సంకలనాలు
Telugu

కరెంట్ కష్టాలకు వినూత్న పరిష్కారం సూచిస్తున్న ఎయాన్ సోలారీస్

సౌర విద్యుత్‌తో ఎయాన్ సోలారీస్ సంచ‌ల‌నంమూల‌ధ‌న వ్య‌యాన్ని స‌గానికి త‌గ్గించిన శుభం, నిమేశ్‌సోలార్ ప‌వ‌ర్ ఇండ‌స్ట్రీలో థ‌ర్డ్ పార్టీ ఇన్వెస్ట‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్న సంస్థ‌..ప్రైవేట్ ప‌వ‌ర్ ప‌ర్చేజ్ అగ్రీమెంట్ (పీపీఏ)ల‌ను కుదురుస్తూ క‌రెంట్ క‌ష్టాలు తీరుస్తున్న ఎయాన్ సోలారీస్‌..

GOPAL
2nd Jun 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

జాతీయ సోలార్ మిష‌న్ 2010లో ప్రారంభ‌మైంది. ఐతే మూల‌ధ‌న వ్య‌యం అధికంగా ఉండ‌టంతో సోలార్ విద్యుత్ ఆర్థికంగా అంత ఆచ‌ర‌ణీయ‌మ‌న‌ది కాద‌న్న‌ది అంద‌రి ఉద్దేశం. ఐతే అదే 2012కు వ‌చ్చే స‌రికి ఆ అభిప్రాయం త‌ప్ప‌ని తేలిపోయింది. మూల‌ధ‌న వ్య‌యం స‌గానికి స‌గం ప‌డిపోయింది. ఈ మూల ధ‌న వ్య‌యం అమాంతంగా ప‌డిపోయేలా చేసింది శుభం సందీప్‌, నిమేశ్‌ గుప్తా. వీరిద్ద‌రూ ఎయాన్ సోలార్ ప‌వ‌ర్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు. దేశం స్థిర‌మైన అభివృద్ధిని కాంక్షిస్తూ, ప‌వ‌ర్ ఇండ‌స్ట్రిలో ప్ర‌స్తుతం ఉన్నప‌రిస్థితిని స‌వాల్ చేస్తూ త‌మ ఆంట్రప్రెన్యూర్ జ‌ర్నీని మొద‌లు పెట్టాల‌ని శుభం, న‌మీష్ నిర్ణ‌యించారు.

పెద్ద బిల్డింగులపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్

పెద్ద బిల్డింగులపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్


ఏంటి వీళ్ల ఐడియా ?

21వ శ‌తాబ్దంలో విజ‌య‌వంత‌మైన విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ‌గా ఎద‌గాల‌న్న ల‌క్ష్యంతో ఎయాన్ సోలారీస్ ఆవిర్భ‌వించింది. శుభం, నిమేశ్‌ ఢిల్లీ ఐఐటీలో చ‌దువుతున్న‌ప్పుడే ఎయాన్ సోలారీస్‌ను స్థాపించాల‌న్న ఆలోచ‌న పురుడుపోసుకుంది. విద్యుత్ రంగంలో దేశం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను, ప‌రిస్థితిని గ్ర‌హించి వీరిద్ద‌రూ ఈ సంస్థ ఏర్పాటుకు సిద్ధ‌మ‌య్యారు. అమెరికా, జ‌ర్మ‌నీ వంటి దేశాల్లో అమ‌లవుతున్న విధానాల‌తో ఆక‌ర్షితులై, వాటినే దేశంలోనూ అమలు చేయాలని అనుకున్నారు. కార్పొరేట్ కంపెనీలు, ఇండ‌స్ట్రీల్లో సౌర విద్యుత్ ఏర్పాటు చేయ‌డంలో గ‌ల అస‌మానత‌లు గ్ర‌హించిన వీరు.. ఈ రంగంలో అపార అవ‌కాశాలున్నాయ‌ని గుర్తించారు. వ‌చ్చే ఐదేళ్లలో రెండు గిగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి అవ‌స‌రముంద‌ని వీరు గుర్తించారు. దీని విలువ ఓపెన్ మార్కెట్లో దాదాపు 2.5 బిలియ‌న్ డాల‌ర్లు.

హైద‌రాబాద్‌లో తొలి అడుగు..

ఢిల్లీ ఐఐటీలో ఎలక్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన త‌ర్వాత వీరిద్ద‌రూ కొంత‌కాలంపాటు ప్ర‌ఖ్యాత సంస్థ‌ల్లో ప‌నిచేశారు. డాయిష్ బ్యాంక్‌లో ఇన్వె స్ట్‌మెంట్ బ్యాంకింగ్ డివిజ‌న్‌లో ప‌నిచేసిన కాలంలో దాదాపు 200 మిలియ‌న్ డాల‌ర్ల కంటే ఎక్కువ‌గానే వ్య‌వ‌హారాల‌ను న‌డిపారు శుభం. ఇక నిమేశ్... రాయ‌ల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్‌లో గ్లోబ‌ల్ బ్యాంకింగ్ అండ్ మార్కెట్స్ డివిజ‌న్‌లో ప‌నిచేశారు. ఎయాన్ ప్రారంభ‌మైన‌ప్పుడు వీరిద్ద‌రే అన్ని వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టేవారు. బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్‌, సేల్స్, ప్రొక్యూర్‌మెంట్‌, సోలార్ ప్లాంట్ ఇన్‌స్టాలేషన్... ఇలా అన్ని వ్య‌వ‌హారాల‌ను వీరే చూసుకునేవారు. వీరి వ్యాపారానికి తొలి అడుగు ప‌డింది హైద‌రాబాద్‌లోనే. ఓ కార్పొరేట్ కంపెనీ కోసం రూఫ్‌టాప్‌లో 40 కిలోవాట్ల సోలార్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేశారు. ఆ త‌ర్వాత వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. దీంతో సంస్థ‌లో ఉద్యోగులు కూడా పెరిగిపోయారు. ఇద్ద‌రితో ప్రారంభ‌మైన సంస్థ‌లో ప్ర‌స్తుతం ఆన్‌సైట్ ప్రాజెక్ట్‌లు, ప్రొక్యూర్‌మెంట్లు, సేల్స్‌, అకౌంటింగ్‌, మార్కెటింగ్‌ ఇలా అన్ని విభాగాల్లోనూ వేరువేరు మేనేజ‌ర్లున్నారు. త‌మ నిర్వ‌హ‌ణ బృందంలో ఉత్సాహంగా ప‌నిచేసే యువ‌కుల కోసం ఈ సంస్థ ఇప్ప‌టికీ ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది.

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ అభివృద్ధిలో కీల‌క పాత్ర పోషిస్తున్న ప‌వ‌ర్ సెక్టార్ ఎన్నో స‌వాళ్ల‌తో కూడుకున్న‌ది. ఈ రంగంలో రోజురోజుకు కొత్త కొత్త విధానాలు, సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులోకి వ‌స్తున్నాయి. దేశంలో 70 శాతం బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పాద‌క సంస్థ‌లే. విద్యుత్ ఉత్ప‌త్తి కోసం దేశంలో ప్ర‌స్తుతం 150 మిలియ‌న్ల మెట్రిక్ ట‌న్నుల బొగ్గు కొర‌త ఉంది. దీంతో చాలావ‌ర‌కు విదేశాల నుంచే బొగ్గును దిగుమ‌తి చేసుకుంటున్నారు. వ‌చ్చే ఐదేళ్ల‌లో ఇది మూడు రెట్లు పెరుగుతుంది. దీంతో బొగ్గు కొర‌త మ‌రింత పెరిగితే.. దానికి అనుగుణంగా విద్యుత్ చార్జీలు కూడా పెరుగుతాయి. దేశంలో ఎదుర్కొంటున్న విద్యుత్ కొర‌త‌ను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స‌మ‌స్య‌ల‌ను తీర్చేందుకు 35 బిలియ‌న్ల అమెరికా డాల‌ర్ల‌ను ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. ఈ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించేందుకు సౌర విద్యుత్తే స‌రైన ప‌రిష్కారం. డిస్ట్రిబ్యూష‌న్ జ‌న‌రేష‌న్‌లో ప్ర‌స్తుత వ్య‌వ‌స్థ‌ను బ‌ట్టి చూస్తే సౌర విద్యుత్తే అత్యంత స‌రైన ఎంపిక‌. ఇంధ‌న ధ‌ర‌లో ఎలాంటి హెచ్చు త‌గ్గులుండ‌వు. ఏడాదంతా పుష్క‌ల‌మైన ఉత్ప‌త్తి జ‌రుపొచ్చు. దీనికితోడు ఇన్‌స్టాలేష‌న్ చాలా సుల‌భం. అంతేకాదు మెయింటేనెస్ కూడా ఈజీనే. అమెరికా, జర్మ‌నీ వంటి దేశాల్లో విజ‌య‌వంత‌మైన ఉత్ప‌త్తి, పంపిణి విధానాల‌ను భార‌త్‌లో అమ‌లుప‌ర‌చ‌డం ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అత్య‌వ‌సరం. ఈ దేశాల్లో సౌర విద్యుత్ అందిస్తున్న సోలార్‌సిటీ సంస్థ విలువ 5 బిలియ‌న్ డాల‌ర్లు. అలాగే స‌న్‌ర‌న్‌, స‌న్‌గెవిటీ వంటి సంస్థ‌లు కూడా విజ‌య‌వంతంగా న‌డుస్తుండ‌టంతో వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఎయాన్ సోలారీస్‌ను ప్రారంభించారు.

image


పుష్క‌ల అవ‌కాశాలు...

దేశంలో వివిధ రాష్ట్రాల్లో క‌మ‌ర్షియ‌ల్‌, ఇండ‌స్ట్రియ‌ల్ ప్రాజెక్ట్‌లు పెరిగిపోవ‌డంతో విద్యుత్ పంపిణీ రంగంలో స‌మ‌స్య‌లు పెరిగిపోయాయి. అస‌మాన‌త‌లు చోటుచేసుకున్నాయి. వీట‌న్నింటికి సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తే స‌రైన ప‌రిష్కారం. పెద్ద పెద్ద హాస్పిట‌ల్స్‌, హోట‌ల్స్‌, విద్యాసంస్థ‌లు, కార్పొరేట్ కార్యాల‌యాలు, పారిశ్రామిక సంస్థ‌లు, మాల్స్‌, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీ వంటి సంస్థ‌ల‌కు ఎంతో విద్యుత్ అవ‌స‌ర‌మ‌వుతుంది. దీంతో ఇవే ఎయాన్‌కు టార్గెట్ మార్కెట్స్‌. దీనికితోడు సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రూఫ్‌టాప్‌లో అవ‌స‌ర‌మైన స్థ‌లం కూడా అందుబాటులో ఉంటుంది. విద్యుత్ కోసం ఈ సంస్థ‌లు చాలా పెద్ద ఎత్తున ఖ‌ర్చుచేస్తున్నాయి. దీంతో సోలార్ విద్యుత్ ద్వారా వీటికి డ‌బ్బు కూడా ఆదా అవుతుంది. అలాగే కార్బ‌న్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించుకునేందుకు, కార్పొరేట్ సో్ష‌ల్ రెస్పాన్సిబిలిటీ పూర్తిచేసేందుకు సోలార్ ప్లాంట్లు ఉప‌యోగ‌ప‌డుతాయి. ప‌ర్య‌వార‌ణాన్ని ర‌క్షించి క‌స్ట‌మ‌ర్ల‌లో, ఉద్యోగుల్లో మంచి గుర్తింపు పొందేందుకు కూడా సంస్థ‌ల‌కు అవ‌కాశం ఉంటుంది.

స‌రికొత్త మోడ‌ల్‌..

పార్టీలు, క్ల‌యింట్లు, పెట్టుబ‌డిదారులు అన్ని వ‌ర్గాల‌కు అనుకూల‌మైన స‌రికొత్త బిజినెస్ మోడ‌ల్‌ను రూపొందించింది ఎయాన్ సోలారీస్‌. అంద‌రికీ లాభదాయకత కంటికి కనిపించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. పెట్టుబ‌డిదారుల‌కు లాభాల‌ను, క‌స్ట‌మ‌ర్ల‌కు నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల ఆదాతో పాటు కాలుష్యాన్ని త‌గ్గించ‌డం వంటివి ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్రయోజనాలు. అంతేకాదు త‌క్కువ ధ‌ర‌కే సౌర విద్యుత్‌ను అందిస్తూ ఎయాన్ మంచి లాభాల‌నూ ఆర్జించింది. 

ఈ బిల్డ్‌-ఆప‌రేట్‌-ట్రాన్స్‌ఫ‌ర్ (బీఓటీ) మోడ‌ల్ ద్వారా క‌స్ట‌మ‌ర్ల రూఫ్‌టాప్‌ల‌పై సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న‌ది. దీర్ఘ కాల ఒప్పందాన్ని ఏర్ప‌ర్చుకుని, ప్లాంట్ నిర్వ‌హ‌ణ వ్య‌వ‌హారాల‌ను చూస్తున్న‌ది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారమే క‌స్ట‌మ‌ర్ డ‌బ్బులు చెల్లిస్తాడు. అలాగే కాంట్రాక్ట్ పూర్త‌యిన త‌ర్వాత ఆ సోలార్ ప్లాంట్ కూడా అత‌ని సొంత‌మవుతుంది. ప్రాజెక్ట్‌ల‌ను ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌న్న‌దాన్ని గుర్తించిన త‌ర్వాత‌, వాటిని శ్ర‌ద్ధ‌గా నిర్వ‌హిస్తుంది ఎయాన్ టీమ్‌. ఇంజినీరింగ్‌, ఫైనాన్స్‌, అనుమ‌తులు, ఇన్‌స్టాల్‌మెంట్‌, మెయింటేనెన్స్‌, పేమెంట్ క‌లెక్ష‌న్ వంటి అన్ని ర‌కాల స‌హాయాల‌ను అంద‌జేస్తుంది. అలాగే సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఇన్వెస్ట్ చేసే కంపెనీల‌తో కూడా ఎయాన్ చ‌ర్చ‌లు జ‌రిపి క‌స్ట‌మ‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డుతున్న‌ది. ఈ ర‌క‌మైన బిజినెస్ మోడ‌ల్‌.. విద్యుత్ ఉత్ప‌త్తి, పంపిణీ రంగంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ది. ఇలాంటి త‌ర‌హా కంపెనీలు అమెరికావంటి దేశాల్లో ఎంతో విజ‌య‌వంత‌మ‌య్యాయి. 

భార‌త్‌లోనూ ఇలాంటి మోడ‌ల్స్‌కు ఎన్నో అవ‌కాశాలున్నాయి. ఇంధ‌న రంగంలో భార‌త్‌లో మార్కెట్ వ్యాప్తికి ఎంతో అవ‌కాశ‌ముంది. మంచి పునాదులుంటే ఈ రంగంలో మార్కెట్‌ను అందిపుచ్చుకోవ‌డం సుల‌భ‌మేన‌న్న‌ది ఎయాన్ వ్య‌వ‌స్థాప‌కులు ఆలోచ‌న‌. వ‌చ్చే కొన్నేళ్ల‌లో 300 మెగావాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన ప‌వ‌ర్ ప్లాంట్ల ఏర్పాటు కూడా చేస్తామ‌ని వీరు ధీమాగా చెప్తున్నారు.

అడ్వాంటేజ్ ఎయాన్‌..

కార్పొరేట్ వినియోగ‌దారుల‌కు విద్యుత్ అందిస్తున్న సంస్థ‌లు, ముఖ్యంగా ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌, ఇత‌ర సోలార్ సంస్థ‌ల అడుగు జాడ‌ల్లో ఈ సంస్థ న‌డుస్తున్న‌ది. ఐతే సౌర ఇంధ‌నాన్ని కార్పొరేట్ కంపెనీల‌కు అందిస్తున్న బిజినెన్ మోడ‌ల్ మాత్రం, గ‌తంలో ఎవ‌రూ ఇవ్వ‌లేన‌టువంటిది. దీంతో ఇది వారికి అడ్వాంటేజ్‌గా మారింది. చాలా సంస్థ‌లు ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, క‌న్‌స్ట్ర‌క్ష‌న్ (ఈపీసీ) విభాగాల్లో మాత్ర‌మే క‌స్ట‌మ‌ర్ల‌కు సేవ‌లందిస్తున్నాయి. సోలార్ ప్లాంట్ ఏర్పాటు కో్సం మూల‌ధ‌న వ్య‌యం అధికంగా ఉండ‌టం వ‌ల్లే చాలామంది క‌స్ట‌మ‌ర్లు ఈ సౌర విద్యుత్‌కు దూరంగా ఉంటున్నారు. ఐతే క‌స్ట‌మ‌ర్ల‌కు అనుకూలంగా ప్ర‌యివేట్ సంస్థ‌ల‌తో ఒప్పందం కుదుర్చుకుని, అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన పీపీఏల‌తో, స‌రికొత్త ఫైనాన్షియ‌ల్ మోడ‌ల్‌ను ఎయాన్ సోలారీస్ అందిస్తూ క‌స్ట‌మ‌ర్ల స‌మ‌స్య‌ల‌ను తీరుస్తున్న‌ది.

image


గ‌త మూడేళ్ల‌లో వ్య‌వ‌స్థాప‌క ఖ‌ర్చులు స‌గానికి స‌గం ప‌డిపోయిన‌ప్ప‌టికీ అధిక మూల‌ధ‌న ఖ‌ర్చు, సాంకేతిక అవ‌స‌రాలు క‌స్ట‌మ‌ర్ల‌కు ప్ర‌తిబంధ‌కంగా మారాయి. ఎవ‌రి సాయమూ లేకుండా ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసుకోవ‌డం చిన్న చిన్న సంస్థ‌ల‌కు అంత సుల‌భ‌మేమీ కాదు. ఐతే కొత్త కొత్త విధానాల‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను సంతృప్తిప‌రుస్తూ, ఎయాన్ సోలారిస్ కార్పొరేట్ కార్యాల‌యాలు, విద్యా సంస్థ‌లు, వివిధ పారిశ్రామిక సంస్థ‌ల్లో ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయ‌డం విశేషం. బ‌ల‌మైన‌, విభిన్న ఉద్యోగ బృందాన్ని నిర్మించ‌డం దేశంలో స్టార్ట‌ప్ కంపెనీల‌కు చాలా క‌ష్ట‌మైన ప‌ని. అదే హార్డ్‌వేర్ వెంచ‌ర్‌లోనైతే దాదాపుగా అసాధ్య‌మ‌నే చెప్పాలి. స‌ప్ల‌య్‌-డిమాండ్ గ్యాప్ కార‌ణంగా సోలార్ ఇండ‌స్ట్రీలో టాలెంట్ చాలావ‌ర‌కు శిక్ష‌ణార‌హితంగాకానీ, అత్యంత ఖ‌రీదైన‌ది కాని ఉండ‌టం జ‌రుగుతున్న‌ది.

"ప్ర‌స్తుతం ఉన్న విధానాన్ని మార్చుకునేందుకు ఇష్ట‌ప‌డ‌ని కంపెనీల వ‌ద్ద మౌలిక వ‌స‌తులు అధికంగా ఉన్నాయి. అయితే ఆ అడ్డంకుల‌న్నింటినీ అధిగ‌మించి, దేశంలో విద్యుత్ రంగంలో మార్పులు తేవాల‌న్న‌దే మా ల‌క్ష్యం" అని శుభం, నిమేశ్ అంటారు.

ఢిల్లీ ఫ్యాక్ట‌ర్‌..

దేశ‌రాజ‌ధాని ఢిల్లీ, ఆ స‌మీప న‌గ‌రాల్లో విద్యుత్ కోత‌లు తీవ్రంగా ఉన్నాయి. వీవీఐపీలు నివ‌సిస్తున్న‌ప్ప‌టికీ కోత‌ల‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు.ఈ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకునేందుకు ఢిల్లీలోనే త‌మ సంస్థ‌ను ప్రారంభించింది ఎయాన్‌. దేశంలో అత్య‌ధిక విద్యుత్ చార్జీలు వ‌సూలు చేస్తున్న ప్రాంతాల్లో ఎన్‌సీఆర్ (NCR) టాప్ త్రీలో ఉంది. దీంతో సోలార్‌, ఇత‌ర మార్గాల విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ‌ల‌కు ఈ న‌గ‌రాలే మంచి మార్కెట్‌. అలాగే ఎన్‌సీఆర్‌లో ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కొలువై ఉన్నాయి. దీంతో త‌మ మార్కెటింగ్ కార్య‌క‌లాపాల‌ను ఎయాన్ ఈ ప్రాంతంలోనే మొద‌లుపెట్టింది. అంతేకాదు ఉత్త‌ర‌భార‌త దేశం వెళ్లాల‌న్నా ఢిల్లీ నుంచి పెద్ద దూరాభారం కూడా కాదు. ఖ‌ర్చు కూడా చాలా త‌క్కువ‌వుతుంది. దీంతో ఢిల్లీ కేంద్ర స్థానంగా వ్యాపారాన్ని ప్రారంభించింది ఎయాన్‌. దేశ‌రాజ‌ధానిని వీరు ఎంచుకోవ‌డానికి మ‌రో ప్ర‌ధాన కార‌ణం శుభం, నిమేశ్ పుట్టిపెరిగింది కూడా ఇక్క‌డే. దీంతో వ‌స‌తి, నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు కూడా క‌లిసొస్తాయ‌న్న ఉద్దేశంతో ఢిల్లీలోనే వ్యాపారాన్ని ప్రారంభించారు.

విదేశాల్లో సైతం...

వ‌చ్చే ఏడాదిలో సంస్థ‌ను మ‌రింత వృద్ధి చేయాల‌ని వీరు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా కార్పొరేట్‌, పారిశ్రామిక సంస్థ‌లే ల‌క్ష్యంగా ఎయాన్ ప్రారంభించారు. ఏడాదిలోనే 400 కిలోవాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయ‌గ‌లిగింది. అంతేకాదు రెవెన్యూలో కూడా ఐదు ల‌క్ష‌ల అమెరిక‌న్ డాల‌ర్ల‌ను ఆర్జించింది. దేశ‌వ్యాప్తంగా వివిధ‌ రంగాల‌కు చెందిన క‌స్ట‌మ‌ర్లు ఎయాన్‌కు ఉన్నారు. దేశ రాజ‌ధానిలో స‌క్సెస్ కావ‌డంతో వ్యాపారాన్ని మ‌రింత విస్తృత ప‌రుచాల‌న్న ల‌క్ష్యంతో శుభం, నిమేశ్ ఉన్నారు. సౌర విద్యుత్ రంగంలో పుష్క‌ల అవ‌కాశాలున్న మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ల‌లో కూడా త‌మ సేవ‌ల‌ను అందించ‌నున్నారు. దేశీయంగానే కాదు విదేశాల్లోనూ సంస్థ‌ను విస్తృత ప‌ర‌చాల‌నుకుంటున్నారు. జ‌పాన్, మిడిల్ ఈస్ట్‌, ఆఫ్రికాల్లో కూడా సౌర విద్యుత్ రంగంలో అవ‌కాశాలు ఉండటంతో ఆ దేశాల్లో కూడా కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌నుంది ఎయాన్. మూడేళ్ల క్రితంతో పోలిస్తే ప్ర‌స్తుతం ఖ‌ర్చులు స‌గానికి స‌గం త‌గ్గిన‌ప్ప‌టికీ సోలార్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసేందుకు క‌స్ట‌మ‌ర్లు ముందుకు రావ‌డం లేదు. అందుకు కార‌ణం అధిక మూల‌ధ‌న వ్య‌యం, సాంకేతిక స‌హ‌కారం లేక‌పోవ‌డం. ఇలాంటి క‌స్ట‌మ‌ర్ల మ‌న‌సుల‌ను కూడా ఎయాన్ మారుస్తున్న‌ది. ఇత‌ర సంస్థ‌ల‌తో మాట్లాడి పెట్టుబ‌డి పెట్టించ‌డంతోపాటు అవ‌స‌ర‌మైన సాంకేతిక సాయాన్ని చేస్తూ క‌స్ట‌మ‌ర్ల ఆందోళ‌న‌ల‌ను దూరం చే్స్తున్న‌ది. ప్రైవేట్ ప‌వ‌ర్ ప‌ర్చేజ్ అగ్రిమెంట్స్ (పీపీఏ)లు అందుబాటులోకి తెచ్చి, సిస్ట‌మ్ లీజింగ్‌, అసెట్ ఫైనాన్సింగ్‌, డెట్ ఫైనాన్సింగ్ వంటి మోడ‌ల్స్‌తోక‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్న‌ది.. అత్యంత త‌క్కువ రిస్క్ ఉన్న సోలార్ ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబ‌డి పెట్టేందుకు థ‌ర్డ్ పార్టీ ఇన్వెస్ట‌ర్ల‌ను ఒప్పించగ‌లిగిన ఫ‌లిత‌మే ఎయాన్‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్న‌ది. సౌర విద్యుత్‌కు అపార అవ‌కాశాలున్న ఢిల్లీ ఇప్పుడు హార్డ్‌వేర్ స్టార్ట‌ప్‌ల‌కు హ‌బ్‌గా మారిపోయింది. గ్రే ఆరెంజ్ రోబొటిక్స్‌, అంబ్రెల్లా ప్రొటెక్ష‌న్ వంటి సంస్థ‌లు ఇప్ప‌టికే త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించంగా.. ఇప్పుడు ఎయాన్ సోలారీస్ కూడా ఈ రంగంలో అవ‌కాశాల‌ను పుణికిపుచ్చుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తూ విజ‌య‌ప‌థాన ప‌య‌నిస్తున్న‌ది. ఈ సంస్థ ప్ర‌యాణం మ‌రింత వేగంగా సాగాల‌ని కోరుకుందాం.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags