సంకలనాలు
Telugu

కుటుంబం ఒక్కటే జీవితం కాదు..

‘‘చాలా పాతదే అయినా.. ఏదీ అసాధ్యం కాదు.. అనే నానుడిని నేను నమ్ముతాను. మంచయినా, చెడయినా, గెలుపైనా.. ఓటమైనా మన చేతుల్లోనే వుంటుంది. ’’యుక్తి మెహందిరత్తా గురించి ఒక ముక్కలో చెప్పలేం. ఆమె ఓ ఆంట్రపెన్యూర్, కవల పిల్లలకు తల్లి, మోడల్, టీవీ యాంకర్. మిసెస్ గ్లాడ్‌రాగ్స్ పోటీల్లో సెకండ్ రన్నరప్‌గా కూడా నిలిచారు. వ్యాపారమంటే డబ్బు సంపాదించడమే కాకుండా.. మనసుకు కూడా తృప్తినిచ్చే పనిని చేయడం ఆమె ప్రత్యేకత. పిల్లల మీద తనకున్న ప్రేమనే తన బిజినెస్ వెంచర్‌గా మార్చుకుని , సమాజానికి తను చేయగలిగే సాయం చేస్తున్నారామె.

bharathi paluri
19th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
యుక్తి మెహందిరత్తా

యుక్తి మెహందిరత్తా


ఇంట్లో పెద్దమ్మాయి కావడం, తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయడం వల్ల చిన్నప్పటినుంచే నేను చాలా పెద్ద బాధ్యతలు మోయాల్సి వచ్చేది. స్కూలు నుంచి రాగానే, స్టవ్ ముందు స్టూలు వేసుకుని లంచ్ వేడి చేసి నా చెల్లెళ్ళకు పెట్టి నేను తినడం నాకు ఇప్పటికీ గుర్తు. నన్ను అంత బాధ్యతగా పెంచారు మా అమ్మానాన్న.

ఒక సారి గతాన్ని గుర్తు తెచ్చుకుంటే, నా బాల్యమంతా బరువు బాధ్యతలతోనే గడిచిపోయింది. చిన్నపిల్లల్లో వుండే అల్లరి, ఆకతాయితనాలు నాలో వుండేవి కావు. నేను టీనేజర్ అయ్యాక ఒకసారి విమానం ఎక్కాను. నిజానికి అప్పట్లో నా వయసు వాళ్ళు విమానం ఎక్కితే, అదో అపురూపమైన అనుభవంగా ఎగిరి గంతేయాలి. కానీ నేన మాత్రం అదో అలవాటైన పనిలాగా గంభీరంగా వుండిపోయాను. చిన్నప్పుడు నేను అలా బాల్యాన్ని కోల్పోవడం వల్లనేనేమో.. నాకు ఇప్పుడు చిన్న పిల్లలంటే చాలా ప్రేమ. వాళ్ళు చేసే చిన్న చిన్న అల్లరిపనులు చూస్తూ వుండిపోవాలనిపిస్తుంది.

ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో సైన్స్ ప్రధాన సబ్జెక్ట్ కావడం వల్ల పై చదువులకు నాకున్న అవకాశాలు రెండే.. అయితే, ఇంజనీరింగ్, లేకపోతే, మెడిసిన్ చేయాలి. నేను ఇంజనీరింగ్ ఎంచుకున్నాను. ఏవో కొన్ని బి-గ్రేడ్ కాలేజీల్లో సీట్లొచ్చాయి. దీంతో నేను మా ఇంట్లో మాట్లాడి ఈ ఇంజనీరింగ్ నా వల్ల కాదని చెప్పేసాను. ఇక మిగిలింది.. మ్యాథమెటిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేయడం. అదే చేసాను.. కెఎమ్‌సి , ఢిల్లీ యూనివర్శిటీ నుంచి.

ఆ తర్వాత ఎమ్ బి ఎ కోసం ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాల్సొచ్చింది. నిజానికి ఎమ్ బి ఎ ప్రాజెక్టు వర్క్ కోసం నేను చాలా ప్రాంతాల్లో తిరగాల్సొచ్చింది. ఇలా తిరుగుతున్నప్పుడే, నేను వీధిబాలల దయనీయ జీవితాన్ని చాలా దగ్గర నుంచి చూసాను. చలించిపోయాను.

మిసెస్ గ్లాడ్ రాగ్స్, 2008, సెకండ్ రన్నర్ అప్

image


అందాల రాణి కిరీటం అంటే, చాలా మందికి కల నిజమవడం లాంటిది. కానీ నేను అలా చెప్పలేను. ఎందుకంటే.. నేను కలలో కూడా ఎప్పుడూ అందాల పోటీల్లో పాల్గొనాలని అనుకోలేదు. ముంబై నుంచి ఢిల్లీ తిరిగి వెళ్తుండగా.. విమానంలో ఏమీ తోచక ఆ మ్యాగజైన్ తిరగేసాను. ఆ మ్యాగజైన్ లో మిసెస్ ఇండియా అప్లికేషన్ ఫామ్ ను చూడకపోయినా.. అప్లై చేయమని మా ఆయన బలవంతపెట్టకపోయినా.. అసలు నాకా కిరీటం వచ్చి వుండేది కాదు. అప్పటికి నా దగ్గరున్న మామూలు ఫోటోలేవో జత చేసి యథాలాపంగా అప్లై చేసాను. అంతే.. తరవాత జరగాల్సిందంతా జరిగిపోయింది.

ఏం జరుగుతోందో తెలిసేలోపే నేను మళ్ళీ మంబైలో వున్నాను. ఈ సారి గ్లాడ్‌రాగ్స్ నిర్వహించే నెలరోజుల వర్క్ షాప్‌లో పాల్గొనడానికి రావలసి వచ్చింది. ఫైనల్స్‌లో పోటీ పడాలంటే.. ఈ వర్క్ షాప్‌కు తప్పని సరిగా హాజరు కావల్సిందే. ఆ ఒక్క నెలా.. నా జీవితాన్ని చాలా రకాలుగా ప్రభావితం చేసింది. ఆ వర్కషాప్ టైమ్‌లో నేను కలిసిన మనుషులు, ఎదుర్కొన్న పరిస్థితులు, అధిగమించిన సవాళ్ళు.. నా జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. ఇంటర్వ్యూ రౌండ్‌లో జ్యూరీలో వున్న జాతీయ స్థాయి ప్రముఖులను కలుసుకున్నప్పుడు, టాప్ 5 లో ఒకరుగా ఎంపికైనపుడే జీవితంలో ఏదైనా సాధ్యమే అన్న విషయం మరో సారి అర్థమైంది.

కాన్సెప్ట్ ఎగ్జిబిషన్స్ .. ఒక క్వాలిటీ వ్యాపారం

మంచి జీతం వస్తున్నప్పుడు, జీవితం సాఫీగా సాగిపోతున్నప్పుడు సాహసాలు చేయాలని ఎవరూ అనుకోరు. సవాళ్ళ జోలికి పోరు. కానీ నేను అలా కాదు.. జీతం , జీవితం బావున్నరోజుల్లోనే నాకు ఉద్యోగం చేయడం అంటే విసుగొచ్చేసింది. నాకు నేనే బాస్‌ని కావాలనుకున్నాను. సిటీ బ్యాంక్, బార్క్లేస్ బ్యాంక్ లాంటి ఎమ్.ఎన్.సి.లలో పదేళ్ళుగా హాయిగా సాగిపోతున్న కెరీర్‌లో నా పరిథి కుంచించుకుపోతున్నట్టు అనిపించింది. కాస్త రెక్కలు విదుల్చుకోవాలనుకున్నాను. అంతే, ఓ సుముహూర్తాన.. నా ఉద్యోగానికి రాజీనామా చేసేసాను. నా భవిష్యత్తేంటో నాకు స్పష్టంగా కనిపిస్తోంది. నాకు ఎంతో ఇష్టమైన చిన్న పిల్లలే కేంద్రంగా ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నాను. అలా.. పెద్ద చర్చ లేకుండానే ఆంట్రప్రన్యూర్‌గా మారిపోయాను.

అప్పటి వరకు కిడ్స్ ఎగ్జిబిషన్ అంటే మూసపోసినట్టు వుండేవి. షోరూమ్‌లలో అమ్మే వస్తువులను, స్టేషనరీనే ఆ నాలుగ్గోడల బయటికి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ అని పెడతారు. ఈ స్టయిల్‌ను మార్చాలనుకున్నాను. పిల్లల కోసం పెట్టే ఎగ్జిబిషన్‌లో నాదైన ముద్ర వేయాలనుకున్నాను. అలా పుట్టిందే 'కాన్సెప్ట్ ఎగ్జిబిషన్స్'.

image


కాన్సెప్ట్ ఎగ్జిబిషన్స్ పేరుకు తగ్గట్టే ఎగ్జిబిషన్స్‌లో ఓ కొత్త కాన్సెప్ట్‌కి శ్రీకారం చుట్టింది. దీన్ని పిల్లల శారీరక, మానసిక పెరుగుదలను ద్రుష్టిలో పెట్టుకుని రూపొందించాం. ఈ ఎగ్జిబిషన్స్ లో రెండు విభాగాలుంటాయి. ఒకటి కిడ్స్ మేలా. ఈ మేలాలో పిల్లల మానసిక, శారీరక, భావోద్వేగ పరమైన అంశాలకు సంబంధించిన ఉత్పత్తులను, సేవలను ప్రదర్శిస్తాం.. వ్యక్తులైనా, కంపెనీలైనా ఈ మేలాలో తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శనకు పెట్టుకోవచ్చు. ఇక రెండోది C – Engage. పిల్లలకు సంబంధించిన సి ఎస్ ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) యాక్టివిటీస్ లో వున్న సంస్థలకు , వారి సేవలు అందుకునే పిల్లలకు మధ్య ఒక నిరంతర వారధిగా C – Engage పని చేస్తుంది. తమ విరాళాలు, సేవల వల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం వుందో ఎప్పటికప్పుడు విశ్లేషించి, ఆ డాటాను ఆయా దాతలకు అందజేస్తాం.

ఆదిలో అవాంతరాలు

కిడ్స్ ఎగ్జిబిషన్ అంటే.. షాపింగ్ మాల్స్ కి ఎక్స్ టెన్షన్ లాగా కాకుండా వారి అభివ్రుద్ధికి తోడ్పడే వస్తువులు, సేవలు మాత్రమే వుండాలన్న నా ప్రయత్నం ఇప్పటికీ చాలా మందికి అర్థం కావట్లేదు. చాలా మంది మిగిలిన ఎగ్జిబిషన్లతో ఈ కిడ్స్ మేలాలను పోలుస్తుంటారు. జనాల్లో వుండే ఈ మూసధోరణే నా వ్యాపారానికి అతి పెద్ద సవాలుగా మారింది. స్పాన్సర్ షిప్స్, పెట్టుబడులు సంపాదించడం చాలా కష్టమవుతోంది. అయితే, నా దారి మీద నాకు నమ్మకం వుంది. ఇవాళకాకపోతే, రేపయినా, జనంలో మార్పొస్తుంది. నా ఉద్దేశం వారికి అర్థమై, రేపటి తరాన్ని మరింత ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి నాతో చేతులు కలుపుతారని నా నమ్మకం.

ఈ వ్యాపారంలో అడుగు తీసి అడుగువేయాలంటే సవాలక్ష అడ్డంకులు ఎదురయ్యేవి. ఒక దశలో నా పరిచయస్తులందరూ నాకు ముఖం చాటేసారు. అసలు ఎవరికీ పట్టని బాధ నాకే ఎందుకు అని కూడా నన్ను నేను తిట్టుకున్న రోజులున్నాయి. చివరికి నాదగ్గరున్న డబ్బంతా అయిపోయి, అమ్మానాన్నల దగ్గర చేయిచాచాల్సి వచ్చింది.

ఆరోజుల్ని తలచుకుంటేనే భయమేస్తుంది. పరిస్థితులు ఎంతగా ఎదురుతిరిగినా.. నా మీద నాకున్న నమ్మకం మాత్రం చెక్కు చెదర్లేదు. చేతిలో డబ్బుల్లేవు, భవిష్యత్తు మీద ఆశల్లేవు. అలాంటి పరిస్థితుల్ని ఎలా అధిగమించానా అనిపిస్తుంటుంది.. మనసు నచ్చిన పనిమీద ప్రాణం పెడితే కానీ.. అలాంటి రోజుల్ని ఎదుర్కోలేం.

image


బహుపాత్రాభినయం

ఇటు కాన్సెప్ట్ ఎగ్జిబిషన్స్‌ను చూసుకుంటూనే, ఇంకా చాలా బాధ్యతలను తలకెత్తుకున్నాను. ఆక్వాక్రాఫ్ట్ అనే కంపెనీకి ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్ హోదాలో డైరక్టర్‌గా వున్నాను. ఆ సంస్థ బిజినెస్ డెవెలప్ మెంట్‌లో నా వంతు సహకారం అందించాను. గ్రామీణ, వెనకబడిన ప్రాంతాల్లో తాగు నీటి ఎటిఎంలు , టాయిలెట్లు అమర్చడం ఆ సంస్థ బిజినెస్.

ఇటు వ్యాపారాలతో పాటు.. మనసుకు నచ్చిన మరికొన్ని పనులు చేసేదాన్ని. ఈవెంట్స్, షోస్‌కు యాంకర్ గా పనిచేస్తాను. ప్రింట్ యాడ్స్ డిజైన్ చేస్తాను. అవసరమైతే, మోడల్‌గా కూడా నేనే వుంటాను. ఈ పనుల వల్ల సమాజంలో పై స్థాయిలో వున్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కాన్సెప్ట్ ఎగ్జిబిషన్స్‌ను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పరిచయాలే ఉపయోగపడతాయి.

ఆడవాళ్ళకు ఇన్ని పనులు అవసరమా..

''స్త్రీలకు సహజంగా బహుముఖ ప్రజ్ఞ వుండదు. కానీ వాళ్ళకు అన్నీ జీవితమే నేర్పిస్తుంది. అలా అని ఇదంత సులభమేం కాదు.. ప్రతి క్షణం అగ్ని పరీక్షే. నిజానికి నాకు ఇంట్లో అన్నీ అనువైన పరిస్థితులే వున్నాయని చెప్పుకోవాలి. ప్రేమించిన వ్యక్తే భర్తగా వచ్చాడు. తను కూడా తండ్రి లేని బిడ్డగా పెరిగాడు కనుక పరిస్థితులను అర్థం చేసుకోగలడు. అయినప్పటికీ చాలా సార్లు , నాకు వ్యాపారాల కంటే, ఇల్లే ముఖ్యమని నిరూపించుకోవాల్సి వచ్చేది''.

దీనికంటే పెద్ద సవాలు..ఇంట్లో పిల్లలు. చాలా సార్లు వాళ్ళను పనిమనుషుల దగ్గర వదిలేయాల్సి వచ్చేది. అలాంటి సమయాల్లో నేను మంచి తల్లిని కానేమో అని నామీద నాకే సందేహం కలిగేది. తల్లిగా, భార్యగా నా కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. అయితే, అంతేనా.. జీవితమంటే భర్తని, పిల్లల్ని చూసుకోవడమేనా.. స్త్రీగా నాకంటూ ఒక జీవితం లేదా.. ఈ ప్రశ్నకు సమాధానం నా బాల్యం నుంచే వచ్చేది. నన్ను బాగా చదివించడానికి , నా తల్లిదండ్రలు అష్టకష్టాలు పడ్డారు. మరి ఆ చదువు, తెలివితేటలు వృధాగా పోవాలా.. అలా జరగకూడదు. నా చదువు తెలివి తేటలు,, నాకే కాక ఈ సమాజానికి కూడా ఉపయోగపడాలనుకున్నాను. అందుకే ఇటు కుటుంబానికి, అటు నా ప్రొఫెషనల్ లైఫ్‌కి కూడా న్యాయం జరిగేలా కష్టపడ్డాను.

కలల తీరం.. ఎంతెంత దూరం..

ఆడవాళ్ళు చాలా అంచనాల మధ్య బతుకుతారు. ఎలాంటి జీవితం నుంచి వచ్చినా, ఎలాంటి మనుషుల మధ్ పెరిగినా.. స్త్రీ అంటేనే.. ఇతరుల కోసం బతకాలని అనుకుంటాం. బహుశా అది మా డి. ఎన్.ఎ. లోనే వుందేమో. మా గురించి మేం అలోచించుకోవడం అంటే అదో పెద్ద స్వార్థం, నేరం..

మన చుట్టూ వున్న వాళ్ళు అన్ని రకాలుగా సహకరించినా కూడా మనకి మనమే కలల్ని కనడం మానేస్తాం. ఒకవేళ కన్నా.. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించం. ఎందుకంటే.. మన కలలంటే మనకు చులకన. పక్కవాళ్ళ కోసమ బతకాలనుకుంటాం. మంచి తల్లిగా, మంచి భార్యగా, కోడలిగా, నిరూపించుకోవడానికి నిరంతరం తాపత్రయపడతాం. ఈ తాపత్రయాన్ని వదిలించుకుంటే తప్ప స్త్రీ గెలుపుదారిలో సాగలేదని నా అభిప్రాయం. మన ఆశయ సాధన కోసం మనం మనస్పూర్తిగా ప్రయత్నిస్తే.. ఆటోమేటిక్‌గా మన చుట్టూ వున్న వాళ్ళు కూడా దానికి సాయపడతారు. అప్పుడు నటనకు స్వస్తి చెప్పి.. మన జీవితాలను మనం నిజంగా జీవించగలుగుతాం.

కలలు కనండి.. అవి నిజమయ్యేంత వరకు కంటూనే వుండండి..

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags