సంకలనాలు
Telugu

సంతకానికి వచ్చిన ఇబ్బందే... 5000 కోట్ల వ్యాపారంలోకి అడుగుపెట్టేలా చేసింది !

balakrishna jyosula
21st Sep 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

మీరు ఫ్యామిలీతో కలిసి ఎక్కడికో వేకేషన్‌కు వెళ్లారు. సరదాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో మీ స్మార్ట్ ఫోన్లోని ఈమెయిల్‌కు ఓ అర్జెంట్ మెసేజ్. ఆఫీస్‌లోని ఓ ముఖ్యమైన డాక్యుమెంట్‌కు సంబంధించి పని పూర్తి చేసి అర్జంట్‌గా సంతకం చేయాలని దాని సారాంశం. మెసేజ్ వచ్చింది ఆఫీస్ నుంచి... అదీ అర్జంట్ పనికి సంబంధించిన ఈ మెయిల్. మరి మామూలుగా అయితే ఈ సమయంలో ఎవరైనా ఎంజాయ్‌మెంట్‌ను పక్కన పెట్టేసి ఫ్యాక్స్ మెషీన్, ప్రింటర్ ఎక్కడ అందుబాటులో ఉందా అని వెదుకులాటకు బయిలు దేరుతారు. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్‌కు చెక్ చెప్పేందుకు సైన్ ఈజీ అనే కంపెనీకి శ్రీకారం చుట్టారు సంస్థ ఫౌండర్ సునీల్ పాత్రో.

ఓ సారి మెక్సికో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆఫీసు నుంచి కాల్ అందుకున్న సునీల్ పాత్రో....తాత్కాలికంగా ఆ కష్టాన్ని ఎలాగోలా అధిగమించారు. భవిష్యత్తులోఇంకెవరికీ ఇలాంటి ఇబ్బంది రాకూడదని భావించి అప్పుడే డిసైడ్ అయిపోయారు. కేవలం తమ స్మార్ట్ ఫోన్ నుంచే అవసరమైన డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేసి సంతకాల ప్రక్రియను కూడా అవగొట్టేలా సాయం చేస్తోంది 'సైన్ ఈజీ' అనే కంపెనీ. అనతి కాలంలోనే లక్షలాది మంది వినియోగదారులను ఆకట్టుకున్న ఈ కంపెనీ ఇప్పుడు ఏకంగా 5000 కోట్ల రూపాయలకు విస్తరించిన డిజిటల్ డాక్యుమెంటేషన్, ఎలక్ట్రానిక్ సైన్ బిజినెస్‌లో భాగస్వామిగా ఉంది. 

2010లో మొదలైన ఈ కంపెనీ ఆరంభంలో కొన్ని కష్టాలను ఎదుర్కొన్నా.. డిజిటల్ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం ఓ పటిష్టమైన స్థితికి చేరుకుంది. సైన్ ఈజీ కంపెనీ పెట్టడానికి తనను పురిగొల్పిన పరిస్థితులు, సక్సెస్ వెనక కారణాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సమయంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సునీల్ పాత్రో యువర్ స్టోరీతో అనేక విషయాలను పంచుకున్నారు.

యువర్ స్టోరీ : సైన్ ఈజీ కంపెనీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే చాలా ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి. కంపెనీ నిర్వహణలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొంటూ అయిదేళ్లుగా మీరు సాగిస్తున్న విజయ ప్రస్థానంలోని కీలక ఘట్టాలు ఏంటి ?

సునీల్ పాత్రో : సైన్ ఈజీ కంపెనీ స్థాపించిన కాలంలోనే భారత్‌లో స్టార్టప్‌ల జోరు ప్రారంభం కావడంతో.. పోటీని ఎదుర్కోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మా ఉత్పత్తులను వేగంగా డబ్బు రూపంలోకి మార్చుకోవడానికి చాలా ఇబ్బందిపడ్డాం. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఈ రంగంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను సులభంగా పరిష్కరిస్తూ వినూత్నమైన ఆలోచనలతో సేవలను అందించడానికి ప్రయత్నించాం. ముఖ్యంగా మార్కెట్‌ను పెంచుకోవడానికి ఒకే సారి అన్ని వర్గాల మీద దృష్టి పెట్టకుండా డాక్యుమెంటేషన్‌ను విరివిగా ఉపయోగించే రియల్ ఎస్టేట్, అకౌంటింగ్, సేవా సర్వీసులు, లాజిస్టిక్ పరిశ్రమలను టార్గెట్ చేసుకున్నాం. తద్వారా డాక్యుమెంటేషన్‌ను సులభతరం చేసే మార్గంలో కొత్త పద్ధతులను కనిపెట్టడానికి వీలు కలగడంతో పాటు మార్కెట్‌ను పెంచుకోవడం కూడా ఈజీ అయింది. అంతే కాదు ఆపిల్‌తో పాటు ప్రస్తుతం మా భాగస్వాములుగా ఉన్న డ్రాప్ బాక్స్ లాంటి కంపెనీల దృష్టిని ఆకర్షించేలా చేసింది.

సైన్ ఈజీ టీమ్

సైన్ ఈజీ టీమ్


యువర్ స్టోరీ- డిజిటల్ కార్యకలాపాల నిర్వహణ ప్రస్తుతం విస్తృతంగా వాడుకలోకి వస్తోంది. ఈ అభివృద్ధి గురించి వివరిస్తారా. డిజిటల్ సంతకాల విషయంలో భారత్ స్థానం ఏంటి. మన ప్రయాణం ఏ దిశగా సాగుతోంది.

సునీల్ పాత్రో - డిజిటల్ కార్యకలాపాల నిర్వహణా రంగం వ్యాపార విలువ ప్రస్తుతం 5వేల కోట్ల రూపాయలు. 2020 నాటికి దాని విలువ సుమారు 2లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. ప్రతి ఏటా ఎలక్ట్రానిక్ సంతకాల రూపంలో 150 కోట్ల డాక్యుమెంట్ల ప్రాసెసింగ్ జరుగుతోంది. ఒక్క అమెరికాలోనే రెండు కోట్ల 28 లక్షల చిన్న చిన్న వ్యాపార వ్యవహారాలు జరుగుతున్నాయి. వీటిలో దాదాపు రెండు కోట్ల చిన్న వ్యాపార సంస్థలు పేపర్ వాడకాన్ని తగ్గించుకోవడంతో పాటు ఎలక్ట్రానిక్ సంతకాల కోసం చూస్తున్నాయి. అంతే కాదు సమాచారాన్ని డిజిటల్ మార్గంలో నిక్షిప్తం చేసి అవసరమైనపుడు ఉపయోగించుకునే క్లౌడ్ కంప్యూటింగ్ పద్ధతి కూడా పెరిగిపోయింది. అమెరికాలోని దాదాపు సగం కంపెనీ దీన్నే అవలంభిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ సంతకాల విషయంలో అక్రమాలు జరగకుండా చట్టాలు కూడా పటిష్టంగా అమలు అవుతూ ఉండడంతో వ్యాపార కార్యకలాపాలన్నీ పేపర్ రహితంగా జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో పోలిస్తే అమెరికా మార్కెట్లో సైన్ ఈజీ విస్తరణకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే భారత్‌లో కూడా ఇప్పుడిప్పుడే స్మార్ట్ ఫోన్ల వాడకం మరింత పెరగడం, ప్రభుత్వాలు డిజిటల్ ఇండియా కార్యక్రమాల అమలుపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టడంతో రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా డిజటల్ సంతకాలు, ఎలక్ట్రానిక్ సంతకాల వాడకం మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. 

యువర్ స్టోరీ - సైన్ ఈజీనే ఎందుకు కంపెనీలు నమ్ముతున్నారు ? మీ ప్రత్యేకతలు ఏంటి ?

సునీల్ పాత్రో : కొన్ని నెలల కాలంలో మా కంపెనీ అద్భుతమైన పని తీరు కనబర్చింది. పేపర్ వర్క్ డిజిటలైజేషన్, ఈ- సంతకాల కోసం మేం Box, Camscanner, Cloudmagic, Dropbox, GeniusScan, Mailbox, Microsoft OneDrive, Scannable, Slack లాంటి వాటికి సరిపోయే విధంగా సరికొత్త యాప్‌లను ప్రవేశపెట్టాం. దీనికి అదనంగా ఆండ్రాయిడ్ యాప్‌లను కూడా ప్రవేశపెట్టాం. మా యాప్‌లు, వాటి పని తీరును గుర్తించిన యాపిల్ కంపెనీ చిన్న వ్యాపారుల ప్రోత్సాహ కార్యక్రమాల్లో భాగంగా మేం తయారు చేసిన యాప్‌కు కూడా చోటు కల్పించింది. యాపిల్ ప్రచార జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత కంపెనీ మాదే. ఇందుకు మేం చాలా గర్విస్తున్నాం. రాబోయే రోజుల్లో వెబ్ ఆధారిత డాక్యుమెంట్ వ్యవహారాలను మరింత సులభతరం చేయడంతో పాటు ప్రస్తుతం వాడుతున్న వాటికి ప్రత్యామ్నాయంగా ఆధునిక యాప్‌లను మార్కెట్ లోకి తీసుకురాబోతున్నాం. ఈ యాప్‌ల ద్వారా ఎవరైనా తమ కంప్యూటర్ ద్వారానే సంతకం చేసే వీలు కల్గుతుంది. వీటి వల్ల చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు మరింత సులభంగా పని చేసుకోవడంతో పాటు ఉద్యోగులు, కస్టమర్లకు అదనపు శ్రమ తగ్గిపోతుంది. 

యువర్ స్టోరీ : మీ కంపెనీ ఆదాయం సంపాదించే పద్ధతులు ఎలా ఉంటాయి. నిధుల సేకరణ విషయంలో మీరు అనుసరించే పద్ధతులు ఏమిటి?

సునీల్ పాత్రో : వినియోగదారులు మొదటి మూడు సంతకాల ప్రక్రియ విషయంలో మా నుంచి ఉచితంగా సేవలను పొందవచ్చు. ఆ తర్వాత మూడు రకాలైన పెయిడ్ సర్వీసులు ఉంటాయి. ఈ ధరలు కూడా సేవలకు తగ్గట్లుగా, వారిని సంతృప్తి పర్చే విధంగా ఉంటాయి. ఇక లాభాల విషయానికి వస్తే 2010లో మా కంపెనీని స్ధాపించగా.....మూడేళ్ల నుంచి మంచి ఆదాయం ఆర్జిస్తున్నాం.


యువర్ స్టోరీ :మీ కంపెనీలో ఎంతమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారు పని చేసే విధానం ఎలా ఉంటుంది ?

సునీల్ పాత్రో: కంపెనీలో సేవలు అందించే ప్రతీ దశ, విభాగంలో 20 లేక అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పని చేస్తారు. ప్రొడక్ట్ మేనేజర్ నుంచి మొదలుకుని ఇంజనీర్లు, మార్కెటింగ్, సహాయ సిబ్బంది ఇలా ఉద్యోగులు వివిధ దశల్లో పని చేస్తూ ఉంటారు.


యువర్ స్టోరీ : పోటీ సంస్థ డాక్యు సైన్ పై మీ అభిప్రాయాలు, మార్కెట్ లో ఉన్న పోటీ గురించి వివరిస్తారా ?

సునీల్ పాత్రో : మొబైల్ ఫోన్ ద్వారా డాక్యుమెంటేషన్, ఎలక్ట్రానిక్ సేవలను అందించేందుకు ఏర్పడిన తొలి కంపెనీ సైన్ ఈజీ. రాబోయే రోజుల్లో ఇంటర్నెట్‌ను పర్సనల్ కంప్యూటర్, ట్యాబ్ ఇలా ఏ విధంగా ఉపయోగించుకున్నా మా సేవలు వాడుకునేలా కొత్త పథకాలను మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నాం. కేవలం ఇంగ్లిష్‌లోనే కాకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంత ప్రజలు తమ స్ధానిక భాషలో డాక్యుమెంటేషన్ చేసుకునేలా 15 భాషలుకు మా సేవలను విస్తరిస్తున్నాం. అంతే కాకుండా మా పోటీ సంస్థల కంటే తక్కువ ధరలోనే సేవలను అందుబాటులో ఉంచి మార్కెట్ లో నిలబడేలా ప్రయత్నిస్తాం.

యువర్ స్టోరీ : మీరు అందిస్తున్న సేవలకు సంబంధించి ప్రస్తుతం అమెరికా చాలా పెద్ద మార్కెట్గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తును ఏ విధంగా ఊహిస్తున్నారు ?

సునీల్ పాత్రో : ప్రస్తుతం మా సేవలను పొందుతున్న కస్టమర్లలో సగం కంటే ఎక్కువ మంది అమెరికా నుంచి ఉండగా మిగతా వారు యూరప్, ఆసియా, దక్షిణ అమెరికా నుంచి ఉన్నారు. ఆగ్నేయాసియా దేశాల్లో మొబైల్ ఫోన్ల నుంచి వ్యవహారాలు నడిపి సంస్కృతి ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. సరైన చట్టాలు, నిబంధనలతో ఎలక్ట్రానిక్ సంతకాల ప్రక్రియ రాబోయే రోజుల్లో మరింత విస్తృతం అవడంతో పాటు వినియోగాదారుల్లో దీని వాడకంపై మరింత అవగాహన పెరగవచ్చని అంచనా వేస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మా మార్కెట్‌ను పెంచుకోగలమని విశ్వాసంతో ఉన్నాం.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags