దేశంలోనే తొలి టెక్నాలజీ ఆధారిత రెంటల్ స్టార్టప్ జిఫ్ఫీ హోమ్స్

దేశంలోనే తొలి టెక్నాలజీ ఆధారిత రెంటల్ స్టార్టప్ జిఫ్ఫీ హోమ్స్

Saturday August 19, 2017,

2 min Read

పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ లో ఉండే కష్టాలు అనుభవిస్తేగానీ తెలియవు. వాటర్ మొదలుకొని పార్కింగ్ దాకా అనేక ఆంక్షలు. ఓనర్లతో మహా చెడ్డ చిరాకు. వాళ్లు వేసే ప్రశ్నలు యమా ఇరిటేట్ చేస్తుంటాయి. అవికాకుండా బ్రోకర్ల చార్జీలనీ, ఫర్నిచర్ కాస్టనీ.. ఖర్చు తడిసి మోపెడవుతుంది.

image


సంచల్ రంజన్ ఒకసారి బెంగళూరు నుంచి ఢిల్లీకి కంపెనీ పనిమీద వెళ్లాడు. అక్కడ ఓ పీజీ అకామిడేషన్ లో పదిహేను రోజులు ఉండాల్సి వచ్చింది. అప్పుడు తెలిసింది బ్యాచిలర్లకు ఒక గది దొరకడం ఎంత కష్టమో.

బ్రహ్మచారి అయినంత మాత్రాన ఇల్లు ఇవ్వకూడదని రాజ్యాంగంలో రాసుందా? పెళ్లి కానంత మాత్రాన సవాలక్ష కండిషన్లు పెట్టాలా? అలా జరగడానికి వీల్లేదు. బ్యాచిలర్లు తమకు నచ్చిన పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లో ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలి. అలాంటి వేదిక ఒకటి తయారుచేయాలని రంజన్ మనసులో బలంగా నాటుకుంది. ఈ సమస్యకు పరిష్కారం వెతకాలని మిత్రుడు సౌరభ్ రంజన్ తో కలిసి మేథోమథనం చేశాడు. అలా ఇద్దరి ఆలోచనల్లోంచి వచ్చిందే జిఫ్ఫీ హోమ్స్.

2015లో వెంచర్ స్టార్ట్ చేశారు. బిజినెస్ మొదలుపెట్టడం తేలికే. కానీ లాభాలు రాబట్టడం అనేది కత్తిమీద సాములాంటిది. అందుకే వ్యాపారాన్ని ఒక కొలిక్కి తేవడానికి తలపండిన రియల్టర్ల సాయం తీసుకున్నారు.

జిఫ్ఫీ హోమ్స్ అనేది ఇండియాలోనే తొలి టెక్నాలజీ ఆధారిత రెంటల్ మార్కెట్ ప్లేస్. అద్దె ఇళ్లను అతి సులువుగా వెతికి పెడుతుంది. ఎన్ని రోజులు ఉన్నా ఓనర్లతో ఎలాంటి టెన్షన్ లేకుండా, మెయింటెనెన్స్ జంఝాటం రాకుండా చేస్తుంది. అద్దె చెల్లింపులు కూడా ఆన్ లైన్లో జరిగేలా ఏర్పాటు చేశారు.

ప్రాసెస్ అంతా సింపుల్. ఇల్లు అద్దెకు ఇవ్వాలనుకున్న యజమానుల్ని ఒక వేదిక మీదకి తెస్తారు. తర్వాత వాళ్లు ఇవ్వాలనుకన్న గదిని వెళ్లి స్వయంగా పరిశీలిస్తారు. ఫర్నిచర్ వగైరా సరిగా ఉన్నాయా లేవా చూస్తారు. అంతా సవ్యంగా ఉంటే దాన్ని ఆన్ లైన్ లోకి తెస్తారు. టెనెంట్స్ మళ్లీ మళ్లీ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం రాకుండా చూసుకుంటారు. బుక్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ అయిపోవడమే. ఆ లోపే రెంటల్ అగ్రిమెంట్ కూడా రెడీ అయిపోతుంది. జిఫ్ఫీ హోమ్స్ మరో ప్రత్యేకత ఏంటంటే.. అద్దె చెల్లింపులను కూడా ఆన్ లైన్ చేసింది. దాంతోపాటు ఏవైనా రిపేర్లు, మెయింటెనెన్స్ లాంటివి అవసరమొచ్చినా చేసిపెడతారు. రకరకాల ప్యాకేజీల్లో సోఫా క్లీనింగ్, ఎలక్ట్రిసిటీ వైరింగ్ లాంటి వాటికి కూడా సర్వీస్ అందిస్తారు.

గూర్గావ్, నోయిడా, ఢిల్లీల్లో జిఫ్ఫీ హోమ్స్ ఆపరేషన్స్ నడిపిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాల్లో కూడా కార్యకలాపాలు ప్రారంభించాలని అనుకుంటున్నారు. జిఫ్ఫీ హోమ్స్ లో 30 మంది ఫుల్ టైం ఉద్యోగులుగా ఉన్నారు.

ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అంచనా ప్రకారం ఓవరాల్ ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2020కల్లా 180 బిలియన్ డాలర్ల మార్కెట్ ని తాకుతుంది. అంటే దేశ జీడీపీలో దాదాపు 6శాతం.

ఇక రెంటల్ స్టార్టప్స్ విషయానికొస్తే మార్కెట్లో చాలానే ఉన్నాయి. యువర్ ఓన్ రూమ్, హోమిగో, నెస్ట్ వే, స్టేఅబోడ్, కోహో, రెంట్ రూమి, వుడ్ స్టే లాంటి స్టార్టప్స్ రెంటల్ మోడ్ లో బిజినెస్ చేస్తున్నాయి.

23.5 లక్షల సీడ్ కేపిటల్ ఇన్వెస్ట్ చేసి జిఫ్ఫీ హోమ్స్ మొదటి రోజునుంచే లాభాల మీద కన్నేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ ప్లాట్ ఫాం మీద 550 మంది టెనెంట్స్, 100 మంది ఓనర్లు ఉన్నారు. సగటున ఒక ప్రాపర్టీ మీద నలుగురు అద్దెకున్నారు. ప్రతీ నెలకు 30 మంది ఓనర్లను, 120 కిరాయిదార్లను జతచేస్తూ పోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓనర్ల నుంచి 10 శాతం చార్జ్ చేస్తూ నెలకు 20 శాతం చొప్పున రెవెన్యూ పెంచుకుంటున్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రూ. 18 కోట్ల బిజినెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.