రాయితీలు, మినహాయింపులతో స్టార్టప్స్‌కు రాచబాట

తెలంగాణ స్టార్టప్ పాలసీ- 2016

రాయితీలు, మినహాయింపులతో స్టార్టప్స్‌కు రాచబాట

Monday April 04, 2016,

3 min Read


ఐటి రంగంలో ఇప్పటికే తెలంగాణ తన సత్తాను చాటింది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, టిసిఎస్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ సంస్థలు హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకున్నాయి. త్వరలో యాపిల్ కూడా తన సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది. పేరుకు స్టార్టప్ స్టేట్ అయినప్పటికీ.. ఐటి రంగంలో మాత్రం హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అందుకే తర్వాతి తరం విప్లవాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. తాజాగా ప్రకటించిన ఐటి విధానం కూడా ఇందుకు అద్దం పడ్తోంది.

image


ఇప్పటికే టి-హబ్ ఏర్పాటు ద్వారా అతిపెద్ద ఇంక్యుబేటర్ నిర్మించిన ప్రభుత్వం 'స్టార్టప్ క్యాపిటల్' గా ఎదగాలని చూస్తోంది. ఇందుకోసం ఇన్నోవేషన్ పాలసీలో స్టార్టప్స్, ఇంక్యుబేటర్స్ కోసం ప్రత్యేక విధానాన్ని, రాయితీలను ప్రకటించింది.

ఐదు ముఖ్య పాయింట్ల ఆధారంగా ఈ ఇన్నోవేషన్ పాలసీని రూపొందించింది.

1. మౌలిక సదుపాయాల కల్పన, నిర్వాహణా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలి.

రాబోయే ఐదేళ్లలో ప్రత్యేకంగా స్టార్టప్స్ కోసం 10 లక్షల చదరపు అడుగుల స్థలం అభివృద్ధి

ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యంలో ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ నిర్మాణం. ఇందుకోసం 20కిపైగా గ్లోబల్ యాక్సిలరేటర్స్, ఇంక్యుబేటర్స్‌తో ఒప్పందాలు.

ద్వితీయ శ్రేణి నగరాల్లో రెండు ఇంక్యుబేటర్ల నిర్మాణం.

ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ - ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్

12 రోజల్లోనే అన్ని అనుమతులూ వచ్చి వ్యాపారం ప్రారంభించేలా చర్యలు

నిర్మాణం, విద్యుత్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పరిమితుల కోసం ఎలాంటి ఇబ్బందులూ లేని వ్యవస్థ

కార్మిక, అంతర్ రాష్ట్ర వస్తు రవాణాలో సులభమైన చట్టాలు

2. స్థిరమైన ఫండింగ్ ఉండేందుకు విధానాల రూపకల్పన

స్టార్టప్స్‌కు ఫండింగ్ ప్రధాన సమస్య. అద్భుతమైన ఆలోచన ఉన్నా వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు వాళ్లకు ఆర్థిక స్వేచ్ఛ ఉండదు. అందుకే చాలా ఆలోచనలు ప్రోటోటైప్‌కే పరిమితమవుతాయి.

ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏర్పాటు. కొంత మంది వెంచర్ క్యాపిటలిస్టులను ఎంపిక చేసి ప్రభుత్వం మ్యాచింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తుంది.

వీటితో పాటు రూ. 2000 కోట్లతో టి-ఫండ్ ఏర్పాటు. టి-హబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కార్పొరేట్ నెట్వర్క్, సీనియర్ ప్రభుత్వ అధికారులతో కలిసి ప్యానెల్ ఏర్పాటు.. ఫండ్ నిర్వాహణ అంతా ప్రొఫెషనల్స్ చేతుల్లోనే.

టి-సీడ్ పేరుతో సీడ్ స్టేజ్ ఫండింగ్ కోసం రూ.250 కోట్ల కేటాయింపు. రీసెర్చ్ డిస్కవరీలు, కాలేజ్ ప్రాజెక్ట్ ఐడియాల స్థాయిలో ఉన్నవాళ్లకు ఈ ఫండ్ ఉపకరిస్తుంది.

3. హ్యూమన్ క్యాపిటల్ అభివృద్ధి. విద్యావ్యవస్థలో మార్పుల ద్వారా ప్రాధమిక దశ నుంచే ఇన్నోవేషన్‌పై దృష్టి

స్టూడెంట్ ఆంట్రప్రెన్యూర్ ఇన్ రెసిడెన్స్ అనే విధానాన్ని అమలు చేసేందుకు యూనివర్సిటీలకు ప్రోత్సాహం.

యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువు పూర్తయ్యాక, అవసరమైతే ఒక ఏడాది బ్రేక్ తీసుకోవచ్చు. ఈ కాలంలో సీరియస్‌గా ఆంట్రప్రెన్యూర్ అవతారం ఎత్తొచ్చు.

స్టార్టప్ టీమ్స్‌కు 5 శాతం గ్రేస్ మార్క్స్, ప్రతీ సెమిస్టర్‌లో 20 శాతం అటెండెన్స్‌ (విధివిధానాలు కాలేజీలు రూపొందించుకోవచ్చు)

image


4. ఎప్పటికప్పుడు పరిశ్రమ అవసరాలు గుర్తించేందుకు ఇండస్ట్రీతో సత్సంబంధాలు

చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ వ్యవస్థ ఏర్పాటు

ఐటి మంత్రిత్వ శాఖలో ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు

5. గ్రామీణ, సామాజిక స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు అదనపు రాయితీలు

రూరల్, సోషల్ ఎంట్రప్రైస్ కోసం ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు.

ఇలాంటి స్టార్టప్స్ కోసం ప్రత్యేకంగా ఇంపాక్ట్ ఫండ్.

ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో టి-హబ్ ఒప్పందం.

image



ఇంక్యుబేటర్స్‌కు ప్రోత్సాహకాలు

- స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులో 100 శాతం రీఇంబర్స్‌మెంట్. రెండో లావాదేవీలో 50 శాతం రాయితీ

- 1 : 1 రేషియోలో మ్యాచింగ్ గ్రాంట్. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంక్యుబేటర్ సమీకరించే మొత్తానికి అదే స్థాయిలో ఆర్థిక ప్రోత్సాహం

- ఇండస్ట్రియల్ టారిఫ్‌తో అవాంతరం లేని విద్యుత్ సరఫరా

- మొదటి మూడేళ్లలో 25 శాతం ఇంటర్నెట్ ఛార్జీల రీ ఇంబర్స్‌మెంట్ (గరిష్టంగా రూ.2.50 లక్షలు)

- ఒక వేళ టెక్నాలజీ ఇంక్యుబేటర్లు.. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుంటే ఐదేళ్ల పాటు ఎలాంటి అద్దె, లీజు వసూలు చేయరు.

- క్యాపిటల్ వ్యయంలో 20 శాతం ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ

స్టార్టప్స్‌కు ప్రోత్సాహకాలు

- ప్రభుత్వం గుర్తించిన, ప్రోత్సహిస్తున్న ఇంక్యుబేటర్లలో ఉంటున్న స్టార్టప్స్‌కు మూడేళ్ల పాటు సర్వీస్ ట్యాక్స్ రీఇంబర్స్‌మెంట్. వార్షిక టర్నోవర్ రూ.50 లక్షలు దాటని స్టార్టప్స్‌కే వర్తింపు

- మొదటి మూడేళ్లలో తెలంగాణలో చెల్లించిన వ్యాట్, సిఎస్‌టి రీఇంబర్స్‌మెంట్. గరిష్టంగా రూ.50 లక్షల వరకే పరిమితి.

- అంతర్జాతీయ మార్కెట్లలో ట్రేడ్ షోస్ ద్వారా మార్కెటింగ్(ప్రమోషన్) చేసుకునేందుకు చేసే ఖర్చులపై 30 శాతం రీఇంబర్స్‌మెంట్. ఒక్కో స్టార్టప్‌కు గరిష్టంగా రూ. 5 లక్షల మినహాయింపు.

- భారత్‌లో ఫైల్ చేసుకునే పేటెంట్ల ఖర్చుపై గరిష్టంగా రూ.2 లక్షల వరకూ రీఇంబర్స్‌మెంట్.

- ఐడియా స్టేజ్ స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు మొదటి ఏడాదిలో ఒక్కో ఉద్యోగి కోసం రూ. 10 వేల రిక్రూట్‌మెంట్ అసిస్టెన్స్.

- ఆడిట్ లెక్కల ప్రకారం ఏటా 15 శాతం వృద్ధిని సాధిస్తున్న స్టార్టప్స్‌ తమ టర్నోవర్‌పై 5 శాతం గ్రాంట్‌ పొందేందుకు అవకాశం. గరిష్ట పరిమితి రూ.10 లక్షలు.

- స్టార్టప్స్, ఇంక్యుబేటర్స్ సెల్ఫ్ సర్టిఫికేషన్స్ చేసుకోవచ్చు.

- కొన్ని చట్టాల మినహాయింపు సమీక్షించేందుకు స్టార్టప్ సెల్ ఆధ్వర్యంలో ఫెసిలిటేషన్.

image


Report