పూల జడలతో పాపులర్ అయిన కెమికల్ ఇంజనీర్

పూల జడలతో పాపులర్ అయిన కెమికల్ ఇంజనీర్

Wednesday September 30, 2015,

4 min Read

పెళ్లి. జీవితంలో ఓ మధురమైన ఘట్టం. ఏడడుగుల బంధాన్ని కలిపే ఈ ముహూర్తాన్ని మాటల్లో వర్ణించలేం. నూతన వధూవరులిద్దరూ కొత్త వస్త్రాలతో మెరిసిపోతూ.. ఆ మండపానికే వన్నెతెస్తారు. వాళ్ల మెడలో ఠీవిగా మెరిసిపోయే పూలదండలు.. పరిమళాన్ని వెదజల్లుతూనే తాజాదనాన్ని గుర్తుచేస్తాయి. ఇక అమ్మాయి కొప్పులో ఒదిగిపోయి.. పెళ్లికూతురి శోభను ద్విగుణీకృతం చేసేది మాత్రం ముమ్మాటికీ పూలజడే. వజ్రాలతో ఒదిగిన ఆభరణాలు ఎన్ని ఉన్నా.. కొప్పులో ఉన్న గుప్పెడు మల్లెలు, అందంగా తీర్చిదిద్దిన పూలజడ ముందు బలాదూర్. ఆ మాటకు వస్తే.. మణిమాణిక్యాలు ఉన్నా లేకపోయినా బారెడు పూలజడ లేనిదే అమ్మాయికి పెళ్లికూతురి అందం రానేరాదు.

image


అయితే ఈ రోజుల్లో అంత ఒద్దికగా పూలజడలు కుట్టే ఓపికలు ఇంట్లో ఎవరికీ లేవు. ఒకవేళ టైం ఉన్నా.. ఈ జనరేషన్ జనాలకు వాటిని తయారుచేయడం కూడా రాదు. అందుకే ఇప్పుడు బయట దొరికే వాటి గురించే జనాలు చూస్తున్నారు. సరిగ్గా దీన్నే ఓ బిజినెస్ ఐడియాగా మార్చుకుంది ఓ ఇద్దరు పిల్లల తల్లి. కెమికల్ ఇంజనీరింగ్ చదివినా.. ఎలాంటి నామోషీ లేకుండా పూలజడలను తయారు చేస్తూ, చేయిస్తూ.. వందల మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండలేక ఏదో ఒకటి వినూత్నంగా చేయాలనే తాపత్రయం నుంచి పుట్టిన ఈ పూలజడ ఇప్పటి వరకూ వెయ్యి మంది పెళ్లికూతుళ్లను ముస్తాబు చేసింది.

పెళ్లి పూలజడ ఆలోచన ఎలా ?

హైదరాబాద్‌కు చెందిన కల్పన.. సిబిఐటిలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. సాధారణంగా మహిళలు ఈ రంగంలోకి రావడం అరుదే. అయినా కల్పన ధైర్యంగానే ముందడుగు వేశారు. సువెన్ లైఫ్, రిలయన్స్, ఇన్వెన్సిస్ వంటి సంస్థల్లో పదేళ్ల పాటు మేనేజర్ స్థాయిలో పనిచేశారు. యూఎస్ కూడా వెళ్లి కొన్ని ప్రాజెక్టులు చేపట్టారు. ఈ మధ్యలోనే పెళ్లి.. ప్రెగ్నెన్సీ రావడం పిల్లలను సరిగా చూసుకోలేక వాళ్లను డే కేర్ సెంటర్లకు అప్పగించడం.. కొద్దిగా బాధ అనిపించినా తప్పని పరిస్థితి. ఆర్థికంగా నిలదొక్కుకునేంత వరకూ ఉద్యోగం చేయాలనే అనుకున్నారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సంతానం పెరగడంతో ఇక ఉద్యోగం చేయడానికి కల్పన ఏ మాత్రం ఇష్టపడలేదు. పిల్లలను చూసుకోవడానికే ఆమె మొగ్గుచూపారు. అంత పెద్ద ఉద్యోగాన్ని వదిలేయడానికి కూడా ఏ మాత్రం సంకోచించలేదు. అయితే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఓ సారి ఓ పేపర్‌లో డిజైనర్ పూలజడల ఫోటోలు కంటపడ్డాయి. ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉందే.. అని అప్పుడే ఆసక్తి పెరిగింది. ఇలాంటివి ఎవరైనా తయారు చేస్తున్నారా అని నెట్‌లో వెతికారు. కానీ పెద్దగా ఎవరూ కనిపించలేదు.

image


అప్పుడు వాళ్ల అమ్మ సాయం తీసుకుని.. కొన్ని పెళ్లి పూల జడలు చేస్తే ఎలా ఉంటుందని కల్పనకు అనిపించింది. ఎందుకంటే.. వాళ్ల అమ్మ ఇలాంటి జడలను అల్లడంలో అందెవేసిన చెయ్యి. ఇక ఆలస్యం చేయకుండా కొన్ని పూలను తెచ్చుకుని ట్రై చేశారు. పూలజడలు బాగానే వచ్చాయి. వాటిని ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. అలా జూన్ 2012లో ఈ పూలజడల ఆలోచనకు బీజం పడింది.

కానీ భవిష్యత్తులో ఇదో పెద్ద వ్యాపారం అవుతుందని తను కూడా ఊహించలేదు. ఖాళీగా ఎందుకు ఉండడం అని టైమ్ పాస్‌ కోసం చేసిన వ్యాపారమే ఇప్పుడు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తోంది. తల్లి దగ్గర బేసిక్స్ నేర్చుకుని.. ఇంటి చుట్టుపక్కల ఉన్న కొంత మందితో కలిసి బిజినెస్ మొదలుపెట్టారు కల్పన. ఇందుకోసం మొదట రూ. 50 వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టారు. వినూత్నంగా పూలజడలను తయారు చేయడం వాటిని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేయడం. అలా అవి షేర్ అవుతూ.. ఎంతో మందికి చేరడంతో ఆర్డర్ల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి జనాలు వాటిని కొనుక్కుని వెళ్లేవారు. ఊహించనంత ప్రోత్సాహం రావడంతో కల్పన ఇక వెనుదిరిగి చూడలేదు.

45 శాఖలు, అమెరికాలోనూ ఫ్రాంచైజీ

ఒక అద్దె ఇంట్లో మొదలైన పెళ్లి పూలజడ ప్రస్థానం అలా అలా అంచలంచెలుగా ఎదుగుతూ వెళ్లింది. చుట్టుపక్కల ఉండే వాళ్లే ఇందులో భాగస్వాములయ్యారు. పెద్దగా చదువురాని.. ఇంటిగుమ్మాలకే పరిమితమైన స్త్రీలకు కల్పన ఓ వెలుగుదివ్వెలా కనిపించింది. కూలీపనులతో రాటుదేలిపోయిన ఆ చేతులు..సుతారమైన సుతిమెత్తని పూలు తాకే సరికి వాళ్ల వేళ్ళు కూడా కోమలత్వం సంతరించుకుంది వేగంగా కదిలాయి. ఇప్పుడు కల్పన దగ్గర దాదాపు 200 మంది వరకూ పనిచేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో అయితే దాదాపు 400 మందికి పనిదొరుకుతుంది. వాళ్లు చేసుకునే పనిని బట్టి నెలకు ఒకొక్కరూ కనీసం రూ.5 వేల నుంచి 20 వేల వరకూ సంపాదించుకుంటున్నారు.

శ్రీకాకుళం, విజయనగరం తప్ప.. ఆంధ్ర,తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ పెళ్లి పూలజడ ఫ్రాంచైజీలు ఉన్నాయి. బెంగళూరు, ముంబై, చెన్నైసహా 45 చోట్ల వీళ్లకు శాఖలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కల్పన దగ్గర పని నేర్చుకున్న మహిళలకే కొన్ని చోట్ల ఫ్రాంచైజీ బాధ్యతలు అప్పగించారు. పెద్దగా చదువు రాని వాళ్లే ఇప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్‌లో తమ పనితనాన్ని చూపించుకుంటూ ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు.

పూలజడ కాన్సెప్ట్ వినూత్నంగా ఉండడంతో విదేశాల నుంచి కల్పనకు ఆర్డర్లు వచ్చేవి. అయితే వాటిని ఎగుమతి చేసే పర్మిట్ తమకు లేకపోవడం, పూలు వాడిపోయే అవకాశం ఉండడంతో నిస్సహాయంగా ఉండిపోయారు. అయితే వీళ్ల పనులపై ఆసక్తి పెంచుకున్న ఉదయ అనే మహిళ అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి ట్రైనింగ్ తీసుకుని మరీ.. ఫ్రాంచైజీ తీసుకున్నారు. దీంతో అక్కడున్న తెలుగువాళ్లు కూడా పెళ్లిళ్లకు, వివిధ కార్యక్రమాలకు వీటిని ఆర్డర్ చేస్తూ ఆదరిస్తున్నారు.

image


మొదటి షాక్ తగిలింది

'' స్టార్టప్ మొదలుపెట్టిన రోజుల్లో.. చెన్నై నుంచి ఓ బృందం వచ్చి భారీ ఎత్తున ఆర్డర్ ఇచ్చింది. వందల సంఖ్యలో దండలు, పుష్పగుచ్ఛాలు కావాలని ఆర్డర్ ఇచ్చింది. వాళ్లను నమ్మి రూ.20-30 వేలు సరుకును కొని తెచ్చుపెట్టుకున్నాను. తీరా.. వాళ్లకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పలికే దిక్కులేదు. మొదటి రోజుల్లోనే నాకు మతిపోయింది. దీంతో.. అప్పటి నుంచి అడ్వాన్స్ లేకుండా ఆర్డర్లు తీసుకోవడం లేదు '' - కల్పన.

డిమాండ్ తట్టుకోలేక మానేద్దామనుకున్నా

సాధారణంగా పెళ్లిళ్ల సీజన్‌లోనే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి 24 గంటలు కష్టపడినా.. సరఫరా చేయలేని పరిస్థితి వస్తుంది. బల్క్ ఆర్డర్లను సాధారణంగా ముందు నుంచే తీసుకోవడం లేదు. అంత మ్యాన్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్లే ధైర్యం చేయడం లేదని అన్నారు కల్పన. ఒక్కోసారి పనివాళ్లు సమయానికి రాకపోవడం, చెప్పాపెట్టకుండా డుమ్మాలు కొట్టడం, పూలు టైమ్‌కి రాకపోవడం వల్ల విపరీతమైన టెన్షన్ పడేవాళ్లు. ప్రతీ మూడు నెలలకు ఓ సారి ఈ వ్యాపారం మానేసి మళ్లీ ఉద్యోగం చేద్దామని ఎన్నో సార్లు అనుకున్నా అంటారు కల్పన.

భవిష్యత్ లక్ష్యాలు

సీజన్‌లోనే ఫుల్ డిమాండ్ ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ.. ఆఫ్ సీజన్‌లో కూడా అంతే కష్టపడాలని అంటారు కల్పన. బేస్‌లు తయారుచేసుకోవడం, బుట్టలు, తోరణాలు వంటివి తయారు చేసిపెట్టుకుంటామని చెప్తారు. మార్కెట్ అవకాశాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే ఇప్పుడు చేరుకోగలిగామని.. ఇంకా పుష్కలమైన బిజినెస్ ఉందని పూలజడ టీం భావిస్తోంది.

తమ వ్యాపారమంతా పూలపైనే ఆధారపడడంతో హైదరాబాద్ సమీపంలో కొంతభూమిని తీసుకుని పూలను పెంచుతున్నారు. తోటలు అందుబాటులోకి వస్తే.. తమ బిజినెస్‌ను మరింత విస్తరిస్తామనే ధీమా కల్పనలో కనిపిస్తోంది. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ లైసైన్స్‌ కోసం కూడా చూస్తున్నట్టు వివరించారు. ఇప్పటివరకూ అంతా సొంత నిధులతోనే వ్యాపారం సాగుతోంది. పెట్టుబడి కోసం చాలా మంది ముందుకు వచ్చారని, అయితే ఫండింగ్‌తో పాటు మెంటరింగ్ చేసే వాళ్లు ఎవరూ లేకపోవడం వల్లే ఎవరికీ ఓకె చెప్పలేదని కల్పన అంటున్నారు.

website

Photo courtesy - pellipoolajada