సంకలనాలు
Telugu

షార్ట్ ఫిల్మ్స్‌కు కాసులు తెచ్చిపెట్టే ‘హ్యాండీఫ్లిక్స్’

షార్ట్ ఫిల్మ్ కోసం మరో ఇండస్ట్రీ తీసుకొస్తామంటున్న ఫౌండర్లు..చిన్న సినిమాలకు సైతం రెవెన్యూ వెతికిపెట్టే తెలుగు స్టార్టప్..రిలీజు, ప్రమోషన్ తో అదరగొడుతున్న తెలుగు కుర్రాళ్లు..

ashok patnaik
19th Sep 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

సినిమాల్లో షార్ట్ సినిమాలు వేరయా అంటున్నారీ తెలుగు కుర్రాళ్లు. మల్టీఫ్లెక్స్‌లో నడిచే పెద్ద హీరోల సినిమాలు మాత్రమే సినిమాలు కాదు, డాక్యుమెంటరీ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్, వీడియో సాంగ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా ప్రతీదానికి ఓ అరుదైన, అందమైన రూపం ఉందనేది హ్యండీప్లిక్స్ అభిప్రాయం. ఆ రూపాన్ని పదిమంది చేత చూపించడానికే ఈ స్టార్టప్ ప్రారంభమైంది. భవిష్యత్తులో క్రౌడ్ ఫండింగ్ సినిమాలు వస్తాయనేది వాస్తవం. ఇప్పటి నుంచే ఎంతో మంది ఎన్నో రకాలుగా దీన్ని ఇనీషియేట్ చేస్తున్నారు. అందులో తాము కూడా భాగం కావడం ఆనందాన్ని కలిగిస్తుందని సిఈఓ ఈశ్వర్ అంటున్నారు.

image


“ అన్ని రంగాల్లో టెక్నాలజీ వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో కూడా టెక్నాలజీ వచ్చింది. కానీ సాధారణ ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లేదాకా మాత్రమే ఆగిపోయింది. ఇంటి దగ్గరే సినిమా చూసే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం ” - ఈశ్వర్

ఆన్ లైన్లో ఆధునిక దృశ్యకావ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సాధారణ తెలుగు మూవీల్లో స్టార్స్ ఉండరు. కానీ మా మూవీలో సినిమానే ఓ పెద్ద స్టార్. అది కూడా మూడు గంటల సమయం థియేటర్లో కాలక్షేపం చేసే అవకాశం లేకుండా చిన్న చిన్న సినిమాలను ఇంటి దగ్గర, బెడ్ రూం నుంచే చూసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామంటున్నారు. పైరసీకి ఎలాంటి అవకాశం లేని ఫ్లాట్ ఫాం ఇది. భావి దర్శకులకు, నిర్మాతలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. భారీగా పెట్టుబడి అక్కర్లేదు, కళ్లు చెదిరే సెట్లు వేయక్కర్లేదు, స్టార్ల డేట్స్ కోసం అసలు క్యూ కట్టక్కర్లేదు. కథ ఉంటే చాలు వనరులన్నింటినీ సమకూరుస్తామని అన్నారాయన.

image


తొలి అడుగు

హ్యాండీ ఫ్లిక్స్ (handyflix.com) స్టార్టప్ ప్రారంభించడానికి ఓ బలమైన కారణం ఉందంటారు ఈశ్వర్. సాధారణ సినిమా తీయడం ఎంతకష్టమో దాన్ని రిలీజు చేయడం అంతకంటే కష్టమైన పని. డిస్ట్రిబ్యూషన్ సరిగా లేక తెలుగు ఇండస్ట్రీలో వందల సినిమాలు రిలీజుకు నోచుకోవడం లేదు. ప్రారంభించినప్పుడు నిర్మాతలో ఉన్న ఉత్సాహం పూర్తయ్యే సమయానికి ఉండటం లేదు. దీంతో ఆ సినిమాకు పనిచేసిన వారంతా ఏమవుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. పరిచయాలున్న కొందరు మాత్రం మరో అవకాశం పొందుతున్నారు లేదంటే సరేసరి. దీంతో పాటు సినిమాపై ఆసక్తి ఉన్న దర్శక నిర్మాతలు షార్ట్ మూవీస్ తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. అది ఫ్రీగా అందరూ చూడాలని కోరుకుంటున్నారు. క్లిక్స్ పెరిగితే ఆదాయం వస్తుంది కానీ అది ఆశించినంత మాత్రం ఉండకపోవచ్చు. ఆ సినిమా చూసి ఇండస్ట్రీలో ఎవరైనా అవకాశం ఇస్తారేమో అని ఎదురు చూపులు తప్పితే ..పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇలాంటి పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతోనే ఈ స్టార్టప్ ప్రారంభించినట్టు ఈశ్వర్ చెబ్తున్నారు.

హ్యాండీ ఫ్లిక్స్ సిఈఓ ఈశ్వర్

హ్యాండీ ఫ్లిక్స్ సిఈఓ ఈశ్వర్


స్టార్టప్ వెనకున్న కథ

ఈశ్వర్ చిన్ననాటి స్నేహితుడు షార్ట్ మూవీస్ బాగా తీసేవాడు. వ్యూస్ బాగా రావడంతో పాటు చాలా మంది ప్రశంసలు కూడా అందుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడతను ఓ కార్పోరేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఎందుకని అడిగిన ఈశ్వర్‌కి షార్ట్ ఫిల్మ్‌తో ఫేం వచ్చిందేమో కానీ రెవెన్యూ రాలేదు. అందుకే వేరే దారిలేక ఉద్యోగంలో చేరాననే సమాధానం వచ్చింది. ఈ సమాధానం ఈశ్వర్‌ను ఆ దిశగా ఆలోచింపజేసింది. షార్ట్ ఫిలిమ్స్ తీసే వారికి టెక్నాలజీని ఆధారం చేసుకుని ఏ విధంగా ఆదాయ వనరులు కల్పించాలి అని ఏడాది పాటు ఆలోచించారు. ఆ తర్వాత అక్రమ్, శ్యాంతో కలసి దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా ఈ స్టార్టప్ తన ఆపరేషన్స్ నడిపిస్తోంది. హైదరాబాద్‌లో కూడా సేవలను విస్తరించాలని చూస్తోంది.

హ్యాండీ ఫ్లిక్స్ టీం

టీంలో ఫౌండర్‌ సీఈఓ ఈశ్వర్, విశాఖ జిల్లా వాసి. ఎంబిఏ పూర్తి చేశారు. శామ్ కోఫౌండర్, సిఎంఓగా వ్యవహరిస్తున్నారు. ఈయనది రాజమండ్రి. ఎంబిఏ పూర్తి చేశారు. టీంలో మరో వ్యక్తి అక్రం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అక్రమ్‌ది కడప జిల్లా. ఈయన కూడా హ్యాండీ ఫ్లిక్స్‌లో కోఫౌండర్, సీటీఓ బాధ్యతలు చూస్తున్నారు. ఈయనతో పాటు డెవలపర్‌గా శివ , కంటెంట్ వ్యవహారాలను మల్లిఖార్జున, ఫిల్మ్ ఎక్విజిషన్‌ను అభిషేక్ చూస్తున్నారు.

image


ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు

తెలుగు,హిందీ, ఇంగ్లీష్, మళయాళంతోపాటు కన్నడలో మొత్తం 150కి పైగా షార్ట్ మూవీస్, డాక్యుమెంటరీలను వీరి వెబ్ సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకూ 10 మంది ఫిల్మ్ మేకర్స్ రిజిస్టర్ అయ్యారు. ఇందులో ఎక్కువగా తెలుగు సినిమాలు ఉండటం విశేషం. హైదరాబాద్ కేంద్రంగా యాభైకి పైగా సినిమాలు తమ సైట్ లో అప్‌లోడ్ అయ్యాయి.

హ్యాండీ ఫ్లిక్స్ అసలేం చేస్తుంది?

ఫిల్మ్ మేకర్ లేదా ప్రొడక్షన్ బ్యానర్ తమ అకౌంట్‌ని క్రియేట్ చేసుకోవాలి. వారికి సంబంధించిన సినిమా వివరాలు అందించాలి. (ఉదా:ఖర్చు, ట్రైలర్,సినిమా క్రూ). హ్యాండీ ఫ్లిక్స్ దీన్ని అప్రూవ్ చేసి వెబ్ సైట్లో చూసే వెసులుబాటు కల్పిస్తుంది. ట్రైలర్‌ను ప్రమోట్ చేసి వ్యూయర్స్ చూసేలా ప్రోత్సహిస్తుంది. చూడటానికి వ్యూయర్ దగ్గర నుంచి నామినల్ టికెట్ చార్జీలు వసూలు చేస్తారు. ఈ రకంగా ఫిల్మ్ మేకర్స్‌కు రెవెన్యూ జనరేట్ చేస్తారు. టికెట్ ధర ఫిక్స్ చేయడం అనేది ఇక్కడ ప్రధాన విషయం. సినిమా కంటెంట్ బట్టి దీన్ని నిర్ణయిస్తారు.

కో ఫౌండర్ శామ్

కో ఫౌండర్ శామ్


భవిష్యత్ ప్రణాళికలు

ఈ ఏడాది చివరికల్లా లక్ష మంది వ్యూయర్స్‌తో 500మంది రిజిస్ట్రర్ ఫిల్మ్ మేకర్స్ ను ఈ ఫ్లాట్ ఫాం కిందకు తీసుకురావడమే లక్ష్యమని ఫౌండర్లు చెప్పుకొచ్చారు. క్రౌడ్ ఫండింగ్ సినిమాలు తీయడానికి దేశంలో ఉన్నత ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేయాని ముందుకు పోతున్నారు. ఎవరూ ఇప్పటి వరకూ టచ్ చేయని ఇండస్ట్రీలో తాము టెక్నాలజీ సాయంతో ఫ్లాట్ ఫాం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సినిమా అంటే ఖర్చుతో కూడుకున్నదనే అభిప్రాయాన్ని మార్చాలనేది తమ అంతిమ లక్ష్యమని కో ఫౌండర్ షామ్ ముగించారు

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags