పేద కళాకారుల జీవితాల్లో కాంతులు నింపే రంగమాటి

21st Jan 2016
 • +0
Share on
close
 • +0
Share on
close
Share on
close

సంజయ్ గుహ. 15 ఏళ్లు సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసిన అనుభవం. సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ లో డిపార్టుమెంట్ హెడ్. కెరీర్ మంచి పొజిషన్ లో ఉంది. ఒకరోజు సాయంత్రం హఠాత్తుగా గుండెదడ మొదలైంది. శ్వాస బరువెక్కింది. కుప్పకూలిపోయాడు. వెంటనే హాస్పిటల్ కు తరలించారు. టెస్టులు చేశారు. బ్రెయిన్ కు అందాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందలేదని డాక్టర్లు చెప్పారు. వాళ్లు ఇంకో విషయం కూడా చెప్పారు. అది విని సంజయ్ షాకయ్యాడు. భౌతిక సమస్య కాదు .. మానసిక సమస్య అన్నారు వైద్యులు. అర్ధం కాలేదు. త్వరలోనే చనిపోతానా..? కొన్నాళ్లయినా బతక్కపోతానా..? ఆలోపు ఏదో ఒక మంచి చేయకపోతానా..? అని ఆలోచనలో పడ్డ సంజయ్ చివరికి ఏం చేశాడు..?

image


ఆలోచన. సంఘర్షణ. మానసిక సంఘర్షణ. నాలుగు నెలలు గడిచాయి. ఈలోగా సంక్రాంతి పండగొచ్చింది. బెంగాల్ లోని బిర్భూం జిల్లా కెందులీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్లాడు. ప్రముఖ కవి జాయ్ దేబ్ కి నివాళిగా జరుగుతున్న కార్యక్రమం అది. అందులో చాలా మంది పాల్గొన్నారు. జానపద గీతాలు ఆలపించే వాళ్లు, ఫకీర్లు, సన్యాసులు వేలాదిగా ఉన్నారు. వాళ్లు పాడే పాటల్లో ఒక్క ముక్క అర్ధం కాలేదు. అయినా వింటుంటే ఏదో తెలియని తదాత్మ్యం. అనిర్వచనీయమైన అలౌకికానందం. తెలియని ప్రశాంతత. దేహంతా పరుచుకుంది. మస్కిష్కమంతా నిండుకుంది .

కళాకారుడు ఆకలితో చనిపోవడమేంటి..?

వాళ్లు పాడిన పాటలు మనసుని ఒకపట్టాన ఉండనీయలేదు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు అలాంటి గేయాల కోసం.. అవి పాడేవాళ్ల కోసం వెతకడం మొదలుపెట్టాడు. అలా ఎన్నో కిలోమీటర్లు తిరిగాడు. పల్లెలు, గ్రామాలు తిరిగాడు. ఆ క్రమంలో కలిశారు కొందరు అద్భుతమైన పనితనం వున్నవాళ్లు. కుమ్మరులు, నేత పనివారు, వడ్రంగులు, కొందరు గిరిజనులు తారసపడ్డారు. వారు తయారు చేసేవన్నీ అపురూప కళాఖండాలు. అలాంటివి మార్కెట్లో ఎప్పుడూ చేడలేదు. ఇంతగొప్ప వస్తువులకు మార్కెట్ లేకపోవడం సంజయ్ ని ఆలోచనలో పడేసింది. వేళ్లమీద సృజ‌నాత్మ‌క‌త‌ వున్నా నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లని వారి దైన్యాన్ని చూసి చలించిపోయాడు. ఒక కళాకారుడు ఆకలితో చనిపోవడమేంటన్న ప్రశ్నకు సమాధానం వెతకాలనుకున్నాడు.

image


కర్తవ్యం బోధపడింది. వారికోసం ఏదో చేయాలనిపించింది. అలా చేయాలంటే ఉద్యోగం వదులుకోవాలి. జాబ్ వదిలేస్తే భార్యా పిల్లల గతేంకాను? అక్కడ ఆగిపోయాడు. అది 2013 ఆగష్టు 16 . కారణాలు చెప్పకుండానే తన దగ్గర పనిచేసే ఇద్దరు జూనియర్లను తొలగించాలని కంపెనీ నుంచి ఆదేశాలొచ్చాయి. అమెరికాల ఆర్ధిక మాంద్యం ప్రభావాన్ని ఇక్కడ చూపిస్తూ, ఎవరూ శాలరీ పెంచమని అడగకుండా, వారిద్దరినీ ఉద్యోగంలోంచి తీసేయాలనుకుంది కంపెనీ. దాంతో సంజయ్ వారిని తీసేయలేక- తనే ఉద్యోగానికి టాటా చెప్పాడు.

రంగమాటికి శ్రీకారం

బెంగాలీ కళాక్రుతులకు ఈ-కామర్స్ వేదిక చేయాలనుకున్నాడు. వాటిని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. అలా మొదలైంది రంగమాటి. బంకుర, బిర్భూం, బర్ధమాన్, శాంతినికేతన్, పురూలియాలో ఉండే మట్టి ఎరుపు రంగులో ఉంటుంది. ఆ ఎర్ర నేలలకు చెందిన కళాకారులకు గుర్తుగా నేను రంగమాటిగా నామకరణం చేశానంటాడు సంజయ్. మొదట్లో ఎన్నో సవాళ్లు. వాళ్లు తయారు చేసిన వస్తువులు మార్కెట్ చేయడం అంత ఈజీ కాదనిపించింది. కారణం నకిలీ వస్తువులు రాజ్యమేలడం. అసలైనవి పక్కదారి పట్టి, నిజమైన కళాకారులకు అన్యాయం జరుగుతోంది. వాస్తవానికి అధెంటిక్ డోక్రా వర్క్ ఎలాంటి కెమికల్స్ లేకుండా, రకరకాల ఆర్గానిక్ మెటల్స్ తో తయారు చేస్తారు. వాటిని ధరించడం వల్ల శరీరానికి ఎలాంటి నష్టం జరగదు. ఆన్ లైన్ లో దొరికే సింథటిక్ ఆభరణాలతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అదంతా డోక్రా కారణంగానే భావించి కస్టమర్లు వాటిని దూరం పెడ్తున్నారు. సెల్లర్స్ కూడా డోక్రా కాకుండా, ఇతర ఉత్పత్తుల్ని సైట్లలో ఉంచుతున్నారు.

image


"విదేశాలకు పెద్ద ఎత్తున హస్త కళాకృతుల్ని ఎగుమతి చేసే సత్తా ఇండియాకు వుంది. మన హస్తకళల పరిశ్రమ అనేక మంది కార్మికులతో కూడిన కుటిర పరిశ్రమ. అయినప్పటికీ అసంఘటితంగానే ఉంది. 6 మిలియన్ల కళాకారులకు పైగా ఉపాధి అందిస్తోంది. విదేశీ ఎగుమతుల ద్వారా హస్తకళా రంగం 2012-2013 లో 2.2 బిలియన్ అమెరికన్ డాలర్లను సంపాదించింది"-సంజయ్.

ఈ-కామర్స్ తో ముందుకు

దశాబ్ద కాలంగా ఈ-కామర్స్ రంగం భారత పరిశ్రమల గతిని మార్చేసింది. ఈ దశాబ్ధం కూడా కళాకారుల స్థితిగతుల్ని విప్లవాత్మకంగా మారుస్తుందని సంజయ్ బలంగా నమ్మాడు. ఈ క్రమంలో సంజయ్ ఆర్ధికంగా ఒడిదొడుకుల్ని ఎదుర్కొన్నాడు. చేతిలో ఉన్న సేవింగ్స్ అన్ని అయిపోయాయి. తల్లి పెన్షన్ మీద ఆధారపడ్డాడు. చివరికి భార్య నగల్ని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది స్నేహితులు సాయం చేయడానికి ముందుకొచ్చినా అది సరిపోలేదు. వివిధ కమ్యూనిటీలను అందులో భాగస్వాముల్ని చేయాలని అనుకున్నాడు. కానీ అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోలేకపోయాడు. బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు పక్కన పెట్టాయి. సంజయ్ ఆలోచనను చూసి నవ్వేవారు. ఇంకొకరి జీవితాలను బాగుచేయాలనే ఆలోచన ఈ దేశంలో నవ్వు తెప్పించే అంశంగా మారిపోయిందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

image


అయినా సరే కళాకారులు సంజయ్ ని నమ్మారు. వాళ్లమీదా సంజయ్ కి నమ్మకం కుదరింది. మొదట చేయాల్సిన పని దళారుల ఆట కట్టించడం. అది సెట్ చేస్తే ఆటోమేటిగ్గా కళాకారుల జీవితాలు గాడిన పడతాయి. ఆ విషయంలో సంజయ్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడిప్పుడే రంగమాటికి ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లు పెరుగుతున్నారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ తో పాటుగా ఇతర దేశాలకు సంజయ్ తరుచూ వెళ్తుంటారు. భారత్ లో రష్యన్ అంబాసడర్ అయిన అలెగ్జాండర్ కడాకిన్ ఈ మధ్యే డొక్రా కళతో రూపొందించిన లక్ష్మీ దేవి విగ్రహాన్ని కొన్నాడు. బెంగళూరులోని షోర్షె రెస్టారెంట్ ముందుభాగంలో విష్ణు, లక్ష్మి ల ప్రతిమ ఉంది. అది వాళ్లు తయారు చేసిందే. కస్టమర్ల గురించి ఇప్పుడు పెద్దగా ఆలోచించట్లేదంటాడు సంజయ్. వివిధ రంగాలకు చెందిన వారు తమ ఉత్పత్తుల్ని కొంటున్నారు. ఢిల్లీకి చెందిన ఒక రైటర్, అతి ఖరీదైన కాంతా చీరను ప్రతీ నెలా కొంటాడు. ఇలాంటి వారంతా, కస్టమర్లు కాదు.. హస్తకళా పోషకులని అంటారు సంజయ్. నిజమే కదా. కళను బతికించేవాళ్లంతా కళాకారులే. వాళ్లంతా కలకాలం వర్ధిల్లాలి.

 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • WhatsApp Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • WhatsApp Icon
 • Share on
  close
  Report an issue
  Authors

  Related Tags