సంకలనాలు
Telugu

ప్లగ్గుల తయారీ కంపెనీ ప్రపంచ స్థాయికి ఎలా ఎదిగింది..?

Krishnamohan Tangirala
23rd Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొన్నాళ్ళకు తన పెద్ద కొడుకైన ఘన్‌శ్యాం దాస్‌ను కలకత్తాకు పంపించేశారు మదన్‌లాల్‌షా. ఘన్‌శ్యాందాస్‌ను 'GD' అని కూడా పిలిచేవారు. జైపూర్‌లోని మహారాజా కాలేజ్‌లో 1955లో ఘన్‌శ్యాం గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. తర్వాత 18 ఏళ్ళకే ఇంటి నుంచి వెళ్ళిపోయి గ్యాన్‌వతి అనే అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు.

కలకత్తాకి వచ్చిన GD కలకత్తా యూనివర్శిటీలో లా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో కాస్ట్‌ అకౌంటెన్సీ చేయడానికి సిద్ధపడ్డాడు. రెండుకోర్సులూ ఒకేసారి చదువుకుంటూ బెల్గోరియాలో టెక్సామాకో అనే కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. రోజూ చదువూ, ఉద్యోగం చేస్తూ చాలా అలసిపోయాడు ఘన్‌శ్యాం. చదువుకుంటూ ఉద్యోగం చేయడం కష్టమని కొద్దికాలంలోనే గ్రహించాడు. అందుకే చదువుని పక్కన పెట్టి ఉద్యోగంలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. టెక్సామాకో కంపెనీలో స్టోర్స్, పర్చేజ్ డిపార్ట్‌మెంట్లలో పనిచేశాడు ఘన్‌శ్యాం. అక్కడున్న కంపెనీ సెక్రటరీ... ఘన్‌శ్యాం ఆసక్తిని గమనించి మెకానికల్ ఇంజనీరింగ్ నేర్పించాడు. మెషినరీ నాలెడ్జ్‌లో ప్రావీణ్యం సంపాదించాడు ఘన్‌శ్యాం.

ఘన్‌శ్యాం దాస్ షా

ఘన్‌శ్యాం దాస్ షా


ఉద్యోగం వదిలేసి పారిశ్రామికవేత్తగా

వివిధ పారిశ్రామిక అవసరాలకు సంబంధించి ప్లగ్గులు, సాకెట్లు బ్రిటిష్ కంపెనీ అయిన నిఫాన్ నుంచి దిగుమతి చేసుకునేది టెక్స్‌మాకో. ఇక్కడ పనిచేస్తున్న ఘన్‌శ్యాం మదిలో ఓ ఆలోచన మెదిలింది. ఈ ప్లగ్గులు, సాకెట్ల శాంపిల్స్‌ను పరిశీలించి. వాటిని ఇక్కడే డిజైన్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. అంతే ఓ వెంచర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. బ్రిటిష్ కంపెనీ అయిన నిఫాన్‌ లోంచి ఒక్క అక్షరం తీసేసి నిఫా అనే కంపెనీ పేరుని ఖాయం చేశాడు జీడి. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో వేళ్ళూనుకున్న కొత్త కంపెనీ నిఫా. ప్లగ్ అండ్ సాకెట్‌లతో కూడిన లోగోని నిఫాకి రూపొందించాడు జీడి.

టెక్సామాకో జీడీతో పాటు పనిచేసిన సరావూగి హౌరాలోని వివిధ జూట్ పరిశ్రమలు, ఇతర చిన్నతరహా పరిశ్రమల నుంచి నిఫా కోసం ఆర్డర్లు తీసుకుని వచ్చేవాడు. టెక్సామాకోలో పనిచేస్తున్నప్పుడే వ్యాపారంలో కొన్ని మెలకువలు నేర్చుకున్నాడు జీడి. అమ్మకం కంటే ప్లగ్, సాకెట్ల తయారీ వల్ల భారీ లాభాలు ఉన్నాయని తెలిసింది. దీంతో టెక్స్‌మాకోకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు ఘన్‌శ్యాం, సరావూగి, తమ పూర్తి సమయాన్ని నిఫా కోసం ఖర్చుచేయడం ప్రారంభించారు. చిన్న చిన్న కంపెనీల నుంచి ఆర్డర్లు రావడం, వాటిని తయారుచేయడం, ఇన్‌స్టాల్ చేయడం చేసేవారు. ఇదే సమయంలో 1959లో ఘన్‌శ్యాం చిన్న సోదరుడు మహేష్ కలకత్తా కి వచ్చాడు.

ఫ్యాక్టరీలో జి.డి. షా

ఫ్యాక్టరీలో జి.డి. షా


విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి

వైడ్‌లూంకి సంబంధించి నిఫా మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా మారింది. 1962 లో హౌరాలో కొన్ని యంత్రాలతో పని ప్రారంభమయింది. చిన్న యంత్రాలు కంపెనీలో ఉంటే, ఇంట్లో కొన్నింటిని ఏర్పాటుచేసుకున్నాడు జీడీ. ఇదే సమయంలో విదేశాల నుంచి ఆర్డర్లు రావడం ప్రారంభమయింది. జిన్నింగ్ మిల్లులకి సంబంధించిన వివిధ పనిముట్లు తయారుచేసేవారు. పత్తి యంత్రాలకు సంబంధించిన వివిధ సాకెట్లు తయారుచేసి ఉగాండాలోని హెస్సెన్ కంపెనీకి పంపేవారు. ఉగాండా కంపెనీ నిఫాకి దారులు తెరిచింది. ఉగాండా, టాంజానియాలో కాటన్ జిన్నింగ్ ప్రాజెక్టులకు ఇది నాంది అయింది.

ఫరీదాబాద్‌లో ఉన్న నిఫా ఎక్ప్ పోర్ట్స్‌కు ఐఎస్‌ఓ 9001, 2008 క్వాలిటీ సర్టిఫికేషన్ కూడా ఉంది.

తమ క్లయింట్ల అవసరాలను గుర్తించి, వారికి మంచి నాణ్యమయిన వస్తువులను సరఫరా చేస్తూ మంచి లాభాలబాట పట్టింది నిఫా. రోజులు గడుస్తున్నాయి. ఘన్‌శ్యాం ఆశించిన రోజు రానే వచ్చింది. రక్షణ శాఖ నుంచి భారీ ఆర్డర్ నిఫా తలుపు తట్టింది. 1964 లో రక్షణ శాఖ ఆర్డర్ రావడంతో కంపెనీ ముందుకు దూసుకుపోయింది. 1971 లో వచ్చిన భారత్- పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా క్లిప్‌ క్యాట్రిడిడ్జెస్ తయారీ బాగా జరిగింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఘన్‌శ్యాం. తన టీంతో కలిసి రాత్రీపగలు తేడా లేకుండా వచ్చిన ఆర్డర్‌ను పూర్తిచేశాడు. అసలే రక్షణ శాఖ ఆర్డర్. ఘన్‌శ్యాంకి ఈ ఆర్డర్ కత్తిమీద సాములా అనిపించేది.

రోజూ ఉన్నతాధికారులు వచ్చిన క్లిప్ క్యాట్రిడిడ్జెస్ తయారీని దగ్గరుండి పర్యవేక్షించేవారు. అంతేకాదు శత్రువుల విమానాలను ఎలా కూలగొట్టవచ్చో ఉద్యోగులకు వివరించేవారు. పూర్తయిన వాటిని తమ వెంట తీసుకుని వెళ్లేవారు. కలకత్తాలో పనులు సాగుతున్న సమయంలో ఫ్యాక్టరీని ఫరీదాబాద్‌కు మార్చాడు జీడీ.

అప్పటి రాష్ట్రపతి కలాం నుంచి అవార్డును అందుకుంటున్న జిడి

అప్పటి రాష్ట్రపతి కలాం నుంచి అవార్డును అందుకుంటున్న జిడి


అమెరికాకు ఎగుమతులు

1970 ప్రాంతంలో అమెరికానుంచి ఓ ఆర్డర్ వచ్చింది. అమెరికాలో్ని కాస్టింగ్స్ అండ్ అల్లాయ్స్ కంపెనీ ప్రతినిధులు నిఫాతో ఒప్పందం చేసుకున్నారు. ఇది నిఫా చరిత్రను తిరగరాసింది. ఇక వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకుండా చేసింది. 1980 దశకంలో ఐటీ బూమ్ ప్రారంభానికి ముందు ఫ్లాపీ డిస్క్ ఫ్యాక్టరీ స్థాపించారు ఘన్‌శ్యాం అండ్ టీం. అంతేకాదు ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఆఫ్రికాలో అడుగులు వేయడం సాహసంగా చెప్పుకునేవారు. కష్టపడే తత్వానికి, నిర్భీతికి ఘన్‌శ్యాం నిదర్శనంగా నిలిచారని ఉద్యోగులు ప్రశంసిస్తూ ఉంటారు.

వరల్డ్ బ్యాంకు నుంచి అవార్డులు

నిఫాను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళారు ఘన్‌శ్యాం దాస్. అంతేకాదు ఆయన నాయకత్వంతో కంపెనీ కొత్త కొత్త హంగులు సంతరించుకుంది. ప్రపంచబ్యాంకు, ఆఫ్రికన్‌ డెవలప్‌మెంటు బ్యాంకులు. వివిధ దేశీయ మంత్రిత్వ శాఖల నుంచి అవార్డులు, లెక్కలేనన్ని ప్రశంసలు లభించాయి.

అగ్నికి ఆహుతైన ఆఫీస్

రోజులన్నీ ఒకేలా ఉండవు. విధి వైపరీత్యం నిఫాను వెంటాడింది. 1994 లో జరిగిన ఒక సంఘటన నిఫా ఉద్యోగులను కలిచి వేస్తూ ఉంటుంది. కలకత్తాలో ఓ అర్థరాత్రి ఘోరమయన అగ్నిప్రమాదం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్డులోని నిఫా కార్యాలయం అగ్నికి ఆహుతి అయింది. కొత్త సంవత్సర వేడుకలు నిఫాకి తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఖరీదైన సామాను, అంతకంటే విలువైన డిజైన్లు కాలి బూడిదయ్యాయి. చూస్తుండగానే అన్నీ కాలి బూడిద మిగిలింది.

దివంగత మాజీ ప్రధానితో జి.డి.షా

దివంగత మాజీ ప్రధానితో జి.డి.షా


కంపెనీకి చెందిన పాత ఉద్యోగులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. కంపెనీ భవనం ముందు నిలబడి జరిగిన ఘోరాన్ని తలుచుకుని తెగ బాధపడ్డారు. అన్నీ పోయిన ఘన్‌శ్యాం దాస్‌ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఈ సమయంలో తాను ధైర్యాన్ని కోల్పోతే ఉద్యోగులు మానసిక స్థైర్యం కోల్పోతారని భావించి ధైర్యం తెచ్చుకున్నారు. జరిగిన దాని గురించి ఆలోచించకుండా కంపెనీ ఉద్యోగి జైన్ చెప్పినమాటల్ని తూ.చ తప్పకుండా పాటించాడు ఘన్‌శ్యాం దాస్. సాంకేతిక సమాచారం, ఇతర డాక్యుమెంట్లను పరిశీలించి వాటినుంచి మళ్ళీ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

జరిగిన ఘోరం నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోవాలో ఉద్యోగులకు బోధించాడు ఘన్‌శ్యాం దాస్. ధియేటర్ రోడ్డు లోని ఎక్స్‌ప్రెస్ టవర్‌లో తిరిగి ఫ్యాక్టరీని ప్రారంభించారు. కొత్త సంవత్సరం నాడే కొత్త ఆశలకు జీవం పోశారు. ప్రతి ఉద్యోగి పేపర్, పెన్సిల్ తీసుకుని తమ దగ్గర ఉన్న పెండింగ్ వర్క్ గురించి రాయడం మొదలు పెట్టారు. కంపెనీ కి వివిధ కంపెనీలు ఇచ్చిన ఆర్డర్లు, వారికి పంపించాల్సిన ఆర్డర్లను తయారుచేసి కంపెనీని ముందుకు నడిపించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తమ తమ భుజస్కంధాలపై వేసుకున్నారు.

నిఫా యాజమాన్యం, బోర్డ్ సభ్యులు, ఉద్యోగులు

నిఫా యాజమాన్యం, బోర్డ్ సభ్యులు, ఉద్యోగులు


ఉద్యోగులే ఊపిరిపోశారు

నిఫా కుటుంబంలో ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజుకోసం బాగా కష్టపడ్డారు. జరిగిన ఘోరాన్ని తలుచుకుని కుమిలిపోకుండా.. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు. నిఫా సక్సెస్‌ఫుల్ హిస్టరీలో ప్రతి ఎంప్లాయి తమకంటూ కొన్ని పుటల్ని లిఖించుకున్నరోజులవి. జనవరి ఒకటిని ప్రతి ఎంప్లాయి బాగా గుర్తంచుకున్నారు. ఉద్యోగులు బాగా విశాలంగా తమ పనులు చేసుకునేందుకు వీలుగా నిఫాను విశాలమయిన ప్రాంతానికి మార్చారు జీడీ. గతంలో కంటే భిన్నంగా ముందుకుసాగారు ఉద్యోగులు.

నాటినుంచి నేటివరకూ తరగని స్ఫూర్తి

గతంలో జరిగిన అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకున్నారు ఉద్యోగులు. ప్రస్తుతం నిఫా కంపెనీ తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. హౌరా, కలకత్తాతో పాటు శ్రీరాంపూర్ లోనూ కంపెనీ తన బ్రాంచ్‌లను ప్రారంభించింది. అంతేకాదు, 300 మంది చిన్నవ్యాపారులు, 1500 మంది ఉద్యోగులు నిఫా సొంతం. కాటన్ జిన్నింగ్ మిల్లులకు వివిధ రకాల పరికరాల అందించడంపైనే శ్రద్ధ కనబరిచారు. అంతేకాదు టిల్లేజ్ టూల్స్, కాస్టింగ్స్, అసెంబ్లింగ్ పరికరాలు, మెకనైజ్డ్‌ఫార్మ్ ఎక్విప్మెంటు తయారుచేస్తున్నారు. నిఫా తయారు చేసిన వివిధ రకాల వస్తువులు ఉత్తర అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా కు ఎగుమతి అవుతున్నాయి. అంతేకాకుండా ఆసియా, ఆఫ్రికాలకు కూడా ఎగుమతులు చేస్తున్నారు. ఈ ఎగుమతులు బాగా పెరుగుతున్నాయి కూడా.

ఎంతోమంది ప్రముఖులు...

నిఫా కంపెనీలో డైరెక్టర్లందరూ వివిధ బ్యాంకులకు అధిపతులుగా తమ సేవలు అందిస్తున్నారు. ఎగ్జిమ్‌బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ వంటి వాటిలో నిఫా డైరెక్టర్లున్నారు. ప్రభుత్వానికి సంబంధించి వివిధ టాస్క్‌ఫోర్స్‌లలో జీడీ షా సభ్యులుగా కొనసాగుతున్నారు. అంతేకాదు ఇంజనీరింగ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు మాజీ డైరెక్టర్, భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు అధ్యక్షులు. అనేక అంతర్జాతీయ సదస్సులు, ఎక్స్‌పోలలో జీడి షా పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతులు, ప్రధానమంత్రులతో ఘన్‌శ్యాంకి సన్నిహిత సంబంధాలున్నాయి. రాజీవ్‌గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి లాంటి వారితో కలిసి కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.

ఎన్నో విద్యాసంస్థలకు చేయూత

ఘన్‌శ్యాం దాస్ తండ్రి మదన్‌లాల్ షా 1982 లో జేబీ షా గర్ల్స్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ కాలేజీ స్థాపించారు. రాజస్థాన్‌లోని జున్‌జుహ్నూలో మొట్టమొదటి కాలేజ్ ఇది. జీడి షా సోదరులు, బంధువులు కూడా కాలేజ్ కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాలేజ్‌కి అవసరమయిన ఆర్థిక సాయం అందచేసేవారు.

తండ్రి ఆశయాలే ఆలంబనగా..

మదన్‌లాల్‌షా తన నలుగురు పిల్లల గురించి కొన్ని కలలు కనేవారు. తన నలుగురు కొడుకులు కలిసి పనిచేయాలని, నలుగురు కలిసి మెలిసి ఉండాలని భావించేవారు. వారంతా వివిధ కంపెనీలు నిర్వహిస్తున్నా జీతాలు తీసుకోకుండా కేవలం కుటుంబ అవసరాలకోసమే తీసుకునేవారు. వారంతా జీతాలు తీసుకుంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావం ఉండకూడదని ఆయన అనుకునేవారు. ఎవరి అవసరాలకు వారు ఖర్చుపెట్టుకునే అవకాశం ఇచ్చారు. తండ్రి ఆశయాలను నెరవేరస్తూ, ఆయన్ని గౌరవించేవారు నలుగురు కొడుకులు. 77 ఏళ్ళ వయస్సు వచ్చినా మదన్‌లాల్‌షా ఇంకా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇదంతా ఉమ్మడి కుటుంబం వల్లే సాధ్యం అంటారు షా. నలుగురు కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళతో పాటు దగ్గర బంధువులు కూడా మదన్‌లాల్‌ ఇంటి దగ్గరే ఉంటారు. కష్టమయినా, సుఖమయినా అంతా కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ఏవైనా ఇబ్బందులు వచ్చినా తాత గారి సలహాతో ముందుకెళ్తారు.

నిఫా ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంతా కాదు. 1960 లో రెండు మెషీన్లతో కంపెనీ ప్రారంభమయినా.. ఎంతో నిబద్ధతతో, శ్రమతో నిఫాని ముందుకి తీసుకెళ్ళారు. అప్పటికీ ఇప్పటికీ మదన్‌లాల్‌షా తన కొడుకులు, ఉద్యోగులకు ఒకటే చెబుతారు. ప్రజలు, సామాజిక విలువలే ప్రధాన అంటారు. వ్యాపారం అంటే లాభం ఒక్కటే కాదు, నిజాయితీతో వ్యాపారం చేయడం, అతి తక్కువ లాభంతో ఎక్కువ క్వాలిటీ ఇవ్వాలంటారు. ప్రతి అనుభవం ముఖ్యం, ప్రతి అనుభవం నుంచీ పాఠాలు నేర్చుకోవాలంటారు. గ్లోబలైజేషన్ ప్రభావం వల్ల మన ప్రొడక్ట్ ఎంతో విశిష్టంగా ఉండాలి, పోటీ పెరిగే కొద్దీ, నాణ్యత పెరగాలంటారు. ఆర్థిక పరిస్థితులను అంచనా వేసుకుంటూ, ప్రచారం నిర్వహించుకోవాలంటారు షా.

నిఫా సామాజిక బాధ్యత

ఏదో కంపెనీ పెట్టడం నాలుగు డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా ఉండకూడదంటారు మదన్‌లాల్‌షా. ప్రతి కంపెనీకి సామాజిక బాధ్యత ఉండాలి. నిఫా ఆధ్వర్యంలో రెండు ట్రస్ట్‌లు పనిచేస్తున్నాయి.

గత మూడు దశాబ్దాలుగా విద్య, సామాజిక రంగాల్లో సేవలు అందిస్తున్నారు.

మదన్‌లాల్ ఛారిటబుల్ ట్రస్ట్

సామాజిక సేవకు మదన్‌లాల్ ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన ఎన్నో సంస్థలు ఇప్పుడు విజయవంతంగా నడుస్తున్నాయి. జున్‌జుహ్నూ లోని జేబీ షా గర్ల్స్ (పీజీ) కాలేజ్. మహిళలను విద్యావంతులుగా, ఉద్యోగులుగా మార్చడమే కాలేజ్ లక్ష్యంగా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్లక్షరాస్యత నిర్మూలనకు జేబీ షా ఎంతో కృషి చేశారు. లాయర్‌గా, స్వాతంత్ర్య సమరయోధుడిగా మదన్‌లాల్‌షా ఎంతో శ్రమించారు. లక్షలాదిమంది నిరుపేద అమ్మాయిలను విద్యావంతులుగా మార్చారు. మొదట్లో గ్రాడ్యుయేషన్ వరకూ ఉన్న కాలేజ్‌ని 1989లో పీజీ స్థాయికి మార్చారు. ఈ కాలేజ్‌కి న్యాక్ కూడా గుర్తింపునిచ్చింది. ఐఎస్‌ఓ 9001-2000, ఇంటర్‌టెక్ సంస్థ కూడా కాలేజ్‌ని గుర్తించింది.

నిఫా ఛారిటబుల్ ట్రస్ట్

తండ్రి నడిచిన బాటలోనే ముందుకు సాగారు ఘన్‌శ్యాం దాస్ కంపెనీ పేరుమీద నిఫా ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. ఐలా తుపానుతో అతలాకుతలం అయిన ప్రాంతాల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేశారు. సమాజంలో పేదరికం నిర్మూలన, అక్షరాస్యతకు ట్రస్ట్ ప్రాధాన్యత ఇస్తోంది. 10 గ్రామాల్లో, 20 వేలమంది గ్రామీణులకు ట్రస్ట్ ప్రయోజనం చేకూరుస్తోంది. 25 లక్షల రూపాయలు సేకరించి ఆయా గ్రామాల్లో సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు.

నిఫా సంస్థ కార్యకలాపాలు, సేవలను తెలుసుకోవాలంటే niphaindia ని చూడొచ్చు.


గెస్ట్ ఆథర్ - ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో నమన్ షా రాశారు. యూఎస్ టెక్ స్టార్టప్ బిజ్ ఈక్విటీలో ఆయన ఆసియా లీడ్‌గా పనిచేస్తున్నారు. namanshah203@gmail.com. నమన్‌ను సంప్రదించవచ్చు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags