సంకలనాలు
Telugu

కెగ్‌ ఫారాల్లో గుడ్లు పెడుతున్న డబ్బులు

• పౌల్ట్రీ రంగంలో జెనెటిక్‌ బ్రీడింగ్‌ ప్రవేశపెట్టిన ఇంజనీర్‌• 10 లక్షల బీద కుటుంబాల్లో లాభాల కోడి కూత • ఆఫ్రికా దేశాల్లో కెగ్‌ ఫార్మ్స్‌ కు అద్భుత ఫలితాలు

24th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఎవరైనా కంపెనీలు ఎందుకు ఆరంభిస్తారన్న ప్రశ్నకు, ఎకనమిక్స్‌ ప్రొఫెసర్లయితే 'లాభాలకోసం' అంటారు. సోషల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వాళ్లయితే 'సమాజంలో మార్పుకోసం' అంటారు. ఇదే విషయంలో నేను కొందరు సోషల్‌ ఎంటర్‌ప్రైజర్లతో పదే పదే ముచ్చటించాక, నాకొక అద్భుత దృశ్యం తోచింది. సోషల్‌ స్టార్టప్స్‌ అనేవి కేవలం లాభాపేక్షతోనో, సమాజంలో మార్పుకోసమో ఏర్పడవు. అంతకంటే, మించిన ఉదాత్త భావం వీటిలో ఇమిడి ఉంటుంది. అవి ఖాళీ కాన్వాసుపై గీసే చిత్రంలాంటివి. ఆర్టిస్టు కేవలం తాను చూసింది గీయడంతో సరిపుచ్చడు. తన భావాలు, ఆలోచనలు, జీవితాన్ని తాను దర్శించిన తీరు, తన వ్యక్తిత్వం... వంటి అనేక అంశాలను అందులో చేరుస్తాడు. అప్పుడది ఒక పోర్ట్రయిట్‌ లేదా ల్యాండ్‌ స్కేప్‌ చిత్రంగా మిగలదు. ఆర్టిస్టు వ్యక్తిత్వానికి అది అద్దం పడుతుంది. అలాంటిదే ఒక స్టార్టప్‌ కూడా! ఎంటర్‌ప్రెన్యూర్‌ వ్యక్తిత్వానికి ఎక్స్‌ టెన్షన్‌ అది. అతని జీవితాదర్శంగా మారిపోతుంది.

image


గ్రామీణ నిరుపేదలకు ఆసరా

ఇప్పుడు మనం చెప్పుకోబోయేది... జీవితాన్ని భిన్న కోణం నుంచి చూసిన ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ గురించి. స్వయంగా ఆర్టిస్టుకూడా! 'నేను ధనవంతుణ్ణి కావడం నా గోల్‌ కాదు. నా వ్యక్తిత్వాన్ని చాటుకోవడానికి ఒక మార్గం అనిపించి, వ్యాపారాన్ని ఆరంభించాను. సమాజంపట్ల నాకు ఆవేదన ఉంది. దేశ పౌరుడిగా గర్వం ఉంది. భారతీయ సాంస్కృతిక విలువలనే నా వ్యాపార సూత్రంగా మలచుకున్నాను' అన్నారు వినోద్‌ కపూర్‌. ఆయన గ్రామీణ స్థాయిలో పౌల్ట్రీ పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న తలంపుతో 1967లో కెగ్‌ ఫార్మ్స్‌ ఆరంభించారు. కపూర్‌ ఈ సంస్థకు సిఈవోగా ఉంటున్నారు. ఇది సోషల్‌ ఎంటర్‌ప్రైజ్‌గా తీర్చిదిద్దారు. గ్రామీణ నిరుపేదలకు ఆదాయ వనరును చేశారు. కెగ్‌ ఫార్మ్స్‌ ద్వారా 10 లక్షల కుటుంబాలను ప్రభావితం చేశారు.

అవగాహన లేకపోయినా

40 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్‌ చదివి, స్వీడిష్‌ మాచ్‌ కంపెనీకి ఇండియాలో హెడ్‌గా పనిచేసేవారు వినోద్‌. ఉద్యోగం, జీతం, జీవితం అన్నీ సాఫీగా సాగిపోతుండేవి. అయినా, ఏదో వెలితి. ఏదో కొత్తగా చేయాలన్న తపన. గ్రామాల్లో రైతాంగానికి మేలు చేసేలా ఏవైనా చేయాలనుకున్నారు. ఆ అన్వేషణలో ఆయనను పౌల్ట్రీ పరిశ్రమ ఆకట్టుకుంది. వినోద్‌కు అవగాహన లేకపోయినా పౌల్ట్రీ రంగం భేష్‌ అనుకున్నారు. అప్పట్లో బ్రీడింగ్‌ పౌల్ట్రీ అంతగా అభివృద్ధి చెందలేదు. చాలామటుకు దిగుమతి చేసుకోవలసి వచ్చేది. వినోద్‌ ఆ దిశగా దృష్టి సారించారు. మన దేశంలోనే వనరులు ఏర్పడాలనుకున్నారు. అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను సృష్టించాలనుకున్నారు.

తిరుగులేని ఫలితాలు

1973లో కుటుంబం నుంచి కొంత మొత్తాన్ని తీసుకున్నారు. ఉద్యోగానికి నీళ్లదిలేసి, కెగ్‌ ఫార్మ్స్‌ పైనే పూర్తి సమయాన్ని కేటాయించారు. దేశంలోనే మొదటిసారిగా జన్యు పెంపకం (జెనెటిక్‌ బ్రీడింగ్‌)ను ప్రవేశపెట్టారు. దిగుమతులకు అలవాటుపడ్డవారికి జెనెటిక్‌ బ్రీడింగ్‌ ఉపయోగాలు తెలిసొచ్చేలా చేశారు. ఇది కెగ్‌ ఫార్మ్స్‌కు తిరుగులేని ఫలితాలను తెచ్చిపెట్టింది.

'నేను జెనెటిక్‌ బ్రీడింగ్‌ గురించి ఆలోచించినప్పుడు వెర్రితనంగా కొట్టిపారేశారు. నాకొక ఆలోచన, దూరదృష్టి ఉండడంతో గట్టిగా దానినే నమ్ముకున్నాను. చివరికి నేనే కరెక్టని రుజువైంది. 1977లో ప్రభుత్వం బ్రీడింగ్‌ పౌల్ట్రీ వల్ల లాభాలను, కెగ్‌ ఫార్మ్స్‌ వారి పద్ధతిని గుర్తించింది.

దేశవ్యాప్తంగా కెగ్‌ ఫార్మ్స్‌

ఆ క్షణం నుంచీ కెగ్‌ ఫార్మ్స్‌ దేశవ్యాప్తంగా పాకిపోయింది. 1991లో తన కంపెనీ గ్రామీణ భారతానికి చాలా అవసరమని గుర్తించారు. దేశంలోని అత్యధిక జనాభాకి పౌల్ట్రీ పరిశ్రమతో పరిచయం లేదు. వాళ్లకు పౌల్ట్రీ ఎంతో అవసరం అనుకున్నారు. పౌల్ట్రీ బ్రీడింగ్‌ పేద రైతాంగానికి ఎంతో మేలు చేస్తుంది. వాళ్ల దారిద్య్రాన్ని పోగొట్టడానికి ఇదో మార్గంగా భావించారు.

ఈ రోజున కెగ్‌ ఫార్మ్స్‌ తన వ్యాపారాన్ని వేర్వేరు దేశాలకు విస్తరించింది. ఇథియోపియా, ఉగాండా వంటి దేశాల్లో స్థానిక ప్రభుత్వాలు, ప్రపంచ బ్యాంకు సాయంతో పౌల్ట్రీ బ్రీడింగ్‌ సాగుతోంది. 'నాది మహా దూరదృష్టిగల చిన్న కంపెనీ' అంటారు వినోద్‌.

ఒకప్పుడు ఏమీ తెలియకపోయినా, ఇప్పుడాయన 45 ఏళ్ల అనుభవజ్ఞుడు. ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనుకాడలేదు. ప్రతికూలతనుసైతం సానుకూల దృక్పథంతో చూసేవారు. పాజిటివ్‌గా ఆలోచించగలిగితేనే ఏ సవాలునైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చునన్నారు. 'మీరు సైద్ధాంతికంగా ఆలోచిస్తే, ఆ నమ్మకమే మిమ్మల్నే నడిపిస్తుంది. నేను అలాగే భావిస్తాను' అన్నారు.

image


కొన్నిసార్లు పొరపాట్లు

వినోద్‌ కపూర్‌ లాంటి తెలివైనవాడుకూడా కొన్నిసార్లు పప్పులో కాలేసిన సందర్భాలున్నాయి. 'నాకిప్పుడు 79 ఏళ్లు. నాకు 22 ఏళ్ల వయసులో నేను పనిచేయడం మొదలెట్టాను. నా జీవితంలో లెక్కలేనన్ని పొరబాట్లున్నాయి. ప్రతి తప్పటడుగునూ గుణపాఠంగా భావించాను. ప్రతి మిస్టేక్‌ నుంచీ ఏంతో కొంత నేర్చుకున్నాను. ఈ రోజున ఇలా ఉన్నానంటే, ఆ పొరబాట్లు నేర్చిన పాఠాలే' అన్నారు వినోద్‌.

ఎంటర్‌ప్రెన్యూర్లపై ఆయనకొక స్పష్టత ఉంది. అవకాశాలకోసం ఎదురుచూసేవారే ఎంటర్‌ప్రెన్యూర్లు అవుతారని అంటారు. అలాంటివారు తమ మోటివేషన్‌, ఆలోచనలకనుగుణంగా నడుచుకుంటారని అన్నారు. ఎంటర్‌ప్రైన్యూర్‌ కావాలనుకునేవారికి వినోద్‌ ఓ చిన్న ఉదంతం చెబుతారు... 'ఒకసారి ఓ బ్రిలియంట్‌ స్టూడెంట్‌ నా దగ్గరకొచ్చి, ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలనుకుంటున్నాను. కాబట్టి, నాకు ఏ వ్యాపారం అయితే బాగుంటుందో సలహా ఇవ్వమన్నాడు. నేను అతనితో స్పష్టంగా చెప్పేశాను. నీకు ఏం చేయాలో తెలియనప్పుడు ఏమీ చేయకు! కేవలం డబ్బుకోసమో, నీకొక సొంత కంపెనీ ఉందని చాటుకోవడానికో మొదలెట్టకు. ఎంటర్‌ప్రెన్యూర్‌ అనే వాడికి దట్టించిన ఆలోచనలు ఉండాలి. దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. మీరు చేసే పనిమీద మీకు నమ్మకం ఉన్నట్టయితే చాలు, అదే సరైనదని చెప్పాను' అన్నారు.

విజయానికి కారకులెవరంటే

వినోద్‌ కపూర్‌ పౌల్ట్రీ రంగంలో తిరుగులేని ఎంటర్‌ప్రెన్యూర్‌. తన విజయానికి కారకులెవరంటే, టక్కున 'నా భార్య' అంటారు. 'జీరో నుంచి మొదటెట్టాలని అనుకున్నప్పుడు నా భార్య నాకు అండగా నిలిచింది. మంచి ఉద్యోగాన్ని వదిలేసుకుని ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ఆమె ప్రోత్సాహమే కొండంత ధైర్యాన్చిచ్చింది. నేనొక పిచ్చోణ్ణని అందరూ అనుకున్నా ఆమె మాత్రం అనుకోలేదు. నన్ను ఎన్నడూ ప్రశ్నించలేదు. నీకెందుకు, నేనున్నాను నీ వెనక అని వెన్ను తట్టింది' అన్నారు.

ఖాళీ కాన్వాసుపైకి కెగ్‌ ఫార్మ్స్‌ ను చిత్రించారు వినోద్‌. తన జీవితపు ప్రతి చిన్న కదలికను దానిపైకి ఎక్కించారు. దానినొక మాస్టర్‌ పీసుగా మలిచారు. పికాసో, మైకెలాంజిలో మాదిరిగా ప్రపంచ ప్రఖ్యాత కళాఖండాలు వేయలేకపోవచ్చు; కానీ, ఒక ఎంటర్‌ప్రెన్యూరుగా మాత్రం అద్భుత చిత్రాన్నే చిత్రించారు వినోద్‌ కపూర్‌.

++++++++++

చూడండి : KeggFarm’s website

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags