సంకలనాలు
Telugu

పరాజాయాన్ని శాసించేది ఆ పది శాతం ఓటర్లే !

team ys telugu
22nd Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

బీహార్ ఎన్నికల్లోనూ.. ఢిల్లీ పోల్స్ ఫలితాలే బీజేపీని వెంటాడుతున్నాయి. తరచుగా మనం వినే మాట ఒకటి ఈ సందర్భానికి సరిగా సరిపోతుంది. " చరిత్ర నుంచి ఏమీ నేర్చుకోని వాళ్లకి... తరచూ అదే ఎదురవుతుంది. మొదటి సారి విషాదం అయితే.. ఆ తర్వాత కూడా అదో ప్రహసనంలా మారిపోతుంది".

భారతీయ జనతా పార్టీ నేతలు తెలివిగలవారే అయితే.. ఢిల్లీలో ఎదురైన ఘోర పరాభవాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యూహాలు మార్చుకుని ఉండేవారు. తమ అహంభావాన్ని తగ్గించుకుని, అధికారం ఇచ్చిన దర్పం నుంచి బయటపడి తగినట్లుగా తమ ఆలోచనలు చేసి ఉండాలి. నిజానికి అహమనేది గొప్ప మనుషులను కూడా గుడ్డివారిగా మార్చేస్తుంది. ప్రస్తుతం బీహార్ ఎన్నికల్లోనూ ఇదే జరగనుంది. ఢిల్లీ తరువాత బీజేపీకి బీహార్ ఎన్నికలు మరో పరాజయాన్ని రుచి చూపించబోతున్నాయి. నిజానికి బీహార్ భారాన్ని తలెకెత్తుకున్న ప్రధాని నరేంద్రమోడీకే ఈ పరాజయం వర్తిస్తుంది.

image


హర్యానా, మహరాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకశ్మీర్‌లలో బీజేపీ విజయంపై ఢిల్లీ ఎన్నికల సమయంలో.. ఓటర్లకు విస్తృతంగా చెప్పే ప్రయత్నం చేశాను. ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం లేకనే బీజేపీ విజయం సాధించిందని చెప్తే.. చాలామంది నమ్మేవాళ్లు కాదు. అప్పటికి పరిపాలిస్తున్న ప్రభుత్వాలు, రాజకీయ పరిస్థితులపై ప్రజలు విసుగుచెందిన సమయంలో.. ప్రజలకు బీజేపీ/మోడీ మిగిలినవారికంటే నయం అనే భావన కలిగింది. అందుకే పాక్షికంగా బీజేపీని నమ్మి ఓట్లు వేశారు. అంతే తప్ప పూర్తి విశ్వాసంతో మాత్రం కాదు. కానీ ఢిల్లీ విషయంలో పరిస్థితులు చాలా వేరు. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి అద్భుతమైన గుడ్‌విల్ ఉంది. రాజకీయాల్లో కొత్త ఊపిరులను పరిచయం చేసింది ఈ పార్టీ. కొత్త తరం రాజకీయాల గురించి మాట్లాడ్డం, అవినీత రహిత నేతల గురించి చెప్పడం, నిజాయితీ కూడిన రాజకీయాలను ఆప్ జనాలకు వివరించే ప్రయత్నం చేసింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా.. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 49 రోజుల పాటు నిర్వహించిన పాలనతో ఆ హామీలనే నిరూపించే ప్రయత్నం చేసింది. ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ సరైన ప్రత్యామ్నాయంగా కనిపించింది. మిగిలిన ఎన్నికలకూ.. ఢిల్లీకి ప్రధానమైన వ్యత్యాసం కూడా ఇదే.

భారతీయ ఎన్నికల చరిత్రలో ఢిల్లీ కొత్త శకానికి నాంది పలికింది. 2009 నుంచి ఈ మార్పు మొదలైంది. 2009లో మన్మోహన్ సింగ్‌కు ఎవరూ అవకాశం ఇవ్వకపోయినా.. కాంగ్రెస్ అతి తేలికగా 200 సీట్ల మార్క్‌ను దాటేసి, బీజేపీని ఘోరంగా ఓడించింది. ఇది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు ఫలితంగా చెప్పాలి. అయితే.. ఈ ఫలితాల ప్రయోజనం మన్మోహన్‌సింగ్‌కే గత ప్రభుత్వం కట్టబెట్టింది. సాధారణంగా ఐదేళ్లకోసారి జరిగే సాధారణ ఎన్నికలు, అవి జరిగే తీరుపై ప్రజలు ఎంతగా విసుగు చెందారో ఈ ఫలితాలు నిరూపిస్తాయి. తాము ఓట్లు వేసేటపుడు నిజమైన సమస్యలు చర్చకు రావాలని కోరుకుంటున్నారు. దానినే నేను భారతీయ ఎన్నికల ఆధునీకరణగా చెబ్తాను.

ఎవరికి ఓటు వేయాలని చివరి నిమిషంలో నిర్ణయించుకునే వాళ్ల సంఖ్య మొత్తం ఓటర్లలో 4 నుంచి 6 శాతం వరకూ ఉంటారు. ఈ విషయాన్ని రాజకీయ మేధావులు కూడా మర్చిపోతుంటారు. కొన్నేళ్లుగా ఇలా తరచూ .. ఎవరికి ఓటు వేయాలనే నిర్ణయాన్ని మార్చుకునేవారి సంఖ్య 8 నుంచి 10శాతానికి పెరుగుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణ చెందడం, ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడం దీనికి కారణాలుగా చెప్పవచ్చు. కులం, వర్గం, మతం, లింగం, ఆర్థిక, అంగ బలం, మద్యం, అధికారంతో ఫలితాలు తారుమారు చేయగలిగే పరిస్థితిని.. వీరు మార్చేస్తున్నారు. అన్నాహజారే.. ఉద్యమం చేసిన సమయంలో ప్రజల నుంచి ఏ స్థాయిలో మద్దతు లభించిందో ప్రత్యక్షంగానే చూశాం. ఆ తర్వాత మతాల జోలికి వెళ్లకుండా నరేంద్ర మోడీ చేపట్టిన క్యాంపెయిన్‌కు కూడా బాగానే ప్రతిస్పందన వచ్చింది. ఈ దేశానికి, రాజకీయాలకు అంటుకున్న రోగాలను చికిత్స చేసే ఏకైక శక్తిగా నరేంద్రమోడీకి ప్రచారం జరిగింది. దీంతో ప్రజల నుంచి ఏకపక్షమైన మద్దతు లభించి.. మోడీ ప్రధానమంత్రి కాగలిగారు. అయితే ప్రధానిగా ఎన్నికైన రోజుల వ్యవధిలోనే వీటన్నిటికీ ఆయన చరమగీతం పాడేశారు. కొన్ని వర్గాలను, వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని విధానాలు రూపకల్పన చేయడం ప్రారంభించాయి పార్టీ వర్గాలు. వీటిని నిర్దాక్షిణ్యంగా మోడీ ఖండించాల్సి ఉన్నా.. అలా చేయకపోగా మిన్నకుండిపోయారు.

ఢిల్లీ ఎన్నికల సమయంలో మోడీ ప్రచారం చేసిన తీరు, ఆయన ఉపయోగించిన భాష, అర్వింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడే విధానాలను వదిలేసిన తీరును ఢిల్లీ ప్రజలు గమనించారు. నిజానికి ఈ ప్రచారంలో మోడీ తన ప్రధాన శక్తియుక్తులను పోగొట్టుకున్నట్లగా కనిపించారు. ఈ వ్యవహారం చూసిన ఢిల్లీ ప్రజలకు.. నవతరం రాజకీయాలు అందించడానికి అర్వింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీలే అత్యున్నత ప్రత్యామ్నాయంగా కనిపించాయి. అంతే కాదు బీజేపీ కూడా యూపీఏ మాదిరిగానే, ఆ తానులో ముక్కలాగానే ప్రజలకు కనిపించింది. నా వాదనను ఢిల్లీ ఫలితాలు బలపరిచాయి. 

ఇలాంటివే బీహార్‌లో కూడా పునరావృతం కావొచ్చని నమ్ముతున్నాను. బీజేపీ/మోడీ మళ్లీ అదే తప్పు చేశాయి. బీహార్‌లో అన్నిటికంటే ఆకర్షించే విషయం ఏంటంటే.. ఢిల్లీలో కేజ్రీవాల్ మాదిరిగా.. అక్కడి ప్రజలకు.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై సడలని నమ్మకం ఉంది. తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత నితీష్‌ది. ఆయనపై, ఆయన పాలనపై ఎవరికీ వ్యతిరేకత లేదని గుర్తించుకోవాలి. రాష్ట్ర భవిష్యత్తును మార్చిన నేతగా ఆయనకు ఎనలేని గుర్తింపు ఉంది. అభివృద్ధికి మారుపేరుగా నితీష్‌ని ప్రజలు కీర్తిస్తారు. మీడియా నుంచి ఎంత శక్తివమంతమైన ప్రచారం బీజేపీకి అనుకూలంగా వచ్చినా... బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి నితీష్ కుమార్‌నే ప్రజలు ఎంచుకోబోతున్నారని రిపోర్టులు తేల్చేస్తున్నాయి. ఆ రాష్ట్రంలో మోడీ కంటే ప్రఖ్యాతి చెందిన నేతగా నితీష్‌నే ప్రజలు కీర్తిస్తున్నారు. ఢిల్లీ రేస్‌లో మోడీ కంటే ముందు కేజ్రీవాల్ ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

భారతీయ రాజకీయాల్లో దీన్ని ఓ కీలకమైన అభివృద్ధిగా చెప్పాలి. ప్రతీ వర్గంలోనూ, ప్రతీ కులంలోనూ నితీష్‌ని అంగీకరిస్తున్నారు. కేవలం కులం ఆధారంగానే బీహార్‌లో రాజకీయాలు నిర్ణయం అవుతాయన్న పరిస్థితుల్లో.. నితీష్ సాధించిన మహా విజయంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈయన తన ప్రచారాలన్నింటిలో అభివృద్ధి పైనే మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న ట్రాక్ రికార్డ్.. నితీష్‌కు ఎక్కువగా ఉపయోగపడనుంది. లాలూ ప్రసాద్ యాదవ్‌తో జత కట్టడం.. ఈయనకు కలిసొచ్చే విషయమే. ఖచ్చితంగా కొంత ఓటు బ్యాంకు అదనంగా జతవుతుంది. కానీ చివరి నిమిషంలో ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకునే వారిలో అత్యధికం నితీష్‌కు అనుకూలంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఈ పది శాతం మంది నిర్ణయాత్మక ఓటర్లు. ఈ పది శాతమే 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ పక్షాన నిలిచింది. కానీ వీరిని తమవైపు నిలబెట్టుకోవడంలో మోడీ/బీజేపీ విఫలమయ్యారు. వీళ్లు ఎంతసేపు రిజర్వేషన్, మాంస నిషేధం, కులాల అంతరాలు, హిందు-ముస్లిం, దళిత్-మహా దళిత్, ఉన్నత-వెనుకబడిన తరగతుల అంశాలపైనే మాట్లాడుతున్నారు. అభివృద్ధిని పట్టించుకోవడం మానేశారు. అక్లఖ్‌ను హతమార్చడం, బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం.. ఈ పది శాతం ఓటర్లను మోడీకి దూరం చేశాయని చెప్పచ్చు. సూటిగా చెప్పుకోవాలంటే తనకు 2014లో అండగా నిలిచిన 'New emerging modern class' వర్గం నమ్మకాన్ని.. మోడీ పూర్తిగా పోగొట్టుకున్నారు. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా మోడీ పాలన ఉంటుందనే వీరి విశ్వాసం ఇప్పుడు సడలిపోయింది. దీంతో వీరు పూర్తిగా నిరుత్సాహం చెందారు. అయితే భారత ఎన్నికల్లో సంతరించుకుంటున్న ఈ ఆధునికత బీహార్‌తో ఆగిపోదు. మరిన్ని రాష్ట్రాలకు, మారుమూల ప్రాంతాలకూ విస్తరించి, మరింతగా రాటుదేలటం ఖాయం. సామాన్యుల నుంచి మహానేతల వరకూ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇది.

రచయిత - అశుతోష్

image


ఈ ఆర్టికల్ పూర్తిగా రచయిత సొంత దృక్పథం, అభిప్రాయం. పార్టీతో ఎటువంటి సంబంధం లేదు. అశుతోష్ సుదీర్ఘకాలం జర్నలిజంలో కొనసాగారు. ఆయన ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారిక ప్రతినిధిగా కొనసాగుతున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags