సంకలనాలు
Telugu

బైకునూ చేసి.. ప్రాణమూ పోసి !

బైక్ అంటే రాయల్ ఎన్ ఫీల్డ్, పల్సర్, సీబీజీ... ఇలాంటి పేర్లు వినిపిస్తాయి. కానీ అక్కడ బైకులంటే లాడో, అఘోరీ, రాజ్ మాతా, జోర్దార్... ఇవీ పేర్లు. ఇవేం పేర్లని ఆశ్చర్యంగా ఉందా? ఈ పేర్ల వెనుక ఓ చరిత్ర ఉంది. ఈ బైకుల వెనుక ఓ కథ ఉంది. అవేంటో తెలుసుకోవాలంటే విజయ్ సింగ్ ను పలకరించాలి. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానన్న మాటలు సినిమావాళ్ల నుంచి ఎక్కువగా వినిపిస్తాయి. ఇతని కథ కూడా అలాంటిదే. మాస్ కమ్యూనికేషన్ చేసి జర్నలిస్ట్ కావాల్సిన విజయ్ సింగ్... తనకిష్టమైన బైకుల తయారీ రంగంలో అడుగుపెట్టాడు. రాచరికం ఉట్టిపడే రాయల్ బైకులను తయారు చేస్తూ మోటార్ సైకిల్ బ్రహ్మగా మారాడు. బైక్ లవర్స్ కు హీరో అతను. ఇంతకీ ఎవరీ విజయ్ సింగ్? తెలుసుకోవాలంటే జైపూర్ వెళ్లాలి.

team ys telugu
26th Mar 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఒకచోట నుంచి మరోచోటికి వెళ్లడానికి ఉపయోగపడే టూవీలర్ కు ఎందుకంత ఆర్భాటం... అదే ధరతో మంచి కార్ వస్తుంది కొనుక్కోవచ్చు కదా అని అని రాయల్ ఎన్ ఫీల్డ్ నడిపే ఏ వ్యక్తినైనా అడిగితే నవ్వి ఊరుకుంటారు. అవును మరి...! ఈ లాజిక్ కు అందని విషయం ఏదో ఉంటుంది బైక్ లో. అందుకే అంత పిచ్చి. అంత ఇష్ఠం. అలా బండిపై లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే, చల్లని గాలి ముఖానికి తగుల్తూ, జుట్టు అలల్లా ముందుకు వెనక్కు వెళ్తుంటే... ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టు, ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్టు ఉంటుంది. ఆ రాజసమే వేరు అన్నది కుర్రాళ్ల సమాధానం. బైక్ కొనడానికి ఎంత ఖర్చు చేస్తారో... దాన్ని తమక్కావాల్సినట్టు తీర్చిదిద్దడానికి అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తుంటారు కుర్రాళ్లు. నా బైక్ అలా ఉంటే బాగుంటుంది... ఇలా ఉంటే బాగుంటుంది అని కలలు కనేవారందరికీ కేరాఫ్ అడ్రస్... రాజ్ పుత్నా కస్టమ్ మోటార్ సైకిల్స్. యజమాని విజయ్ సింగ్. బైకులంటే అమితమైన ఇష్టం ఉన్న వారికోసం అందమైన బైకులను తయారు చేసివ్వడమే వీరి పని. వీళ్లు తయారు చేసినట్టుగా ఇంకెవరూ బైకులను తయారుచెయ్యరంటే అతిశయోక్తి కాదు. మోటార్ సైకిల్ అమ్మాయి లాంటిది. ఆ బైక్ కి ఏం కావాలో మనమే అర్థం చేసుకోవాలి. బైక్ తో మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేయాలి. ఇదీ కుర్రాళ్ల మాట. వీరి అవసరాలకు సమాధానం ఇతని దగ్గరుంది. బైక్ ని ఎలా కావాలంటే అలా తయారు చేసి ఇవ్వగల టూవీలర్ బ్రహ్మ ఈ విజయ్ సింగ్.

image


ఫ్యామిలీ అంతా ఇంతే !

జైపూర్ లోని రాజ్ పుత్ ఫ్యామిలీలో జన్మించాడు విజయ్ సింగ్ అజైరాజ్ పురా. ఇతనికి బైకులపై ప్రేమ ఇప్పటిది కాదు. ఏడేళ్ల వయస్సులోనే వాటిపై మనసు పారేసుకన్నాడు. విజయ్ సింగ్ కోసం అతడి తండ్రి తొలిసారిగా ఓ బైక్ ను తయారు చేసిచ్చాడు. అదీ ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు. ఆ యాభై సీసీ ఇంజిన్ బైక్ ను మోటోక్రాస్ ట్రాక్ పై నడిపించడం మరో విశేషం. విజయ్ కి మాత్రమే కాదు... వీరి ఫ్యామిలీకి బైకులతో గొప్ప అనుబంధం ఉంది. 1970వ దశకంలో విజయ్ తండ్రి జైపూర్ మోటార్ సైకిల్ క్లబ్ లో రేసుల్లో పాల్గొనేవాడు. తాత 1977లో తొలిసారిగా ఆలిండియా మోటోఎక్స్ రేస్ ను జైపూర్ లో నిర్వహించాడు.

2005లో మాస్ కమ్యూనికేషన్ నేర్చుకోవడానికి కెనెడా వెళ్లాడు . తిరిగి వచ్చిన తర్వాత జర్నలిస్ట్ గా ఉద్యోగంలో చేరాల్సి ఉంది. కానీ ఆ వృత్తిని ఎంచుకోకుండా చిన్న గ్యారేజ్ లో ఓ బైక్ ని తయారు చేశాడు. తన బంధువు సాయంతో ఆ బైక్ ను ఆటోఎక్స్ పో -2010లో ప్రదర్శించాడు. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పట్నుంచి వెనుతిరిగి చూడలేదు. ఆర్డర్ల మీద బైకులను తయారు చేయడం మొదలు పెట్టాడు. రాజ్ పుత్ వారసత్వాన్ని, సంప్రదాయాన్ని తన బైకుల్లో ప్రతిబింబించాడు. పేర్లు కూడా రాజ్ పుత్ కల్చర్ నుంచి తీసుకున్నవే. లాడో, అఘోరీ, రాజ్ మాతా, జోర్దార్, గులాయిల్, బిటూ పేర్ల వెనుక ఇదే మర్మం దాగి ఉంది. తాను తయారుచేసే బైకులకు ఇంగ్లీష్ ఫ్యాన్సీ పేర్లు పెడితే ఇంతలా క్లిక్కయ్యేది కాదంటాడు విజయ్ !

ఆ కిక్కే వేరప్పా !

విజయ్ మొదటి కస్టమర్ ఎవరో తెలుసా? బాలీవుడ్ లో బైకులంటే పడిచచ్చే నటుడు జాన్ అబ్రహం. ఆటో ఎక్స్ పోలో తొలి బైక్ ను ప్రదర్శించిన తర్వాత తొలి ఆర్డర్ ఇచ్చాడు జాన్ అబ్రహం. "నాకు నటుడు జాన్ అబ్రహం నుంచి కాల్ వచ్చింది. ముంబై వచ్చేయమన్నాడు " ఇదీ తన మొదటి క్లైంట్ గురించి విజయ్ చెప్పే మాట. విజయ్ లాగే జాన్ అబ్రహంకు బైకులంటే మహాఇష్టం. తనకు ఏం కావాలో, ఎలాంటి ఇంజన్ ఉండాలో జాన్ వివరించాడు. ఆ బైక్ ని తయారు చేసి "లైట్ ఫుట్" అని నామకరణం చేశారు. అమెరికన్ బోర్డ్ ట్రాక్ రేసర్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ బైక్ ను తయారు చేశారు. ఆర్సీఎం దగ్గర జాన్ అబ్రహం బైక్ తయారు చేయించాడన్న ఈ వార్త అందరికీ తెలియడంతో చాలా ఆర్డర్లు వచ్చాయి. అలా మోటార్ సైకిల్ ఔత్సాహికులకు రాజ్ పుత్నా కస్టమ్స్ ఫేమస్ అయిపోయింది. రాజ్ పుత్నా కస్టమ్స్ ను ఫేస్ బుక్ ద్వారా చాలామందికి పరిచయం చేశాడు . ఫేస్ బుక్ లో మూడు లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఎప్పుడు ఎవరు ఎలాంటి సందేహం అడిగినా వెంటనే తీర్చేస్తాడు . ఇప్పటి వరకు 30కి పైగా బైకులను తయారు చేశాడు. ఇదీ విజయ్ ట్రాక్ రికార్డ్. ఇంకా ఎన్ని చేయగలవు అనే ప్రశ్నకు ఎన్నైనా చేయగలననే సమాధానమిస్తాడు. ఎన్ని బైకులను తయారు చేసినా దేనికదే సాటి. దేనికదే ప్రత్యేకం. ఆర్సీఎంలో ఒక్క డిజైన్ కూడా రిపీట్ కాలేదంటే ఆశ్చర్యపోవాల్సిందే.

బైక్ తయారీ అంత ఈజీయా ?

ఇద్దరు వ్యక్తులతో మొదలైన రాజ్ పుత్నా కస్టమ్స్ లో ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య పెరిగింది. తన తండ్రి స్నేహితుడైన మెకానిక్ అబ్దుల్ సాయంతో మొదట్లో బైక్ లు తయారుచేసేవాడు. వీరికి టప్పన్ సహాయకుడు. ఇప్పుడు వీరి టీమ్ లో మెకానికల్ స్కిల్స్ స్పెషలిస్ట్ దేవాషిష్ శర్మ జతకలిశాడు. వీరితో పాటు మెకానిక్లు, పెయింటర్లు, దర్జీ లాంటి వారంతా కలిసి టీమ్ గా ఏర్పడ్డారు. బైక్ కు కావాల్సిన పార్ట్స్ ను తయారుచేసిచ్చేందుకు లేత్ ఆపరేటర్లు కూడా ఉన్నారు. ఒక బైక్ ను సొంతగా కస్టమైజ్డ్ చెయ్యడమంటే అంత సులువేం కాదు. మొదట్లో విజయ్ కి ఇలాంటి కష్టాలే ఎదురయ్యాయి. కానీ బైక్ లపై ఉన్న ప్రేమతో ఆ సమస్యల్ని అధిగమించాడు. సొంతగా బైకులు తయారు చేసేందుకు విజయ్ చాలా విషయాలు నేర్చుకోవాల్సి వచ్చింది. "మొదట్లో మేము చాలా తప్పులు చేశాం. అయినా వెనుకడుగు వెయ్యలేదు. బైక్ లపై ఉన్న ప్రేమ అలాంటిది. పదిసార్లు తప్పులు చేసినా పదకొండోసారి మేము సక్సెస్ అయ్యాం" అని తమ విజయాల గురించి వివరిస్తున్నాడు విజయ్. పనిపై ఉన్న ఇష్టం, అంకితభావం వల్లే ఆర్సీఎం కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఇప్పటికీ ఆర్సీఎం గ్యారేజ్ లో అత్యాధునికమైన పరికరాలేమీ లేవు. త్రీడీ ప్రింటర్స్ కాలంలో కూడా పురాతన పరికరాలను వాడి అబ్బురపరిచే బైకులను తయారు చేయడమంటే మాటలు కావు. ఒక్కసారి ఆర్సీఎంలో తయారు చేసిన బైకులను, ఇతర కంపెనీలు రూపొందించిన బైకులను పోల్చి చూస్తే అర్థమవుతుంది విజయ్ ఎంచుకునే డిజైన్లు ఎంత అధ్భుతంగా ఉంటాయో ! రాచరిక రాజ్ పుత్ సంస్కృతిని స్ఫూర్తిగా తీసుకొని తన బైకులను డిజైన్ చేస్తుంటారిక్కడ. భిన్నమైన డిజైన్లతో ఆకట్టుకోవడం రాజ్ పుత్స్ కళ. వాళ్లు వాడే ఆయుధాల దగ్గర్నుంచీ భవనాల వరకు చూస్తే తెలుస్తుంది. అందుకే ఈ బైకుల్లో రాజ్ పుటానా కల్చర్ స్పష్టంగా కనిపిస్తుంది.

image


రేపు ఏంటి ?

image


భవిష్యత్తు ప్రణాళికలేంటని అడిగితే విజయ్ సింగ్ నవ్వుతాడు. ఇన్నాళ్లూ తనకిష్టమైనదే చేశాను... ఇకపై తనకిష్టమైనదే చేయబోతున్నానని చెబుతున్నాడు. "నేను జర్నలిస్ట్ అయ్యేవాడిని. కానీ నా ఇష్టాయిష్టాలు వేరు. నాకు నచ్చిందే చేయడం మొదలుపెట్టాను. ఇకపై కూడా అంతే". బైక్ లవర్స్ నుంచి ఇంత ఆదరణ ఉన్నా తాను జైపూర్ దాటి బయట అడుగు పెట్టనంటున్నాడు. బైకుల తయారీ పరిశ్రమని జైపూర్ లోనే కొనసాగిస్తానని చెబుతున్నాడు. విజయ్ అంటే ఒక బైక్ తయారీదారుడు మాత్రమే కాదు. తనలో ఓ రేసర్ దాగి ఉన్నాడు. ఇంగ్లండ్ లో నాలుగు రేసుల్లో పాల్గొన్న విజయ్... ప్రొఫెషనల్ రేస్ టీమ్ అయిన ఎపెక్స్ రేసింగ్ బృందంలో సభ్యుడు.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags