సంకలనాలు
Telugu

కొత్త పాలసీతో తెలంగాణలో టెక్స్ టైల్ రంగానికి మహర్దశ

team ys telugu
12th May 2017
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

టెక్స్ టైల్, అపారల్ పాలసీ 2017 సిద్ధం చేసింది తెలంగాణ సర్కారు. కొత్త పాలసీ ప్రకారం ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలను ఆకర్షించడంతో పాటు చేనేత కళాకారుల ఉత్పత్తులకు బెస్ట్ బ్రాండ్ వాల్యూ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 కొత్త టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటు, మరో 5 అంతర్జాతీయ, 50 డొమెస్టిక్ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధి, సిరిసిల్లలో టెక్స్ టైల్, అపారెల్ పార్క్ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.

టీఎస్ ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్న తెలంగాణ రాష్ట్రం.. ఇప్పుడు టెక్స్ టైల్ రంగంపై దృష్టి సారించింది. టెక్స్ టైల్ రంగం అభివృద్ధికి ఓ కొత్త విధానం రూపొందించి పెట్టుబడులను భారీగా ప్రోత్సహించేలా చర్యలు చేపట్టింది. దీనికి అనుగుణంగా తెలంగాణ టెక్స్ టైల్, అపారెల్ పాలసీ 2017 ను సిద్ధం చేసింది. దీని అమలు కోసం వివిధ స్థాయిల్లో కసరత్తు మొదలుపెట్టింది. టెక్స్ టైల్స్, అపారెల్ రంగాల్లోని ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలకు.. తెలంగాణను గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో ఈ విధానాన్ని తయారు చేసింది. స్పిన్నింగ్, వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంట్ రంగాల్లో పెట్టుబడులను విరివిగా ఆకర్షించేలా ఈ పాలసీ రూపకల్పన జరిగింది. 

image


ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీకి సాంకేతికతను జోడించడంతోపాటు, స్కిల్ డెవలప్మెంట్ కు ప్రాధాన్యత ఇచ్చి టెక్స్ టైల్ రంగంలో అదనపు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ నూతన పాలసీ ప్రధాన ఉద్దేశం. నేత కార్మికుల కష్టాలుతీర్చేందుకు చేపట్టాల్సిన చర్యలకు ఈసారి పెద్దపీట వేశారు. నేతన్నలకు తగిన ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు, చేనేత కళాకారుల ఉత్పత్తులకు ప్రపంచంలో బెస్ట్ బ్రాండ్ వాల్యూ కల్పించడం, మార్కెట్ అనుకూల వాతావరణం ఏర్పాటు చేయడం తదితర అంశాలు.. ఈ పాలసీకి హైలైట్ గా నిలవనున్నాయి. 

ఈ విధానం ద్వారా వచ్చే 5 ఏళ్లకు లక్ష్యాలు నిర్ధేశించనున్నారు. రాబోయే రోజుల్లో కొత్తగా 5 టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటు, కనీసం 5 అంతర్జాతీయ, 50 డొమెస్టిక్ కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్షించడం ఈ పాలసీ లక్ష్యం. అదనంగా మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఇందులో కనీసం 60శాతం మంది మహిళలే ఉండాలన్నది మరో టార్గెట్. ప్రతి చేనేత కార్మికుని నెలసరి వేతనం కనీసం 50 శాతం పెరగడంతో పాటు.. రాష్ట్రంలోని ప్రతి పవర్ లూమ్ ఆధునీకరించి, కార్మికుల ఆదాయం కనీసం 30% పెరిగేలా చేయాలన్నదే సర్కారు లక్ష్యం

రాష్ట్రంలో ఉత్పత్తయ్యే వస్త్రాల్లో కనీసం 20% ఎగుమతి చేయాలన్నది సర్కారు నిర్ణయించుకున్న మరో టార్గెట్. దీనికోసం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాట, ఇప్పటికే ఉన్న పరిశ్రమల ఆధునీకరణ, విస్తరణకు తగిన సహాయ సహకారాలు ప్రభుత్వం తరపున అందిస్తారు. పెట్టుబడి, నిర్వహణ, నైపుణ్య శిక్షణలాంటి సహకారాలు అందించడంతోపాటు మౌలిక వసతులను కూడా సమకూరుస్తారు. అవసరమైన ఆర్థికసాయం అందిచడంతో పాటు తగిన రాయితీలు కూడా ఇవ్వనున్నారు. 

పరిశ్రమలకు అవసరమైన భూమిని టీఎస్ ఐఐసీ ద్వారా సిద్ధం చేయడంతో పాటు, వ్యర్థాల నిర్వహణ, పరిశోధనా అభివృద్ధికి ఉమ్మడిగా సౌకర్యాలు కల్పిస్తారు. టెక్స్ టైల్ పార్కుల్లోనే కార్మికులు, సిబ్బందికి అవసరమైన నివాసం కోసం భూములను కూడా కేటాయిస్తారు. 

కొత్త విధానంలో భాగంగా కార్మికులకు శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారిస్తారు. సంస్థల్లో పనిచేసే వాళ్లకు శిక్షణ ఇస్తే ప్రభుత్వం నుంచి ఒక్కో ఉద్యోగికి 3,000 రూపాయల చొప్పున శిక్షణా రాయితీగా ఇస్తారు. శిక్షణ పొందిన ఉద్యోగి కనీసం ఏడాది పాటు సంబంధిత సంస్థలోనే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. బట్టల డిజైన్, అభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు 75% వరకు లేదా గరిష్టంగా కోటి రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. 

ప్రస్తుత, కొత్తసంస్థల శిక్షణకు 50%.. అంటే గరిష్టంగా 20 లక్షల వరకు పెట్టుబడికి సాయం చేస్తారు. కొత్త వాళ్లకు వస్త్ర రంగంలో 45 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. దీనికోసం ఒక్కొక్కరిపైనా 7,500 రూపాయల వరకు ఖర్చు చేస్తారు. వీళ్ళు కూడా కనీసం ఏడాది పాటు సంబంధిత సంస్థలోనే పనిచేయాల్సి ఉంటుంది. 

రోజురోజుకూ పేదరికం బారిన పడుతున్న నేత కార్మికులకు కొత్త విధానం ద్వారా భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చేనేత వస్త్రాల డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ, డిప్లమో కోర్సులతో ఓ చేనేత శిక్షణా సంస్థ ఏర్పాటు చేస్తారు. చేనేత కార్మికులకు పావలా వడ్డీ రుణాలు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10% తోపాటు నూలుపై అదనంగా 40% రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కెమికల్స్, కలర్ డై లపై కూడా ఇదే తరహా రాయితీ అందుతుంది. చేనేత వ్యక్తిగత రుణాలకు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తారు. 2017 మార్చి నెలాఖరు గడువుగా రుణాలు మాఫీ చేసే ఆలోచనలో సర్కార్ ఉంది. 

కొత్త పాలసీ ప్రకారం చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. పవర్ లూమ్ ల ఆధునీకరణకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లకు సంబంధించి నూలుపై 20% రాయితీ ఇస్తారు. 27 హెచ్ పీల వరకు పవర్ లూమ్ లకు విద్యుత్ రాయితీ ఇస్తారు. ప్రభుత్వానికి, ప్రభుత్వ అవసరాల కోసం అవసరమైన వస్త్రాలను పవర్ లూమ్ ల నుంచి కొనుగోలు చేస్తారు. పవర్ లూమ్ లలో పనిచేసే కార్మికులకు స్కిల్ డెవలప్ మెంట్, ఇతర శిక్షణా కార్యక్రమాలు చేపడతారు.

చేనేత బ్రాండ్ అంబాసిడర్లుగా పలురంగాలకు చెందిన ప్రముఖుల సేవలు వినియోగించుకుంటారు. చేనేత దుస్తులకు ప్రపంచస్థాయిలో ఓ గుర్తింపు తీసుకురావడం సహా ఫ్యాషన్ డిజైనర్లు, సంస్థల సహకారంతో చేనేతలో కొత్తకొత్త నమూనాలు తీసుకురావడంపై దృష్టి సారిస్తారు. చేనేత వస్త్రాలు విక్రయించేలా ప్రముఖ రిటైల్ దుకాణాలతో అవగాహన కుదుర్చుకుంటారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ షోరూలంను అత్యాధునిక బొటిక్ లుగా తీర్చిదిద్దుతారు. మంచి ఆన్ లైన్ విక్రయ విధానాలతో పాటు తరచూ వ్యాపార ప్రదర్శనలు, చేనేత మేళాలు, ఫ్యాషన్ షోల నిర్వహణ చేపడతారు. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది పెద్దఎత్తున చేనేత వస్త్రాలు ఉపయోగించేలా చర్యలు తీసుకుంటారు. 

వలస వెళ్లిన చేనేత కార్మికులు రాష్ట్రానికి తిరిగి వస్తే వాళ్లకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడంతో పాటు ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో వరంగల్ లో తలపెట్టిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ మొదటి దశను 1250 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారు. సిరిసిల్లలో వంద ఎకరాల విస్తీర్ణంలో టెక్స్ టైల్, అపారెల్ పార్క్ అభివృద్ధి చేస్తారు. ప్రైవేట్ టెక్స్ టైల్ పార్క్ ల ఏర్పాటును సైతం రాయితీలు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహించే ఆలోచనలో ఉంది. మొత్తానికి కొత్త పాలసీతో రాష్ట్రంలో టెక్స్ టైల్ రంగానికి మహర్దశ పట్టనుంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags