సంకలనాలు
Telugu

భగత్ సింగ్ ఎక్కడ…? ఆర్ఎస్ఎస్ ఎక్కడ..?

Pavani Reddy
28th Mar 2016
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share


భగత్ సింగ్ పేరు హఠాత్తుగా తెరపైకి వచ్చింది. ప్రతి రాజకీయ పార్టీ ఆయన గురించే మాట్లాడుతోంది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలుకొని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరకు భగత్ సింగ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అకాలీదళ్ ఇప్పుడు కళ్లు తెరిచి ఆయనకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఈమేరకు రాష్ట్రపతికి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వాలని కూడా నిర్ణయించింది. తలపాగా లేని భగత్ సింగ్ విగ్రహం ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టడాన్ని వ్యతిరేకించింది. బీజేపీ మెంటర్ ఆర్ఎస్ఎస్ అయితే ఈ విషయంలో మరింత అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. జాతీయవాదం, దేశభక్తిపై జరుగుతున్న చర్చలో భగత్ సింగ్ ను ప్రతివారూ ప్రస్తావిస్తునే ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అయితే జే.ఎన్.యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్యను ఏకంగా భగత్ సింగ్ తో పోల్చారు. అది కాస్తా విమర్శలకు దారి తీసింది. నేను ఇటీవలే ఒక టీవీ వాళ్లు పిలిస్తే చర్చాగోష్టికి వెళ్లాను. కన్నయ్యను భగత్ సింగ్ తో పోల్చడంపై ఒక యువతి ఆవేశంతో ఊగిపోయింది. పళ్లు పటపట కొరుకుతూ గుడ్లురిమి చూసింది. ఆమె కోపం, అసహనాన్ని నేను అర్థం చేసుకున్నాను.

భగత్ సింగ్ భారతీయులందరి గుండెల్లో ఉన్నాడు. అతనంటే గౌరవం. అందులో ఎలాంటి సందేహమూ లేదు. స్వాతంత్ర్య ఉద్యమంలో అతనొక ఐకాన్. గాంధీజీతో విబేధించేవారు. స్వాతంత్ర్య సాధన కోసం భగత్ సింగ్ ఎంచుకున్న హింసాత్మక మార్గాన్ని బాపూజీ వ్యతిరేకించారు. తర్వాత పరిణామాల్లో భగత్ సింగ్ త్యాగం 1931లో దేశాన్ని ఒక్క కుదుపు కుదిపింది. సుఖ్ దేవ్, రాజ్ గురుతోపాటు భగత్ సింగ్ ను ఉరితీశారు. అప్పుడు అతని వయసు 23 ఏళ్లు. 

విప్లవం.. ఉద్యమం.. ఈ పేర్లు వినిపించినప్పుడల్లా భగత్ సింగే స్ఫురణకు వస్తాడు. ఈ నేపథ్యంలోనే భగత్ సింగ్ ను సొంతం చేసుకునేందుకు, తమ వాడని చెప్పుకునేందుకు ఇటు ఆర్ఎస్ఎస్ అటు బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. అంతకముందు సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ను కూడా తమవారిని చేసుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నించాయి. వాస్తవానికి ఆ ఇద్దరు నాయకులకు ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేదు. ఒక సంస్థగా ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదు. సర్దార్, నేతాజీ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆర్ఎస్ఎస్ తో సర్దార్ పటేల్ కు కొంచెం భావస్వారూప్యం ఉన్నా… సుభాష్ చంద్రబోస్ కు ఏమాత్రం లేదు. చంద్రబోస్ ఒక సోషలిస్ట్ విప్లవకారుడు.

ఆర్ఎస్ఎస్/ బీజేపీతో భగత్ సింగ్ కు ఎలాంటి భావసారూప్యతా లేదు. భగత్ సింగ్ ఇప్పుడు బతికుంటే ఆర్ఎస్ఎస్ ను, మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేవారు. ఈ విషయంలో నాకెలాంటి గందరగోళం లేదు. జేఎన్యూపై ఆర్ఎస్ఎస్/మోదీ ప్రభుత్వ విధానం… ఆయనకు తీవ్ర ఆగ్రహం తెప్పించేది. జేఎన్ యూ ఉగ్రవాదులకు, జాతి వ్యతిరేకుల అడ్డాగా మారిందని చిత్రీకరించేందుకు ఆర్ఎస్ఎస్ / మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కమ్యూనిజం అంటే ఆర్ఎస్ఎస్ కు విపరీతమైన ద్వేషం. కమ్యూనిజానికి గట్టి పట్టున్న ప్రాంతం జేఎన్ యూ. అందుకే ఆర్ఎస్ఎస్ విరుచుకుపడుతోంది. జేఎన్ యూ పరువుతీసేందుకు భారత వ్యతిరేక నినాదాల అంశం ఆర్ఎస్ఎస్ కు ఒక ఆయుధంలా దొరికింది. జాతీయవాదానికి, దేశభక్తికి చిహ్నంలాంటి భగత్ సింగ్ తమవాడని చెప్పుకోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.

భగత్ సింగ్ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాడు. చిన్నతనంలోనే కారల్ మార్క్స్, లెనిన్ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారు. రష్యా బోల్షివిక్ విప్లవం ఆయనలో స్ఫూర్తినింపింది. లెనిన్ అతని ఐకాన్. సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ విప్లవం స్ఫూర్తిగా భారత్ కు స్వాతంత్ర్యం తీసుకురావాలని భావించిన వ్యక్తి భగత్ సింగ్ . శ్రామిక నియంతృత్వం (ప్రోలిటేరియట్ డిక్టేటర్ షిప్) పేద భారతీయులను దాస్య శృంఖలాల నుంచి విముక్తుల్ని చేస్తుందని నమ్మారు. అసెంబ్లీలోకి భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు విసిరిన పాంప్లెట్లలో అదే విషయం ఉంది. దాస్ క్యాపిటలల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో స్ఫూర్తిని చాటుతూ పాంప్లెట్లు విసిరారు. తర్వాత వారిని అరెస్టు చేయడం.. ఉరి తీయడం జరిగిపోయాయి.

"మనుషులను మనుషులు, దేశాలను దేశాలు దోపిడీచేయడం మాననంతవరకు సమస్యలు పోవు. సామ్రాజ్యవాదం నశించాలి" ఇది పాంప్లెట్లలో ఉన్న విషయం.

పాలకులు కాదు పాలనా విధానం మారాలని చెప్పేవారు భగత్ సింగ్. "సామ్రాజ్యవాద యుద్ధం, పెట్టుబడిదారీ విధానం నశించినప్పుడే మనిషి స్వేచ్ఛగా బతకగలడు” భగత్ సింగ్ పాంప్లెట్లో ఇదే ప్రస్తావించారు. అయితే ఆర్ఎస్ఎస్ హిందువుల ఐక్యత గురించి మాత్రమే మాట్లాడుతోంది. అసంఖ్యాకంగా ఉన్న శ్రామికుల గురించి మాట్లాడదు. కానీ భగత్ సింగ్ మాత్రం ప్రజా ప్రభుత్వం ఏర్పడేందుకు శ్రామికులంతా ఏకం కావాలని పిలపుపునిచ్చారు. మతం మనుషులను విభజిస్తుందని కమ్యూనిజం చెప్తుంది. మతం మత్తు మందులాంటిదన్నారు కార్ల్ మార్క్స్. మతాన్నీ దేవుడినీ వ్యతిరేకించారు.

కానీ మతాన్నే నమ్ముకుంది ఆర్ఎస్ఎస్. హిందూయిజమే దాని స్ఫూర్తి. కమ్యూనిజం, సోషలిజాన్ని నమ్ముకున్న నాస్తికవాది భగత్ సింగ్. తను నాస్తికవాదినని చెప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించేవారు కాదు. వై యామ్ ఐ ఎథిస్ట్ అన్న భగత్ సింగ్ పాప్లెంట్ చదివితే ఈ విషయం అర్థమవుతుంది. దేవుని ఉనికినే ప్రశ్నించారాయన. నిజంగా భగవంతుడే ఉంటే ఈ ప్రపంచంలో ఇన్ని బాధలు, శోకాలు ఎందుకున్నాయి? మనమెందుకు పేదరికంలో మగ్గుతున్నామని పాంప్లెట్ లో ప్రశ్నించారు. "దేవుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడే అయితే ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు..? ఎన్నో కష్టాలు, బాధలతో కూడిన ప్రపంచాన్ని ఎందుకు సృష్టించారు..? ఒక్కరైనా ఈ ప్రపంచంలో సంతోషంగా ఉన్నారా" అంటారు భగత్ సింగ్.

భగత్ సింగ్ సిద్ధాంతాలకు పూర్తిగా భిన్నమైనది ఆర్ఎస్ఎస్. దేవుడు, మతాన్ని తిరస్కరించిన భగత్ సింగ్ భావాలను ఆర్ఎస్ఎస్ అంగీకరిస్తుందా? ఈ ప్రశ్న నేను సూటిగా అడుగుతున్నాను. భగత్ సింగ్ కమ్యూనిస్ట్ భావాలు ఆర్ఎస్ఎస్ కు నచ్చుతాయా? అదే నిజమైతే భారత్ కు కమ్యూనిస్టులు, ముస్లింలు, క్రైస్తవులనే ముగ్గురు శత్రువులున్నారంటూ ఆర్ఎస్ఎస్ నాయకుడు గురు జీ గోవాల్కర్ తన పుస్తకం బంచ్ ఆఫ్ థాట్స్ లో ఎందుకు రాశారు. గోవాల్కర్ లాజిక్ ను చూసుకున్నా భగత్ సింగ్ , ఆర్ఎస్ఎస్ ఒకే ఒరలో ఇమడలేవు. ఆర్ ఎస్ఎస్ తో భగత్ సింగ్ కు అస్సలు పొసగదు.

ఆర్ఎస్ఎస్ / మోదీ ప్రభుత్వం అసహ్యించుకునే జవరర్ లాల్ నెహ్రూ అంటే భగత్ సింగ్ కు వల్లమాలిన అభిమానం. నెహ్రూను సుభాష్ చంద్రబోస్ తో పోల్చినప్పుడు.. బోస్ ఒక భావోద్వేగమైతే- నెహ్రూ ఒక బుద్ధిశాలి అంటారు భగత్ సింగ్. బోస్ తో పోల్చితే నెహ్రూను అనుచరించాలని... పంజాబ్ యువకులకు భగత్ సింగ్ పిలునిచ్చారు. ఈ భావాలన్నీ ఆర్ఎస్ఎస్ కు ఓకేనా.. కాదా..? సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నెహ్రూ, ఆయన లెగసీని ప్రజల స్మృతిపథం నుంచి చెరిపేసేందుకు సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ పేర్లను వాడుకుంటోంది ఆర్ఎస్ఎస్. నెహ్రూ లిబరలిజం ఉన్నంతవరకు ఆర్ఎస్ఎస్ భావజాలానికి చోటుండదన్న విషయం ఆ సంస్థకు తెలుసు. అందుకే నెహ్రూ ఇమేజ్ డామేజ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ నెహ్రూ విధానాలు భగత్ సింగ్ కు నచ్చాయన్న నిజాన్ని దాచగలదా? కమ్యూనిస్ట్ భావజాలం కరెక్టని చెప్పిన గోవాల్కర్ వాదనలన్నీ తప్పు అని ఆర్ఎస్ఎస్ చెప్పగలదా? మతం విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకుని… భగత్ సింగ్ ఐడియాలజీకి మద్దతివ్వగలదా?

ఆర్ఎస్ఎస్ తన విధానాలను, సిద్ధాంతాలను, ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోలేదని నేను గట్టిగా చెప్పగలను. రాజకీయ ప్రయోజనాలకోసమే భగత్ సింగ్ ను, ఆయన త్యాగాన్ని ఉపయోగించుకుంటోంది. భగత్ సింగ్ ఒక ఐకానిక్ ఫిగర్, మహనీయుడు. దయచేసి చిల్లర రాజకీయాల్లోకి ఆయనను లాగొద్దు. అలా చేస్తే మాత్రం భగత్ సింగ్ స్ఫూర్తిని, ఆయన రగిలించిన విప్లవ జ్వాలను ఆర్పినట్టే.. అవమానించినట్టే.. 

రచయిత : అశుతోష్ , ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ జర్నలిస్టు.

తెలుగు అనువాదం: పావనీరెడ్డి.

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags