సంకలనాలు
Telugu

నలుగురు ఖైదీలు చేసిన పనికి ఆ జైలు గర్వంగా తలెత్తుకుంది..!!

24th Mar 2017
Add to
Shares
9
Comments
Share This
Add to
Shares
9
Comments
Share

ఆలోచనలెప్పుడూ శూన్యంలోంచే పుట్టుకొస్తాయి! ఏమీ చేయలేమా అన్న నిస్సారపు అపనమ్మకం నుంచి- ఎందుకు చేయలేం అనే విశ్వాసపు జవసత్వం నిండుతుంది!! చితాభస్మం నుంచి ఊపిరి పోసుకుని రెక్కలు విప్పార్చి ఎగిరిన ఫీనిక్స్ పక్షి మాదిరిగా.. చీకటి గదుల్లో సంఘర్షణలు కొత్త వెలుగు రేఖలను పులుముకుని ప్రసరిస్తాయి!! మీరు చదవబోయే కథ అచ్చం అలాంటిదే!! చేసిన నేరానికి శిక్ష అనుభవించేందుకు జైలుకొచ్చిన ఆ నలుగురి మూలంగా జైళ్ల శాఖ తొడగొట్టి కాలర్ ఎగరేసింది..!! ఇంతకూ ఎవరు వాళ్లు..?! ఏం చేశారు..? లేటెందుకు చదవండి.

కారాగార జీవితమంటే ఊహించడానికి పెద్దగా ఏమీ ఉండదు. జైలు నియమావళి ప్రకారం పొద్దున్నే లేవడం.. ఎవరికి అప్పగించిన పని వాళ్లు చేయడం.. టైంకి తినడం.. కౌన్సెలింగ్ క్లాసులు గట్రా వుంటే వినడం.. బంధువులొస్తే వాళ్లతో మాట్లాడటం.. సాయంత్రానికల్లా బ్యారక్ లోకి వెళ్లి కాళ్లు ముడుచుకోవడం. శూన్యం ఆవహించినట్టుగా ఒకరకమైన నిస్సారమైన జీవితం. పగవాడిక్కూడా రావొద్దనుకునే లైఫ్. ఎప్పుడు బయటపడతామా అని రోజులు లెక్కబెట్టుకునేవాళ్లే తప్ప, ఏ ఒక్కరూ అలాంటి జీవితాన్ని మళ్లీ అనుభవించాలనుకోరు. అలాంటి జైలు వాతావరణంలో అద్భుత ఆవిష్కరణ జరిగింది. నలుగురు ఖైదీల ఆలోచన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల దాకా వెళ్లింది.

image


వివరాల్లోకి వెళ్తే.. చండీగఢ్ లోని భోండ్సీ జైల్లో నలుగురు ట్రయల్ ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. రోహిత్ పగారే, అనూప్ సింగ్, బల్వంత్ సింగ్, అజిత్ సింగ్. వీళ్లలో రోహిత్ అనే ఖైదీది ఢిల్లీ. మిగతా ముగ్గురు రెవారెకు చెందిన వారు. నలుగరిలో ముగ్గురు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఒకరికి పదేళ్ల శిక్షా కాలం.

ఇండియా జైళ్లలో పెద్ద హైటెక్ హంగులేవీ వుండవు. అంతలావు రిజిస్టర్లు, బండిళ్లకొద్దీ పేపర్లు, డజన్ల కొద్దీ పెన్నులు తప్ప, పెద్దగా కంప్యూటర్ వాడే అవసరమే రాదు. ఏం చేయాలన్నా మాన్యువల్ ఎంట్రీనే. విజిటర్ల దగ్గర్నుంచి, క్యాంటీన్ లో కొనే సరుకుల దాకా అన్నీ చేత్తో రాసేవే. ఇలాంటి పనుల్ని ఎందుకు డిజిటలైజ్ చేయకూడదు..? జైల్లో జరిగే అన్ని యాక్టివిటీస్ ని ఒకే గొడుగు కిందకి తెస్తే ఎలా వుంటుంది..? అది కూడా ఒక యాప్ రూపంలో డిజైన్ చేస్తే, కచ్చితత్వంతో పాటు టైం కూడా సేవ్ అవుతుంది కదా.. అని ఆలోచించారు ఆ నలుగురు ఖైదీలు. వారిలో పరివర్తన టెక్నాలజీ రూపంలో సాక్షాత్కరించింది. ఇంకేముంది.. ఆలోచన ఆవిష్కరణ దిశగా నడిచింది. చితాభస్మం నుంచి లేచి రెక్కలు గట్టుకుని ఎగిరిన కాల్పనిక పక్షిని స్ఫూర్తిగా తీసుకుని ఆ పేరు పెట్టారు. జైలు మాన్యువల్ మేనేజ్మెంట్ ని డిజిటలైజ్ చేసే ఆ యాప్ కి ఫీనిక్స్ అని నామకరణం చేశారు.

శిక్ష అనుభవించేందుకు ఇదే జైలుకి అమిత్ మిశ్రా అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వచ్చాడు. అతని సాయంతో సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేశారు. ఇదంతా చేయడానికి ఏడాది పట్టింది. ఐదుగురు టీంగా తయారై యాప్ కోసం రేయింబవళ్లు వర్కవుట్ చేశారు. నెల రోజుల్లో వీళ్లు 11 జైళ్లలో యాప్ ఇన్ స్టాల్ చేశారు. అమిత్ విడుదలయ్యాక యాప్ బాధ్యత నలుగురు చూసుకున్నారు.

అందులో అమిత్ తప్ప, మిగతా వారెవరూ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ కాదు. అమిత్ మిశ్రా సాయంతో జైల్లోనే ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారు. వీళ్ల ఆలోచన పుణ్యమాని జైలు క్యాంటీన్లు క్యాష్ లెస్ అయ్యాయి. ఖైదీలు రోజువారి ఖర్చుల్ని బయోమెట్రిక్ ద్వారా జరుపుతున్నారు. గతంలో మాన్యువల్ గా చేసే క్యాంటీన్ లావాదేవీలను, విజిటర్ల నమోదు ప్రక్రియను, పాత ఖైదీల వివరాలను యాప్ ద్వారా డిజిటలైజ్ చేశారు.

వాస్తవానికి వీళ్లకు మొదట యాప్ ఐడియా రాలేదు. జైలుకి వచ్చే సందర్శకుల వివరాలను, క్యాంటీన్ లెక్కలను కంప్యూటరైజ్డ్ చేస్తామన్నారు. అధికారులు సరే అన్నారు. అలా ముందుకు పడిన అడుగు యాప్ క్రియేట్ చేసే దాకా వెళ్లింది. ఖైదీలు తయారు చేసిన యాప్ మూలంగా మేం గర్వంగా తలెత్తుకున్నాం అంటున్నారు అధికారులు. భారతదేశ చరిత్రలో ఇలాంటి ఆవిష్కరణలు మునుపెన్నడూ జరగలేదని వారు గర్వంగా చెప్తున్నారు.

ఫీనిక్స్ యాప్ వచ్చాక విజిటర్లు గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన అగత్యం తప్పింది. ప్రతీదీ మాన్యువల్ గా ఎంటర్ చేయాల్సిన తలనొప్పీ పోయింది. ఇప్పుడు ప్రతీ సందర్శకుడి వివరాలు కంప్యూటరైజ్డ్ అయ్యాయి. ఆటోమేటిగ్గా సంబంధిత ఖైదీగా సమాచారం వెళ్తుంది. ఈ తతంగమంతా పూర్తికావడానికి గతంలో రెండు గంటలు పట్టేది. ఇప్పుడు ముప్పావుగంటలో పూర్తవుతుంది. ఖైదీ ఏ నేరం చేశాడు? అతని వివరాలేంటి? పెరోల్ డిటెయిల్స్, శిక్షాకాలం ఎప్పుడు పూర్తవుతుంది తదితర వివరాలన్నీ ఈ యాప్ తో చెక్ చేసుకోవచ్చు.

భారీ ఖర్చుతో కూడుకున్న ఈ టెక్నాలజీ నలుగురు ఖైదీల ఆలోచన మూలంగా ఉచితంగా సేవలందిస్తోందంటే నిజంగా అభినందనీయమని యావత్ డిపార్టుమెంట్ ప్రశంసిస్తోంది. ప్రస్తుతానికి ఈ యాప్ ని హర్యానా వ్యాప్తంగా ఉన్న 11 జైళ్లలో ప్రవేశపెట్టారు.

Add to
Shares
9
Comments
Share This
Add to
Shares
9
Comments
Share
Report an issue
Authors

Related Tags