సంకలనాలు
Telugu

ఓ చిన్న గ్రామంలో పుట్టిన స్టార్టప్.. దేశవ్యాప్తంగా ఆర్డర్లు సంపాదిస్తోంది..!!

 హస్తకళల మార్కెట్ కు ఆన్ లైన్ బాట చూపుతున్న నవ్య !!

SOWJANYA RAJ
19th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


చేతివృత్తులు, హస్తకళలు భారతదేశంలో అనేక గ్రామాల్లో ఆదాయవనరులు. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత వీటికి కష్టకాలం ప్రారంభమైంది. మల్టీనేషనల్ కంపెనీలు, చైనా తయారీ వస్తువులు దేశంపై దండెత్తిన తర్వాత వీరికి ఉపాధి తగ్గిపోతూ వస్తోంది. చేతివృత్తులు, హస్తకళలనే నమ్ముకున్న లక్షలాది మంది కార్మికులు, కళాకారుల జీవితాలు చితికిపోయాయి. అయితే ఇటీవలి కాలంలో ఆ టెక్నాలజీనే వీరికి మళ్లీ కొత్త ఊపిరి పోసే ప్రయత్నం చేస్తోంది. దేశంలో ప్రస్తుతం నడుస్తున్న ఈ కామర్స్ బూమ్ ను హస్తకళల కళాకారులు ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరికి కావాల్సింది కొంచెం కొత్త తరం అండ. ఈ అంశాన్ని బాగా గుర్తించింది నవ్య అగర్వాల్. అందుకే.. పట్టుమని పాతికేళ్లు నిండకుండానే చేతివృత్తులు, హస్తకళల కళాకారులకు చేతినిండా పని ఇచ్చే స్టార్టప్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది.

ఎవరీ నవ్య అగర్వాల్..?

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సీతాపూర్ గ్రామం. గుర్తు చెప్పుకోవడానికి లక్నో పేరు వాడుకున్నా... సీతాపూర్ బాగా వెనుకబడిన గ్రామం. కనీస సౌకర్యాలు అంతంతమాత్రం. కానీ ఆ గ్రామంలో హస్తకళలకు ప్రాధాన్యం ఎక్కువ. దాదాపు ప్రతి ఇంటిలోనూ ఓ కళాకారుడు ఉంటారు. ఎక్కువ మంది వాటితోనే ఉపాధి పొందుతూ ఉంటారు. కానీ వారికి లభించే ఆదాయం మాత్రం అత్యల్పం. కానీ తమకు చిన్నప్పటి నుంచి అలవాటైన పనే కనుక... దాన్నే చేస్తూ ఉంటారు కళాకారులు. ఇలాంటి గ్రామంలో ఓ మోస్తరు వ్యాపారస్తుల కుటుంబం నుంచి వచ్చింది నవ్య అగర్వాల్. పట్టణాల్లో చదువులు పూర్తి చేసింది. కానీ ప్రాజెక్టు వర్క్ కోసం మూడేళ్ల కిందట మళ్లీ గ్రామానికి వచ్చింది. గ్రామంలో పరిస్థితులు చూసిన తర్వాత .. కార్పొరేట్ ప్రపంచంలో పరుగులు పెట్టాలని ఆమెకు అనిపించలేదు. గ్రామస్తుల అబ్బురపరిచే కళానైపుణ్యానికి కొద్దిగా సృజనాత్మకత జోడిస్తే ... కళాకారులు, కార్మికుల బతుకు మారిపోతుందని ఆమె అంచనా వేసింది. మనసులో ఫిక్సయిన తర్వాత పెద్దగా ఆలోచించలేదు నవ్య. వెంటనే 2013లో ఐ వాల్యూ ఎవ్రీ ఐడియా ( IVEI ) పేరుతో స్టార్టప్ ను ప్రారంభించింది.

నవ్య అగర్వాల్, IVEI ఫౌండర్<br>

నవ్య అగర్వాల్, IVEI ఫౌండర్


తండ్రి ఇచ్చిన రుణంతో స్టార్టప్

తన ఆలోచన తండ్రికి వివరించిన నవ్య అగర్వాల్.. స్టార్టప్ కోసం పెట్టుబడిని ఇచ్చేందుకు ఒప్పించగలిగింది. నవ్య చెప్పిన అన్నీ విషయాలు సావధానంగా ఆలకించిన తండ్రి రూ.మూడున్నర లక్షలు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఆ మొత్తంతోనే స్టార్టప్ ప్రారంభించారు నవ్య అగర్వాల్. మెరుగైన పనితనం ఉన్న హస్తకళాకారుల్ని ఎంచుకునేందుకు ఇందులోకొంత మొత్తం వెచ్చింది. తనకు కావాల్సిన ఉడెన్ ఆర్టికల్స్ తయారు చేయాల్సిందిగా గ్రామంలో పలువురికి పనులు అప్పగించారు. తను చెప్పినదానితో పాటు కొంచెం క్రియేటివ్ గా ఆలోచించి చేసే వారిని ఆమె ఎంచుకున్నారు. ఎలాంటి ఆధునిక యంత్రాలు వాడకుండా అద్భుతంగా వారు ఉడెన్ ఆర్టికల్స్ రూపొందించిన తీరు చూసి తన స్టార్టప్ కు ఢోకా ఉండదని ఆమె ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు. అయితే తన స్టార్టప్ గురించి చెప్పి.. అందర్నీ తను చెప్పిన విధంగా ఉడెన్ ఆర్టికల్స్ తయారు చేయించేలా ఒప్పించేందుకు ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది.

" కొత్త పద్దతుల్లో, క్రియేటివ్ గా పనిచేసే విషయం ఇరవై మూడేళ్ల అమ్మాయి సలహాలివ్వడాన్ని వారు తేలిగ్గా తీసుకునేవారు. దాంతో వాళ్ల వర్క్ షాపులకు వెళ్లి కూర్చుని చెప్పి పని చేయించేదాన్ని. నేను చెప్పినది చేసిన తర్వాత వారి పనితనాన్ని చూసి వారే ఆశ్చర్యపోయేవారు. ఆ తర్వాత మరింత నేర్చుకునేందుకు ఆసక్తి చూపించారు. కొంత మంది అయితే మాకు కొత్తదనంతో పనిచేయడం నేర్పితే చాలు ఉచితంగా చేస్తామని ముందుకొచ్చారు" నవ్య అగర్వాల్, IVEI ఫౌండర్

పగిలిపోయిన గాజులతో చేసిన బుక్ మార్క్<br>

పగిలిపోయిన గాజులతో చేసిన బుక్ మార్క్


పని ప్రారంభం...!

ముందుగా క్రియేటివ్ గాపనిచేస్తున్న 12 మంది హస్తకళాకారులతో ఒప్పందాలు చేసుకుని తయారీ పనులు ప్రారంభించారు నవ్య అగర్వాల్. ఈ పన్నెండు మందిలో ఓ హౌస్ మెయిడ్ కూడా ఉంది. ఈమె చెక్కతో గాజులు చేయడంతో ప్రత్యేకమైన ప్రతిభ చూపిస్తుంది. ఓ యువతి మొహందీ డిజైనింగ్ పై అమిత ఆసక్తితో పనిచేస్తుంది. హస్తకళాకారులందరికీ మొదట నవ్య అగర్వాల్ బేసిక్ డిజైన్ల తయారీ బాధ్యతను ఇచ్చేవారు. పెన్ స్టాండ్స్, వాల్ క్లాక్స్, ట్రేస్, స్నాక్ బౌల్స్ లాంటివి తయారు చేయించేవారు. అవి సిద్ధమైన తర్వాత అక్రాలిక్ పెయింట్, విరిగిపోయిన గాజుముక్కలు, కుట్టుపనితో అందంగా ముస్తాబు చేయించేవారు. అందరి పనితనాన్ని కొద్దికొద్దిగా మెరుగుపరిచే ప్రయత్నం చేసేవారు.

image


నవ్య అగర్వాల్ స్టార్టప్ తయారు చేసే ఉత్పత్తులు అత్యంత ఆకర్షణ తయారవుతున్నాయి. కానీ వాటిని మార్కెట్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారింది నవ్య అగర్వాల్ కి . అయితే కుకు క్రెట్ అనే సంస్థ నుంచి మొదటి ఆర్డర్ పొందింది నవ్య అగర్వాల్. వంద మిక్కీమౌస్ షేప్ లో ఉన్న క్లాక్స్ కు ఆర్డర్ వచ్చింది. ఒక్క క్లాక్ తయారీకి వంద రూపాయలు అయితే నూట పదిరూపాయలకు అమ్మారు... అదే నవ్య కళ్ల జూసిన మొదటి లాభం. అయితే కొన్నాళ్ల పాటు నవ్యకు సరైన ఆర్డర్స్ లభించలేదు. పెద్ద పెద్ద ఆర్డర్స్ సంపాదించడం కోసమే ఆమె ఎక్కువ సమయం కేటాయించేవారు. అయితే మొదటగా ఆర్డర్ ఇచ్చిన "కుకు క్రెట్" అనే సంస్థ హఠాత్తుగా మూత పడటంతో నవ్య అగర్వాల్ మనసు మారింది.

ఆ తర్వాత బొటిక్ షాపులను టార్గెట్ గా మార్కెటింగ్ ప్రారంభించారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై లాంటి మెట్రో నగరాల్లోని దుకాణాల్లో వీటిని అందుబాటులో ఉంచడం ప్రారంభించారు. అయితే 2014లో ఐదు వందల వైట్ బోర్డ్ క్యాలెండర్స్ కోసం వచ్చిన ఆర్డర్ IVEI దశను మార్చేసింది. ఈ ఆర్డర్ మీద మంచి లాభాలను కళ్ల జూడటంతో నవ్య అగర్వాల్ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఫ్లిప్ కార్ట్. స్నాప్ డీల్, అమెజాన్ లోనూ నవ్య స్టార్టప్ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు కార్పొరేట్ ఆర్డర్స్ సైతం అందుకుంటున్నారు.

లాంగ్ రన్ కి రెడీ

మొదట్లో కొంత సమయమే తన స్టార్టప్ కోసం పనిచేసేలా హస్తకళాకారులతో ఒప్పందం చేసుకుంది నవ్య అగర్వాల్. స్టార్టప్ సక్సెస్ బాట పట్టడంతో వారిని పూర్తి స్థాయిలో నియమించుకుంది. ఇప్పుడు మొత్తం 18 మంది కళాకారులు IVEIలో పనిచేస్తున్నారు. వీరంతా గంటకు రూ.60 వరకు సంపాదిస్తున్నారు. అంతకు ముందు రోజంతా కష్టపడి పని చేసినా వీరికి రూ.200దక్కడమే గగనంగా ఉండేది. సంస్థ ఆదాయం కూడా అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. మొదటి ఏడాది IVEIకి వచ్చిన ఆదాయం కేవలం లక్ష రూపాయలే. కానీ పట్టుదలతో నవ్య అగర్వాల్ చేసిన ప్రయత్నాలతో సంస్థ ఆదాయం రూ.18లక్షలకు చేరింది. ఆన్ లైన్ ఆర్డర్స్ తో పాటు.. కార్పొరేట్ బల్క్ ఆర్డర్స్, షాపుల ఆర్డర్స్ కూడా అనూహ్యంగా పెరగడమే దీనికి కారణం. ఇది ఆ బృందం మొత్తానికి చాలా పెద్ద మొత్తం.

image


సీతాపూర్ నుంచి ఆన్ లైన్ ప్రపంచంలోకి..!

యూపీలోని మరుమూల గ్రామం నుంచి సాగిన సక్సెస్ స్టోరీ పై నవ్య అగర్వాల్ కొన్ని విషయాలు ఇతర ఔత్సాహిక అంట్రప్రెన్యూర్లతో పంచుకుంటారు.

1. స్థలబలిమి అక్కర్లేదు: సీతాపూర్ లో కూర్చుని మార్కెట్ పెంచుకోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. అయితే మంచి పనితనం ఉన్న వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు వెనుకాడరు. దీనికి ఆన్ లైన్ మంచి వేదిక కల్పిస్తోంది. మంచి ఉత్పత్తులు అందజేస్తే చాలు.. ఎక్కడ నుంచి అనేది అవసరం లేని విషయం

2. స్టాఫ్ కోసం ప్రత్యామ్నాయాలను ఉంచండి: నా స్టార్టప్ ప్రారంభ సమయంలో హస్తకాళాకారులందర్నీ చేస్తున్న పనుల్ని వదిలి వచ్చేయమని చెప్పలేదు. వారి చేత రెండు మూడు గంటల పని చేయించుకునేదాన్ని.

3. ఎదిగే ప్రయత్నంలో చిన్న చిన్న అంశాలను వదిలేస్తూంటాం. కానీ నా స్టార్టప్ విషయంలో చిన్న చిన్నవే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి. ఈ హస్తకళాకారులు పిల్లలకు చదువులు చెప్పించడానికి, సంతృప్తిగా జీవించడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందనే సంతృప్తి ఉంది.

అందుకునే ప్రయత్నం చేస్తే మార్కెట్ పెద్దదే..!

భారత్ లో హ్యాండ్ క్రాఫ్ట్స్ మార్కెట్ చాలా పెద్దదే. అంతరించి పోతున్న కళను ప్రొత్సహించే విషయంలోఇటీవలి కాలంలో మంచి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ స్కిల్ ఇండియా మిషన్ ను ఆవిష్కరించింది. వీరికి ప్రొత్సాహం అందించే విషయంలో ఆన్ లైన్ ఈకామర్స్ స్టార్టప్ లు ముందడుగు వేస్తున్నాయి. దేశం నలుమూలల విశేషమైన చరిత్ర ఉండి ఆదరణ కోల్పోతున్న కళలకు ఇవి ప్రాణం పోస్తున్నాయి. ఇలాంటి స్టార్టప్స్ బాటలోనే నవ్య అగర్వాల్ కూడా నడుస్తున్నారు. వచ్చే ఏడాదిలో 40 మంది హస్తకళాకారులతో తన IVEI స్టార్టప్ ను మరింత విస్తరించాలనే ప్రణాళికలు వేసుకుంటున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags