సంకలనాలు
Telugu

ఒకప్పుడు తోపుడుబండి..!ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల వ్యాపారి..!!

umarani kurapati
25th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ఈ ప్రపంచాన్ని నువ్వు చూడలేకపోతే ఏం? ఈ ప్రపంచం నిన్ను చూసేలా ఏదైనా చేయి! ఇదీ ఓ అమ్మ మాట. ఇప్పుడా అమ్మ లేదు. కానీ ఆ అమ్మ చెప్పిన మాటలు ఉన్నాయి. అమ్మ ఇచ్చిన స్ఫూర్తి ఉంది. అదే స్ఫూర్తి భవేష్ భాటియాను వ్యాపారవేత్తను చేసింది. కష్టాల కడలిని ఎదురీదిన ఈ అంధుడు ‘సన్‌రైస్ క్యాండిల్స్’ కంపెనీ ఏర్పాటు చేసి వందలాది కుటుంబాలకు వెలుగులను నింపేలా మలిచింది.

image


కష్టాల వెంటా కష్టాలే..

భవేష్ పుట్టుకతో అంధుడు కాదు. రెటీనా సమస్య కారణంగా 23 ఏళ్ల వయసుకే పూర్తిగా చూపును కోల్పోయాడు. ఒక హోటల్‌లో మేనేజర్‌గా పనిచేసిన భవేష్ సంపాదనంతా క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి వైద్యం కోసమే ఖర్చు చేశాడు. ఎందుకంటే అమ్మే అతని తోడూనీడా. . చూపు లేని కొడుకుని నడిపించాల్సింది అమ్మే. చూపు లేకపోవడంతో ఉద్యోగం పోయింది. నాన్న సంపాదన అంతంతమాత్రమే. అతను దాచిన డబ్బూ ఖర్చయింది. అయినా అమ్మను బతికించుకోలేకపోయాడు. ఒక్కసారిగా శూన్యం ఆవహించింది. సర్వస్వం కోల్పోయిన ఫీలింగ్. గంటల తరబడి అమ్మ చదివి వినిపిస్తేనే భవేష్‌కు పాఠాలు బుర్రకెక్కేది. పీజీ పూర్తి అయ్యేవరకు అమ్మ మాటే ఆయనకు ఆధారం.

తొలి అడుగు పడింది..

భవేష్‌కు చిన్నప్పటి నుంచి పతంగులు, మట్టితో బొమ్మలు చేయడం, అలంకరణ వస్తువుల వంటివి చేసే అలవాటుంది. ఆ అనుభవంతో క్యాండిల్స్ తయారు చేయాలని నిర్ణయించారు. వెలుగు అంటే ఆకర్షించడం. చూపు లేకపోతేనేం తనను పదిమంది ఆకర్షించాలి. ఇదే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టాడు. ఆలోచన వచ్చిందే తడవుగా ముంబైలోని నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్‌లో 1999లో శిక్షణ తీసుకున్నారు. అక్కడ సాధారణ క్యాండిళ్ల తయారీ మాత్రమే నేర్పారు. కానీ భవేష్‌కు అంతకంటే కొత్తగా ఏదో చేయాలనిపించింది. రంగురంగుల క్యాండిళ్లు. వివిధ రూపాల్లో ఉండేవి, మంచి వాసన వచ్చేవి.. ఇలాంటివి తయారు చేయాలనుకున్నాడు. కానీ వాటికి అవసరమయ్యే సాంచ(డై) ఖరీదు ఎక్కువ. తన దగ్గర అంత పెట్టుబడి పెట్టడానికి డబ్బుల్లేవు. 

ప్రస్తుతానికి అలాంటి ఆలోచన కాసేపు పక్కన పెట్టి- బేసిక్‌ క్యాండిళ్లను తయారు చేశాడు. వాటిని మహాబలేళ్వర్‌లోని మార్కెట్లో ఒకచోట బండిపై పెట్టుకుని అమ్మేవాడు. తెలిసిన వ్యక్తి దగ్గర ఒక తోపుడు బండి అద్దెకు తెచ్చుకున్నాడు. దాని కిరాయి రోజుకు రూ.50. క్యాండిల్స్ అమ్మగా వచ్చిన డబ్బుల్లో తర్వాతి రోజుకోసం రూ.25 దాచి- ముడి సరుకులను కొనేవాడు. రోజూ ఇలా గడిచిపోతుంటే కొందరు భవేష్‌ను చూసి ఓర్వలేదు. బండి దగ్గరకు వచ్చి గొడవ చేశారు. క్యాండిళ్లను కింద పడేశారు. ఇలా అయితే లాభం లేదనుకున్నాడు. క్యాండిళ్లను నేరుగా దుకాణాలకు సరఫరా చేస్తే ఈ సమస్యలు ఉండవని భావించాడు. క్యాండిల్ తయారీదారులను, సంస్థలను సంప్రదించాడు. వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు. అప్పు కోసం వెళ్లినా ఎక్కడా పుట్టలేదు.

మలుపు తిప్పిన పరిచయం..

ఒకరోజు క్యాండిళ్లు కొనేందుకు ఒక యువతి వచ్చింది. కాసేపు భవేష్‌తో ఫ్రెండ్లీగా మాట్లాడింది. ఆ పరియయం స్నేహంగా మారింది. ఆమె ప్రవర్తన భవేష్‌కి నచ్చింది. గంటల తరబడి మాట్లాడుకునేవారు. క్రమంగా ఒకరినొకరు లవ్‌ ఎక్స్‌ప్రెస్‌ చేసుకున్నారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాడు భవేష్. ఆమె పేరు నీత. పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. మరి భవేష్‌కి చూపులేదు. పైగా చిరు వ్యాపారి. సహజంగానే నీత ఇంట్లో వ్యతిరేతక వచ్చింది. అయినా వారి నిర్ణయం మారలేదు. ఇద్దరూ ఒక్కటయ్యారు. మహాబలేశ్వర్‌లోని కొండ ప్రాంతంలో ఉన్న చిన్న ఇంట్లో వారి కాపురం.


జీవిత భాగస్వామితో

జీవిత భాగస్వామితో


నీత వెలుగులో..

వంట గిన్నెలు లేవు. క్యాండిళ్లు చేసిన పాత్రలనే కడిగి వంట చేసేవాడు. ఈ విషయం తెలిస్తే నీతూ ఏమంటుందో అని భయపడ్డాడు. కానీ ఆమె మాత్రం నవ్వి ఊరుకుంది. వెళ్లి కొత్తవి కొనుక్కొచ్చింది. ఆ తర్వాత టూ వీలర్‌ కొన్నారు. ఇద్దరూ ఆ బండిపై ఊర్లో తిరిగి క్యాండిళ్లను అమ్మేవారు. ఆ తర్వాత చిన్న వ్యాన్ వచ్చి చేరింది. పెద్ద మొత్తంలో అమ్మకాలు పెరిగాయి. నిజంగా నీతాయే రాకపోతే నా జీవితానికి వెలుగు లేదంటాడు భవేష్.

కొత్తగా చేయాలని..

భవేష్‌ టార్గెట్ ఇది కాదు. వెరైటీ క్యాండిళ్లను తయారు చేయాలన్నది అతడి లక్ష్యం. నీతాతో కలిసి మాల్స్‌కు వెళ్లాడు. అక్కడ ఎన్నో వెరైటీలు. అయితే అవన్నీ ఎక్కువ రేటున్న సరుకు అని తెలుసుకున్నాడు. మరి అంత ఖరీదైన ఐటెమ్స్ చేయాలంటే చేతిలో ఉన్న డబ్బు సరిపోదు. సతారా బ్యాంకును ఆశ్రయించాడు. రూ.15,000 రుణం మంజూరైంది. అదే భవేష్‌ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ డబ్బులతో 15 కిలోల మైనం, రెండు సాంచలు, చిన్నపాటి తోపుడు బండి కొన్నాడు. ఇంకేముంది వ్యాపారం అనూహ్యంగా పెరిగింది. చూస్తుండగానే బిజినెస్ టర్నోవర్‌ కోట్ల రూపాయలకు మారింది. భారత్‌తోపాటు పలు దేశాలకు చెందిన పెద్ద పెద్ద సంస్థలు ఇప్పుడు ఆయన క్లయింట్లు. అంతేకాదు 200 మందికిపైగా సిబ్బంది. అన్నట్టు వారంతా భవేష్‌లాగే చూపు సమస్యతో ఉన్నవాళ్లే.

హృదయంతో చూస్తేనే..

వ్యాపారం అంటే చాలామంంది దృష్టిలో లాభమే. అందుకే నిర్ణయాలు కొంత క్రూరంగా ఉంటాయి. అందువల్లే తనకు ఆర్థిక సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని అంటాడు భవేష్. అందరూ డబ్బు పరంగానే ఆలోచిస్తారు. హృదయంతో కాదు. కానీ అలా ఆలోచిస్తే వ్యాపారం అంతకంటే రెట్టింపు అవుతందని నమ్మాడు. అదే నిజమని నిరూపించాడు. కానీ టైం పడుతుంది. కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు తర్వాతి రోజు మైనం కోసం రూ.25 దాచాడు. అదే ఇప్పుడు రోజుకు 25 టన్నుల మైనం ఉపయోగిస్తున్నాడు. 9,000లకుపైగా విభిన్న రకాల క్యాండిళ్లను తయారు చేస్తున్నాడు. మైనాన్ని యూకే నుంచి దిగుమతి చేసుకుంటున్నాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్, ర్యాన్‌బాక్సీ, బిగ్ బజార్, నరోడా ఇండస్ట్రీస్, రోటరీ క్లబ్ క్లయింట్ల జాబితాలో మచ్చుకు కొన్ని. అంతేకాదు తన కంపెనీ నుంచి బయటికి వెళ్లి సొంత కాళ్ల మీద నిలబడేలా కూడా ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. కంపెనీ పాలనా వ్యవహారాలను నీత చూసుకుంటున్నారు. దాంతోపాటు అంధ బాలికలకు శిక్షణ కార్యక్రమాలను కూడా ఆమే పర్యవేక్షిస్తున్నారు.


రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంటూ

రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంటూ


క్రీడాకారుడు కూడా..

భవేష్‌ మంచి ఆటగాడు కూడా. మధ్యలో గ్యాప్ వచ్చినా తనకిష్టమైన వ్యాపకాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. షార్ట్ పుట్, డిస్కస్, జావెలిన్ త్రోల్లో భవేష్ మంచి టాలెంటెడ్‌. పారాలింపిక్ క్రీడల్లో 109 మెడల్స్ కూడా వచ్యిచా. 500 పుష్ అప్స్, 8 కిలోమీటర్ల పరుగుపందెం, జిమ్‌లో వ్యాయామం భవేష్‌ దైనందిన చర్యలు.

ఎవరెస్టంత లక్ష్యంతో..

బ్రెజిల్‌లో జరగబోయే 2016 పారాలింపిక్స్‌కు భవేష్ సిద్ధమవుతున్నాడు. భారత్‌కు బంగారు పతకం తెచ్చిపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 21 మీటర్ల క్యాండిల్ తయారు చేసిన రికార్డు జెర్మనీ పేర ఉంది. అంత కంటే పొడవైన క్యాండిల్ చేయాలని మనవాడి లక్ష్యం. అంతేకాదు గతేడాది నుంచే వినూత్నంగా క్యాండిల్స్ తయారు చేస్తున్నాడు. నరేంద్ర మోడి, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ లాంటి 25 మంది ప్రముఖుల మైనపు బొమ్మలను తయారు చేశారు. ఎవరెస్టును అధిరోహించి ప్రపంచంలో తొలి అంధుడిగా రికార్డు నమోదు చేయాలన్నది మరో భారీ లక్ష్యం కూడా భవేష్ ముందుంది. భారత్‌లో ఉన్న అంధులందరూ వారివారి కాళ్ల మీద నిలబడాలన్నదే తన అభిమతం చిన్నప్పుడు స్కూల్లో గుడ్డివాడివంటూ హేళన చేయడంతో బడికి వెళ్లనని మారాం చేసేవాడు. అయితే అలా అన్నవారంతా చెడ్డవారు కాదు- నీ స్నేహం కోసం చూస్తున్నవాళ్లేనని అమ్మ సర్దిచెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని అంటాడు 45 ఏళ్ల భవేష్.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags