సంకలనాలు
Telugu

గేమింగ్‌ పరిశ్రమలో దూసుకుపోతున్న అనిల ఆండ్రేడ్

వీడియోగేమింగ్ తయారీ రంగంలో పురుషులదే ఆధిపత్యంఈ రంగంలో మహిళల సంఖ్య చాలా చాలా తక్కువకేంపస్ సెలక్షన్‌నుంచే ఇటువైపు వచ్చేసిన అనిలఆటలో విజయం సాధించిన 99 గేమ్స్ మహిళా ప్రొడ్యూసర్

ABDUL SAMAD
27th May 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
“నేను మొదట అడిక్ట్ అయిన ఆట... ఫేస్‌బుక్‌లోని ఫామ్‌విల్లే. నాకు ఫామింగ్ అంటే అంత మక్కువ అని ఆ ఆట ఆడేవరకూ నాకు కూడా తెలీదు. ఎప్పుడూ ఆడుతూనే ఉండేదాన్ని. వేళాపాళా లేకుండా అర్ధరాత్రి కూడా లేచి నా క్రాప్స్ ఎండిపోకుండా చూసుకునేదాన్ని.”

ఇది 99గేమ్స్ ప్రొడ్యూసర్ అనిల ఆండ్రేడ్ దాపరికం లేకుండా ఇచ్చే వివరణ. చిన్నపుడు తాను టెట్రిస్ అడేది. తర్వాత డిగ్రీ సమయంలో బిజ్యూవెల్డ్ అంటే మక్కువ పెంచుకుంది. ఆతర్వాత డైనర్ డాష్, ది సిమ్స్ వంటి వీడియోగేమ్స్‌నూ ఆడేసేది. ఆ తర్వాత క్రిమినల్ కేస్, వర్డ్స్‌వర్త్, కాండీ క్రష్, జెల్లీ స్ల్పాష్ వంటి గేమ్స్ కూడా ఆమె లిస్ట్‌లో ఉన్నాయి.

గేమింగ్ స్టార్టప్స్... ఈ రంగంలో పురుషులదే ఆధిపత్యం. చాల కొద్దిమంది మాత్రమే మహిళలు ఈ రంగంలో పేరు సంపాదించారు. వారిలో అనిల ఒకరు. వీడియో గేమింగ్ రంగంలో తన ప్రయాణం, అనుభవాలు, సవాళ్లు... అదే ఈ స్టోరీ

అనీలా ఆండ్రేడ్, 99 గేమ్స్ ప్రొడ్యూసర్

అనీలా ఆండ్రేడ్, 99 గేమ్స్ ప్రొడ్యూసర్


మస్కట్ నుంచి మంగళూర్

అనిల ఆండ్రేడ్... మస్కట్‌లో జన్మించారు. ఆమె తల్లి టీచర్, తండ్రి అకౌంటెంట్. కుటుంబంలోని నలుగురు పిల్లల్లో ఆమె రెండో సంతానం. ఇద్దరు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముుడు ఉన్నారామెకు. తండ్రి మస్కట్‌లో ఉద్యోగం చేస్తుండగానే... పిల్లల కోసం మంగళూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు అనిల తల్లి. ప్రాథమిక, హైస్కూల్ విద్యాభ్యాసం మంగళూర్‌లో పూర్తి చేసిన అనిల... మణిపాల్ ఎంఐటీ నుంచి ఇంజినీరింగ్, ఇక్ఫాయ్ ద్వారా ఎంబీఏ పూర్తి చేశారు.

“ నా తల్లి ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు. ప్రతీ ఒక్కరూ సొంతకాళ్లపై నిలబడాలని చెప్పేవారు. అభివృద్ధి కోసం ఎవరికివారు కష్టపడాలని బోధించేవారు. తానే సొంతగా స్పీచ్‌లు తయారు చేసిమరీ... పబ్లిక్‌లో మాట్లాడ్డాన్ని ప్రోత్సహించేవారు. మేం ఆ ప్రసంగపాఠాలను ముందుగానే చదువుకుని... ఎంతో కాన్ఫిడెంట్‌గా స్టేజ్‌పై మాట్లాడగలిగేవారం. నా జీవితంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషించిందని భావిస్తాను. నేనెప్పుడూ స్టేజ్ ఫియర్‌ను ఫేస్ చేయలేదు. చిన్నప్పటి నుంచే నలుగురిలో మాట్లాడ్డానికి ఇబ్బంది పడలేదు”- అనిల

చిన్నప్పటి నుంచే అనిల ఆల్ రౌండర్‌గా పేరు సంపాదించుకున్నారు. విద్యపై ఆమెకు అమితమైన ఆసక్తి ఉండేది. పోటీ పరీక్షల్లోనూ ఆమె మెరిట్ సాధించేది. అంతే కాదు అన్ని రకాల యాక్టివిటీస్‌లోనూ ప్రతిభ ప్రదర్శించడం ఆమె స్పెషాలిటీ. వయొలిన్, క్లారినెట్ వాయించడంలోనూ దిట్ట. స్కూల్, కాలేజ్ ఆర్కెస్ట్రా బ్యాండ్‌లోనూ పని చేశారు. మణిపాల్ యూనివర్సిటీలో వాలీబాల్, త్రోబాల్ ఆడేవారు అనిల.

రోబోసాఫ్ట్ టు 99గేమ్స్

తొలి ఉద్యోగంగా రోబోసాఫ్ట్ టెక్నాలజీస్‌లో జాయిన్ కావడం అదృష్టమే అని ఒప్పుకుంటారు అనిల. క్యాంపస్‌లో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టులో పాల్గొనకపోయినా... అదృష్టం కొద్దీ రాత పరీక్షకు అవకాశం లభించింది. “ఆ పరీక్షను 70మంది రాస్తే... షార్ట్ లిస్ట్ చేశాక ఆరుగురిలో నేనూ ఒకరు”అని చెప్పారు అనిల. రోబోసాఫ్ట్ సీఈఓ రోహిత్ భట్... ఆమెను ప్రతిభావంతురాలిగా గుర్తించి అవకాశమిచ్చారు. ఎక్సెల్‌లో ఎన్నో అవకాశాలు కల్పించారామెకు. “2008లో యాప్ స్టోర్ ప్రారంభమైంది. దీంతో మొబైల్స్ కోసం గేమ్స్ రూపొందించే టైం ఇదేనని భావించారు రోహిత్. దీంతో కొత్త కంపెనీ 99గేమ్స్‌లో ప్రొడ్యూసర్ బాధ్యతలు చేపట్టాను. ఇది రోబోసాఫ్ట్ టెక్నాలజీస్‌కి అనుబంధ సంస్థ. ఇప్పటికి నేనిక్కడ చేరి 11 ఏళ్లు పూర్తయింది.” - అనిల

గేమింగ్‌లో అడుగు పెట్టిన వేళ

రోబోసాఫ్ట్‌లో క్వాలిటీ కంట్రోల్ మేనేజర్‌గా ఉద్యోగం ప్రారంభించారు అనిల. రెండేళ్లలోనే అనలిస్ట్‌గా మారేందుకు అవసరమైన కోర్సులను పూర్తి చేశారు. దీంతో ఆమె పాత్ర గేమ్స్ డిజైనింగ్‌లోకి మారింది. “నేను కాన్సెప్ట్, డిజైన్ తయారు చేసి, బ్లూప్రింట్ రూపొందిస్తాను. ప్రోగ్రామింగ్ టీం దీన్ని అమలు చేస్తారు”అంటారు అనిల.

కొత్త ప్రోడక్ట్స్ తయారు చేయడానికి అనిల దగ్గర తగినంత టీం ఎప్పుడూ ఉంటుంది. ఆమె కార్యకలాపాలు ప్రారంభించిన తొలి గేమ్ వర్డ్స్‌వర్త్. ఐఫోన్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వర్డ్ పజిల్ గేమ్ ఇది. ఇది వర్డ్ గేమ్‌లలో రెండో స్థానం, మొత్తం అమెరికా వీడియోగేమ్స్‌లో 33వ స్థానం పొందడం విశేషం. ఆ తర్వాత మెల్లగా డిజైనర్ నుంచి ప్రొడ్యూసర్ స్థాయికి చేరుకున్నారు. ఈ రంగంలో ఇదే అద్భుతమైన రోల్ అంటూ మురిసిపోతారు.

గేమింగ్ ప్రపంచంలో మహిళలు

పాశ్యాత్య దేశాల్లో గేమింగ్ బాగానే అభివృద్ధి చెందినా... మన దేశంలో ఈ ట్రెండ్ లేటుగా మొదలైంది. 99గేమ్స్ ప్రారంభించేనాటికి ఇండియాలో ఉన్న గేమింగ్ కంపెనీల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఈ రంగంలో ఉన్నవారికి నిలకడతత్వం, వినూత్నమైన ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం, సరైన వనరుల ఎంపిక వంటివి సవాళ్లు.

image


ప్రస్తుతం కొన్ని కాలేజ్‌లు ఓ సబ్జెక్ట్‌గా గేమింగ్ ఎంచుకునే అవకాశమిస్తున్నాయి. అలాగే కొన్ని సంస్థలు గేమింగ్‌పై డిగ్రీ కోర్స్ భోధిస్తున్నాయి కూడా. “ ఈ రంగం చాలా వినూత్నమైనది. ఇందులో చాలా కొద్దిమంది మాత్రమే ఇమడగలరు. అలాంటి గేమింగ్ ఇండస్ట్రీలో మహిళలు చాలాకొద్ది మందే ఉన్నారు. 99గేమ్స్ సంస్థ మొత్తం 24. అందులో ఇద్దరు ప్రొడ్యూసర్లు కాగా.... ఇద్దరూ మహిళలే కావడం విశేషం.” అంటారు అనిల.

గేమింగ్‌లో ప్రొడ్యూసర్ పాత్ర చాలా ముఖ్యం. ఒకేసారి అనేక రకాలుగా ప్రవర్తించాల్సి వస్తుంది. డిజైనర్ విధులు మాత్రమే కాదు.. ఆ గేమ్‌ను అర్ధం చేసుకోగలగాలి. మంచి అనుసంధానకర్తగా మారాలి. పనుల సకాలంలో పూర్తయ్యేలా చూడాలి. మార్కెటింగ్‌పై గ్రిప్ ఉండాలి. టీంను నడిపించడగలిగే స్థాయి ఉండాలంటారు అనిల.

మైలురాళ్లు

కర్నాటకలోని ఉడిపి నుంచి గేమింగ్ కమ్యూనిటీకి ప్రతినిధిగా పలు జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్సులకు హాజరైన మహిళా స్పీకర్‌ అనిల మాత్రమే. మేథావులైనా సరే చాలా సింపుల్‌గా ఉండే టీంను లీడ్ చేయడం, ఓ గేమింగ్ సంస్థ స్టార్టప్ స్థాయి నుంచి విధులు నిర్వహించగలగడం, 2 కోట్లమందికి పైగా యూజర్లను ఆకట్టుకున్న గేమ్స్ తయారు చేయగలగడం... అనిల సాధించిన మైలురాళ్లలో కొన్నిగా చెప్పుకోవచ్చు.

ఎదుర్కోవాల్సిన సవాళ్లు

పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినపుడు... దాన్నో సవాల్‌గానే భావిస్తానంటారు అనిల. టెస్టింగ్, రిక్వైర్‌మెంట్, అనాలసిస్, ఫైనల్‌గా గేమింగ్.. అన్నిటినీ సవాల్ గానే స్వీకరించానని చెప్పారు. “ ఈ రంగాన్ని నేను ఓ అవకాశంగా భావించాను. దీనిలోకి వచ్చేశాను. ముందుగా ఇక్కడున్న అబ్బాయిలతో కలిసి పనిచేయాలి. అదే సమయంలో నేను వారికి ప్రమాదం కలిగించే వ్యక్తిని కాదని వారికి అర్ధమయ్యేలా చెప్పాలి. ముఖ్యంగా వారిలో కొందరికి నేను జూనియర్‌ని కూడా. లీడర్‌గా బాధ్యతలు నిర్వహించాల్సి రావడం మహిళలకు కొంత సవాల్ అనే చెప్పాలి. ఎన్నో అడ్డంకులు దాటాల్సి వస్తుంది. తీసుకునే నిర్ణయాలు వారిపై ప్రభావం చూపేవి కావడంతో... ముందుగా ఈగో హర్ట్ కాకుండా ప్రవర్తించాల్సి ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ కాన్ఫరెన్సుల్లో మాట్లాడాల్సి రావడం... ప్రతీసారీ సవాల్ అనే చెప్పాలి. మనం చెప్పేది అంతమందీ వినేలా చెప్పగలగాలి. అర్ధమయ్యేట్లుగా చూసుకోవాలి. మనకు ఎంత పరిజ్ఞానం ఉందో వారికి తెలియచెప్పాలి” అంటారు అనిల.

image


స్ఫూర్తిదాతలు

అనిలకు ప్రయాణలన్నా... వాటితో పరిచయాలన్నా చాలా ఇష్టం. ఏదైనా ఒంటరి ప్రయాణం చేయాల్సి వచ్చినా... తోటి ప్రయాణికులతో వెంటనే మాటలు కలిపేస్తారామె. పుస్తకాలు చదవడం ఆమెకు చాలా ఇష్టం. అలాగే రొమాంటిక్ కామెడీ మూవీస్ చూడ్డం, ఫ్రెండ్స్- ఫ్యామిలీతో టైం గడపడం నచ్చుతాయంటారు అనిల.

మరిస్సా మాయర్, షెరిల్ శాండ్‌బెర్గ్, జె.కె. రోలింగ్‌లు తనకు స్ఫూర్తి అంటారు అనిల. తనకు ఇంతటి ఇన్‌స్పిరేషన్‌కు ప్రధాన కారణం కుటుంబసభ్యులు, తన టీం నుంచి లభించిన మద్దతే అంటారు కూడా.

ఇతర మహిళలకు ఏం చెబ్తారంటే...

“గేమింగ్, మొబైల్.. మాంచి జంట. ఇదే అధ్భుతమైన పరిశ్రమ. ఈ రంగంలో మార్పులు చాలా వేగంగా ఉంటాయి. మీరు అంత వేగంగా స్పందించలేకపోతే... వెనకబడిపోవడం ఖాయం. తరచూ మార్పులకు గురవుతూ కూడా నిలకడగా ఉండడం సవాలే. నేను ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకనే విద్యార్ధినినే. ఆ తపన చాలా ముఖ్యం. నాలో ఉన్న పోటీ తత్వమే నన్ను నడిపిస్తోంది” అంటారు అనిల.

ప్రస్తుత కాలంలో మరికొంతమంది మహిళలు గేమింగ్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. డిజైనర్లు, ప్రోగ్రామర్లతోపాటు మార్కెటింగ్‌లోనూ సత్తా చాటుతున్నారు. ఇంతటి పురుషాధిక్య రంగంలో మహిళలు పెరగడం అభినందించదగ్గ విషయమే. గేమింగ్‌లోకి ప్రవేశించాలనే ఉత్సాహం ఉన్న మహిళలకు అనిల ఇలా సలహా ఇస్తున్నారు. “గేమింగ్ ఎప్పుడూ ఛాలెంజే. కానీ ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగం. ఇక్కడ అవకాశాలకు కొదువ లేదు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ సామర్ధ్యాన్ని, టాలెంట్‌ని, క్రియేటివిటీని అభివృద్ధికి బాటలుగా వేసుకోండి.”

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags