సంకలనాలు
Telugu

మలిసంధ్యలో నులివెచ్చని స్పర్శ

పండుటాకుల్నిపొదివిపట్టుకుంటున్న‘టేక్ కేర్’సమాజానికి ఎంతోకొంత తిరిగివ్వాలంటున్న శ్రీమంతురాలు

hari prasad
23rd Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

చనిపోయిన తర్వాత తద్దినం పెట్టడం ఈజీ. కానీ బతికున్నప్పుడే ఇంట్లో ఇంత చోటివ్వడమే కష్టం అన్నారో కవి. నిజమే. దానికి కారణాలు అనేకం ఉండవచ్చుగాక. ఎవరి అవకాశంలో వాళ్లు. ఎవరికి ఆకాశంలో వాళ్లు. ఎటొచ్చీ వయసుడిగిన పండుటాకే అన్యాయమైపోతోంది. అందరూ ఉన్న అనాథగా మారిపోతోంది. జగమంత కుటుంబం ఉన్నా, ఏకాకి జీవితం అనుభవించాల్సి వస్తోంది. వృద్ధాశ్రమంలో ఓ మూలకు మంచం. పక్కన కిటికీ. అందులోంచి శూన్యాకాశం. ఎవరూ భర్తీ చేయనంత ఖాళీ. ఎన్నటికీ భర్తీకాని ఖాళీ.

image


డబ్బుంటే చాలదు.. గుండె కూడా

మలిసంధ్యలో ఎవరి కోరికైనా ఒకటే- ఎలావున్నావు.. అనే ఒక ఆత్మీయ పకలరింపు! ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో.. అనే ఒక చిన్నపాటి నులివెచ్చని స్పర్శ! ఆ వయసులో అవేవీ లేని జీవితమంటే- అంతకు మించిన నరకం మరొకటి లేదు. ఆప్యాయంగా ఇచ్చే కాసిన్ని మంచినీళ్లయినా సరే వారికి అమృతంతో సమానం. అలాంటి ప్రేమను పంచాలంటే కేవలం డబ్బుంటే సరిపోదు. గుండెకూడా ఉండాలి. అలాంటి ఒక హృదయం గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. 

చిన్నప్పటి నుంచే తపన

దేవాన్షి సేథ్. పుట్టిపెరిగింది ఉత్తర్ ప్రదేశ్ లోని గోండాలో. లక్నోకి 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుందా ఊరు. పెద్దకుటంబం. ఆరుగురు అన్నదమ్ములు. దేవాన్షికి చిన్నప్పటి నుంచీ సమాజ సేవ చేయాలన్న తపన ఉండేది. అందునా, వృద్ధుల కోసం ఏదో ఒకటి చేయాలనే ఆశయం మనసులో బలంగా నాటుకుంది. కాలేజీ రోజుల్లో టైం దొరికినప్పుడల్లా వృద్ధాశ్రమాలకు వెళ్లడం. వాళ్లతో కాసేపు గడిపడం. మంచీచెడ్డలు పలకరించడం. అవసరమైతే సాయం చేసి రావడం. అలా పరుచుకున్న బాట క్రమంగా విస్తరించింది. ఒకసారి అడుగు ముందుకు వేస్తే మళ్లీ వెనుకడుగు వేయకూడదనేది దేవాన్షి ఉద్దేశం.అందుకే ముందుగా వారి సమస్యల అవగాహన పెంచుకుంది. నాలుగైదేళ్ల పాటు సీనియర్ సిటిజన్స్ మీద అధ్యయనం చేసింది. గతేడాది తన 23వ ఏట తొలి అడుగు వేసింది. పగలంతా ఉద్యోగం. సాయంత్రం వృద్ధాశ్రమం. ఏదో ఒక తోచిన సాయం చేయడం. ఆప్యాయంగా పలకరించడం. కావాల్సిన వస్తువులను తెచ్చిపెట్టడం.

image


టేక్ కేర్ ఇలా మొదలైంది !

ఎప్పటిలాగే ఒకరోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత సాయంత్రం షా అనే మహిళ ఇంటికి వెళ్లింది. అప్పుడామె చెప్పిన మాటలు దేవాన్షి సేథ్ని పూర్తిస్థాయిలో లక్ష్యం వైపు నడిచేలా చేశాయి.”నేను కూడా నీలాగే సమాజ సేవ చేయాలనుకున్నాను. నా పిల్లలను కూడా ఇదే బాటలో నడిపించాలనుకున్నాను. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. బాధ్యతలన్నీ తీరి, లక్ష్యం వైపు నడిచేలోగా వయసు మీద పడింద”ని షా ఒకరకమైన ఉద్వేగంతో చెప్పింది. ఆ క్షణమే దేవాన్షి సేథ్ సంకల్పించింది.. ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా వృద్ధుల సేవకే అంకితమైపోవాలని. ఆ సంకల్పం లోనుంచి పుట్టిందే “ టేక్ కేర్”. 

అవసరాన్ని బట్టి సేవలు

ఆసుపత్రుల్లో వృద్ధులు పడే అవస్థలు దేవాన్షికి తెలుసు. ఎందుకంటే గతంలో చాలాసార్లు వారిని కలిసింది. అందుకే మణిపాల్ హాస్పిటల్స్ తో చేతులు కలిపింది. వయసుడిగాక వచ్చే అనారోగ్య సమస్యలు, వాటికి అందించాల్సిన చికిత్సలకు సంబంధించి ముందుగా ఒక జాబితా తయారుచేసుకుని, దానికనుగుణంగా చికిత్స అందజేస్తారు. దీంతో అనవసర ఖర్చులు కొంత తగ్గాయి. ఒక్క ఆసుపత్రులనే కాదు.. వృద్ధులకు ఎలాంటి సేవలు అవసరమైనా టేక్ కేర్ వాళ్లను చాలా కేరింగ్గా చూసుకుంటుంది.

image


ఎవరికి ఏ అవసరం ఉన్నా..

రోజువారీ లేకుంటే, వారానికి సరిపడా కిరాణా సరుకులు తెచ్చివ్వడం. అవసరమైన టాబ్లెట్లు, సిరప్‌లు అందజేయడం. ఆసరా కోసం ఎదురుచూసే వృద్ధుల ఇళ్లకు వెళ్లి, వాళ్లను ఆప్యాయంగా పలకరిస్తారు. వారికోసం కొంతటైం కేటాయిస్తారు. సందర్భాన్ని బట్టి వాకింగ్, జాగింగ్ లాంటివి కలిసి చేస్తారు. స్మార్ట్ ఫోన్, లాప్టాప్ ఆపరేటింగ్ లాంటివి నేర్పిస్తారు. వీలైతే వీడియోకాల్స్ చేసిపెట్టడంలాంటి పనులు చేస్తుంటారు. ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యంపై టేక్ కేర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. నెలవారీ వైద్య పరీక్షలతో పాటు ఆర్నెల్లకోసారి పూర్తిస్థాయి టెస్టులు నిర్వహిస్తారు. అవసరమైతే ఫిజియోథెరపీలాంటి సేవలు కూడా అందిస్తారు. ఇంటిపనులు చేయడానికి పనివారిని, వంటవారిని, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ లాంటి వారిని కూడా వెతికి పెడతారు. సరదాగా కొన్ని రోజులు బయటకు వెళ్లి గడిపి రావడానికి కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తారు. ఇల్లు మారాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా సాయం చేస్తారు. విదేశాలకు వెళ్లాల్సి ఉంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ సిద్ధం చేసిపెడతారు. విదేశాల్లో ఉన్న వారి పిల్లలకు తల్లిదండ్రుల యోగక్షేమాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తారు.

అనవసర భారం లేకుండా

అవసరాలను బట్టి ఒక్కో సేవకు కొంత మొత్తం వసూలు చేస్తారు. అవికూడా ఖర్చుల కోసం. అనవసర భారం వారిపై పడకుండా చూస్తారు. ఉదాహరణకు కిరాణా వస్తువులు తెచ్చిపెట్టడం, మెడికల్ ఎమర్జెన్సీ, మూడుసార్లు ఇంటికి వెళ్లి కలవడం, రోజువారీ వివరాలు అందించడం కోసం- 15 రోజులకుగాను రూ.3,500 వసూలు చేస్తారు. వీకెండ్స్ లో మాత్రమే సేవల కోసం రూ.2,300 తీసుకుంటారు

తక్షణ కర్తవ్యం అదే

ప్రస్తుతానికి ‘టేక్ కేర్’ను వారో పైలట్ ప్రాజెక్ట్ గానే నడిపిస్తున్నారు. దీనిద్వారా మార్కెట్ అవసరాలేంటో అంచనా వేయగలిగారు. ప్రస్తుతానికి పుణెలో సంస్థను రిజిస్టర్ చేయించాలని దేవాన్షి భావిస్తున్నారు. అయితే పూర్తిస్థాయి సేవలు అందించాలంటే అందుకు తగిన టీమ్ ను సిద్ధం చేయడమే ఆమె ముందున్న తక్షణ కర్తవ్యం.

“మా టీం మెంబర్స్ వృద్ధులతో జాగర్తగా మెలిగేలా చూడాల్సిన బాధ్యతన నాపై ఉంది. నేను వ్యక్తిగతంగా వారికి ట్రైనింగ్ ఇస్తున్నాను. ప్రస్తుతం కొంతమంది సీనియర్లు నాతో ఉండటం వల్ల పెద్ద కష్టమేమీ కావడం లేదు”- దేవాన్షి

శాపంలా భావించొద్దనే..

వృద్ధాప్యం శాపం కావొద్దు. అదొక మధురానుభూతిగా ఉండాలి. దేవాన్షి ముందున్న లక్ష్యం అదే. అందుకే ఎన్నో అవకాశాలను వదులుకున్నారు. విదేశాల్లో లక్షల రూపాయలిచ్చే ఉద్యోగాలను కాదనుకున్నారు. సమాజానికి తనవంతుగా ఎంతోకొంత తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తానీ పనిచేస్తున్నానని దేవాన్షి తెలిపారు. వృద్ధులకు సేవ చేయడంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. భవిష్యత్ లో ‘టేక్ కేర్’ను మరింత మెరుగుపరుస్తూ గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో సహా భారతదేశమంతటా సంస్థను విస్తరింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags