టీ షర్ట్స్ అమ్మి కోట్లు గడిస్తున్న క్యాంపస్ సూత్ర !
క్యాంపస్ సూత్ర యూత్ బ్రాండ్
సాధారణంగా యూత్ టీ షర్ట్ కొనాలంటే బ్రాండ్ పెద్దగా చూడరు. కలర్, దానిపై కొటేషన్ ఖతర్నాక్ ఉంటే చాలు. ఫ్లాటైపోయి కొనేస్తారు. ఈ ట్రెండే ధీరజ్, ఆదిత్య, సోనాల్, కుష్బూ అగర్వాల్ అనే నలుగురిని ఆకర్షించింది. అలా క్యాంపస్ సూత్ర మొదలయింది.
క్యాంపస్ సూత్ర ఔట్ అండ్ ఔట్ యూత్ బ్రాండ్. ఇండియాలో స్టూడెంట్స్ టేస్టుకు తగ్గట్టు కోరుకున్నట్లు తగిన వస్త్రాలు లేవనేది వారి అభిప్రాయం. ఇంజినీరింగ్, ఇతర కోర్సులు చదివే విద్యార్థులను ఆకట్టుకునే గార్మెంట్స్ అందించడంలో కంపెనీలు ఫెయిల్ అవుతున్నాయి. అందుకే ఈ గ్యాప్ ను గుర్తించే క్యాంపస్ సూత్ర పెట్టామంటున్నారు. సొంత డబ్బు కోటి రూపాయలతో ఆన్ లైన్ స్టోర్ మొదలుపెట్టారు.
రోజుకు 2500 యూనిట్లు సరఫరా చేస్తున్నా ఈ స్టార్టప్ కంపెనీ రెవెన్యూ 2013లో కోటీ 65 లక్షలు సాధించిన క్యాంపస్ సూత్ర- 2014లో రూ.16కోట్లు ఆర్జించింది. దాదాపు ఇప్పటివరకూ ఆరున్నర లక్షల ఉత్పత్తులను విక్రయించింది. యువతను ఆకట్టుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్న క్యాంపస్ సూత్ర - యూత్ లో పాపులర్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. డిజైనింగ్ పై ఓ నిర్ణయానికి వచ్చిన 21 రోజులకే ప్రాడక్ట్ మార్కెట్ లోకి వచ్చేస్తుంది. వస్త్ర పరిశ్రమలో అమూల్ యాడ్స్ లా ఉంటామంటున్నారు ధీరజ్. అందుకే కరెంట్ ఇష్యూలపై దృష్టిపెడుతూ వినియోగదారులకు చేరువయ్యేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు.
యాక్సరీస్ వరకు పెరిగిన బిజినెస్
అప్పారెల్ ఇండస్ట్రీలో ప్రత్యేకత కోసం క్యాంపస్ సూత్ర తీవ్రంగా కృషిచేస్తోంది. వస్త్రాల నుంచి యాక్ససరీస్ కూ బిజినెస్ విస్తరించింది. టీషర్ట్స్ తో పాటూ స్వెట్షర్ట్స్, క్యాప్స్, జాకెట్స్, స్పోర్ట్స్ వేర్, షార్ట్స్, టాప్స్, హుడీస్, బ్యాగ్స్, లాప్ టాప్ స్లీవ్స్, మగ్స్, సిప్పర్స్ పై తమదైన మార్క్ చూపిస్తోంది. 18-25ఏళ్ల వయసున్న యూత్ ఫ్యాషన్ అవసరాలు తీర్చుతున్న క్యాంపస్ సూత్ర బిజినెస్ 70 శాతం పట్టణాల్లోనే సాగుతోంది.
ఆన్ లైన్ వస్త్ర ప్రపంచంలో మిగతా పోటీదారులకు భిన్నంగా క్యాంపస్ సూత్ర సేల్స్ సాగిస్తోంది. బ్యాక్ ఎండ్ మెట్రిక్స్ తో వ్యాపారం చేస్తోంది. ఓ ఉత్పత్తిని మార్కెట్ లోకి తీసుకురావాలంటే చాలా బ్రాండ్స్ 12-18 నెలల సమయం తీసుకుంటాయి. కానీ క్యాంపస్ సూత్ర కొత్త కాన్సెప్ట్స్ మాత్రం 21 రోజుల్లోనే మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. అందుకే ఈ ఇండస్ట్రీలో మాగ్జిమం నంబర్స్ మావే అని ధీరజ్ చెప్తున్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో రూ.40కోట్ల రెవెన్యూను టార్గెట్ గా పెట్టుకున్న కంపెనీ 2016లో రూ.100కోట్లకు చేరుకోవాలని ఆశిస్తోంది.
అనుభవాలు-పాఠాలు
అందరి వ్యాపారవేత్తల్లానే మొదట్లో క్యాంపస్ సూత్ర నిర్వాహకులు అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. అన్నింటికీ సిద్ధమయ్యే ఈ రంగంలోకి అడుగు పెట్టారు. చిన్న తప్పు జరిగినా నష్టం తీవ్రంగా ఉంటుందని తెలిసీ బరిలోకి దిగారు. కంపెనీ ప్రారంభించిన తొలినాళ్లలో తమ వేర్ హౌజ్ వరదల్లో చిక్కుకుంది. అర్ధరాత్రి రెండు గంటలకు వెళ్లి బట్టలన్నింటినీ మరో ప్రాంతానికి తరలించారు. అలా ప్రతీ పనిలో చిత్తశుద్ధి ఉంది కాంట్టే ఎంప్లాయిస్ ను కంపెనీ లక్ష్యాల్లో భాగం చేస్తూ వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అందుకే ఎంప్లాయిస్ క్యాంపస్ సూత్రను వదిలేసి వెళ్లరు. ఒకసారి వేరే కంపెనీ మూడింతలు సాలరీ ఆఫర్ చేసినా నలుగురు మినహా అందరూ అక్కడే ఉన్నారు. ఈ అంశం థ్రిల్లింగ్ గా ఉంటుందని ధీరజ్ ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
భవిష్యత్ లక్ష్యాలు
క్యాంపస్ సూత్ర ప్రారంభం నుంచి ఇప్పటివరకూ ఫౌండర్సంతా ఎగ్జయిటింగ్ గానే ఉన్నారు. తొలి ఉద్యోగి, తొలి ఆర్డర్ ఇలా ప్రతీదీ ధీరజ్, ఆదిత్య, సోనాల్, కుష్బూ ఎప్పుడూ గుర్తుచేసుకుంటారు. కంపెనీని అతి పెద్ద ఆవిష్కరణ సంస్థగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు యత్నిస్తున్నారు. యువతకు సంబంధించి ట్రావెల్, స్పోర్ట్స్, ఎంటర్టయిన్మెంట్ అపారెల్, యాక్ససరీస్ లో మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు కృషిచేస్తున్నారు.
మార్కెట్ తీరుతెన్నులు
ఆన్ లైన్ అపారల్ మార్కెట్, మర్చండైజ్ లో అల్మామేటర్, జాక్ ఆఫ్ ఆల్ థ్రెడ్స్, వొక్స్ పాప్ సత్తా చాటుతున్నాయి. కొద్దిపాటి కొత్తదనం, డిజైన్స్ చిన్న తేడాలతో గణనీయ ఫలితాలు సాధిస్తున్నాయి. వీటికి తోడు ఫ్రీకల్టర్, షోపో లాంటి కంపెనీలు వెబ్ నుంచి అమ్మేందుకు వ్యాపారవేత్తలను ఆహ్వానిస్తున్నాయి. ఈ రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకుంటూ క్యాంపస్ సూత్ర తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకుంది. ఈ విభాగంలో మార్కెట్ అవకాశాలు విపరీతంగా ఉన్నాయి. ఈ సెక్టార్ లో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నిపుణులు సైతం చెప్తున్నారు.