రాత్రి సూరీడు హరీష్ హండే

ఖరగ్‌పూర్ ఐఐటిలో ఎనర్జీ ఇంజీరింగ్మసాచుసెట్స్‌ లో పిజి,పిహెచ్.డి.అయినా ఏదో తెలియని అసంతృప్తిపేదల ఇళ్లల్లో వెలుగునింపేందుకు ప్రయత్నంశ్రీలంక, భారత్ లో రెండేళ్లు విస్తృత పర్యటన పేదల ఇళ్లల్లోనే ఉండి వాళ్ల సాధక బాధకాలు తెలుసుకున్నారుబడి పిల్లల రాత్రిళ్లు చదివేందుకు ఓ ప్రత్యేక సోలార్ లైట్స్కూలుకు వెళ్లి ఛార్జింగ్ చేసుకుని వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లువచ్చిన అవార్డుల కన్నా వాళ్ల కళ్లలో వెలుగే సంతృప్తి అంటున్న హండే

15th Apr 2015
 • +0
Share on
close
 • +0
Share on
close
Share on
close

అతడు నేటి తరం సూర్యుడు. పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే అతని ఆలోచన. సూర్యుడు నిద్రలోకి జారుకున్న తర్వాత ఇతని శక్తి మారుమూల గ్రామాల్లోని పూరిగుడిసెల్లో ప్రకాశిస్తుంది. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా మీరు వింటున్నది నిజం. ఎందుకంటే.. ఇతడు సూర్యుడిని ఆధారంగా చేసుకుని వెలిగే లైట్లకు ఓ కొత్త రూపం తీసుకుని వచ్చాడు. సోలార్ ఎనర్జీ గురించి కేంద్రం ఇప్పుడు తీవ్రస్థాయిలో ఖర్చు పెడ్తూ ప్రచారం చేస్తోందికానీ.. ఇతడు పదిహేనేళ్ల క్రితమే ఇలాంటి కార్యక్రమాలకు ఆద్యుడయ్యాడు. ఇప్పుడు కనీసం రెండు లక్షల ఇళ్లకు ఇతడి ఆలోచనతోనే నిత్యం వెలుగులను ప్రసరిస్తున్నాయి. కేవలం లైట్లకే పరిమితం కాకుండా సోలార్ హీటర్లు, స్ప్రేయర్లు, నీటి పంపింగ్ మెషీన్లు.. ఇలా ఎన్నో వాటికి ఇతడు ప్రాణం పోశాడు. అయితే అన్నింటికంటే ముఖ్యంగా ఇతడి ఆలోచన ఒక్కటే.. గ్రామాల్లోని విద్యార్థులు రాత్రిళ్లు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా చదువుకోవాలి, అక్కడి ప్రజలు కాలుష్యం బారినపడకుండా మెరుగైన జీవితాలను జీవించాలి. ఐఐటిలో ఉన్నత చదువులు చదివి సామాజిక పారిశ్రామికవేత్తగా మారిన హరీష్ హండేపై ప్రత్యేక కథనం.

భారతదేశంలో ఇప్పటికీ ఎన్నో మారుమూల గ్రామాల్లో ప్రజలకు విద్యుత్ సౌకర్యం లేనేలేదు. మరెన్నో గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండదు. నిరంతరం కోతలే. ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఈ ఆలోచనే డాక్టర్ హరీష్ హండే సెల్కో స్థాపనకు పునాది వేసింది.

హరీష్ హండే, సెల్కో వ్యవస్థాపకుడు

హరీష్ హండే, సెల్కో వ్యవస్థాపకుడు


కర్ణాటకలోని ఉడుపి జిల్లా హండట్టులో హరీష్ హండే జన్మించారు. కానీ ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం ఒడిషాలోని రూర్కెలాలో జరిగింది. ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి ఎనర్జీ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత పై చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్‌.డీ పూర్తిచేశారు. 1991లో డొమినికన్ రిపబ్లిక్ పర్యటనలో ఉండగా అక్కడి పేద ప్రజలు సౌర శక్తితో పనిచేసే దీపాలు ఉపయోగించడం చూసి హండే ఆశ్చర్య పోయారు. వెంటనే ఆయన మదిలో ఒక ఆలోచన మెదిలింది. ఈ విధంగా మన దేశం (భారత్) లో ఎందుకు చేయకూడదు, పేదల ఇళ్లలో విద్యుత్ కాంతులు నింపవచ్చు కదా అని అనిపించింది. తద్వారా సామాజిక మార్పు తీసుకురావచ్చు అని భావించారు. వెంటనే దీనిపై అధ్యయనం ప్రారంభించారు. దాదాపు రెండేళ్లు భారత్, శ్రీలంక దేశాల్లో విస్తృతంగా పర్యటించారు, పరిశోధించారు. పేదల జీవితాలను, వారి అవసరాలను, ఆర్థిక స్థితిగతులను దగ్గరగా పరిశీలించారు. ఇలా చేయడానికి హండే కూడా ఆ రెండేళ్లూ పేదలతో పాటు చీకటిలోనే గడిపారు. 


పూరిళ్లకు సోలార్ సొబగులు

పూరిళ్లకు సోలార్ సొబగులు


శ్రీలంక వెళ్లి అక్కడ సౌరశక్తి వినియోగంపై పూర్తిగా పరిశోధన చేసి మసాచుసెట్స్‌కి తిరిగి వచ్చారు. అప్పుడే ఆయనకు నెవెల్లి విలియమ్స్‌తో పరిచయం ఏర్పడింది. విలియమ్స్... సోలార్ ఎలక్ట్రిక్ లైట్ ఫండ్ (సెల్ఫ్) అనే ఓ అమెరికా కంపెనీ వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ ప్రధాన ఉద్దేశం కూడా ప్రపంచవ్యాప్తంగా గ్రామాలన్నింటినీ విద్యుదీకరించడం. తను కూడా ఇదే రకమైన ఆలోచనతో ఉండడం వల్ల హండేకి విలియమ్స్ పరిచయం బాగా ఉపయోగపడింది. 1995లో వీరిద్దరి భాగస్వామ్యంలో సెల్కో ప్రారంభమైంది. మొదట్లో సెల్ఫ్‌కి విలియమ్స్ ఛైర్మన్ గా, హండే మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండేవారు. 1996లో విన్ రాక్ ద్వారా సెల్కోకి 1,50,000 డాలర్ల ఆర్థిక సాయం లభించింది.


మణిపూర్‌లోని సోలార్ వాటర్ హీటింగ్ వ్యవస్థ

మణిపూర్‌లోని సోలార్ వాటర్ హీటింగ్ వ్యవస్థ


తర్వాత హండే భారత్‌కి తిరిగి వచ్చారు. బెంగళూరులో సెల్కో-ఇండియా పేరుతో తన ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడానికి పని ప్రారంభించారు. సౌరశక్తి వినియోగం, సౌరశక్తి ఆధారిత వస్తు వినియోగం... ఇవి పేదలకు అందని ద్రాక్ష, ఖర్చుతో కూడినవి అనే అపనమ్మకాల్ని తొలగించడమే హండే తొలి లక్ష్యం.

''నాతో పనిచేసే బృందంలో అందరూ ఏదో ఒక ప్రత్యేకత, నైపుణ్యం కలిగినవారే. వీరందరినీ పేదలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలనే తపనే ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అందుకే మేము ఏ ప్రాజెక్టు చేపట్టినా కచ్చితంగా విజయం సాధిస్తామని మా నమ్మకం'' అంటారు హరీష్

ఉదాహరణకు... సెల్కో లైట్ ఫర్ ఎడ్యుకేషన్ (చదువుకోవడానికి సెల్కో లైటు) ప్రాజెక్టు నిజంగా ఓ గొప్ప ఆలోచన. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 30,000 మంది పేద విద్యార్థులకు రాత్రివేళల్లో ఇంట్లో చదువుకోవడానికి వీలుగా ఓ లైటు, ఓ బ్యాటరీ అందించారు. కేవలం లంచ్ బాక్స్ పరిమాణంలో ఉండే ఈ బ్యాటరీ చాలా తేలికగా, పిల్లలు మోయగలిగేలా ప్రత్యేకంగా రూపొందించారు. బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే స్కూలుకి రావాల్సిందే. ఎందుకంటే ఛార్జ్ చేయడానికి అవసరమైన సోలార్ ప్యానెల్స్ పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. దీనివల్ల విద్యార్థులు తప్పనిసరిగా స్కూలుకి రావాల్సిన పరిస్థితి. బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటేనే రాత్రి వేళ ఇంట్లో చదువుకోగలరు. స్కూలుకి రాకపోతే ఆ రోజుకి చదువు, హోమ్ వర్క్ చేయడం సాధ్యం కాదు. ఈ ప్రాజెక్టు ఎంతగానో విజయవంతమైంది. అద్భుత ఫలితాలనిచ్చింది.


ఆంధ్రప్రదేశ్‌లోని ఓ స్కూలు విద్యార్థులతో సెల్కో బృందం

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ స్కూలు విద్యార్థులతో సెల్కో బృందం


పేదలు తమపై జాలి చూపించే నాయకులని కోరుకోవడంలేదు అంటారు హండే. వారికి తోడుగా నిలిచి, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించి, జీవితాలను మార్చుకోవడానికి అవసరమైన ఆసరా అందిస్తే... వారే అభివృద్ధి పథంలోకి వస్తారు అని తనకు శ్రీలంక పర్యటనలో తెలిసింది అని గర్వంగా చెబుతారు. ఇదే హండే ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రధానంగా ఉపయోగపడింది.


ఒబామాతో హరీష్ హండే (వెనక వరుసలో)

ఒబామాతో హరీష్ హండే (వెనక వరుసలో)


అవార్డులు, రివార్డులు

 • సెల్కో ఇండియా ద్వారా హరీష్ చేసిన, చేస్తున్న కృషికి, పరిశోధనలకు, సేవలకు ఎన్నో పురస్కారాలు ఆయనను వరించాయి. వీటన్నింటిలో ప్రముఖమైనది మెగసేసే అవార్డు. సౌర శక్తిని పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చేసిన కృషికి గాను హరీష్ హండేను 2011లో రామన్ మెగసేసే పురస్కారం వరించింది.
 • 2011లో కర్ణాటక ప్రభుత్వం నుంచి రాజ్యోత్సవ ప్రశస్తి అవార్డు
 • 2009 లో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీకి ఎఫ్ టీ ఆర్సెలర్ మిట్టల్ బిజినెస్ అవార్డు
 • బిజినెస్ టుడే ప్రకటించిన 21వ శతాబ్దంలో 21మంది యువ నాయకుల జాబితాలో చోటు
 • భారతదేశ ప్రగతిని మార్చగలిగే 50 మంది యువకుల జాబితాలో 2008 చోటు
 • తరిగిపోయే ఇంధన వనరుల వాడకాన్ని గణనీయంగా తగ్గించినందుకు ప్రతిష్టాత్మక యాష్ డెన్ అవార్డును రెండుసార్లు 2005, 2007 పొందారు... దీన్నే హరిత ఆస్కార్ (గ్రీన్ ఆస్కార్) అని కూడా పిలుస్తారు.
 • 2007 సంవత్సరానికి గాను స్వాబ్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ వారిచే సోషల్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు
 • 2007లో నంద్ అండ్ జీత్ ఖేమ్కా అవార్డు
 • 2005 – టెక్ మ్యూజియమ్ వారు ఇచ్చే ఎస్సెంచర్ ఆర్థికాభివృద్ధి అవార్డు
 • డిజైన్ ఫర్ ది అదర్ 90% ప్రదర్శనలో సెల్కో ఇండియాకి స్థానం.
 • ఇలా చెప్పుకుంటే ఎన్నో అవార్డులు, రివార్డులు హండే ఖాతాలో చేరాయి. ఈ అవార్డులు ఇచ్చే ఆనందం కన్నా తనకు పేదల ఇళ్లలో సెల్కో వెలుగులే ఎక్కువ సంతృప్తినిస్తాయంటారు హరీష్.
 • +0
Share on
close
 • +0
Share on
close
Share on
close

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India