మహిళల కష్టాలు తీర్చిన మహనీయుడు

మహిళల కష్టాలు తీర్చిన మహనీయుడు

Sunday August 14, 2016,

20 min Read

అరుణాచలం మురుగనాథమ్‌ ఒకప్పుడు ఈ పేరు వింటేనే చాలా మంది అసహ్యించుకున్నారు. పిచ్చివాడన్నాడు. సమాజం నుంచి వెలివేశారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగుతోంది. ఆయన చేసిన ఆవిష్కరణ గురించే చర్చ జరుగుతోంది. మహిళల నెలసరి ఇబ్బందులను దూరం చేసేందుకు ఆయన చేసిన ఓ ఆవిష్కరణ అద్భుతాలు సృష్టింస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది మహిళల జీవితం మార్చేసింది.

తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన మురగనాథమ్‌ తక్కువ ఖర్చుతో నాణ్యమైన శానిటరీ ప్యాడ్‌ తయారు చేసే అత్యంత చవకైన మిషన్‌ను తయారు చేసి ప్రపంచంలో సరికొత్త సామాజిక చైతన్యాన్ని తెచ్చారు. మురగనాథమ్‌ ఫ్యాక్టరీలో తయారవుతున్న శానిటరీ ప్యాడ్స్‌ను ఉపయోగిస్తున్న ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని కోట్లాది మంది మహిళలు అనేక ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకుంటున్నారు.

మరుగనాథన్‌ విజయ గాథ వెనుక ఎన్నో ఆసక్తికరమైన అంశాలు దాగి ఉన్నాయి. ఆయన జీవితంలో ఎదురైన ఒక్కో అనుభవం ఒక్కో పాఠం నేర్పింది. తన భార్య మనసు దోచేందుకు మురగనాథన్ చేసిన ప్రయత్నం, పడ్డ శ్రమ ఆయనను విజయ శిఖరాలకు చేర్పింది. అయితే మహిళలు బయటకు చెప్పుకోలేని బాధను అర్థం చేసుకుని పరిష్కారం చూపే ప్రయత్నంలో భార్య, తల్లి నుంచి దూరం కావాల్సి వచ్చింది. తన కలను నిజం చేసుకునే ప్రయత్నంలో సమాజం నుంచి ఎన్నో ఇబ్బందులు, స్నేహితుల ఎగతాళిని భరించాల్సి వచ్చింది. కొందరు ఆయనను పిచ్చివాళ్లంటే మరికొందరు వెర్రివాడన్నారు. గ్రామ పంచాయతీ అయితే ఏకంగా ఆయనను ఊరి నుంచి వెలివేసింది. ఇన్ని అవమానాలు, తిరస్కారాలు, బహిష్కరణ తర్వాత కూడా మురగనాథన్ ఓటమి అంగీకరించలేదు. మహిళలకు తక్కువ ధరకే నాణ్యమైన శానిటరీ ప్యాడ్స్ అందించే ప్రయత్నాన్ని కొనసాగించారు. కొన్నేళ్ల శ్రమ తర్వాత పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆయన సాధించిన విజయం సమాజంలో పెద్ద విప్లవమే తెచ్చింది. ఆ వెలుగులో మహిళల జీవితాల్లో వచ్చిన మార్పు మురగనాథమ్ ను ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుల సరసన నిలబెట్టింది.

వెంట నడిచే వారెవరూ లేరు. ఎవరూ సాయం చేయలేదు. సలహాలిచ్చేవారు కనిపించలేదంటే ఇక పెట్టుబడి పెట్టేవారి సంగతి దేవుడెరుగు. ఒక చిన్న వర్క్ షాప్ నే ఫ్యాక్టరీగా మార్చుకుని మెషీన్ తయారుచేసేందుకు మురగనాథమ్ ఒక్కడే కష్టపడ్డాడు. ధృడ సంకల్పం, సాధించాలన్న పట్టుదల, ఓటమిని అంగీకరించనితత్వం, కొత్తగా ఏదైనా చేయాలన్న తపన, విజయం సాధించాలన్న బలమైన కోరికే ఆయనను విజయానికి చేరువ చేశాయి. నిజానికి మురగనాథమ్ జీవితం ప్రయాణం, ఆయన ఆవిష్కరణ ఒక అద్భుత, అద్వితీయమైన కథను తలపిస్తుంది.

ఈ కథ తమిళనాడు కోయంబత్తూర్ పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని పాపనాయకన్ పుడూర్ అనే గ్రామంలో మొదలైంది. అరుణాచలం మురుగునాథమ్ పుట్టింది ఈ ఊరిలోనే. ఆయన తండ్రి అరుణాచలం చేనేత కార్మికుడు. తల్లి వనిత గృహిణి. చాలా పెద్ద కుటుంబం. మురగనాథన్ ముత్తాతకు 24మంది సంతానంకాగా.. తన తండ్రి తోడబుట్టిన వారు ఆరుగురున్నారు. వారిలో మురగనాథన్ తండ్రి మూడో వాడు. మురగనాథన్ అమ్మమ్మకు 23మంది సంతానం కాగా వారిలో అతని తల్లి వనిత నెంబరు నాలుగు.

మురగనాథమ్ ది ఉమ్మడి కుటుంబం. బంధువుల్లో చాలా మంది ఇంటి చుట్టుపక్కలే ఉండేవారు. మురగనాథమ్ తన తల్లిదండ్రుల తొలి సంతానం కాగా అతని తర్వాత వనితా అరుణాచలంకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు.

వనిత తొలిసారి గర్భవతి అయినప్పుడు అమ్మాయి పుట్టాలని కోరుకుందట. కానీ కొడుకు పుట్టాడు. తల్లిదండ్రులకు దైవ భక్తి ఎక్కువ కావడంతో తొలి సంతానానికి తమిళుల ఆరాధ్య దైం మురుగన్ పేరు పెట్టారు. మురగనాథమ్ ను అందరూ ప్రేమగా మురుగా అని పిలిచేవారు.

తొలి సంతానం అమ్మాయి కావాలనుకున్న వనితకు కొడుకు పుట్టడంతో ఆ అబ్బాయినే అమ్మాయిలా ముస్తాబు చేసి మురిసిపోయేదట.

“చిన్నప్పుడు అమ్మ నన్ను అమ్మాయిలా ముస్తాబుచేసేది. జుట్టు పెంచి జడలు వేసేది. అ మ్మఎంతో ప్రేమతో అందంగా ముస్తాబు చేసి స్కూల్ కు పంపితే నన్ను చూసి అంతా ఎగతాళి చేసేవారు. కొన్నాళ్ల తర్వాత అదంతా అలవాటైపోయింది.” మురగనాథమ్

మురుగనాథమ్ ను గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నాడు. అప్పట్లో స్కూల్ అంటే ఇప్పటిలా సెపరేట్ క్లాస్ రూంలు ఉండేవి కాదు. నేలపై కూర్చుని చదవుకోవాల్సి వచ్చేది. బోధనంతా తమిళంలో జరిగేది. ఆడుకునేందుకు పెద్ద గ్రౌండ్ ఉండేది. పచ్చని పైర్లు, పక్షుల కిలకిలరావాలతో కూడిన పల్లె వాతావరణంలో మురగనాథమ్ బాల్యం గడిచింది.

“నా చదువు నాలుగ్గోడల మధ్య సాగలేదు. అందమైన ప్రకృతి ఒడిలో పాఠాలు నేర్చుకున్నాను. చిన్నప్పుడు సీతాకోక చిలుకలు, పక్షులు, జంతువుల వెంట పరిగెత్తేవాణ్ని. చెట్లు ఎక్కేవాణ్ని. పొలాలు, మైదానాల్లో ఆడుకునేవాణ్ని. బాల్యంలో 90శాతం పాఠాలు ప్రకృతి నుంచే నేర్చుకున్నారు. కేవలం 10శాతం మాత్రమే టీచర్లు నేర్పారు.”-మురగనాథమ్.

మురుగనాథమ్ చెట్టియార్ కుటుంబంలో జన్మించాడు. అయినా మిగతా కులాల పిల్లలతో కలిసి పెరిగాడు. మేకలు కాసే వ్యక్తి ఒక్కడే రెండు మూడొందల మేకల్నిఎలా మేపుకొచ్చేవాడో తెలుసుకోవాలని మురుగాకు కుతూహలంగా ఉండేది. అందుకే మేకలు కాసే స్నేహితుడితో గంటల తరబడి గడిపేవాడు. ఫ్రెండ్స్ తో ఆడుకుని ఇంటికి వెళ్లగానే మురగనాథమ్ అమ్మ అతనిపై బిందెడు నీళ్లు కుమ్మరించేది. శుద్ధి చేసిన తర్వాతే ఇంట్లో అడుగుపెట్టనిచ్చేది.

మురగనాథమ్ కేవలం ఫ్రెండ్స్ తో తిరగడమే కాదు. తండ్రికి పనిలో సాయం చేసేవాడు. చిన్న తనంలోనే తన తండ్రి చేస్తున్న పని ఎంత క్లిష్టమైందో అతనికి అర్థమైంది. మురగనాథన్ తండ్రి అత్యద్భుతమైన కళాకారుడు. ప్రతి 15రోజులకు ఒకసారి ఆయన తాను నేసే చీరల డిజైన్ మార్చే వారు. తండ్రి ఒక్కడి సంపాదనపైనే కుటుంబం నడిచేది. అంతా సజావుగా సాగుతున్న సమయంలో మురగనాథమ్ కు తండ్రి దూరమయ్యాడు. రోడ్డు ప్రమాదంలో అరుణాచలం చనిపోయాడు. అప్పటికి మురగనాథన్ హై స్కూల్ లో ఉన్నాడు. తండ్రి మరణంలో కుటుంబ పోషణ భారం తల్లి వనితపై పడింది. ఆ రోజుల్లో తమిళనాడులోని గ్రామాల్లో మహిళలకు కేవలం పొలం పనులు మాత్రమే చేయించే వారు. దీంతో తల్లి పొలాల్లో పనిచేయడం మొదలు పెట్టింది. రోజంతా కష్టపడితే కేవలం 10-15 రూపాయలు వచ్చేవి. అయినా పిల్లల చదువుకు ఏ లోటు రాకుండా చూసుకునేది.

“అమ్మ నన్ను పోలీస్ ఆఫీసర్, పెద్ద చెల్లిని లాయర్, చిన్న చెల్లిని కలెక్టర్ చేయాలనుకునేది. అప్పట్లో అమ్మ తమిళ సినిమాలు బాగా చూసేది. ఆ ప్రభావంతోనే అలా కోరుకునేది. తమిళ సినిమాల్లో వైజయంతి మాల, హేమమాలిని, షావుకారు జానకి అద్భుతాలు చేసినట్లే తాను కూడా జీవితంలో అద్భుతం చేస్తానని అనుకునేది. కానీ సినిమాలకు నిజ జీవితానికి చాలా తేడా ఉంటందన్న విషయం ఆమెకు అర్థమయ్యేది కాదు.

కుటుంబ భారాన్ని మోసేందుకు తల్లి రాత్రిపగలనక పడుతున్న కష్టాన్ని చూసి మురగనాథమ్ కదిలిపోయాడు. పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. 14ఏళ్ల మురగనాథమ్ చదువుకు గుడ్ బై చెప్పి ఏదో ఒక పనిచేసి అమ్మకు ఆసరాగా నిలవాలనుకున్నాడు. అలా పదో తరగతి చదువును మధ్యలోనే వదిలేశాడు.

“ఓ వేప చెట్టు కింద కూర్చొని బాగా ఆలోచించి ఇక స్కూల్ కువెళ్లడం మానేయాలని నిర్ణయించుకున్నా. ఆ రోజు కూడా నేను నా ఫ్రెండ్ వెంట మేకల్ని మేపేందుకు వెళ్లాను. ఓ వేప చెట్టుకింద కూర్చున్నాం. అప్పుడు అమ్మ పడుతున్న కష్టం గుర్తొచ్చి ఏడుపొచ్చింది. అమ్మకు సాయం చేయాలన్న ఉద్దేశంతో చదువు మానేయాలని నిర్ణయించుకున్నా.”

చదువు మానేశాక మురగనాథమ్ చాలా చోట్ల పని చేశాడు. పటాకులు అమ్మాడు. గణేషుడి విగ్రహాలు విక్రయించాడు. కొన్ని రోజుల చెరుకు గడలు అమ్మాడు. కొన్నాళ్లకు ఇడ్లీలు అమ్మాడు. అయితే ఓ చిన్నవెల్డింగ్ వర్క్ షాప్ లో పనిచేస్తున్న సమయంలోనే అతని జీవితం మారిపోయింది. అక్కడ మిగతా వాళ్లకన్నా వయసులో చిన్నవాడు కావడంతో మొదట్లో సీనియర్లకు బీడీ సిగరెట్, చాయ్ తెచ్చిచ్చే పని అప్పజెప్పారు. ఆ తర్వాత పని నేర్చుకున్నాడు. అయితే షాపులో వెల్డింగ్ పనితోపాటు మురగనాథమ్ మరో పెద్ద పని చేయాల్సి వచ్చేది. వెల్డింగ్ షాప్ యజమాని తాగుబోతు. పీకల్దాక తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. అతన్ని క్షేమంగా ఇంటికి చేర్చాల్సిన పెద్ద పని కూడా మురగనాథమ్ చేయాల్సి వచ్చేది..

వర్క్ షాప్ ఓనర్ ఎంతగా తాగేవాడంటే తరుచూ తాగిన మైకంలో నాలాలో పడిపోయేవాడు. అతన్ని నాలాలోంచి బయటకు తీసి ఆ భారీకాయాన్ని భుజాలపై వేసుకుని ఇంటికి చేర్చాల్సివచ్చేది.

చాలా రోజులు ఈ పని చేశాక మురగనాథమ్ కు విరక్తి కలిగింది. దీంతోవర్కషాప్ ఓనర్ దగ్గరికెళ్లి పని మానేస్తున్నట్లు చెప్పాడు. ఆ మాటవినగానే ఓనర్ ఆశ్చర్యపోవడంతో పాటు ఆందోళన చెందాడు. మురగనాథమ్ పై ఉన్న అభిమానంతో ఎక్కడికీ వెళ్లొద్దని వర్క్ షాప్ బాధ్యతలు చూసుకోమని చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం మురగనాథమ్ వంతైంది. తాగిన మత్తులో ఈ మాట చెబుతున్నాడో లేక నిజంగానే అంటున్నాడో అర్థంకాలేదు. ఓనర్ నిజంగానే అంటున్నాడని అర్థమైంది. అయితే వర్క్ షాప్ ను కొనేందుకు అవసరమైన డబ్బుమురగనాథన్ దగ్గర లేదు. అదే విషయాన్ని ఓనర్ కు చెప్పాడు. దీంతో వర్క్ షాప్ యజమాని ఓ ఉపాయం చెప్పాడు. ఓనర్ ఫైనాన్స్ ఇచ్చే వారి దగ్గర డబ్బు తీసుకుని వర్క్ షాప్ నడిపేవాడు. మురగనాథన్ ను అలాగే ఫైనాన్స్ తీసుకుని వర్క్ షాప్ కొనుక్కోమని సలహా ఇచ్చాడు. అందుకు మురుగా అంగీకరించాడు. వర్కర్ నుంచి వర్క్ షాప్ ఓనర్ అయ్యాడు. ఓనర్్ అవడం కన్నా తాగుబోతు యజమాని బాధ తప్పడమే మురగనాథమ్ కు ఎక్కు సంతోషాన్నిచ్చింది.

వర్క షాప్ సొంతం కాగానే దాన్ని పూర్తిగా మార్చేశాడు. వర్క్ షాప్ కు ధనధాన్యాలు ప్రసాదించే లక్ష్మీ దేవి పేరు పెట్టాడు. జీవితంలో తొలిసారి వ్యాపారిగా మారాడు.

“అప్పుడు చాలా సంతోషం అనిపించింది. మొదటి నుంచీ రొటీన్ పని నచ్చేదికాదు. ఏదైనా కొత్తగా చేయాలనుకునేవాణ్ని. వర్క్ షాప్ కొనుగోలుచేయడంతో కొత్తగా ఏమైనా చేసే మంచి అవకాశం దక్కింది.”

మురగనాథమ్ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మిగతా వెల్డర్లలా కాకుండా ఇళ్లు, బిల్డింగులు, దుకాణాలకు ఉపయోగించే గ్రిల్స్, జాలీలను కొత్త కొత్త డిజైన్లలో తయారు చేయడం మొదలుపెట్టాడు.

“అప్పట్లో చాలా మంది వెల్డర్లు తాగిన మత్తులోనే పని చేసేవారు. మత్తులో ఉండి కూడా రెక్టాంగ్యులర్, స్క్వేర్, సర్కిల్, సెమీ సర్కిల్ ఆకారాల్లో డిజైన్లు తయారు చేయడం చాలా సులువు. చాలా మంది వెల్డర్లు కళ్లు మూసుకుని ఈ పని చేయగలిగే వారు. అయితే నేను వారిలా చేయలేదు. మా ఇంటి ముందు చెల్లెళ్లు వేసే ముగ్గుల్లాంటి డిజైన్లున్న గ్రిల్స్ కూడా తయారుచేశాను.”

వివిధ రకరకాల అందమైన డిజైన్ల గ్రిల్స్ తయారుచేస్తుండటంతో కొద్దికాలంలోనే మురగనాథమ్ కు మంచి పేరువచ్చింది. దూర ప్రాంతాల నుంచి కూడా జనం వెల్డింగ్ పనులు చేయించుకునేందుకు మురుగనాథమ్ వద్దకు వచ్చేవారు. పేరు ప్రఖ్యాతులతో పాటు సంపాదన పెరిగింది. వర్క్ షాప్ ఓనర్ కావడం, సంపాదన బాగానే ఉండటం, పెళ్లి ఈడు రావడంతో మురగనాథమ్ తల్లి అతని పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది. 1998లో శాంతితో మురగనాథమ్ పెళ్లి జరిగింది.

పెళ్లి తర్వాత మురగనాథమ్ జీవితం పూర్తిగా మారిపోయింది. మురగనాథమ్ లో చాలా మార్పులొచ్చాయి. పెళ్లైనప్పటి నుంచి భార్యను ఇంప్రెస్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. భార్యతో మాట్లాడేందుకు కూడా సమయం దొరికేది కాదు. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు మాత్రం కాస్త ఏకాంతం దొరికేది.

ఒకరోజు మురగనాథమ్ తన భార్య ఏదో వస్తువు దాస్తుండటం గమనించాడు. ఆ వస్తువును భర్త కంట పడకూడదనే ఉద్దేశంతో శాంతి తన వెనక దాచుకుంది. అదేంటో చూపించమని అడిగితే ఆమె కోపగించుకుంది. భార్య ప్రవర్తనతో అదేంటో తెలుసుకోవాలన్న ఉత్సుకత మురగనాథమ్ లో పెరిగింది. చివరకు అదేంటో తెలుసుకున్నాడు. రక్తంతో తడిసిన గుడ్డ ముక్కలవి. తొలుత అవేంటో అతనికి అర్థం కాలేదు. అయితే అప్పుడప్పుడు బాత్రూంలో తన చెల్లెళ్లు ఇలాంటి గుడ్డ ముక్కలు వదిలేసే విషయం గుర్తొచ్చింది. నెలసరి సమయంలో భార్య ఆ గుడ్డ ముక్కల్నేఉపయోగిస్తున్నదన్న విషయం మురగనాథమ్ కు అర్థమైంది. నెలసరి సమయంలో ఆమె ఇలాంటి మురికి బట్టల్ని ఉపయోగిస్తుండటం ఆయనకు బాధ కలిగించింది. భార్యపై ఉన్న ప్రేమతో ఆమెకు శుభ్రమైన బట్టల్ని ఉపయోగించమని సలహా ఇచ్చాడు.

“అప్పటికి ఆ ప్రొడక్ట్ పేరు ఏంటో కూడా తెలియదు. దాన్నిశానిటరీ ప్యాడ్ అంటారన్న విషయం అంతకన్నా తెలియదు. దాని గురించి ఏవో కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. అందుకే పేరు చెప్పకుండానే నా భార్యను వాటిని వాడమని సలహా ఇచ్చా.” మురగనాథమ్.

తన సలహా విని భార్య శాంత చెప్పిన విషయం విని మురగనాథమ్ ఆశ్చర్యపోయాడు. నేను, మీ చెల్లెళ్లు వాటిని వాడటం మొదలుపెడితే ఇంట్లో పాలకు డబ్బులు మిగలవన్న ఆమె మాటలు మురగనాథమ్ ను డైలమాలో పడేశాయి. నెలసరి సమయంలో వాడే ఆ వస్తువుకు పాలకు సంబంధం ఏంటో అతనికి అర్థంకాలేదు. అయినా ఆ వస్తువును తానే స్వయంగా కొని భార్యకు ఇస్తే సంతోషపడుతుందని అనుకున్నాడు. సైకిల్ పై ఏడు కిలోమీటర్లు ప్రయాణించి పట్నంలోని మెడికల్ షాప్ కువెళ్లాడు. షాపులో ఉన్న మహిళను ఆ వస్తువు ఇవ్వమన్నాడు. ఆమె ఆ వస్తువును ఇచ్చిన విధానం చూసి మురగనాథమ్ ఆశ్చర్యపోయాడు.

“మెడికల్ షాప్ లోని మహిళ ఆ వస్తువును న్యూస్ పేపర్ లోచుట్టి సిగ్గుపడుతూ చేతికిచ్చింది. ఆమె ఇచ్చిన విధానం చూస్తే బ్యాన్ చేసిన వస్తువో లేక స్మగుల్డ్ గూడ్స్ ఇచ్చినట్లు అనిపించింది.”

మెడికల్ షాప్ లోని మహిళ హావభావాలు మురగనాథమ్ లో ఆశ్చర్యాన్ని మరింత పెంచింది. సాధారణంగా ఇలాంటి వస్తువులు మహిళలే కొంటారు. ఒక మగాడు వచ్చి ఆ వస్తువు అడిగే సరికి ఆ మహిళ ఆశ్యర్యంతో పాటు ఆందోళన చెందిందన్నవిషయం అర్థమైంది. న్యూస్ పేపర్ లోచుట్టిన ఆ వస్తువును తీసి అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. శానిటరీ ప్యాడ్ చూసి మురుగనాథమ్ కు ఓ వింత అనుభూతి కలిగింది. మురగనాథమ్ శానిటరీ ప్యాడ్ ను విప్పి అదెలా తయారు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేశాడు.

తెల్లగా మెత్తగా ఉన్న ఆ వస్తువును చూసి అది దూది అనే విషయం అర్థమైంది. వెల్డింగ్ పని చేసే మురగనాథమ్ ఏ వస్తువునైనా చేతిలోకి తీసుకుని దాని బరువు అంచనా వేయగలిగేవాడు. శానిటరీప్యాడ్ ను చేతిలోకి తీసుకోగానే దాని బరువు 10 గ్రాములు ఉంటుందని అర్థమైంది. 1990లో 10గ్రాముల దూది 10పైసలకే దొరికేది. 10పైసల విలువ చేసే దూదిని ఆరు రూపాయలకు అమ్ముతున్నారన్న విషయం తెలిసి ఆశ్చర్యం కలిగింది. తాను కూడా వ్యాపారం చేస్తాడు కానీ ఒక వస్తువును ఇంత పెద్ద మార్జిన్ కు ఎప్పుడూ అమ్మలేదు.

శానిటరీ ప్యాడ్స్ చూశాక మురగనాథమ్ మనసులో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో ఆలోచనలు పుట్టుకొచ్చాయి. తానే స్వయంగా శానిటరీ ప్యాడ్ తయారుచేసి భార్యకు గిఫ్ట్ గా ఇ్వవాలన్న ఆలోచన వచ్చింది. ఇలా చేస్తే రెండు లాభాలు కలుగుతాయనుకున్నాడు. ఒకటి తన భార్య సంతోష పడుతుంది. రెండోది అత్యంత అవసరమైన వస్తువు చౌకగా దొరుకుతుంది.

ఈ ఆలోచనకు రూపం ఇచ్చేందుకు మురగనాథన్ మంచి క్వాలిటీ దూదికొన్నాడు. దాన్ని రెక్టాంగ్యులర్ షేప్ లో కట్ చేసి ప్యాడ్ తయారుచేశాడు. ఎనిమిది అంగుళాల పొడవున్న ఆ ప్యాడ్ ను తయారుచేసి మురగనాథన్ ఏదో సాధించానని సంతోషపడ్డాడు. గొప్ప విజయం సాధించానని రెండు రోజుల్లోనే చౌక శానిటరీ ప్యాడ్ తయారు చేశానని ఉప్పొంగిపోయాడు. తన భార్య శానిటరీ ప్యాడ్ ను చూసి సంతోషిస్తుందని మెచ్చుకుంటుందని అనుకున్నాడు. శానిటరీ ప్యాడ్ భార్యకిచ్చి దాన్ని వాడమని చెప్పాడు ఎలా ఉందో ఫీడ్ బ్యాక్ ఇవ్వమన్నాడు. ఒకట్రెండు రోజుల్లో ఫీడ్ బ్యాక్ వస్తుందని అనుకున్నాడు కానీ అలాజరగలేదు. రోజులు గడుస్తున్నా ఫీడ్ బ్యాక్ రాలేదు. సమయం గడిచే కొద్దీ మురగనాథమ్ లో కుతూహలంతో పాటు ఆత్రుత పెరిగింది. ఇక ఉండబట్టలేక భార్యను అడిగాడు. ఆమె ఫీడ్ బ్యాక్ కోసం ఇంకొన్నాళ్లు ఆగాలని చెప్పింది. భార్య మాటలతో నెలసరి అనేది ఎప్పుడు పడితే అప్పడురాదని మురగనాథమ్ కు తెలిసింది. తాను తయారుచేసిన శానిటరీ ప్యాడ్ గురించి భార్య ఇచ్చే ఫీడ్ బ్యాక్ కోసం ఎదురుచూడటం మురగనాథమ్ కు చాలా కష్టంగా అనిపించింది. ఏదో తెలియని కుతూహలం, ఆత్రుత. భార్య ఏం చెబుతుందో తెలుసుకోవాలన్న కోరిక పెరుగుతూ పోయింది. అదే సమయంలో ఊరిలో మిగతా మహళల గురించి తెలుసుకున్నాడు. చాలా మంది మహిళలు నెలసరి సమయంలో గుడ్డముక్కలు, ఇసుక, బూడిద, చెట్ల ఆకులను ఉపయోగిస్తారని తెలుసుకుని అతనికి షాక్ తగిలినంత పనైంది. నెలసరి సమయంలో ఈ వస్తువుల వాడకం వల్ల వారి ఆరోగ్యం పాడై రోగాల బారిన పడే ప్రమాదముందన్న విషయం మురుగాకు తెలుసు.

నెలసరి ఎప్పుడు వస్తుందో తెలుసుకునేందుకు మురగనాథమ్ చాలా మంది మహిళలు వచ్చే ఊరిలోని దేవత గుడికి వెళ్లడం మొదలుపెట్టాడు. ఓ శుక్రవారం రోజు చాలా మంది మహిళలు గుడి బయటే నిలబడటం మురగనాథమ్ గ్రహించాడు. నెలసరి సమయంలో మహిళలు గుడిలోకి వెళ్లరన్న విషయం ఆయనకు తెలుసు. ఆ తెలివితేటలతోనే శుక్రవారం రోజు నెలసరి వస్తుందన్న నిర్ణయానికొచ్చాడు. ఇదే విషయాన్ని భార్యతో చెప్పాడు. ఆ మాట విని ఆమె కోపంతో నెలసరి అనేది నెలకు ఒకసారి మాత్రమే వస్తుందని ఏదో ఒక శుక్రవారం చూసుకుని రాదని చెప్పింది.

ఆ తర్వాత మురగనాథమ్ నెలసరి గురించి ఒక్కో విషయం తెలుసుకోవడం మొదలుపెట్టాడు. కొత్త విషయాలు తెలుస్తున్న కొద్దీ అతనిలో ఉత్సాహం ఇంకా పెరిగింది. కొన్ని రోజుల తర్వాత తాను తయారు చేసిన శానిటరీ ప్యాడ్ గురించి భార్య ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఇచ్చింది. అది విని మురగనాథమ్ నిరాశ చెందాడు. తాను ఏదైతే ఊహించాడో అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది అది. శానిటరీ ప్యాడ్ చాలా దరిద్రంగా, డేంజరస్ గా ఉందని ప్యాడ్ కన్నా గుడ్డ ముక్కలే బెటర్ అని చెప్పింది. తాను ఇంకోసారి దాన్ని వాడనని తెగేసి చెప్పింది. ఈ మాటలతో మురగనాథమ్ కు పెద్ద షాక్ తగిలినట్లైంది. తాను చౌక శానిటరీ న్యాప్కిన్ తయారుచేశానని ఈ ఆవిష్కరణతో భార్య మనసులో ఎప్పటికీ రాజ్యమేలుతానని అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఈ షాక్ నుంచి తేరుకునేందుకు అతనికి కొంత సమయం పట్టింది. షాక్ నుంచి తేరుకోగానే ప్రయోగం కొనసాగించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.

మురగనాథమ్ ఈసారి కొత్తగా పని మొదలుపెట్టాడు. రకరకాల దూదిని వాడి ప్యాడ్స్ తయారు చేశాడు. కానీ వాటిని వాడి ఫీడ్ బ్యాక్ ఇచ్చే వాళ్లు ఎవరన్నది అతని ముందున్న పెద్ద ప్రశ్న. భార్య అప్పటికే తాను వాడనని తేల్చి చెప్పేసింది. వేరే మహిళల్ని ఎవరికైనా ప్యాడ్ లు ఇచ్చి వాడమని అడుగుదామా అంటే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఆయనకు బాగా తెలుసు.

బాగా ఆలోచించిన తర్వాత మురగనాథమ్ మరో ఆలోచన వచ్చింది. ప్రయోగంలో తన చెల్లెళ్ల సహకారం తీసుకోవాలనుకున్నాడు. ఎలాగోలా చెల్లెల్లిద్దరినీ ఒప్పించి మళ్లీ ప్రయోగం మొదలుపెట్టాడు. కానీ చెల్లెళ్లు కూడా ఆయనకు ఏ మాత్రం సాయం చేయలేకపోయారు. వాళ్లు మురగనాథమ్ తయారుచేసిన న్యాప్కిన్ లు అయితే వాడారు కానీ సిగ్గుతో ఫీడ్ బ్యాక్ ఇవ్వలేకపోయారు.

“ ఫీడ్ బ్యాక్ అడిగితే వాళ్లు చాలా సిగ్గుపడేవారు. నావైపు సూటిగా చూసేవాళ్లు కూడా కాదు. ఏమైనా చెప్పాలనుకుంటే గోడవైపు తిరిగి చెప్పేవారు. మణిరత్నం సినిమాల్లోని సీన్లలాగే కొన్ని నిమిషాల తర్వాత ఒకట్రెండు మాటలు మాట్లాడేవారు. ఆ రెండుమూడు మాటల్లో ఆ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుందన్న విషయం అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఇంట్లో ప్రతి గదిలో దేవీదేవతల పోస్టర్లుండేవి. వాళ్లిద్దరూ శివుడు, గణేషుడి లాంటి దేవుళ్ల పటాల ముందు నిలబడి నెలసరి గురించి మాట్లాడటం పెద్ద తప్పుగా భావించేవారు. నా ప్రయోగాలతో విసిగిపోయిన వాళ్లిద్దరూ చివరకు అమ్మకు చెప్పేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అమ్మకు తెలిసిపోతుందన్న భయంతో వారిపై ప్రయోగాలకు ఫుల్ స్టాప్ పెట్టాను.”

భార్య, చెల్లెళ్లు సహకరించేందుకు ససేమిరా అన్నా మురగనాథమ్ మాత్రం ప్రయోగాలు చేయడం మానుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చౌక ధరలో నాణ్యమైన స్వదేశీ శానిటరీ ప్యాడ్ తయారు చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ రోజుల్లో రెండు మల్టీ నేషనల్ కంపెనీలు తయారుచేసిన శానిటరీ ప్యాడ్లు మాత్రమే ఇండియాలో దొరికేవి. వాటి ధర ఎక్కువగా ఉంటుందన్న కారణంతో పేద మహిళలు వాటిని కొనేవారు కాదు. మురగనాథన్ ప్రయోగం విఫలమైందన్న బాధతో పాటు భార్యను ఇంప్రెస్ చేయలేకపోయానన్న బాధ వేధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శానిటరీ ప్యాడ్ తయారుచేయడమే లక్ష్యంగా పెట్టుకున్న మురగనాథన్ అలాచేయకపోతే భార్య దృష్టిలో తాను పిచ్చివాడ్ని, చేతగానివాడినన్న ముద్రపడిపోతుందని అనుకున్నాడు.

అలా ఆలోచనల్లో మునిగిపోయిన మురుగనాథమ్ కు మెడికల్ కాలేజ్ అమ్మాయిలు ఆశాకిరణంలా కనిపించారు. మెడికల్ కాలేజ్ అమ్మాయిలు మానవ శరీర నిర్మాణం, దాని ధర్మాల గురించిన విషయాలు మాట్లాడేందుకు ఏ మాత్రం సిగ్గుపడరన్న ఆలోచనతో కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ అమ్మాయిలను కలిశాడు. శానిటరీ ప్యాడ్ ప్రయోగంలో భాగస్వాములు కావాలని కోరాడు. అయితే శానిటరీ ప్యాడ్ ల మాట వినగానే అమ్మాయిలంతా సిగ్గుతో అక్కడి నుంచి పారిపోయారు.

“మెడికల్ కాలేజ్ అమ్మాయిల కన్నా నిరక్షరాస్యులైన అమ్మాయిలే నయం అనిపించింది. వాళ్ల స్పందన నిరాశ కలిగింది. వాళ్ల బాగు కోసమే ఇదంతా చేస్తున్నానన్న విషయం అమ్మాయిలు ఏ మాత్రం అర్థం చేసుకోలేదు.”

మురగనాథమ్ వ్యక్తిత్వం మొదటి నుంచి భిన్నంగా ఉండేది. ఆయన అంత తొందరగా ఓటమిని అంగీకరించేవాడు కాదు. మహిళలకు చౌకైన, మన్నికైన, ఆరోగ్యకరమైన శానిటరీ న్యాప్ కిన్ తయారు చేసే వరకు ప్రశాంతంగా కూర్చోనని మురగనాథమ్ నిర్ణయించుకున్నాడు.

శానిటరీ ప్యాడ్ తయారుచేయాలన్న పట్టుదల ఆయనలో ఎంత బలంగా ఉండేందంటే అందుకోసం చేయాల్సిందంతా చేశాడు. రాత్రిపగలన్న తేడాలేకుండా శానిటరీ ప్యాడ్ తయారీ గురించే ఆలోచించేవాడు. కొన్నాళ్లకు మళ్లీ మరో పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఈసారి తీసుకున్న నిర్ణయం గతంలో వాటికన్నా చాలా పెద్దది, భిన్నమైంది, వింతైనది కూడా. బహుశా గతంలో ఎవరికీ ఇలాంటి ఆలోచిన వచ్చి ఉండదు కూడా.

మురగనాథమ్ తాను తయారు చేసే శానిటరీ ప్యాడ్ లను తానే స్వయంగా ఉపయోగించి వాటి పనితీరు తెలుసుకోవాలనుకున్నాడు. కానీ ఇదేమంత తేలికైన వ్యవహారం కాదు. మగాడు కావడం వల్ల అతనికి నెలసరి రాదు. దీంతో ఓ ఉపాయం కనుక్కున్నాడు. ప్రయోగాలుచేసి కృత్రిమ గర్భాశయాన్ని తయారుచేశాడు. ఫుట్ బాల్ ట్యూబ్ బ్లాడర్ సాయంతో దాన్ని రూపొందించాడు. రక్త స్రావమయ్యేందుకు దానికి చిన్న రంధ్రాలు చేశాడు. అంతటితో ఆగకుండా మాంసం దుకాణం వ్యక్తితో మాట్లాడి మేకల రక్తాన్ని తీసుకుని దాన్ని ప్రయోగాలకు ఉపయోగించడం మొదలుపెట్టాడు. మేకను కోసే ముందు ఆ వ్యక్తి మురగనాథమ్ కు కబురుపంపేవాడు. ఆ సమయానికి మురగనాథమ్ వెళ్లి తాజా రక్తాన్ని సేకరించి ప్రయోగానికి ఉపయోగించుకునేవాడు. రక్తంతో నిండిన చిన్న రంథ్రాలున్నా ఫుట్ బాల్ బ్లాడర్ తో తయారుచేసిన కృత్రిమ గర్భాశయానికి తాను రూపొందించిన శానిటరీ ప్యాడ్లను తొగిడి ప్రయోగాలు చేసేవాడు. శానిటరీ ప్యాడ్ లు ధరించి నెమ్మదిగా నడవడం, పరిగెత్తడం చేసేవాడు. ప్యాడ్ వేసుకుని సైకిల్ తొక్కుతూ రకరకాల ప్రయోగాలు చేశాడు.

మురగనాథన్ ఇలా చేస్తూ తాను రూపొందించిన శానిటరీ ప్యాడ్ లు రక్తాన్ని పీల్చుకుంటాయో లేదో… పీల్చుకుంటే ఎంత సేపటి వరకు పీల్చుకుంటాయన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంచేశాడు. ఓ పది రోజుల వరకు మహిళలు పడే ఈ ఇబ్బందిని స్వయంగా అనుభవించాడు మురగనాథమ్. అయితే తాను చేసిన ప్రయోగం విజయవంతం కాకపోడంతో ఆయనకు చెప్పలేనంత బాధ కలిగింది. దూది రక్తాన్ని పీల్చుకునేది కాదు. కాసేపటికే ప్యాడ్ నుంచి దుర్వాసన చ్చేది. మురగనాథమ్ తొలుత కాస్త నిరాశ చెందినా ధైర్యం మాత్రం కోల్పోలేదు. ప్రతి సవాల్ ను స్వీకరించి ప్రయత్నాన్ని కొనసాగించాడు. మరోసారి మెడికల్ కాలేజ్ వైపు అడుగులేశాడు.

మురగనాథమ్ తన మిషన్ విజయవంతం చేసేందుకు కొత్త ఉపాయం కనుక్కున్నాడు. మెడికల్ కాలేజ్ అమ్మాయిలు వాడిన శానిటరీప్యాడ్ లను సేకరించడం మొదలుపెట్టాడు. ఉపయోగించిన బ్రాండెడ్ శానిటరీ ప్యాడ్స్ రక్తాన్ని ఎలా పీల్చుకుంటాయన్న విషయాన్ని గమనించాడు. తాను రూపొందించిన ప్యాడ్స్ ను బ్రాండెడ్ ప్యాడ్స్ తో పోల్చిచూశాడు. మెడికల్ కాలేజీల అమ్మాయిల్లో కొందరిని ఎంచుకుని వారికి శానిటరీ ప్యాడ్స్ తో పాటు ఫీడ్ బ్యాక్ ఫామ్ కూడా ఇచ్చాడు. ఈ ఉపాయం అమ్మాయిలకు కూడా నచ్చింది. కానీ ఫలితం అంత సంతృప్తికరంగా రాలేదు. ఫీడ్ బ్యాక్ ఫామ్స్ తీసుకునేందుకు వెళ్లిన మురగనాథమ్ కు చాలా మంది అమ్మాయిలు ఫామ్ లలో సరైన వివరాలు రాయలేదని అర్థమైంది. అమ్మాయిలిచ్చిన ఆ ఫీడ్ బ్యాక్ తో నిర్ణయానికి రావడం సరికాదని అనుకున్నాడు. మురగనాథమ్ ఈసారి కొత్త పద్దతిలో ఫీడ్ బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే ఊహించని ఘటన జరిగింది. మురగనాథమ్ పనులతో విసిగిపోయిన అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

“ఒకరోజు ఇంట్లో భోజనం చేస్తుండగా శాంతి వచ్చి ఓ విషయం చెప్పాలనుకుంటున్నానంది. చెప్పమన్నా. నేను మెడికల్ కాలేజీ అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నానని అంది. తాను ఏం చెప్పదల్చుకుందో అర్థమైంది. మెడికల్ కాలేజీ గేట్లు పాడైపోయాయని వాటి మరమ్మతుల కోసమే తాను అక్కడికి వెళ్తున్నానని చెప్పా. కానీ తను ఆ మాటల్ని నమ్మలేదు. వెక్కి వెక్కి ఏడ్చింది.”

ఈ ఘటన తర్వాత శాంతి పుట్టింటికి వెళ్లిపోయింది విడాకుల నోటీసు పంపింది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడం ఒక రకంగా మురగనాథన్ కు మంచే జరిగింది. ప్రయోగాలకు ఎక్కువ సమయం కేటాయించే అవకాశం దొరికింది. పని స్పీడందుకుంది. ఇదే సమయంలో విదేశీ కంపెనీలు ప్యాడ్ ల తయారీలో తాను ఉపయోగిస్తున్న దూదిని వాడటం లేదన్న విషయం మురగనాథమ్ కు అర్థమైంది.

అంతకు ముందు ఎన్నో ప్రయోగాలు చేసిన మురగనాథమ్ కు విదేశీ కంపెనీలు తాను ఉపయోగిస్తున్న దూదిని వాడటం లేదన్న విషయం మాత్రం అర్థం కాలేదు. ఈ విషయం తెలియగానే మురగనాథమ్ శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే కంపెనీలకు లేఖలు రాయడం మొదలుపెట్టాడు. ప్యాడ్స్ తయారీలో ఎలాంటి వస్తువుల్ని ఉపయోగిస్తున్నారని అడిగాడు. అయితే మురగనాథమ్ రాసిన లెటర్ లలో ఒక్కదానికి కూడా రిప్లై రాలేదు. ఎంతో శ్రమ, అధ్యయనం తర్వాత శానిటరీ ప్యాడ్స్ తయారీకి సెల్యూలోజ్ ఫైబర్ ఉపయోగిస్తారన్న విషయం తెలుసుకున్నాడు. మురగనాథమ్ మల్టీ నేషనల్ కంపెనీల శానిటరీ ప్యాడ్లను ఐఐటీల్లోని ల్యాబ్ లకు పంపి వాటిని ఏ వస్తువుతో తయారుచేస్తారో చెప్పమని కోరాడు. ఈసారి ఆయన ప్రశ్నకు సెల్యులోజ్ ఫైబర్ అనే జవాబు దొరికింది. సెల్యులోజ్ ఫైబర్ పైన్ బార్క్ వుడ్ పల్ప్ నుంచి తయారుచేస్తారని తెలిసింది.

సెల్యులోజ్ ఫైబర్ గురించి తెలియడంతో మురగనాథమ్ లో కొత్త ఉత్సహం వచ్చింది. ఆయనలో కొత్త ఆశ పుట్టింది. లక్ష్యాన్ని చేరుకున్నానన్న నమ్మకం కుదిరింది. అయితే ఇంతలోనే ఊహించని మరో ఘటన జరిగింది. దీంతో అతని తల్లి కూడా అతని నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత పరిస్థితులు ఎంత దారుణంగా మారాయంటే ప్రాణాలు కాపాడుకునేందుకు మురగనాథమ్ ఊరు వదిలి పారిపోవాల్సి వచ్చింది.

ఓ ఆదివారం రోజు మురగనాథమ్ మెడికల్ కాలేజ్ అమ్మాయిలు ఉపయోగించిన శానిటరీ ప్యాడ్ లను పరిశీలిస్తున్నాడు. చేతిలో కత్తి పక్కనే ఎర్ర రంగు. దూరం నుంచి చూసిన ఆయన తల్లి ఆదివారం కావడంతో కోడిని కోస్తున్నాడేమో అనుకుంది. దగ్గరి కెళ్లి చూశాక ఆమెకు అసలు విషయం అర్థమైంది. మురగనాథమ్ రక్తంతో తడిసిన శానిటరీ ప్యాడ్స్ తో ఉండటం చూసిన అతని తల్లికి తల తరిగినట్లైంది. తన కొడుకు ఏం చేస్తున్నాడో ఆమెకు అర్థంకాలేదు. మురుగాకు దెయ్యం పట్టిందేమోనని, ఎవరైనా మంత్రతంత్రాలు చేయించడంతో పిచ్చివాడైపోయాడేమోనని అనుకుంది. కొడుకుకు పిచ్చిపట్టిందని నిర్థారించుకుని అతన్నుంచి దూరంగా వెళ్లిపోయింది.

తల్లి ఇళ్లు వదిలి వెళ్లిపోవడంతో గ్రామస్థులు కూడా అతనికి శత్రువులుగా మారారు. వాళ్లందరికీ అప్పటికే మురగనాథమ్ పై చెప్పలేనంత కోపం ఉంది. వారంతా అదును కోసం చూస్తున్నారు. ఊరిలో చాలా మంది స్త్రీలతో మురగనాథమ్ కు అక్రమ సంబంధం ఉందన్నది వాళ్ల అనుమానం. చాలా సందర్భాల్లోమురగనాథన్ ఆడవాళ్ల వెంట వెళ్లడం వారితో మాట్లాడటం చూడటం వల్ల వారికి ఈ అనుమానం కలిగింది. మురగనాథమ్ మండుటెండలో చెరువు దగ్గర రక్తంతో తడిసిన బట్టల్ని శుభ్రం చేయడాన్ని చూసిన చాలా మంది అతనికి ఎవరో మహిళతో అక్రమ సంబంధం కారణంగా లైంగిక సంబంధ వ్యాధి వచ్చిందని అనుమానించారు. ఊరిలో చాలా మంది మగాళ్లకు మురగనాథమ్ చేసే పనులు తప్పుగా అనిపించేవి. ఈ అనుమానాలతో గ్రామస్థులు పంచాయితీ ఏర్పాటుచేశారు. ఊరిలో వాళ్లంతా కలిసిన మురగనాథమ్ కు దెయ్యం పట్టిందని నిర్దారించి ఆయనను ఇనుప గొలుసులతో బంధించి వేప చెట్టుకు తలకిందులుగా వేలాడదీయాలి.. అయినా భూతం వదలకపోతే మురగనాథమ్ ను గ్రామం నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. మురగనాథమ్ కు పంచాయితీ నిర్ణయం గురించి తెలిసింది. చేసేదేం లేక ఊరు వదిలి పారిపోయాడు.

“సుప్రీంకోర్టు నిర్ణయమైనా మారుతుందేమో కానీ. మా ఊరి ఖాప్ పంచాయతి నిర్ణయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మారదని తెలుసు. రాత్రికి రాత్రే ఊరి వదలి వెళ్లిపోయాను.”

ఈ ఘటన తర్వాత కూడా మురగనాథమ్ శానిటరీ ప్యాడ్ తయారు చేసే పనిని వదిలిపెట్టలేదు. విదేశీ కంపెనీలు ఏయే వస్తువులు ఉపయోగించి న్యాప్ కిన్లు తయారుచేస్తారో ఆయనకు తెలిసిపోయింది. దీంతో ఆయన తన దృష్టంతా శానిటరీ ప్యాడ్ లు తయారు చేసే మిషన్ తయారీపై కేంద్రీకరించాడు. ఈ ప్రయత్నంలో ఉన్న మురగనాథమ్ శానిటరీ ప్యాడ్ లు తయారు చేసే మిషన్ కనీస ధర మూడున్నర కోట్లు ఉంటుందని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఈ విషయం తెలిశాక ఆయన స్వయంగా శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే మిషన్ రూపొందించడమే లక్ష్యంగా మార్చుకున్నాడు.

ఆయన తీసుకున్న నిర్ణయం ఎంత పెద్దదో ఆ పని అంతకన్నా పెద్దది. అప్పటికి పరిస్థితులు కూడా ఏ మాత్రం అనుకూలంగా లేవు. అమ్మ, భార్య కుటుంబసభ్యులెరూ వెంట లేరు. తనకు తోడుగా ఉండి ప్రోత్సహించేవాళ్లు కనిపించలేదు. చిన్ననాటి స్నేహితులు కూడా తనను పిచ్చి వాడనుకున్నారు. కష్టకాలం వచ్చింది ఎటు చూసినా సవాళ్లే. అయినా ఓటమిని అంగీకరించకుండా లక్ష్యం వైపు సాగాడు.

పరిస్థితి అధ్వాహ్నంగా ఉంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. చిన్న గదిలో మరో ఐదుగురితో కలిసి ఉండాల్సి వచ్చేది. వాళ్లంతా హమాలీ పని చేసేవారు. రూంలో అందరూ ఉంటే సరిగా నిద్రపోయే అవకాశం కూడా ఉండేదికాదు. ఆ రూంలో సుఖంగా నిద్రపోయిన సందర్భం ఒక్కటి కూడా ఆయనకు గుర్తులేదు. గోడకు ఆనుకుని కునుకుతీయాల్సి రావడంతో వర్టిగో బారిన పడ్డాడు.

బాగా నడుస్తున్న వ్యాపారం, మంచి కుటుంబం, పుట్టిన ఊరు, బంధువులు… అంతా దూరమయ్యారు. అయినా బాధ పడకుండా హమాలీలతో కలిసి ఉంటూ శానిటరీ ప్యాడ్స్ రూపొందించే మిషన్ తయారుచేసే పని ప్రారంభించాడు. మెషీన్ తయారీకి అవసరమైన ఇనుము, ఇతర పరికరాల కోసం ఎంతో కష్టపడ్డాడు. వారంలో రెండు మూడురోజులు రాత్రి పగలన్న తేడాలేకుండా వెల్డింగ్ పని చేసేవాడు. వచ్చిన డబ్బు శానిటరీ ప్యాడ్ రుపొందించే మెషీన్ తయారీలో ఖర్చు చేసేవాడు. మురగనాథమ్ పనిలో ఎంత బిజీగా ఉండేవాడంటే కనీసం గడ్డం చేసుకునే తీరక కూడా దొరికేది కాదు. వెల్డింగ్ పని బాగా తెలియడంతో మెషీన్ తయారుచేస్తానన్న నమ్మకం ఉండేది. చివరకు ఆయన శ్రమ ఫలించింది. కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత చౌకైన నాణ్యమైన శానిటరీ ప్యాడ్ లతో పాటు వాటిని తయారు చేసే మెషీన్ తయారు చేయడంలో విజయం సాధించాడు. కేవలం 65 వేల రూపాయల్లోనే మెషీన్ తయారుచేసి చూపించాడు.

మురగనాథమ్ తన ప్రయోగాలకు ట్రయల్ అండ్ ఎర్రర్ పద్దతిని అనుసరించాను. మెషీన్ తయారు చేసి పనితీరు సరిగాలేకపోతే దాన్ని విరగ్గొట్టి కొత్త మెషీన్ తయారు చేసేవాణ్ని. ఇలా ఎన్నోసార్లు చేసిన తర్వాత విజయం వరించింది. ఐఐటీ మద్రాస్ మురగనాథమ్ జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. అక్కడ ఇన్నోవేషన్ ఫర్ బెటర్ మెంట్ ఆఫ్ సొసైటీ పేరుతో జరిగిన కాంపిటీషన్ లో ఆయన పాల్గొన్నారు. మురగనాథమ్ కథ విని ఆయన ఆవిష్కరణ గురించి తెలుసుకుని ఐఐటీ సైంటిస్టులతో మిగతా వారు చాలా ప్రభావితులయ్యారు. అయితే అక్కడ ఒక్క విషయం మాత్రం ఆయనకు బాధ కలిగించింది. చాలామంది ఇంగ్లీషులో ప్రశ్నలు అడగడంతో జవాబు తెలిసినా చెప్పలేకపోయాడు. అయినా ఆయన ప్రతిభ, ఆవిష్కరణకు వెలకట్టలేని ప్రశంసలు దక్కాయి. అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా మురగనాథమ్ ఇన్నోవేషన్ అవార్డ్ అందుకున్నాడు.

రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఈ మాట మురగనాథమ్ కు చిరాకు కలిగిస్తుంది. ఏ ప్రయోగమైనా ట్రయల్ అండ్ ఎర్రర్ విధానంతోనే విజయం సాధిస్తుందన్నది ఆయన మాట. ట్రయల్ అండ్ ఎర్రర్ అనే మాటకు భయపడిన కొందరే రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్అనే కొత్త పదాన్ని తెరపైకి తెచ్చారంటారాయన. ట్రయల్ అండ్ ఎర్రర్ విధానంలో మురగనాథమ్ సాధించిన విజయం సమాన్యమైనదేమీ కాదు. అదో చారిత్రక విజయం. ఆ విజయం తర్వాత మురగనాథమ్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ఇన్నోవేషన్ అవార్డ్ గెల్చుకోవడంతో మురగనాథమ్ పేరు ప్రపంచమంతటా తెలిసిపోయింది. మీడియాలో ఆయనపై ప్రత్యేక కథనాలు వచ్చాయి. మురగనాథమ్ విజయ ప్రస్థానాన్ని బీబీసీ, సీఎన్ ఎన్, అల్ జజీరా ఛానెల్ లు ప్రపంచానికంతటికీ చూపించాయి. మహిళల శానిటరీప్యాడ్స్ వాడిన మొట్టమొదటి మగాడని ఒకరంటే… మహిళోద్దారకుడు అని మరోకరు కితాబిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద అమ్మాయిలు, మహిళలకు సులువుగా, సరసమైన ధరల్లో శానిటరీ ప్యాడ్లు దొరకాలన్న ఉద్దేశంతో మురగనాథమ్ జయశ్రీ ఇండస్ట్రీస్ ఏర్పాటుచేశాడు. ఈ కంపెనీలో మురగనాథమ్ చౌక శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే మెషీన్ల తయారీ ప్రారంభించాడు.

మురగనాథమ్ స్వయంగా శానిటరీ ప్యాడ్స్ తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాత కూడా ఆయన ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన కోవై పేరుతో శానిటరీ ప్యాడ్స్ మార్కెట్ లోకి తెచ్చారు. అయితే సరైన మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ లేకపోవడంతో మార్కెట్ లో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయారు.

అప్పట్లో జనానికి చౌకైన శానిటరీ ప్యాడ్స్ పై నమ్మకంలేదు. తక్కువ రేటున్న వస్తువు క్వాలిటీ బాగుండదని అనుకునేవారు. వాస్తవానికి ఈ అభిప్రాయం తప్పు. ప్రొడక్ట్స్ అమ్ముడు పోకపోవడంతో మురగనాథమ్ నష్టాల పాలయ్యాడు. తన దగ్గరున్న సరుకంతా భార్యకు ఇచ్చేశాడు. ఇలా చేయడం కూడా ఆయనకు కలిసొచ్చింది.

మురగనాథమ్ తన దగ్గర మిగిలిపోయిన అన్ని శానిటరీ ప్యాడ్స్ ను భార్యకు ఇచ్చేయడంతో ఆమె వాటిని తన స్నేహితులు, చుట్టుపక్కల మహిళలకు అమ్మడం మొదలుపెట్టింది. మురగనాథమ్ ఇంట్లో లేనప్పుడు మహిళలు ఇంటికొచ్చి వాటిని తక్కు ధరకే కొనుక్కుని వెళ్లేవారు. ఈ విషయం తెలుసుకున్న మురగనాథమ్ కు కొత్త ఫార్ములా దొరికినట్లైంది. ఈ ఫార్ములా ఆధారంగానే మురగనాథమ్ మెషీన్లను కేవలం మహిళలకు మాత్రమే అమ్మాలని నిర్ణయించాడు. అలా చేస్తే బిజినెస్ డెవలప్ అవుతుందన్నది ఆయన ప్లాన్.

ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విశేషమేమిటంటే మురగనాథమ్ తన కంపెనీలో తయారుచేసిన మెషీన్లను మహిళల అభివృద్ధి కోసం పనిచేస్తున్న NGOలు, స్వయం సేవా సంఘాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు మాత్రమే విక్రయిస్తారు. ఈ మెషీన్ల సాయంతో బాగా సంపాదించి కోట్లు కూడబెట్టాలన్నది ఆయన ఉద్దేశం కాదు. వీలైనంత మంది మహిళలకు శానిటరీ ప్యాడ్స్ అందించాలన్నదే మురగనాథమ్ లక్ష్యం.

మురగనాథమ్ ఫ్యాక్టరీలో తయారవుతున్న మెషీన్ల కారణంగా దేశమంతటా చౌకైన శానిటరీ ప్యాడ్స్ తయారుచేసి విక్రయించడం పెరిగింది. మహిళలు, యువతులకు శానిటరీ ప్యాడ్స్ కొనుగోలుచేయడం సులువైపోయింది. మురగనాథమ్ రూపొందించిన ఈ న్యాప్ కిన్ల సాయంతో మహిళా ఆరోగ్య కార్యకర్తలు యువతులు, మహిళలకు నెలసరి విషయంలో జాగ్రత్తలు చెప్పడం సులభమైంది. ఈ శానిటరీ ప్యాడ్ల వాడకంతో చాలా మంది మహిళలు నెలసరి సమయంలో చ్చే రోగాలు, ఇతర ఇబ్బందుల నుంచి విముక్తి పొందుతున్నారు.

మురగనాథమ్ కృషి పట్టుదల, సంఘర్షణ ఫలితంగా భారతదేశంలో కొత్త విప్లవం వచ్చింది. మహిళలు, యువతులకు వెలకట్టలేని ప్రయోజనం చేకూరింది.. మురగనాథమ్ వల్ల విదేశాల్లోని పేద మహిళలకు లాభం చేకూర్చింది. ఆయన కారణంగా చాలా దేశాల్లో మహిళల జీవితాలు మారాయి. రోగాల బారినపడే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పేద యువతులు, మహిళలు శానిటరీ ప్యాడ్స్ కొని ఉపయోగించడం మొదలుపెట్టారు.

దేశంలోని 29రాష్ట్రాలు, 7కేంద్ర పాలిత ప్రాంతాల్లో మురగనాథమ్ ప్యాక్టరీలో తయారైన మెషీన్లతో శానిటరీ ప్యాడ్లు తయారుచేసి విక్రయిస్తున్నారు. మన దేశంతో పాటు మరో 19దేశాల్లోనూ మురగనాథమ్ మెషీన్లతో శానిటరీ ప్యాడ్లు అమ్ముతున్నారు. ఈ చారిత్రక విప్లవంతో మురగనాథమ్ ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే పేరున్న సామాజిక కార్యకర్తల్లో ఒకడిగా మారారు. మురగనాథమ్ ఇప్పుడు ఓ పెద్ద ఆవిష్కర్తే కాదు టాప్ బిజినెస్ మేన్, సమాజ సేవకుడు, మార్గదర్శకుడు.

పెద్ద పెద్ద విద్యాసంస్థలు తమ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు మురగనాథమ్ ను సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. ఐఐటీ, ఐఐఎంలకు వెళ్లి విద్యార్థులకు, భావి పారిశ్రామికవేత్తలకు ప్రేరణ నిస్తున్నారు. మురగనాథమ్ సాధించిన విజయానికిగానూ భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

ప్రపంచంలోని ఏ మూలన ఉన్న మహిళలైనా నెలసరి సమయంలో సురక్షితమైన శానిటరీ ప్యాడ్స్ ఉపయోగించాలన్నదే మురగనాథమ్ కల. దీన్ని నిజం చేసుకునే ప్రయత్నంలో భాగంగా 100 శాతం శానిటరీ ప్యాడ్లు ఉపయోగించే దేశంగా భారత్ ను మార్చే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే ఓ ఉద్యమంలా ముందుకు తీసుకుపోతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి మహిళకు చౌక ధరలో శానిటరీ న్యాప్ కిన్లు అందుబాటులోకి తెచ్చారు. దేశంలో వంద శాతం శానిటరీ ప్యాడ్లు ఉపయోగించే మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తర్ ప్రదేశ్ ను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. యూపీలో ఈ మిషన్ కంప్లీట్ అయ్యాక మిగతా రాష్ట్రాలపై దృష్టి పెట్టాలన్నది ఆయన ఆలోచన. అయితే మురగనాథమ్ ప్రస్తుతం కేవలం యూపీ పైనే దృష్టి పెట్టారనుకుంటే పొరపాటే. మిగతా రాష్ట్రాల్లోనూ మహిళా సంఘాలు, స్వయంసహాయక బృందాల సాయంతో శానిటరీ ప్యాడ్ల గురించి అవగాహన కల్పించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మురగనాథమ్ కు మరో పెద్ద కల కూడా ఉంది. అదే చౌక శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే మెషీన్ల సాయంతో దేశంలో కనీసం 10లక్షల మంది మహిళలకు ఉపాధి కల్పించడం.

మురగనాథమ్ సాధించిన విజయంతో ఆయన కుటుంబసభ్యులు మళ్లీ ఆయనకు దగ్గరయ్యారు. భార్య శాంతి, కూతురు ప్రీతీతో కలిసి ఆయన తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంటున్నారు. ఒకప్పుడు భర్త చేస్తున్న ప్రయోగాలను అసహ్యించుకుని మురగనాథమ్ ను వదిలి వెళ్లిపోయిన శాంతి ఇప్పుడు భర్త విజయంపై గర్వ పడుతోంది. అతని తల్లి కూడా మురగనాథన్ సక్సెస్ తో ఎంతో సంతోషిస్తోంది. కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదివిన కొడుకు మురుగా ఇంత పెద్ద విజయం సాధించాడంటే పై పెద్ద చదువులు చదివుంటే ఇంకెంత గొప్ప విజయం సాధించేవాడోనని మురిసిపోతోంది. పాపనాయకన్ పూడూర్ ఇప్పుడు మామాలు గ్రామం కాదు. మురగనాథమ్ కారణంగానే అదిప్పుడు సబర్బన్ గా మారింది. గతంలో మురగనాథమ్ ను అవమానించిన గ్రామస్తులు తాము చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతున్నారు.

రచయిత: డా. అర్వింద్ యాదవ్, మేనేజింగ్ ఎడిటర్ (ఇండియన్ లాంగ్వేజెస్), యువర్ స్టోరీ

అనువాదం: ఉదయ్ కిరణ్