సంకలనాలు
Telugu

రతన్ టాటా చెప్పిన స్టార్టప్ సూత్రాలు

పారిశ్రామిక రత్నంతో వాణికోలా ఇంటరియాక్షన్ హైలెట్స్

SOWJANYA RAJ
20th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


"ఒక విలువ..ఒక విశ్వాసం...ఒక నాయకత్వం "

ఇవీ రతన్ టాటా గురించి మూడు ముక్కల్లో చెప్పుకునే మాటలు.!

భారతదేశంలో అత్యంత నిరుపేద వ్యక్తి దగ్గర్నుంచి అత్యంత ధనవంతుడు వరకు ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో ఒక్కటైనా టాటా ఉత్పత్తి వాడకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. టీ పొడి నుంచి లగ్జరీ కార్ల వరకూ టాటా వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. జేఆర్డీ టాటా పోసిన నారు... నేడు మహా..మహా వృక్షంగా ఎదగడానికి నీరు పోసిన వ్యక్తి రతన్ టాటా. దేశ జీడీపీలో రెండు శాతానికిపైగా కంట్రిబ్యూషన్ టాటా గ్రూప్ సంస్థలది. విలువల మీద నడిచే వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడం .. అంతే నిబద్ధత గల రతన్ టాటా వల్లే ఇది సాధ్యమయింది.

సిలికాన్ వ్యాలీలో సీరియల్ అంట్రెపెన్యూర్ గా విజయం సాధించి... కలారి క్యాపిటల్ ద్వారా ఇండియా స్టార్టప్స్ వ్యవస్థ పిల్లర్లలో ఒకరిగా ఎదిగిన విజేత వాణి కోలా. స్నాప్ డీల్, మింత్రా, అర్బన్ లాడార్ లాంటి స్టార్టప్ లకు వాణి కోలా పెట్టుబడులు అందించారు. ఇప్పుడు ఆమె ఫోర్ట్ ఫోలియోలో 20కిపైగా స్టార్టప్ లు ఉన్నాయి. ఎన్నో కంపెనీల్లో బోర్డ్ ఆఫ్ డైరక్టర్ గా ఉన్నారు.

టాటా గ్రూప్ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత రతన్ టాటా... స్టార్టప్స్ ని పొత్సహించడాన్ని వ్యాపకంగా పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలోనే వాణి కోలా ... రతన్ టాటా తో పలుమార్లు సమావేశమయ్యారు. ఇటీవల కలారి క్యాపిటల్ స్టార్టప్స్ ను ప్రొత్సహించేందుకు చేపట్టిన సీడ్ ప్రోగ్రామ్.. Kstart ప్రారంభ సమయంలో రతన్ టాటాను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు వాణి కోలా. భారత పారిశ్రామిక రంగంలోని చెరగని ముద్రవేసిన రతన్ టాటా ... ప్రతి మాట.. అడుగు నుంచి నేర్చుకోవాల్సింది ఏందో ఉందని వాణి కోలా గుర్తించారు.

రతన్ జీవితానుభవాల నుంచి భవిష్యత్ తరాలు నేర్చుకోవాల్సింది కొండంత ఉందంటున్న వాణి కోలా.. తన నేర్చుకున్న కొన్ని అంశాలను మనతో పంచుకున్నారు.

అవి..వాణి కోలా మాటల్లోనే....

రతన్ టాటాతో మొదటి సమావేశం

ముంబైలోని రతన్ టాటా ఆఫీస్.. !

పుణెలో బోర్డు మీటింగ్ ముగించుకుని అపాయింట్ మెంట్ కు రెండు గంటల ముందుగానే ముంబై చేరుకున్నా. లెజండరీ పర్సన్ తో సమావేశం అవుతున్నామనే ఉత్సుకత మనసంతా కప్పేసి ఉంది. కానీ... మాట్లాడటానికి ఏమీ తోచడం లేదు. చివరికి ఇండియన్ స్టార్టప్ అవకాశాలపై రతన్ తో చర్చించాలని నిర్ణయించుకున్నా. ఇండియన్ వెంచర్ క్యాపిటల్ రంగం అవకాశాలు, భవిష్యత్ పై చర్చిస్తే సౌకర్యంగా ఉంటుందని అనిపించింది.

రతన్ టాటాతో మీటింగ్ కి సమయం దగ్గర పడుతున్నకొద్దీ... టాటా గ్రూప్ లెగసీని ఓ సారి గుర్తు చేసుకున్నా. 150 ఏళ్ల చరిత్ర.. భారత పారిశ్రామిక రంగానికి అందించిన సేవలు.. ఎలాంటి పరిస్థితుల్లోనూ చెక్కుచెదరని నైతిక విలువలు ఇచ్చిన స్ఫూర్తిని మరోసారి మననం చేసుకున్నా. ఆ సమయంలో నేను చదివిన జేఆర్డీ టాటా బయోగ్రఫి " బియాండ్ ది లాస్ట్ బ్లూ మౌంటెన్" మనసులో మెదిలింది.

నా కెరీర్ ప్రారంభించిన సమయంలోనే... రతన్ టాటా.. టాటా గ్రూప్ కి ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినట్లు గుర్తు. ఆ సమయంలోనే జేఆర్డీ టాటాను నేను విపరీతంగా అభిమానించేదాన్ని. అలాంటి మహోన్నత వ్యక్తి నిర్వహించిన బాధ్యతలను చేపట్టేందుకు రతన్ టాటా సామర్ధ్యం సరిపోతుందా అని నాకే అనుమానం వేసేది. కానీ రానున్న రోజుల్లో నావన్నీ వట్టి అనుమానాలేనని టాటా గ్రూప్ అభివృద్ధి తేల్చేసింది. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన టాటా గ్రూప్ కి రతన్ ఇరుసులా మారారు.

ఇలా ఆలోచనల్లో ఉండగానే... సమయం గడిచిపోయింది. దేశంలో అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి దగ్గరకు వెళ్తున్నాననే ఓ రకమైన టెన్షన్, క్యూరియాసిటీతో ఆయన చాంబర్ లోకి అడుగుపెట్టాను. అంత పెద్ద వ్యక్తితో ఎలా వ్యవహారించాలో అనేది నాకు అప్పటికీ తోచలేదు. కానీ లోపలికి అడుగుపెట్టిన తర్వాత రతన్ అంత గొప్ప వ్యక్తి ఎలా అయ్యారో మొదటి అడుగులోనే అర్థమయింది.

ఆయన సింప్లిసిటీ, అతిధిని ఆప్యాయంగా ఆహ్వానించే విధానం, చూపించిన అభిమానం నాలో ఉన్న భయాన్ని పోగొట్టాయి. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఉత్సాహం, ప్రొత్సహించే విధానం అద్భుతం. చెప్పింది మొత్తం వింటారు...తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్తారు. రతన్ టాటా చూపించిన చొరవతో ఇండియన్ క్యాపిటల్ వెంచర్ మార్కెట్ పై మా మధ్య అర్థవంతమైన చర్చ జరిగింది. ఆ తర్వాత మరో ఆలోచన లేకుండా... మా కలారీ క్యాపిటల్ సంస్థ గురించి చెప్పి.. సలహాదారుగా ఉండాలని అభ్యర్థించా. ఏ మాత్రం ఆలస్యం చేయకుండానే దానికి అంగీకారం తెలిపారు. ఆ విధంగా నాకు స్ఫూర్తిగా నిలిచిన.... దేశ వ్యాపార, పారిశ్రామిక రంగంలో మేరునగధీరుడనదగ్గ వ్యక్తితో మా అసోసియేషన్ ప్రారంభమయింది.

అప్పట్నుంచి ఎన్నోసార్లు రతన్ టాటాతో సమావేశమయ్యాను. ప్రతీసారి రతన్ టాటాలోని మానవత్వం, ప్రశాంతత, హేతుబద్ధంగా ఆలోచించే తీరు, ఇతరుల చెప్పే వివరాలను ఆలకించే విధానం... నాకు స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నాయి. తను గొప్ప పారిశ్రామికవేత్తనన్న డాంబికం ఇసుమంత కూడా చూపించరు. నేను ఇంత వరకూ చూడలేదు. ప్రపంచాన్ని మరింత మెరుగ్గా సరిదిద్దే ప్రయత్నంలో ఆయన చూపించే ఉత్సాహం మర్చిపోలేనిది. నిజమైన నాయకత్వానికి ఆయన నిదర్శనం. స్టార్టప్స్ ప్రారంభిస్తున్న ఔత్సాహికులతో పాటు... ఇప్పటికే ఆ రంగంలో విజయం సాధించిన వారికీ రతన్ టాటా ఓ ఐడియల్ రోల్ మోడల్.

కలారి క్యాపిటల్ సీడ్ ప్రోగ్రామ్ కెస్టార్ట్ ( Kstart ) ప్రారంభించిన సందర్భంగా ఫిబ్రవరి 5న రతన్ టాటాను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాను. అయితే ఈ సందర్భంగా అడగాల్సిన ప్రశ్నలు సిద్ధం చేసుకోవడం కోసం పడిన టెన్షన్ తో నిద్రపట్టలేదు. ఎట్టకేలకు తెల్లవారుజామున యువ పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ ఫౌండర్లకు స్ఫూర్తినిచ్చేలా రతన్ టాటాలోని అంట్రపెన్యూర్ ని బయటకు తెచ్చేలా ఇంటర్ఫ్యూ ప్రశ్నలు సిద్దం చేసుకోగలిగాను.

రతన్ టాటాతో వాణి కోలా ఇంటర్వ్యూ 

ఫైర్ సైడ్ చాట్ విత్ రతన్ టాటా ( వీడియో కర్టెసి Kstart.in ) 

ఇంటర్వ్యూలో రతన్ టాటా చెప్పిన ముఖ్యమైన విషయాలు

"కాలేజీ చదువుల కోసం అమెరికా వెళ్లడమే నా జీవితంలో కీలకఘట్టం. అక్కడంతా ప్రతిభ ఆధారంగా నడుస్తుంది. వినయ విధేయలతో ఎలా మెలగాలో... ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలో అక్కడ నేర్చుకున్నా.."

మీరు ఇప్పుడు రెండు పదుల్లో ఉన్న అంట్రపెన్యూర్ లా..!

ఒక సమస్య వచ్చినప్పుడే ఐడియా కూడా వస్తుంది. పరిష్కరించుకోవడానికి సమస్యను వెదుకండి. దానిపై సమయం, శక్తిని వెచ్చించండి. ప్రయత్నాలు చేయండి. అలా వచ్చిన ఆలోచనలు, ఐడియాతో కొత్త వెంచర్స్ ప్రారంభించండి.

స్టార్టప్స్ తో నా అసోసియేషన్ చాలా కొద్ది కాలమే. ఈ కాలంలోనే నేను చాలా మంది నుంచి ఆలోచనలు, ఐడియాలు విన్నాను. అందులో కొన్ని జరిగే పని కాదని అనుకున్నాను. అయితే వాటిని ఆచరణలో పెట్టారు. విజయం కూడా సాధించారు. నా చుట్టూ ఉన్న యువ ప్రతిభావంతుల నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందని అప్పుడే అర్థం చేసుకున్నా..

సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రాతిపదిక ఎలా..?

ప్రజల జీవన శైలిని, వారి ఆలోచనను, జీవన విధానాన్ని ప్రభావితం చేసే ఐడియాలు ఎంతో శక్తిని, స్ఫూర్తిని ఇస్తాయి. నా విషయంలో ... నేను చేస్తున్న దాతృత్వ కార్యక్రమాల వల్ల సానుకూల పరిణామాలు జరిగినప్పుడు అవి నాకెంతో ఉత్తేజాన్నిస్తాయి.

పెట్టుబడిదారుడిలో ఎలాంటి లక్షణాలు చూడాలి..?

మనం ఎంచుకున్నరంగం, చేయబోతున్నపని పట్ల ఎక్సైట్ మెంట్, ప్యాషన్ ఇన్వెస్టర్ కి ఉందో లేదో చూడాలి. కేవలం డబ్బు పెట్టేవారితో కాకుండా అంట్రపెన్యూర్ జర్నీలో మనతో కలిసి నడిచేవారితో భాగస్వామ్యం అవ్వాలి. ఇన్వెస్టర్ అనుభవాలు, పరిచయాలు, సలహాలను ఉపయోగించుకుని వాస్తవ ప్రపంచంలో పనిచేయగలిగేలా చూసుకోవాలి.

వృద్ది రేటు, లాభదాయకత మధ్య సమతౌల్యం ఎలా..?

దీనికి ఎలాంటి సింగిల్ ఫార్ములా లేదు. ఇటీవల కాలంలో నేను చాలా కంపెనీల పెరుగదల రేటును అసలు అంచనా వేయలేదు. ఆ స్థాయిలో పెరుగుదల అసాధ్యమని అనుకున్నాను. అయితే వృద్దిరేటును స్థిరంగా కొనసాగించడమే పెద్ద ప్రశ్న. ఇదంతా ప్రతి స్టేజ్ లోనూ సంస్థ పనితీరుపై మీరు పెట్టే శ్రద్ధ, ఆచరణలో పెట్టే ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది.

స్టార్టప్ సీఈవో వ్యక్తిగత బ్రాండ్ పెంచుకోవడం అవసరమా..?

ఇది పూర్తిగా పర్ననల్ చాయిస్. కొంత మంది స్టార్టప్ సీఈవోలు తమ ఇమేజ్ ను అలా పెంచుకుంటారు. కొందరు పెంచుకోరు. ఎక్కువమంది ఫౌండర్లు స్టార్టప్ కమ్యూనికేషన్ లో పోటీతత్వ ప్రయోజనాన్ని పొందడానికి ఇలా ప్రయత్నిస్తారు. అందరూ వాటాదారులకు ప్రమేయం ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ ఉత్తమమైనదని నా అభిప్రాయం. విజయవంతమైన సీఈవోలు ఇదే చేస్తారు. నువ్వు కమ్యూనికేట్ చేసే విధానాన్ని బట్టే ప్రపంచం నిన్ను గుర్తుంచుకుంటుందనే విషయాన్ని సీఈవోలు ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలి.

విజయం ఆస్వాదన

నేను నా ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన ఘట్టాలను చూశా. కానీ నానో కారు ఆవిష్కరించిన రోజే నేను దాన్ని ఆస్వాదించా. భారీ వర్షం పడుతున్న సమయంలో ఓ మధ్య తరగతి కుటుంబం స్కూటర్ పై వెళ్తూండటం చూశా. కాసేపటికే వారు చిన్న ప్రమాదానికి గురై కిందపడ్డారు. వారి భద్రత కోసం నేను ఏం చేయగలనో ఆలోచిస్తే నాకు అందుబాటులో ఉండేలా కారును సృష్టించాలనే ఆలోచన వచ్చింది. దాని ఫలితమే నానో కారు ఆవిష్కరణ.

మేమంతా కలసికట్టుగా నానో కారు డిజైన్ చేసి... అందుబాటులో ఉండేలా ధరను నిర్ణయించి ఢిల్లీ కార్ ఎక్స్ పోలో ఆవిష్కరించాం. ఇదే అద్భుత ఘట్టం.

26 ఏళ్ల వయసులో తెలుసుకోవాల్సిన విషయం...

జంషడ్పూర్ లో నేను ఓ యువ ఉద్యోగిగా ఉన్నప్పుడు... ఎన్నో ఐడియాలతో బాసుల దగ్గరకి వెళ్లేవాడిని. కానీ వారెవరూ నా ఆలోచనలు, ఐడియాలను పట్టించుకునేవారు. ఇవన్నీ మానేసి అప్పగించిన పని పూర్తి చేయమనేవారు. నిజం చెప్పాలంటే .. నా ఐడియాను వారి ముందుకు ఎలా తీసుకెళ్లాలో స్పష్టమైన అవగాహన ఉండేది కాదు. మీరు ఇతరులతో వ్యవహరించే విధానం ఇప్పుడు అనుసరిస్తున్నదానికంటే మరింత మెరుగ్గా ఉండాలి.

రతన్ టాటాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు

JRD టాటా: భారత పరిశ్రమల రంగంలో తనదైన ముద్రవేసిన గొప్ప వ్యక్తి. నాకు అప్పుడు, ఇప్పుడు.. ఎప్పూడూ గురువే

హెన్రి సచట్: కమిన్స్ డీజిల్ మాజీ ఛైర్మన్, సీఈవో నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. చాలా విషయాల్లో స్ఫూర్తి నిచ్చిన వ్యక్తి

అమర్ బోస్: బోస్ కార్పొరేషన్ స్థాపించిన దిగ్గజం. అతను నాకు చాలా దగ్గరి వ్యక్తి. మేమిద్దరం ఎన్నో ఆలోచనలు పంచుకుంటూంటాం.

ఈ సంభాషణ జరిగిన 45 నిమిషాలు నా జీవితాంతం గుర్తుంచుకోవాల్సినవి. వ్యాపార ప్రపంచంలో వ్యాపారవేత్తల ప్రాధాన్యాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. పోటీ ప్రపంచం, విజయాల కోసం విలువలకు తిలోదకాలిచ్చేస్తూంటారు. కానీ రతన్ టాటా మాత్రం నమ్మిన సిద్ధాంతం, నైతిక విలువల విషయంలో ఏ మాత్రం రాజీపడని అద్భుతమైన వ్యక్తి " గాలులు ఎంత తీవ్రంగా వీచినా వాటికి పర్వతం ఎన్నటికీ తలవంచదు" అనేదానికి నిలువెత్తు నిదర్శనం రతన్ టాటా.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags