‌హా అడిగింది. 

'' నువ్వు ఎగ్జిక్యూటివ్ అవుతావా.... ఆంట్రప్రెన్యూర్‌వి అవుతావా ? '' అని అడిగారాయ‌న‌. ఈ రెండిటికి తేడా ఏంటి అని అడిగిందామె..

ఆత్మసంతృప్తా.. ఆర్థిక సంతృప్తా.. ?

‘‘ మొద‌టి దాంట్లో నీకు మంచి కెరీర్ వుంటుంది. ప్రెస్టేజ్, మ‌నీ వుంటాయి. అవే కావాల‌నుకుంటే, నువ్వు అమెరికాలోనే వుండొచ్చు. అక్క‌డే మంచి అవ‌కాశాలుంటాయి. అలాకాక నీకంటూ ఓ గుర్తింపుండాలి. నువ్వు ప‌నిచేసే కంపెనీకి నువ్వే గుండెకాయ కావాల‌నుకుంటే.. నువ్వు ఇండియా వ‌చ్చేయాల్సుంటుంది '' అని ఆమె తండ్రి వివ‌రంగా చెప్పారు. అంతే, అమీరా ఆంట్రప్రెన్యూర్ కావాల‌నుకున్నారు. 2001లో ఇండియా తిరిగొచ్చేసారు.

"ఆ రోజుల్లో ఆ నిర్ణ‌యం చాలా పెద్ద సంచ‌ల‌న‌మే. అప్ప‌టికి ఇంకా భార‌త్ వెలిగిపోవ‌డం లేదు. స్టార్టప్స్ ఆచూకీ కూడా లేదు. ఒక ర‌కంగా చెప్పాలంటే, అదో క‌ల్చ‌ర‌ల్ షాక్. నాకు ఇండియాలో ప‌నిచేసిన అనుభవం కూడా లేదు. మా ల్యాబ్‌లో మానాన్న‌, ఆయ‌న స్నేహితుడు చెప్పిందే వేదం. అంతా సెంట్ర‌లైజ‌్డ్ అడ్మినిస్ట్రేష‌న్. కంప్యూట‌ర్లు లేవు. ఈమెయిల్స్, సిస్టమ్స్, ప్రాసెస్.. ఏం లేవు. ఒక వ్య‌క్తి కూర్చుని ఫోన్లో ఆర్డ‌ర్లు తీసుకునే వాడు. ఇలా వుంటే, మ‌నం ఎద‌గ‌లేం.. ఒక్క వ్య‌క్తి నిర్ణ‌యాల‌తో కంపెనీ ఎద‌గ‌దు...'' అనుకుని మొత్తం వ్య‌వ‌స్థ‌ని మార్చే ప‌నిలో ప‌డ్డారు అమీరా.

డాక్ట‌ర్ సుశీల్ షా అప్ప‌టికే 25ఏళ్ళ సంస్థ‌. ద‌క్షిణ ముంబైలో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించి 1500 SFT విస్తీర్ణంలో సాగుతున్న బిజినెస్ అది. అయితే, దాని ప‌రిథి అంత వ‌రకే. ద‌క్షిణ ముంబై దాటితే ఎవ‌రికీ ఆ ల్యాబ్ పేరు కూడా తెలియ‌దు. సుశీల్ షాకి దీన్ని దేశవ్యాప్త చైన్ ఆఫ్ ల్యాబ్స్‌గా విస్త‌రించాల‌ని వుండేది. కానీ ఎలా చేయాలన్న దానిపై స్ప‌ష్ట‌త లేదు.

చిన్న కంపెనీలో పెద్ద సంస్కరణలు

తొలి అడుగు నుంచే విప్ల‌వాత్మ‌క మార్పులు చేప‌ట్టాల‌ని అమీరా నిర్ణ‌యించుకున్నారు. ముందు ఏక‌ వ్య‌క్తి నిర్ణ‌యాలు కాకుండా, ఈ సంస్థ‌కు ఓ కంపెనీ రూపం తేవాల‌నుకున్నారు. కొత్త టాలెంట్‌కు అవ‌కాశాలు క‌ల్పించారు. కొత్త శాఖ‌ల‌ను తెరిచారు. క‌మ్యూనికేష‌న్ సిస్టమ్స్‌ను డిజిటలైజ్ చేశారు. నిజానికి ఇదంతా అమీరాకు కూడా కొత్తే. అప్పుడే బిజినెస్ స్కూల్ నుంచి వ‌చ్చిన ఒక గ్రాడ్యుయేట్ .. పెద్ద‌కంపెనీల గురించి చ‌దువుకోవ‌డ‌మే త‌ప్ప నిర్వ‌హించిన అనుభ‌వం లేదు. క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్స్, ఎక్సెల్ షీట్స్ చేయ‌డం నేర్చుకుందే త‌ప్ప మ‌నుషుల‌తో ఎలా డీల్ చేయాలో ఏ ఇన్స్‌టిట్యూట్ నేర్పించ‌లేదు. అస‌లు సిస్ట‌మ్ లేని కంపెనీకి సిస్ట‌మ్ ఎలా అల‌వాటు చేయాలి... ? పెద్ద జీతాలివ్వ‌లేని చిన్న కంపెనీలోకి మంచి టాలెంట్‌ని ఎలా తీసుకురావాలి.. ? ఇవ‌న్నీ కామ‌న్ సెన్స్‌తోనే నేర్చుకున్నారు. మ‌న‌సుకు ఏద‌నిపిస్తే అది చేసి సంస్థ‌ను ముందుకు న‌డిపించారు.

image


ఇంత స‌మూల మార్పులు తేవ‌డానికి ముందుగా ఆమె తండ్రే అంత‌గా సుముఖంగా లేరు. నిజానికి ఇండియా రాగానే బాస్ సీట్లో ఆమెను కూర్చోపెట్ట‌లేదు. మొద‌ట ఆమె క‌స్ట‌మ‌ర్ కేర్‌లో ప‌నిచేసారు. అక్క‌డ ప‌నిచేస్తూనే, సంస్థ‌లో తాను చేయాల‌నుకున్న మార్పుల‌ను ఒకొక్కటిగా చేప‌ట్టారు. దీనివ‌ల్ల ఆమెకు కంపెనీలో అట్ట‌డుగు నుంచి అవ‌గాహ‌న వ‌చ్చింది. కింది స్థాయిలో ఏం స‌మ‌స్య‌లున్నాయి.. వాటికి ఎలాంటి ప‌రిష్కారం వుంటుందో తెలిసొచ్చింది.

అభివృద్ధి ప‌థం

రెండేళ్లపాటు సంస్థ‌లో మార్పుల మీద దృష్టి పెట్టిన అమీరా, చివ‌రికి కంపెనీ అభివృద్ధి గురించి ఆలోచించ‌డం మొద‌లు పెట్టారు. ముందుగా డాక్ట‌ర్ సుశీల్ షా లాబ‌రేట‌రీ పేరును ''మెట్రోపొలిస్ లాబ‌రేట‌రీ''గా మార్చారు. ఆ త‌ర్వాత దేశంలోని వివిధ స‌క్సెస్‌ఫుల్ లాబ‌రేట‌రీల‌తో టైఅప్ పెట్టుకుని.. వాట‌న్నిటినీ మెట్రోపొలిస్ కింద‌కి తీసుకొచ్చారు.

2004లో మొద‌టి పార్ట‌న‌ర్‌షిప్ ఒప్పందంపై సంత‌కం జ‌రిగింది. చెన్నైలోని డాక్ట‌ర్ శ్రీ‌నివాస‌న్‌తో మొద‌టి ఒప్పందం చేసుకున్న ఈ మెట్రోపోలిస్‌లో ఇప్పుడు 25 మంది భాగ‌స్వాములున్నారు.

ఇక ఫండ్స్ విష‌యానికొస్తే, 2006లో ఐసిఐసిఐ వెంచ‌ర్స్ ద్వారా మొద‌టి సారి ఫండ్ రైజ్ చేసారు. 2010లో గ్లోబ‌ల్ ఈక్విటీ సంస్థ వార్బ‌ర్గ్ పిన్క‌స్ మెట్రోపోలిస్‌లో భారీగా ఇన్వెస్ట్ చేసింది. ఇత‌ర సంస్థ‌ల్లో వాటాలు కొనుగోలు చేయ‌డానికి ఈ ఫండ్స్‌ను వినియోగించారు. 

'' స్వ‌త‌హాగా మాది బిజినెస్ ఫ్యామిలీ కాదు క‌నుక‌, మా ద‌గ్గ‌ర పెద్ద‌గా పెట్టుబ‌డి పెట్ట‌డానికి నిధులు లేవు. లేబ‌రేట‌రీ ద్వారా వ‌చ్చే లాభాల నుంచే తిరిగి పెట్టుబ‌డిపెట్టాలి. క‌నుక‌, సంస్థ ఎంత‌గా ఎదుగుతుందో దానికి త‌గ్గ‌ట్టే మేం తిరిగి సంస్థ‌లో పెట్టుబ‌డులు పెట్ట‌గ‌లం. ఈ రోజుల్లో స్టార్ట‌ప్స్ రెండు కోట్లు సంపాదిస్తే, వంద‌కోట్లు ఖ‌ర్చు పెడ‌తున్నారు. కానీ మేమ‌లా కాదు.. ఎంత సంపాదిస్తే, అందులో కొంత మాత్ర‌మే పెట్టుబ‌డి పెట్టాం..'' అన్నారు అమీరా. ఈ మ‌ధ్యే వార్బ‌ర్గ్ పిన్క‌స్ నుంచి మెట్రోపోలిస్ త‌న వాటాను తిరిగి కొనుగోలు చేసింది. ఇప్ప‌ట్లో విదేశీ ఇన్వెస్ట‌ర్ల అవ‌స‌రం ఈ సంస్థ‌కు లేదు.

నిజానికి 2002 నుంచే ఈ లాబ్ లాభాల బాట‌లోనే న‌డిచింది. అయితే, అప్ప‌ట్లో ఏడుకోట్ల ట‌ర్నోవ‌ర్‌తో, 40-50 మంది ఉద్యోగుల‌తో ఒక్క లాబ్‌గా వున్న సంస్థ ఈ ప‌ద‌మూడేళ్ళ‌లో ఎంతో ఎదిగింది. ఏడు దేశాల్లో 800 సెంట‌ర్లు, 125 లేబొరేట‌రీలుగా విస్త‌రించింది. ఇప్పుడు ఇది 2000కోట్ల విలువైన సంస్థ‌. వార్షికాదాయం 500కోట్ల రూపాయ‌లు.

image


విదేశాలకూ విస్తరణ

అంత‌ర్జాతీయ‌స్థాయి విస్త‌ర‌ణ వెనుక పెద్ద వ్యూహ‌మేం లేదు. అవ‌కాశం వ‌చ్చింది. అందిపుచ్చుకుని వెళ్ళిపోయారు. అప్ప‌టికి ఇంకా మెట్రోపోలిస్ దేశ‌మంతా కూడా విస్త‌రించ‌లేదు. కేవ‌లం ముంబై, చెన్నై, కేర‌ళ‌ల్లో మాత్ర‌మే సెంట‌ర్లు వున్నాయి. ఆ ద‌శ‌లో శ్రీ‌లంకలో సెంట‌ర్ పెట్టే అవ‌కాశం వ‌చ్చింది. అప్ప‌టికే ఈ రంగంలో ఇండియాలో పోటీ విప‌రీతంగా వుంది. రేట్లు అంత‌కంత‌కూ త‌గ్గిపోతున్నాయి. ఇక్క‌డితో పోలిస్తే, శ్రీ‌లంకలో ప‌రిస్థితి కొంత మెరుగ్గా వుంది. దీంతో 2005లో శ్రీ‌లంక‌లో అడుగుపెట్టారు. అది మంచి లాభదాయ‌కంగా మారింది. ఆ త‌ర్వాత 2006లో మ‌ధ్య ప‌శ్చిమాసియా, 2007లో ఆఫ్రికాలోనూ సెంట‌ర్లు వెలిసాయి.

వివిధ దేశాల్లో వివిధ మార్కెట్ల‌తో డీల్ చేయ‌డం అమీరాకు చాలా ఉత్సాహంగా అనిపించింది. ఒక్కో చోట ఒక్కో విధ‌మైన ప‌నితీరు వుంటుంది. శ్రీలంక‌లో కుటుంబాలు న‌డిపే వ్యాపారం వుంటుంది. చాల తీరిక‌గా పనిచేస్తుంటారు. ప‌శ్చిమాసియాలో కార్పొరేట్ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. ఆఫ్రికాలో ఒక్కోదేశం ఒక్కో తీరుగా వుంటుంది. ద‌క్షిణాఫ్రికాలో చాలా ప్రొఫెష‌న‌ల్ డీలింగ్స్ వుంటాయి. కానీ, ప‌నిగంట‌లు మాత్రం 9-5 క‌చ్చితంగా పాటిస్తారు. మ‌న‌లాగా ఎక్కువ గంట‌లు ప‌నిచేయ‌రు.

అందుకే మెట్రోపోలిస్ త‌న ప‌నితీరులో నిల‌క‌డ వుండాల‌ని నిర్ణ‌యించుకుంది. ప్ర‌పంచంలో ఏ దేశంలోని సంస్థ‌తో బిజిన‌ెస్ చేసినా.. మెట్రోపోలిస్ విలువ‌లు ఒకేలా వుంటాయి. నీతి, నిజాయితీ, బిజినెస్ ప‌ట్ల ప్రేమ బాధ్య‌త ఇవ‌న్నీ మెట్రోపోలిస్ న‌మ్మే విలువ‌లు.

కొన్ని ఎదురుదెబ్బ‌లు

మెట్రో పోలిస్ ఎంత‌గా పైపైకి దూసుకెళ్ళిందో అంత‌గా ఎదురుదెబ్బ‌లూ త‌గిలాయి. కొన్ని భాగస్వామ్యాలు లాభ‌సాటిగా మారితే, కొన్ని అంత‌గా క‌లిసిరాలేదు. లాభ న‌ష్టాల‌ను అంచ‌నా వేయ‌కుండా, తొంద‌ర‌ప‌డి కొన్ని పార్ట‌న‌ర్‌షిప్ ఒప్పందాలు చేసుకున్నామ‌ని అంటారు అమీరా. ఈ ఎదురు దెబ్బ‌లు త‌ర్వాత ఇప్పుడు వెన‌క్కి తిరిగి చూసుకుంటే, కొన్ని నిర్ణ‌యాలు మ‌రింత జాగ్ర‌త్త‌గా తీసుకుని వుండాల్సింద‌ని తనకు అనిపిస్తూ వుంటుంది.

హెల్త్ కేర్ అనేది అనుభ‌వం పండిన మ‌గాళ్ళు మాత్ర‌మే చేయాల్సిన బిజినెస్ అని ఒక అపోహ వుంది. అలాంటిది అమీరా లాంటి యువ‌తి ఈ రంగంలోకి వ‌చ్చిన‌ప్పుడు ఈ ఫీల్డ్‌లో వున్న‌వాళ్లెవ‌రూ ఆమెను సీరియ‌స్‌గా ప‌ట్టించుకోక‌పోవడం, ఆమె కెరీర్ ప్రారంభంలో చూసిన మొదటి ఎదురుదెబ్బ‌. పైగా అమీరాకు మెడిక‌ల్ బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు. అందుకే ఆ రోజుల్లో తాను అవ‌కాశాల వెంట పరిగెత్త‌కుండా కొంచెం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తే బాగుండేదని అంటారు అమీరా. అవ‌కాశాలతో బిజినెస్ డెవ‌ల‌ప్ చేయ‌డం మంచిదే. కాక‌పోతే, అవ‌కాశాలు ఎంత తొంద‌ర‌గా వ‌స్తాయో అంత తొంద‌ర‌గానూ పోతాయి. అందుకే అప్ప‌ట్లో నేను కాస్త వ్య‌వ‌స్థాగ‌తంగా ఆలోచించాల్సింది...‘‘ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంటారు.


image


మ‌గాళ్ల ప్ర‌పంచంలో మ‌హిళ సాహ‌సం

యువ‌మ‌హిళా బాస్‌గా అమీరా చాలా వివ‌క్ష‌నే ఎదుర్కొన్నారు. కొన్ని సార్లు ఆమెను సెక్ర‌ట‌రీ అనుకున్నారు. ఇంకొన్ని సార్లు ఆమె కింద ప‌నిచేసే మ‌గ ఉద్యోగులే చిన్న చూపు చూసే వాళ్ళు. అయితే, ఇన్ని ప్ర‌తికూల‌త‌ల మ‌ధ్య ఆమె న‌మ్మిన సిద్ధాంతం ఒక‌టే. గెలిచే యుద్ధాలు చెయ్యాలి. మ‌హిళా ఉద్యోగులు ఎదుర్కొనే లింగ వివ‌క్ష‌కీ, మ‌హిళా ఆంట్రప్రెన్యూర్స్‌ ఎదుర్కొనే వివ‌క్ష‌కీ చాలా తేడా వుంటుంది. ఇక్క‌డ ఆర్గ‌నైజేష‌న్ బిల్డ్ చేయాలి... ఒక ప‌ని సంస్కృతి అల‌వాటు చేయాలి. మ‌న‌కంటూ ఒక బ్రాండ్ సృష్టించుకోవాలి. ఇక్క‌డే అత్యంత ఘోర‌మైన వివ‌క్ష ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని అమీరా అంటారు.

మ‌గాళ్ళు పుట్టిపెరిగిన దగ్గ‌ర నుంచి రెండు ర‌కాలుగానే స్త్రీల‌ను అతిదగ్గరగా చూసుంటారు. ఒక‌టి త‌ల్లి, మ‌రొక‌టి భార్య‌. అలాంటి వాళ్ళ‌కి ఒక మ‌హిళ త‌న‌కు స‌మానంగా కూర్చుని బిజినెస్ చేయ‌డం స‌హించ‌లేరు. మ‌హిళ‌ల‌ను కాపాడ‌డం, వాళ్ళ‌కు కావ‌ల్సినవి స‌మ‌కూర్చ‌డమే త‌మ ప‌ని అనుకునే మ‌గాళ్ళు.. వాళ్ళ‌ని త‌మ‌తో స‌మానంగా ఊహించ‌లేరు. ఈ స‌మ‌స్య‌ను అర్థం చేసుకోవాలే త‌ప్ప‌, అస‌లు అలా వుండ‌ద‌ని అనుకోవ‌డం త‌ప్ప‌ని అమీరా అంటారు. అలా అని అర్థం చేసుకోవ‌డం అంటే, వివ‌క్ష‌ను స‌హించ‌డ‌మ‌ని కాదు. మ‌న చేత‌ల‌తో వాటికి సమాధానం చెప్పాలి అని ధైర్యంగా చెబుతారు.

image


భ‌విష్య‌త్తు

మెట్రోపాలిస్ భ‌విష్య‌త్తు ఊహించుకుంటే, అమీరాకు చాలా ఉద్వేగంగా వుంటుంది ‘‘ ఇప్ప‌టి వ‌ర‌కు మేం పెట్టుబ‌డులు పెడుతూ పోయాం. మాన‌వ‌వ‌న‌రుల మీదా, మౌలిక స‌దుపాయాల మీదా, డిస్ట్రిబ్యూష‌న్ నెట్వ‌ర్క్ మీదా, పెట్టుబ‌డులు పెట్టాం. ఇప్పుడిక వాటి ఫ‌లితాలు రావాలి. ఇది మా స్వ‌ల్ప‌కాలిక ప్ర‌ణాళిక‌.

ఇక దీర్ఘ‌కాలంలో..చూస్తే, ఈ బిజినెస్‌ను మ‌రింత ప్రొఫెష‌న‌ల్‌గా మార్చాల‌నుకుంటున్నాను. భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు బిజిన‌ెస్ మోడ‌ల్‌ను మార్చాలి. మ‌రిన్ని దేశాల‌కు మెట్రోపాలిస్‌ను విస్త‌రించి, ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న మార్క‌ెట్ల‌లో మా ముద్ర వేయాల‌నుకుంటున్నాను '' అని భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వివ‌రించారు అమీరా.

వారానికి మూడు సార్లు టెన్నిస్ ఆడే అల‌వాటున్న అమీరా వారానికి రెండు సార్లు జిమ్‌కు కూడా వెళ్తారు. ఎసి ఆఫీసుల్లో మ‌గ్గిపోవ‌డం అంటే ఆమెకు చిరాకు. వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా సెయిలింగ్, ట్రెక్కింగ్.. లాంటి ఔటింగ్స్‌కి వెళ్ళిపోతుంటారు. కొంచెం మ‌న‌సు పాడైతే, శారీర‌కంగా, మాన‌సికంగా ఉత్తేజ‌ప‌రిచే ప‌నుల‌మీదకి దృష్టి మ‌ళ్లిస్తారు. త‌న‌కు న‌చ్చిన స‌ల‌హా ఏంట‌ని అడిగితే... మ‌రింత బాగా ఓడిపోతూ వుండాలి.. అని చెప్తారు.. అమీరా.

స‌ల‌హా

ప‌ద్నాలుగేళ్ళ‌లో చాలా ఎత్తుప‌ల్లాలు చూసిన అమీరా త‌న‌కు తానే ఓ స‌ల‌హా ఇచ్చుకుంటారు. '' ఎవ‌రికి వాళ్ళు త‌మ హ‌ద్దుల‌ను చెరిపేసుకుంటూ వుండాలి. సౌక‌ర్యాల‌కు బందీ అయిపోవ‌డం మాన‌వ‌ స‌హ‌జం. ఫ‌లితం తెలియ‌ని స‌వాళ్ళంటే కూడా మ‌న‌కి చిరాకు. అయితే, అవే మ‌న‌కి చాలా అవ‌స‌రం. నువ్వెంత హ‌ద్దుల‌ను చెరిపితే, అంత‌గా నిన్ను నువ్వు తెలుసుకోగ‌లుగుతావు. నీ సామ‌ర్థ్యం నీకు అర్థ‌మ‌వుతుంది ''.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags