సంకలనాలు
Telugu

మహిళల వంటింటి బాధ తీర్చే 'న‌వ్‌దుర్గా'

పొగ‌పొయ్యిల‌తో అవ‌స్థ‌లు ప‌డుతున్న గ్రామీణ మ‌హిళ‌ల‌ను ఆ క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించేందుకు ముందుకొచ్చింది న‌వ్‌దుర్గా. వ్య‌వ‌సాయ వ్య‌ర్థాల‌తో కుక్‌స్ట‌వ్‌ల‌ను త‌యారు చేసి ప్ర‌జ‌ల ఆదాయంతోపాటు ఆరోగ్యాన్నీ కాపాడుతోంది.

GOPAL
30th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

అభివృద్ధిలో ఇత‌ర దేశాల‌తో పోటీప‌డుతూ భార‌త్ దూసుకెళ్తున్న‌ప్ప‌టికీ .. గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ క‌ష్టాల‌ను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప‌ల్లెల్లో గ్యాస్ స్ట‌వ్‌లు అందుబాటులో లేక‌పోవ‌డంతో ఇప్ప‌టికీ చాలా గ్రామాల్లో పొగ పొయ్యిల‌నే ఉప‌యోగిస్తూ ఆరోగ్యాల‌ను పాడు చేసుకుంటున్నారు. ఈ పొగ పొయ్యిలు వ‌దిలే విష వాయువులు ప్ర‌జ‌ల ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూప‌డంతోపాటు ప‌ర్యావ‌ర‌ణాన్ని కూడా దెబ్బ‌తీస్తున్న‌ది. 40 కోట్ల‌మంది భార‌తీయులు.. అందులో 90 శాతం మ‌హిళ‌లు ఈ పొగ పొయ్యిల వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పొయ్యిల కార‌ణంగా శ్వాస‌ సంబంధ‌ , ఊపిరితిత్తులు, కంటి చూపు స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. పొగ పొయ్యిల కార‌ణంగా వెలువ‌డే కాలుష్యం వ‌ల్ల ఏటా 13 ల‌క్ష‌ల మంది మృతి చెందుతున్నార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ ఓ) ప్ర‌క‌టించింది. ఘ‌న‌రూపంలో ఉన్న ఇంద‌నం, ఆవు పేడ‌తో చేసిన పిడ‌క‌ల వాడ‌కం వ‌ల్ల వెలువ‌డుతున్న విష‌వాయువులు గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు శాపంగా మారాయి. అనారోగ్యం పాల‌వ‌డ‌మే కాకుండా ఈ వంట చెరుకును తెచ్చుకొనేందుకు ప్ర‌జ‌ల‌కు చాలా స‌మ‌యం వృథా అవుతున్న‌ది. 

గ్రామీణ మ‌హిళ‌ల ఆశా దీపం.. న‌వ్‌దుర్గా

భార‌త‌ ప్ర‌భుత్వ నివేదిక - ఎన‌ర్జీ స్టాటిస్టిక్స్ ప్ర‌కారం దేశ‌ జ‌నాభాలో 80 కోట్ల మంది ప్ర‌జ‌లు వంట కోసం సంప్ర‌దాయ‌ ఇంద‌న వ‌న‌రులైన‌ వంట చెరుకు, బొగ్గు, పంట అవ‌శేషాలు, పిడ‌క‌లు ఉప‌యోగిస్తున్నారు. వంట కోసం కిరోసిన్ ఉప‌యోగిస్తున్న వారు త‌మ ఆదాయంలో 30 శాతాన్నిఖ‌ర్చుపెట్టాల్సి వ‌స్తున్న‌ది. అలాగే ఘ‌న ఇంధ‌న వినియోగం కార‌ణంగా అనేక ఇబ్బందుల పాల‌వుతున్నారు. ఈ స‌మ‌స్య‌లకు చెక్ చెప్పేందుకు 2009లో సౌర‌భ్ సాగ‌ర్ జైస్వాల్‌, అత‌ని తండ్రి అర‌వింద్ సాగ‌ర్ జైస్వాల్ న‌వ్‌‌దుర్గా మెట‌ల్ ఇండ‌స్ట్రీని 2009లో స్థాపించారు. క్లీన్ కుక్‌స్ట‌వ్‌ల‌ను త‌యారు చేయాల‌న్న ఐడియా మొద‌ట‌గా సౌర‌భ్ మామ‌య్య మ‌హేంద్ర ప్ర‌తాప్ జైస్వాల్‌కు వ‌చ్చింది. నేపాల్‌లో పేద‌లు స్ట‌వ్‌ల‌కు ఇంధ‌నంగా వరి పొట్టును ఉప‌యోగిస్తుండ‌టాన్ని గ‌మ‌నించిన మ‌హేంద్ర క్లీన్ స్ట‌వ్‌ను త‌యారు చేయాల‌ని నిర్ణ‌యించారు. న‌వ్ దుర్గ్ ఇండ‌స్ట్రీ నుంచి వ‌చ్చిన తొలి ప్రాడ‌క్ట్ జ‌న‌తా సుల్లా స్మోక్‌లెస్ స్ట‌వ్‌. దాని ధ‌ర రూ. 500. ఈ కుక్‌స్ట‌వ్‌ల‌తో పేద‌ల కుటుంబాల ఆరోగ్యం మెరుగ‌వ‌డంతోపాటు, ఆదాయం కూడా మిగులుతుంద‌ని, ప‌ర్యావ‌ర‌ణానికి మేలు చేకూరుతుంద‌ని జైస్వాల్ భావించారు. అలాగే , ఈ వరి పొట్టు కుక్‌స్ట‌వ్‌ల వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి కూడా హాని త‌గ్గిందని మ‌హేంద్ర సింగ్ జైస్వాల్ కుమారుడు విభోర్ జైస్వాల్ చెప్తున్నారు. 

పక్కనే వరిపొట్టుతో ఉన్న కుకింగ్ స్టౌవ్. ఈ ఆధునిక కాలుష్య రహిత  పొయ్యిపై మహిళ వంట వండుతున్నదృశ్యం

పక్కనే వరిపొట్టుతో ఉన్న కుకింగ్ స్టౌవ్. ఈ ఆధునిక కాలుష్య రహిత పొయ్యిపై మహిళ వంట వండుతున్నదృశ్యం


2012లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా విభోర్ చేరారు. హ్యుమ‌న్ రిసోర్స్‌లో ఎంబీఏ చేసిన విభోర్ మొద‌ట్లో స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్‌తోపాటు దేశ‌వ్యాప్తంగా ప‌లు ఈ గ‌వ‌ర్నెన్స్ ప్రాజెక్ట్‌లో ప‌నిచేశారు. త‌క్కువ ఇంధ‌నం ఉప‌యోగించి బ‌యోమాస్ కుక్‌స్ట‌వ్‌ల‌ను త‌యారు చేయాల‌న్న త‌న తండ్రి క‌ల‌ను సాకారంచేసేందుకు, చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి న‌వ్ దుర్గ ఇండ‌స్ట్రిలో చేరారు. విభోర్ చేరిన త‌ర్వాత న‌వ్‌దుర్గాను మూడు రాష్ట్రాల‌కు విస్త‌రించారు. పెట్టుబ‌డి రాబ‌ట్ట‌డం, క్లీన్ కుక్‌స్ట‌వ్‌ల‌కు డిమాండ్ పెంచ‌డం, అలాగే అల్పాదాయ వ‌ర్గాల్లో కంపెనీ విశ్వాసాన్ని పెంచ‌డం వంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు న‌వ్‌దుర్గాకు ఎంతో సాయం చేశారు విభోర్‌. 

సంప్రదాయ ఎల్పీజీ స్ట‌వ్‌ల‌కు ఈ న‌వ్‌దుర్గా కుక్‌స్ట‌వ్‌లు స‌రిస‌మాన‌మైన‌వ‌ని కంపెనీ చెబ్తోంది. ఎల్పీజీ మాదిరిగా బ్లూ ఫేమ్ రావ‌డం, ఎలాంటి పొగ వెలువ‌డ‌క‌పోవ‌డం వంటి గుణాలు ఈ స్ట‌వ్‌లో ఉన్నాయి. వ్య‌వ‌సాయ వ్య‌ర్థం వరి పొట్టుతో ప‌ది ర‌కాల కుక్‌స్ట‌వ్‌ల‌ను న‌వ్‌దుర్గా రూపొందించింది. పేద‌ల ఇండ్ల‌లో ఉప‌యోగించే స్ట‌వ్‌ల‌తో పోలిస్తే ఈ స్ట‌వ్‌ల‌ను వినియోగించ‌డం ద్వారా గాలి కాలుష్యం 80 శాతం వ‌ర‌కు త‌గ్గిపోయింది. దేశంలో ప్ర‌తియేటా 120 మిలియ‌న్ ట‌న్నుల బియ్య‌పు పొట్టు ఉత్ప‌త్త‌వుతుంది. ఇందులో ఎక్కువ శాతం వృథాగానే పోతుంది. ఈ వ్య‌వ‌సాయ వృథాను ఉప‌యోగించి హ‌స్క్ ప‌వ‌ర్ సిస్ట‌మ్ విద్యుత్ ఉత్ప‌త్తి కూడా చేస్తున్న‌ది. అలాగే న‌వ్‌దుర్గా కూడా త‌మ స్ట‌వ్‌ల‌కు ఈ బియ్య‌పు పొట్టునే ఉప‌యోగిస్తూ స్మోక్‌లెస్ స్ట‌వ్‌ల‌ను త‌యారు చేసింది. వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా స్ట‌వ్‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా స‌వాలుతో కూడుకున్న‌ద‌ని జైస్వాల్ అంటున్నారు. 

'వంట ఉత్ప‌త్తుల‌తోపాటు వ్యాపార విస్త‌ర‌ణ‌కు మైక్రో ఫైనాన్సింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌, కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్స్ కూడా ఎంతో అవ‌స‌ర‌మ‌ని గుర్తించాం. బియ్య‌పు పొట్టు స్ట‌వ్‌ల విష‌యానికి వ‌స్తే ఇలాంటి వాటిని త‌యారు చేస్తున్న ఏకైక కంపెనీ మాదే. త‌యారు చేయ‌డంతోపాటు పేద‌ల‌కు అందే విధంగా పంపిణి కూడా మేమే చేస్తున్నాం' అని జైస్వాల్ గ‌ర్వంగా చెప్తున్నారు. 

ఓ స్టాల్‌లో తమ ఉత్పత్తి గురించి వివరిస్తున్న విభోర్

ఓ స్టాల్‌లో తమ ఉత్పత్తి గురించి వివరిస్తున్న విభోర్


అగ్రీ వేస్ట్‌ల‌తో ఇంధ‌నం త‌యారీ

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కేంద్రంగా బీహార్‌, ఉత్త‌రాఖండ్‌, ఒడిశా, చ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క, అసోమ్‌, మేఘాల‌యా రాష్ట్రాల్లో న‌వ్ దుర్గా త‌న ప్రొడ‌క్ట్స్‌ను విక్ర‌యిస్తున్న‌ది. ఈ కంపెనీ త‌యారు చేసిన స్ట‌వ్‌ల కార‌ణంగా గాలిని విష‌తుల్యం చేసే కార్బ‌న్ డ‌యాక్సైడ్ విస‌ర్జ‌న 60 వేల ట‌న్నులు త‌గ్గ‌డం గ‌మ‌నార్హం. ఒక్కో స్ట‌వ్ ఏడాది స‌గ‌టున 20 చెట్ల‌ను ర‌క్షించ‌డం, 730 గంట‌ల‌ను ఆదాచేయ‌డంతోపాటు, రెండు ట‌న్నుల గ్రీన్ హౌజ్ వాయువ‌ల విస‌ర్జ‌న‌ను నివారిస్తున్న‌ది. అలాగే ఈ బియ్య‌పు పొట్టును ఉప‌యోగించిన త‌ర్వాత వ‌చ్చే బూడిద‌, బ‌యోచార్ భూసారానికి ఎంతో ఉప‌యుక్త‌మైన‌ది. వివిధ ర‌కాల అగ్రీ వేస్ట్‌ల‌తో ఇంధ‌నం ఎలా త‌యారు చేయాల‌న్న అంశంపై న‌వ్‌దుర్గా ఇప్పుడు ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ది. మ‌రింత ఇంధ‌నాన్ని ఉత్ప‌త్తి చేసి వివిధ రాష్ట్రాల్లో త‌మ వ్యాపారాన్ని విస్త‌రించుకోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది. అగ్ని మిడ్ డే మీల్ స్ట‌వ్‌ల పేరుతో ప్ర‌భుత్వ స్కూళ్ల‌కు స్ట‌వ్‌ల‌ను అంద‌జేస్తున్న‌దీ సంస్థ‌. వివిధ సైజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ల‌లో ఉప‌యోగించేందుకు వీలుగా ఈ స్ట‌వ్‌ల‌ను రూపొందించింది. 

ఈ ఏడాది చివ‌రి క‌ల్లా నేపాల్‌లో కూడా వ్యాపారాన్ని విస్త‌రించాల‌ని భావిస్తున్నామ‌ని విభోర్ త‌మ కంపెనీ వ్యూహాల‌ను వివ‌రించారు. 2016 క‌ల్లా దేశ‌వ్యాప్తంగా 2 ల‌క్ష‌ల కుక్‌స్ట‌వ్‌ల‌ను ఉత్త్ప‌త్తి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ప‌ర్యావ‌ర‌ణానికి హానీ క‌లుగ‌కుండా, పేద‌ల ఆరోగ్యాల‌కు అండ‌గా నిలుస్తున్న న‌వ్‌దుర్గా 2014లో సంక‌ల్ప్ అవార్డ్స్ పోటీల తుది రౌండ్‌కు చేరుకుంది. వ్యాపారంతోపాటు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌య‌త్నిస్తున్న న‌వ్‌దుర్గ్ ఇండ‌స్ట్రీ మ‌రింత విస్త‌రించాల‌ని ప‌ర్యావ‌ర‌ణవేత్త‌లు, ప్ర‌జ‌లు ఆకాంక్షిస్తున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags