సంకలనాలు
Telugu

ప్లాస్టిక్‌ బ్యాగులపై పోరాటం నుంచి పుట్టిన స్టార్టప్

Nagendra sai
4th Sep 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ఓ 24 ఏళ్ల యువకుడు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చాడు. బాధ్యతల బరువు పెద్దగా లేదు. బికాం పూర్తైంది. అయితే అందరిలానే 9 టు 5 జాబ్ చేయడం అతడికి ఇష్టంలేదు. మనం చేస్తే.. ఏదైనా సమాజానికి ప్రయోజనం ఉండాలి.. మనకు ఓ మంచి గుర్తింపు రావాలనే తలంపు. చివరకు ప్లాస్టిక్ బ్యాగ్స్‌పై సమర భేరి మోగించాడు. వాటి ఉపయోగాన్ని తగ్గించేందుకు క్లాత్ బ్యాగ్స్ ఒక్కటే పరిష్కారం అనుకున్నాడు. సోషల్ ఆంట్రప్రెన్యూర్‌గా మారి.. నలుగురికి ఉపాధిని కల్పిస్తూ.. పర్యావరణానికి తన చేతనైనంత సాయం చేస్తున్నాడు. ఆ కుర్రాడే శశికాంత్ కాజా.

శశికాంత్ కాజా, రీవీల్ ఫౌండర్

శశికాంత్ కాజా, రీవీల్ ఫౌండర్


మంచి చదువు చదివి.. కార్పొరేట్ ఫీల్డ్ వైపు దూసుకుపోకుండా ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే.. తనో స్టోరీ చెప్తాడు. డిగ్రీ పూర్తైన తర్వాత కొద్దికాలం తీసుకున్న గ్యాప్‌లో జూ పోలిసింగ్ వాలంటీర్‌గా పనిచేశాడు శశి. జూ, అడవుల్లో చెత్తను పారేయొద్దని చెప్పడం, జంతువులను రెచ్చగొట్టడం లాంటివి చేయొద్దని చెప్పడం వీళ్ల లక్ష్యం.

ఇలా ఓ సందర్భంలో శ్రీశైలం అడవులకు టీం అంతా కలిసి వెళ్లింది. రోడ్డు మీది నుంచి దాదాపు యాభై కిలోమీటర్ల లోపలికి వీళ్లంతా వెళ్లారు. అంతరించిపోతున్న జీవులు, వన్యమృగాలు తిరగాడే ప్రాంతాలకు చేరుకున్నారు. ఆశ్చర్యకరంగా అంత లోపలికి కూడా...ప్లాస్టిక్ కవర్లు.. కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. వీటి వల్ల అగ్నిప్రమాదాలతోపాటు జంతువులకు కూడా ఇబ్బంది అని విషయాన్ని గమనించాడు. అప్పుడే ఓ బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్లాస్టిక్‌గా పోరాటాన్ని చేయాలని.

ఏం చేయాలి.. ఎలా చేయాలి ?

సరే నిర్ణయమైతే తీసుకున్నాడు కానీ ఏం చేయాలో.. ఎలా చేయాలో తెలీదు. వయస్సు చూస్తే.. పాతిక కూడా లేదు. ఎవరికైనా ఆలోచన చెబితే.. అంతా వినేవాళ్లే కానీ రెస్పాన్స్ మాత్రం ఆ స్థాయిలో ఉండేది కాదు. ప్లాస్టిక్ వాడొద్దని చెబితే.. వినే పరిస్థితుల్లో జనాలు లేరు. ఎందుకంటే ప్రత్యామ్నాయాన్ని చూపించాల్సిన అవసరం ఉందని నిర్ణయించుకున్నాడు. అప్పుడే క్లాత్ బ్యాగ్స్ ఆలోచన తట్టింది. బట్ట సంచీలను తయారు చేస్తే కొద్దిగానైనా ప్రయోజనం ఉంటుందని అనిపించింది.

వెంటనే చార్మినార్ వెళ్లిపోయాడు. ఎవరో చెబితే కోరా కాటన్ బాగుంటుందని విన్నాడు. తీరా దాని గురించి వాకబు చేస్తే.. వందల రకాలున్నాయని అర్థమైంది. నాణ్యత ఎలా ఉందో తెలీదు.. సరిగ్గా చెప్పే వాడు లేడు. కొంత క్లాత్ తీసుకుని.. కొన్ని ట్రయల్స్ చేయించాడు. నాణ్యతగా అనిపించలేదు. ఓ సారి క్లాత్ పరిశీలిస్తుండగా.. బుర్లాపూర్, మధ్యప్రదేశ్ అనే పదం కనిపించింది. అంతే రైలెక్కి అక్కడికి వెళ్లిపోయారు. చేతిలో కొంతే డబ్బు. అది కూడా నాన్న ఇచ్చింది. హోటల్ రూములకే సరిపోయింది. కావాల్సిన క్లాత్ మాత్రం దొరకడం లేదు. నిరాశ.. నిస్పృహ. చేతిలో డబ్బు అయిపోతోంది. రెండు రోజులైంది అప్పటికే.

అనుకోకుండా టెక్స్‌టైల్ రంగంలో అనుభవం ఉన్న ఓ వ్యక్తి కనిపించి తమిళనాడులోని ఈరోడ్‌ సరైన స్థలమని సూచించాడు. ప్రాణం లేచివచ్చినట్టు అయింది. నేరుగా అక్కడికి వెళ్లిపోయాడు. వారం రోజులు ఉండి.. పది మంది వ్యాపారస్తులతో మాట్లాడి.. బట్ట నాణ్యత గురించి తెలుసుకుని, తన ప్రాజెక్టును వివరించి మాట్లాడి వచ్చాడు. అక్కడే ''రీవీల్'' సంస్థకు బీజం పడింది. ఇక్కడి వచ్చి కొంత మంది టైలర్లతో మాట్లాడి వాటిని కుట్టించి బ్యాగులు సిద్ధం చేశాడు. ఇదంతా జరిగింది 2013 సంవత్సరం.. జూన్, జూలైలలో.

image


అన్‌లిమిటెడ్ ప్రోత్సాహం

సామాజిక బాధ్యత, ఆలోచనను గుర్తించిన అన్‌లిమిటెడ్ హైదరాబాద్ శశికాంత్‌ రీవీల్‌కు మెంటార్‌గా వ్యవహరించింది. మార్కెట్, మార్కెటింగ్.. సహా అనేక విషయాలపై అవగాహన కల్పించి రూ.80వేలు గ్రాంట్‌గా ఇచ్చింది.

ఆలోచన బాగుంది.. ఆచరణ ఎలా ?

సాధారణంగా ఉద్యోగుల్లో 70 శాతం మంది ఇంటికి వెళ్లే ముందు కూరగాయలో, సరుకులో కొనుగోలు చేసి వెళ్తుంటారు. వీరిలో అధిక శాతం మంది ఎలాంటి సంచీ లేకుండానే వెళ్తారు. ఇక్కడే ప్లాస్టిక్ వినియోగం కూడా అధికంగా ఉంటుంది. అందుకే మొదట ఐటి కంపెనీలతో మాట్లాడి.. అక్కడ కొన్ని బ్యాగ్స్ డిస్‌ప్లే చేయడమో.. లేక కొన్నింటిని అమ్మడమో, ఉచితంగా ఇవ్వడమో మొదలుపెట్టాడు శశికాంత్. కొన్ని ఐటి సంస్థల నుంచి ప్రోత్సాహకరమైన మద్దతే లభించింది.

సూపర్ మార్కెట్లు, గేటెడ్ కమ్యూనిటీలతో మాట్లాడి ప్లాస్టిక్ బ్యాగుల బదులు ఈ క్లాత్ బ్యాగ్స్ ఇస్తే బాగుంటుందని సూచించాడు. షాపుల వాళ్లు ఫ్రీగా ఇలాంటి బ్యాగ్స్ కస్టమర్స్‌కు ఇవ్వడం వల్ల ఓ గేటెడ్ కమ్యూనిటిలో నెలకు 400 ప్లాస్టిక్ కవర్స్ తక్కువగా వాడినట్టు గుర్తించి తెగ మురిసిపోయాడు.

మెల్లిగా అలాంటి క్యాంపెయిన్ చేపట్టి... ఎక్కువ మందికి క్లాత్ బ్యాగ్స్‌ను సరఫరా చేయాలని చూస్తున్నాడు.

బట్ట బ్యాగులు కుడ్తున్న మహిళా ఉధ్యోగి

బట్ట బ్యాగులు కుడ్తున్న మహిళా ఉధ్యోగి


రెవెన్యూ మోడల్ ఉందా ?

బొల్లారంలో ఓ చిన్న యూనిట్ ఇందుకోసం ఏర్పాటైంది. అక్కడ నలుగురు మహిళా ఉద్యోగులు కుట్టుపని చేస్తూ బ్యాగులు తయారు చేస్తారు. ఒక్కో బ్యాగ్‌ను రిటైల్ మార్కెట్లో అయితే రూ.30 చొప్పున అమ్ముతున్నారు. బల్క్‌గా తీసుకునే వాళ్లకు, కంపెనీలకు 20 శాతం తక్కువకు ప్రొడక్ట్ అమ్ముతోంది రీవీల్.

పాతికేళ్లు కూడా నిండకుండానే నాలుగైదు కుటుంబాలకు పనికల్పించడం అనేది కూడా చాలా ఉత్సాహభరితంగా ఉందనేది అతడి మాట.

'' అక్కడి బస్తీల్లో ఉండేవాళ్లు, గతంలో ఎప్పుడు పనిచేయని వాళ్లను తీసుకున్నాం. ఇప్పుడు వాళ్లకు నెలకు మూడు, నాలుగు వేల వరకూ వస్తోంది. వాళ్ల పిల్లలను మంచి స్కూళ్లకు పంపడం, చేతిలో నాలుగు డబ్బులు మిగలడం చూస్తున్నామని వర్కర్స్ చెప్పినప్పుడు ఆ ఆనందం మాటల్లో వర్ణించలేం '' అంటారు శశికాంత్.

అంత ఈజీగా సాగిపోతోందా ?

ఏడాది, ఏడాదిన్నర కాలంలోనే అనేక అనుభవాలను సంపాదించాడు శశికాంత్. ఒక్కోసారి విపరీతమైన ఆర్డర్లు వచ్చిపడితే.. మూడు, నాలుగు నెలలపాటు ఒక్య బ్యాగ్ కూడా అమ్ముడుపోని స్థితిని ఎదుర్కొన్నాడు. సిఏ పూర్తి చేసుకుని.. మంచి ఉద్యోగం చేసుకోకుండా.. ఎందుకొచ్చిన తిప్పలు అని పలుసార్లు లోలోపల మదనపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తుచేసుకుంటాడు. ఒకసారి వర్షాకాలంలో రూ.70 వేల విలువైన స్టాక్ మొత్తం తడిసి పాడైపోయింది. సంక్రాంతికి సెలవులు ఇచ్చి.. వచ్చి చూసుకునే లోపు.. సరుకు తడిపోయి.. ఎలుకలు తినేసిన స్టాక్ చూసి షాక్ అయినట్టు చెప్తారు శశి. అప్పటి నుంచి తయారైన బ్యాగులను నిల్వచేసేందుకు కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా డెవలప్ చేసుకున్నారు.

image


భవిష్యత్ ఏంటి ?

సాధ్యమైనంత వరకూ ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని తగ్గించేందుకు తన వంతు కృషి చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు శశికాంత్. ఎక్కువ మందికి తన ప్రాజెక్టు గురించి వివరిస్తూ... కార్పొరేట్ కంపెనీలు, సూపర్ మార్కెట్ల సాయం కోరాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి నెలకు 7 వేల బ్యాగుల వరకూ ఆర్డర్లు వస్తున్నాయి. దీన్ని మరింతగా పెంచాలనేదే మొదట లక్ష్యం. అయితే గతంతో పోలిస్తే.. కనీసం కొద్దిగానైనా జనాల్లో ప్లాస్టిక్ నష్టాలపై అవగాహన పెరగడం సంతోషమని చెప్తారు.

'' ఈ సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత నేను వ్యక్తిగతంగా చాలా మారాను. దూకుడుగా ఉన్న నాకు బాధ్యతను, ఆచితూచి అడుగులేసే గుణాన్ని రీవీల్ నేర్పింది. జీవితంలో ఇంతవరకూ ఏదైనా నేర్చుకున్నాను అంటే.. అది కేవలం రీవీల్ ఏర్పాటైన తర్వాత మాత్రమే ''
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags