సంకలనాలు
Telugu

రెండు వేళ్ళ మధ్య కత్తెర నుంచి రెండొందల కార్ల వరకూ..

రెండో పూట తినడానికి నోచుకోని పేదరికాన్ని అనుభవించిన అతడే ఇప్పుడు రెండు వందల కార్లకు అధిపతి. ఇల్లు గడపడానికి నాలుగిళ్ళలో అంట్లు తోమి, పాచిపని చేసిన ఓ తల్లి బిడ్డడే ఇప్పుడు వందల మందికి పని కల్పించాడు. ఆకాశమెత్తు ఎదిగినా కాళ్ళకు ఊతంగా నిలిచిన నేలను మరువరాదనే ఆయన పేరు రమేష్ బాబు. ఊరు బెంగళూర్. కోట్లకు అధిపతి అయినా కులవృత్తి అయిన క్షురకర్మ అంటే మనసా వాచా కర్మణా భక్తీ, గౌరవం ఉన్న విలక్షణమైన వ్యక్తి ఆయన! సంపన్నులకే తాను కార్లను సరఫరా చేస్తున్నా; తానూ కార్లలో తిరుగుతున్నా.. ఒకనాడు తమను ముట్టడించిన దరిద్రాన్ని ఎదిరించడానికి ఆయుధాలుగా ఉన్న కత్తినీ, కత్తెరనూ వీడని వినమ్రుడాయన!

team ys telugu
25th Mar 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఇప్పటికీ ఎలాంటి భేషజమూ లేకుండా హాయిగా, అపారమైన గౌరవంతో క్షురక వృత్తిని చేస్తుంటారు. అందుకు కేవలం రూ.100 మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడా వృత్తి ఆయనకు కొంత రాబడిని తెచ్చిపెట్టే ఉపాధి కాదు.. ఎంత సొమ్ము పెట్టి కొనాలన్నా దక్కని ఆత్మ సంతృప్తికి మార్గం! దాని ద్వారా ఆయన ఆర్జించేది బహుశా.. ఆ స్థాయి వ్యక్తి ఏదైనా పెద్ద హోటల్ కు వెళ్ళినప్పుడు వెయిటర్ లకు ఇచ్చే టిప్ కన్నా తక్కువే కావచ్చు. అయినా ఆ సంపాదన ఆయనకు దేవాలయంలో ఇచ్చే ప్రసాదం అంత పవిత్రమైనది. ఆయన వద్ద ఉన్న 200 కార్లలో 75 విలాసవంతమైన కార్లే! వాటిలో మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడిలతో పాటు 5 సీట్ల, 10 సీట్ల లగ్జరీ వాన్లు కూడా ఉన్నాయి. అవన్నీ.. రమేష్ బాబు గడ్డు పరిస్థితులకు ఎదురొడ్డి ఎగరేసిన విజయ పతాకాల్లాంటివి అనుకుంటే.. వాటిలో మరింత సమున్నతమైనది- రోల్స్ రోయ్స్! కుటుంబాన్ని నెట్టుకు రావడానికి తల్లి పడే కష్టాన్ని చూడలేక.. వేన్నీళ్ళకు చన్నీళ్ళ సాయంలా న్యూస్ పేపర్లూ, పాల సీసాలూ వేసి నాలుగు రూపాయలు సంపాదించడానికి చెమటోడ్చిన వాడు ఇప్పుడు నాలుగు కోట్ల రోల్స్ రోయ్స్ కి అధిపతి! ఈరోజున ఆయన దగ్గరున్న కార్లను ఒకదానివెనుక ఒకటి నిలబెడితే.. బహుశా ఆనాడు సైకిల్ పై ఆయన తిరిగిన దూరంతో సమానంగా ఉండొచ్చు. పొద్దు పొడవక ముందే పేపర్లు వేసిన నాడు.. తర్వాత ఆ పేపర్లు చదివే వారిలో చాలా మంది ఆ కుర్రాడి ముఖం చూసి ఉండక పోవచ్చు. అదే వ్యక్తి దేశవ్యాప్తంగా తన విజయగాథను ప్రసారం చేసిన, ప్రచురించిన టీవీలూ, పేపర్ల ద్వారా; 'టెడ్' టాక్ ద్వారా ఇప్పుడు కోట్లమందికి పరిచితుడు! లక్షల మందికి ప్రేరకుడు! చదువుకునే రోజుల్లోనే తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన క్షౌర వృత్తిని చేసిన వాడు .. ఇప్పుడు తానే ఓ అమూల్య పాఠం!

రమేష్ బాబు, రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత

రమేష్ బాబు, రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత


లెనార్డ్ విల్లబీ అన్నట్టు 'తన నడకను తానే నిర్దేశించుకుని, తన చొరవే కరదీపికగా జీవితాన్ని వెలిగింపజేసుకున్నవాడు' రమేష్ బాబు! కేవలం తన కుటుంబాన్ని నొప్పించిన అయినవాడిపై పై చేయి అనిపించుకోవాలన్న దుగ్ధతో 1993లో ఓ వాహనం కొన్నఓ యువకుడు.. ఫార్ములా -1 రేస్ అంత వేగంగా ప్రయాణించి, నేడు ఓ కార్ల 'బిడారు'కే బాద్ షా ఎలా అయిందీ ఆయనే చెపుతున్నారు. ఆ మాటల సారాంశం ఇది..

అమ్మ భారం తగ్గించాలని.. బరువునెత్తుకున్నలేత భుజాలు

మాది పేదకుటుంబం. క్షౌర వృత్తి చేసే మా నాన్న 1979లో నా 7వ ఏటే చనిపోయాడు. మమ్మల్ని పోషించడానికి అమ్మ కొందరి ఇళ్ళలో అంట్లు తోమి, పాచిపని చేసేది. నాన్నకి బ్రిగేడ్ రోడ్లో ఉన్న సెలూన్ ని మా అంకుల్ నడుతూ దాని నిమిత్తం రోజుకి అయిదు రూపాయలు ఇచ్చే వాడు. లీటర్ పెట్రోల్ తో వెయ్యి కిలోమీటర్లు నడపడం ఎంత కష్టమో.. ఆ డబ్బుతో మా తిండితిప్పలు, నాతో పాటు నా ఇద్దరు తోడబుట్టిన వాళ్ళ చదువులు గడవడమూ అంతే కష్టంగా ఉండేది. రోజుకు ఒక పూటే తిని, మరోపూట పస్తులుండే వాళ్ళం. అమ్మ భుజాలపై బరువును పూచిక పుల్లంతయినా తగ్గించాలని నేను చేయని పని లేదు.. న్యూస్ పేపర్లు, పాల సీసాలూ వేయడం దగ్గర నుంచి ఎన్నో చేశాను. ఇప్పటి నా ఆదాయంతో పోలిస్తే అప్పటి నా సంపాదన సముద్రంలో నీటి బొట్టు కావచ్చు. కానీ..ఆ డబ్బులు నీట మునిగే వేళ.. అందుబాటులోకి వచ్చిన నావ అంత అమూల్యమైనవి.

అటు క్షౌరాలు.. ఇటు పాఠాలు

అలాంటి ఒడిడుడుకులలోనే పదో తరగతి పూర్తి చేసి సాయంత్రపు కాలేజీలో పీయూసీలో చేరాను. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతుండగా మా చిన్ని బతుకులకు పెద్ద దెబ్బ తగిలింది. సెలూన్ నడుపుకుంటున్నందుకు రోజూ ఇచ్చే అయిదు రూపాయలకు మా అంకుల్ ఎగనామం పెట్టాడు. దాంతో అతడికీ, మా అమ్మకీ పెద్ద జగడం జరిగింది. అవును మరి..ఆ అయిదు రూపాయలే మాకు ఓ ఎస్టేట్ మీద వచ్చే కౌలుతో సమానం. సెలూన్ ను నేనే నడుపుతానంటే అమ్మ ససేమిరా అంది. 'బాబూ! ఇంకా ఏమి హూనమైపోతావు గానీ చదువుకోరా' అంది. అయితే నేను అంతకన్నా మొండిగా నా నిశ్చయానికే కట్టుబడ్డాను. పొద్దున్నే సెలూన్ కి వెళ్లి గడ్డాలూ, క్షౌరాలూ చెయ్యడం, సాయంత్రం కాలేజీకి వెళ్ళడం, తర్వాత మళ్ళీ సెలూన్ తెరిచి అర్ధరాత్రి ఒంటి గంట వరకూ పనిచేయడం.. ఇదీ అప్పటి నా దినచర్య. నాటి నుంచీ నేను 'బార్బర్'గా గుర్తింపు పొందాను.

చిన్న స్వాతిశయంతో పెద్ద మలుపు..

1993లో.. స్తోమతకు మించి నేను చేసిన ఓ పనే నా జీవితాన్ని మలుపు తిప్పింది. సెలూన్ విషయంలో మమ్మల్ని కష్టపెట్టిన అంకుల్ ఓ చిన్న కారు కొన్నాడు. అతడి కన్నా పైనునున్నాననిపించుకోవాలన్న స్వాతిశయంతో.. రూపాయి, రూపాయిగా కూడబెట్టిన సొమ్ములకు మా తాతకున్న కొద్దిపాటి ఆస్తిని తనఖా పెట్టి తెచ్చిన డబ్బులు కలిపి సెకండ్ హ్యాండ్ మారుతీ వాన్ కొన్నాను. ఆ అప్పుపై వడ్డీ రూ.6,800 కట్టడానికి నా తల ప్రాణం తోకకు వచ్చేది. వాన్ కొనడమైతే కొన్నాను కానీ..దాన్ని మేత దండగ గొడ్డులా ఓ మూల ఉంచాను. అది చూసి నందిని అక్క (మా అమ్మ వాళ్ళ ఇంట్లో పనిచేసేది. ఆమెకు నేనంటే ఉన్న ఆపేక్ష వల్ల సొంత తోబుట్టువునిలాగే చనువుగా 'అక్కా' అని పిలిచేవాడిని) వాన్ ని ఉత్తినే ఉంచి తుప్పు పట్టించే దానికన్నా అద్దెకు తిప్పొచ్చు కదా అని సలహా ఇచ్చింది. అంతే కాదు.. ఆ వ్యాపారంలోని బరువుసులువులనూ విడమరిచింది. తాను పని చేసే ఇంటెల్ కంపెనీలోనే ఆ వాన్ ని అద్దెకు కుదర్చడంలో సాయం చేసింది. నందిని అక్క అంటే నాకు అప్పటికీ ఇప్పటికీ గురీ, గౌరవం. నాకు అత్యంత ఆత్మీయులలో అక్క ఒకరు. ఆమె కూడా తన కుమార్తె పెళ్ళికి పిలిచి అందరికీ నన్ను గొప్పగా పరిచయం చేసింది.

రోల్స్ రాయిస్ కంటే విలువైన ఠీవి అతనలో కనిపిస్తోంది

రోల్స్ రాయిస్ కంటే విలువైన ఠీవి అతనలో కనిపిస్తోంది


1994 నుంచి ఇంటెల్ కి అద్దెకిచ్చిన వాన్ కి ఒకటొకటిగా కార్లను జోడిస్తూ వచ్చాను. అయితే 2004 నాటికి నా దగ్గర అయిదారు కార్లు మాత్రమే ఉన్నాయి. అప్పుడు బెంగళూర్ లో కార్లను అద్దెకిచ్చే వ్యాపారంలో పోటీ ముమ్మరంగా ఉండేది. ఈ రంగంలో అందరి దగ్గరా చిన్న కార్లు ఉండేవి. వారికి భిన్నంగా లగ్జరీ కార్లను ఎందుకు సమకూర్చుకోకూడదనిపించింది.

సవాళ్ళే సోపానాలు..

2004లో నేను మొదటిసారి రూ.40 లక్షలు పెట్టి ప్రిస్టిన్ కారు కొన్నాను. అప్పుడు ప్రతివాళ్ళూ నన్ను హెచ్చరించారు. కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉండక.. కోరి చిక్కుల్ని కొని తెచ్చుకుంటున్నానన్నారు. అయితే నాకు నేనే వెన్ను తట్టుకుని ధైర్యం చెప్పుకున్నాను. అందరూ హెచ్చరించినట్టు ఈ లగ్జరీ కారు నన్ను చిక్కుల్లోకి నెడితే.. అప్పుడే దాన్ని తెగనమ్మ వచ్చులే అని నిశ్చయించుకున్నాను. కానీ నా చొరవే సరైనదని తేలింది. బెంగళూరులోనే సరికొత్త లగ్జరీ కారును అద్దెకి తిప్పిన మొదటి వ్యక్తిని నేనే అయ్యాను. దాని మీద ఉన్న అప్పును నల్లేరుపై నడకంత సులువుగా తీర్చేశాను. మనం వ్యాపారంలో దిగినప్పుడే ఇలాంటి తెగింపూ, చొరవలకు సిద్ధం కావాలి. ప్రతి వ్యాపారంలో మనల్ని కలవరపరిచే సవాళ్లు ఉంటాయి. మన శక్తియుక్తులన్నిటినీ కేంద్రీకరించి వాటిని ఎదుర్కోవాలి. నేను నిరుడు రూ.3 కోట్ల రోడ్ టాక్స్ కట్టాల్సి వచ్చింది. పుట్టిన చోటల్లా అప్పు చేశాను. నా ఆస్తుల దస్తావేజులన్నీ కుదువబెట్టాను. అయితే త్వరలోనే ఆ పరిస్థితి నుంచి బయటపడగలను. 2011లో నాలుగు కోట్లు పెట్టి రోల్స్ రోయ్స్ కొన్నప్పుడూ నన్ను చాలా మంది మునుపటిలాగే వెనకడుగు వెయ్యమన్నారు. 2004లో తీసుకున్న చొరవ 2011లో తీసుకోలేనా అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. నేను అనుకున్నదే చేశాను. మరో ఆరు నెలల్లో ఆ కారు వాయిదాలు పూర్తి అవుతాయి.

ప్రస్తుతం విపరీతంగా పెరిగిన పన్నుల భారాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపార విస్తరణ ఆలోచనను విరమించాను. అయితే 2015లో కొన్ని స్ట్రెచ్ లిమోసిన్ కార్లు, అలాంటివే ఇంకొన్ని కొనాలనుకుంటున్నాను. (రమేష్ బాబు ఈ మాటలు చెప్పింది 2014 ఏప్రిల్ లో).

శ్రమే ప్రధాన శస్త్రం..

ఆ మధ్య 'టెడ్' టాక్ లో చెప్పినట్టే.. నేను వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకి చెప్పేదొకటే.. శ్రమను నమ్ముకోండి. వినమ్రంగా ఉండండి. ఇవే ప్రధానం. ఆ తర్వాతే అదృష్టం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags