గోవాలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ సహకారం

గోవాలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ సహకారం

Thursday July 06, 2017,

2 min Read

ఐటి పరిశ్రమ అభివృద్ది కోసం గోవా-తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదుర్చుకున్న నాలెజ్డ్ ట్రాన్స్ ఫర్ ఒప్పందంలో భాగంగా మరో ముందడుగు పడింది. గోవాలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసం సహాకరించాల్సిందిగా గతంలో అక్కడి ప్రభుత్వం తెలంగాణను కోరింది. ఆ మేరకు ఆ గోవా ఐటీ శాఖ మంత్రి రోహన్ కౌంతే ఈ తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యారు. రాష్ర్టంలో ఐటీ పరిశ్రమ అభివృద్ది, ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు గోవా ఐటీ శాఖ మంత్రి, అధ్యర్యంలో అధికారుల బృందం రెండు రోజుల పర్యటనకు హైదరాబాదు వచ్చింది.

image


గోవాలో ఐటీ పరిశ్రమ అభివృద్దికి తెలంగాణ సహకారాన్ని కోరుతున్నామని రోహన్ కౌంతే తెలిపారు. తమ రాష్ర్టంలో పరిశ్రమ ప్రారంభదశలో ఉన్నదని, అందుకే తాము మెదట స్టార్టప్స్, ఇన్నోవేషన్ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈరంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ వినూత్నమైన కార్యక్రమాలతో ఐటీ పరిశ్రమను పరుగులు పెట్టిస్తున్న తీరును అయన ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ గవర్ననెన్స్, ఇన్నోవేషన్, డిజిటల్ లిటరసీ రంగాల్లో మద్దతు తీసుకుంటామని తెలిపారు. అయా అంశాల మీద తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో చర్చించారు.

గ్రాండ్ కాకతీయ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వ ఐటీ పాలసీలను, ముఖ్యంగా వివిధ సెక్టార్ల వారీగా ఉన్న పాలసీలను వివరించారు. దీంతోపాటు టీ హబ్, టాస్క్, టీ వర్క్స్ వంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా గత మూడు ఏళ్లలో ఐటీ రంగంలో చూపిన అభివృద్దిని మంత్రి కేటీఆర్ వివరించారు. గత ఇరవై సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం ఐటి పరిశ్రమ అభివృద్ది కోసం చేసిన పలు కార్యక్రమాలను, పాలసీలను మార్చుకున్న తీరుని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. సాప్ట్ వేర్ హబ్ గా ఉన్న హైదరాబాద్ ఐటీ పరిశ్రమ బలాన్ని ఉపయోగించుకుని, టీ హబ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అవిష్కరణలు, స్టార్టప్స్ కు చేయూత ఇచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

మూడు సంత్సరాల క్రితం కేవలం వందల్లో ఉన్న స్టార్టప్స్ సంఖ్య ఈ రోజు 3వేలకు పైగా పెరిగాయని, హైదరాబాద్ నగరం దేశ స్టార్టప్ క్యాపిటల్ గా మారిందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం కేవలం ఐటీ ఇకో సిస్టమ్‌కు సహాకారం అందిచామన్నారు. నగరంలోని ప్రఖ్యాత విద్యాసంస్ధలు, పరిశ్రమ వర్గాలను కలుపుకుని వినూత్నమైన పద్దతిలో టీ హబ్ తయరు చేశామన్నారు. ఇదే విధంగా టాస్క్, టీవర్క్స్ ను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

మరోవైపు టీ ఫైబర్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గోవా ప్రభుత్వం ఇప్పటికే గ్రామపంచాయితీ వరకు భారత్ నెట్ ద్వారా ఇంటర్నెట్ ఇచ్చిందని, అధునాతన వై-ఫై విధానంలో గ్రామాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని గోవా మంత్రిని కోరారు. గోవా ఐటి పరిశ్రమ అభివృద్దికి కావాల్సిన సహాకారాన్ని తెలంగాణ అందిస్తుందని, రెండు రాష్ర్టాలు చేస్తున్న ప్రయత్నం నిజమైన ఫెడరల్ స్ఫూర్తికి అద్దం పడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.