Telugu

ఒకప్పుడు ఇంటింటికీ తిరిగి పాటలు పాడాడు.. నేడు 'ప్రిన్స్ ఆఫ్ గజల్'గా ఖ్యాతి గడించాడు

team ys telugu
6th Dec 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఒకప్పుడు తన గజల్స్ వినిపించడానికి ఇంటింటికీ తిరిగే వాడు రంజీత్. ఇప్పుడు వాటిని వినేందుకు దేశంలోని నలుమూలల నుంచి జనాలే వస్తున్నారు.

image


ప్రతిభ ఎవరి సొత్తూ కాదనేది సత్యం. అలాంటి ప్రతిభకు కష్టపడడేతత్వం కూడా తోడైతే.. ఇక విజయం కాళ్ల దగ్గరే పడి ఉంటుంది. ఇందుకు చేయాల్సిందల్లా ఒకటే మనల్ని మనం తెలుసుకోవడమే. మనలో చాలా మందికి వాళ్ల బలాలేంటో, బలహీనతలేంటో బాగా తెలుసు. కానీ వాటిని గుర్తించి మారేందుకు ప్రయత్నమే చేయరు. ఇక కళాక్షేత్ర రంగమైన సంగీతమూ ఇందుకు మినహాయింపేమీ కాదు. మన కళను నలుగురి దగ్గర ప్రదర్శిస్తున్నప్పుడు.. మనలో కొరవడిన లోపాలేవైనా ఉంటే జనాలకు అర్థమైపోతుంది. అందుకే అలాంటి లోపాలను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ.. కళకు సానబెడుతూ ముందుకు సాగాల్సిందే ! ఎంత గొప్పగా పాడినప్పటికీ.. పొరపాటున వాళ్లు చేసే చిన్నతప్పు- మొత్తం కార్యక్రమాన్నే నాశనం చేయొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్వరచక్రవర్తి రంజీత్ రజ్వాడా కూడా అలాంటి గొప్ప వ్యక్తే. తన పాటలతో ప్రపంచాన్ని మెప్పించగల సమర్థుడే. సంగీత మార్తాండుడితో.. శాస్త్రీయ సంగీతంతో ఉన్నత శిఖరాలకు చేరిన పండిత్ జస్‌రాజ్ లాంటి వాళ్లు కూడా రంజీత్‌ను తెగ మెచ్చుకుంటారు. రాబోయే రోజుల్లో ఇతగాడే గజల్‌కు భవిష్యత్ అంటూ కీర్తించిన సందర్భాలూ ఉన్నాయి. రాజస్తాన్ మట్టివాసను ఆసాంతం అస్వాదిస్తూ.. అక్కడే పుట్టిపెరిగి ఇంతవాడయ్యాడు రంజీత్. తాను పుట్టిన నేల కొంత సంస్కారాన్ని నేర్పిస్తే.. తల్లిదండ్రులు దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో అలవాటు చేశారు. తాను గజల్స్ పాడే ప్రతీ చోటా.. శ్రోతల హృదయాల్లో చెరగని ముద్రవేసే రంజీత్‌ను కళాప్రియులు ముద్దుగా 'ప్రిన్స్'‌, 'రాజకుమార్' అని కూడా పిలుచుకుని సంతోషపడ్తూ ఉంటారు.

ఓ సామాన్య గ్రామీణ యువకుడి స్థాయి నుంచి 'ప్రిన్స్ ఆఫ్ గజల్' అని పిలుపించుకునే స్థాయికి ఎదిగిన వైనాన్ని రంజీత్ యువర్ స్టోరీతో పంచుకున్నారు. తన కలను సాకారం చేసుకునేందుకు ముంబై రోడ్లపై తిరిగిన పాత రోజులనూ గుర్తుచేసుకున్నారు. ''నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి నేను పాటలు పాడడం మొదలుపెట్టానని మా ఇంట్లో వాళ్లు చెబుతారు. సంగీతం అబ్బడం మా ఇంట్లో వాళ్ల వల్లే సాధ్యమైంది. మా వంశంలో వాళ్లకు సంగీత సరస్వతి కటాక్షం ఉంది. మా నాన్నగారు ఉదయం 6.30 నుంచి 9 గంటల వరకూ సంగీత సాధన చేసేవారు. ఆ తర్వాత నన్ను స్కూల్‌లో దిగబెట్టి వచ్చేవారు. అలా ఆయనను చూస్తూ.. గొంతు కలుపుతూ.. కొన్ని సంవత్సరాల పాటు నాకు తెలియకుండా సాధన జరిగిపోయింది. ఏడేళ్ల వయస్సులోనే నాకు రాష్ట్ర స్థాయి అవార్డు, 12 ఏళ్లకే జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. ప్రతిభకు పోటీతత్వానికి ఉన్న తేడాను గమనించుకుంటూ.. నన్ను నేను మరింత మార్చుకుంటూ వచ్చాను''.

image


'సంగీతంలోనూ రియాల్టీ షోస్ అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతిభ దాగున్న ఎంతో మందికి బయటి ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. పోటీ కూడా బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మనుగడ సాధించడం కూడా చాలా ప్రధానం. 

ఈ విషయంలో '' నాకు నేనే పోటీగా భావిస్తాను. నిన్నటితో పోలిస్తే.. ఇవాళ నేను మెరుగ్గా చేశానా లేదా అనేది ముఖ్యం. ఎవరో గురించి ఆలోచించడం అనవసరం. ప్రతీ కళాకారుడూ.. తన ప్రత్యేకతను చాటుకోవడానికి జనం ముందుకు వస్తారు'' అంటారు రంజీత్.

రియాల్టీ షో రాటుదేల్చింది

సరిగమప అనే సంగీత ప్రధాన రియాల్టీ కార్యక్రమంలో ఆఖరి ఐదుగురు పోటీదారుల్లో రంజీత్ కూడా ఒకరు. అయితే ఈ షోలో టీవీకి పరిచయం కాకముందే తాను ఎంతో కొంత పేరుప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. రేడియో సహా వివిధ వేదికలపై తన గాత్రాన్ని వినిపిస్తూ.. వీక్షకులకు వీనులవిందు పంచేవారు. అయితే సరిగమప వంటి వేదికపై ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత తన జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది ? ''రియాల్టీ షోలలో పాల్గొంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. కోల్‌కతాలో రేడియోలో నా పాటవిన్న నిర్వాహకులు ఈ షో ఆడిషన్‌లో పాల్గొనాలని సూచించారు. ఆడిషన్ తర్వాత నేను ఎంపికయ్యాను. అయితే రియాల్టీ షోస్‌లో గజల్ పాడేవాళ్లను తీసుకోవడంపై అప్పట్లో కొద్దిగా సంధిగ్థత ఉండేది. ఎందుకంటే.. గజల్స్‌ను ఆదరించే వాళ్ల సంఖ్య తక్కువగా ఉంటుందనేది వాళ్ల ఆలోచన. అయితే కార్యక్రమం ముందుకు సాగేకొద్దీవాళ్ల ఆలోచన తప్పని నేను నిరూపిస్తూ వచ్చాను''.

image


రంజీత్ ఈ స్థాయికి అంత సులువుగా చేరుకోలేదు. ఎన్నో కష్టాల ఫలితంగానే ఇది సాధ్యమైంది. ఉనికిని చాటుకోవడానికి కూడా ఇబ్బందిపడిన రోజులను చూశారు. ''మా నాన్నగారు రాజస్థాన్ నుంచి ముంబై వలస వచ్చేసిన తర్వాత మాకు అక్కడ తెలిసిన వాళ్లు ఎవరూ లేరు. మా సామానంతా తీసుకుని.. వివిధ ప్రాంతాలకు వెళ్తూ.. పాటలు పాడేవాళ్లం. చాలాకాలం ఇలానే చేయాల్సి వచ్చింది. అప్పుడు పరిస్థితుల్లో కొద్దిగా మార్పు కనిపించింది. జనాలను మమ్మల్ని గుర్తించి, ఆదరించడం మొదలుపెట్టారు'' అంటారు రంజీత్.

నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ

ఈ గానాబజానా అనేది చాలా కష్టతరమైన విషయంగా రంజీత్ అభివర్ణిస్తారు. ఇక్కడ ప్రతీ రోజూ, ఇంకా చెప్పాలంటే జీవితాంతం.. ఒకేలా ఉంటుంది. నిన్నటిలానే నేడూ బతకాలి. నిత్యవిద్యార్థిలా ఉండాలి. ఇక నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, నాకు అన్నీ తెలుసు అని ఎప్పుడైతే అనిపించిందో.. అప్పుడు విరామం తీసుకోవడం ఉత్తమం అంటారు. జనాల ఆకాంక్షలను నేను ఆశీర్వదంగా భావిస్తాను. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడానికి నిత్యం నాతో నేను పోటీపడ్తూ ఉంటాననంటారు.

కళ విషయంలో ఒకరితో ఒకరు పోల్చుకోవడం సరైంది కాదు. ఈ రంగంలో ఎవరూ ఏదీ నేర్పించరు. ఇది నేర్పిస్తే వచ్చే విద్యకాదు. నేర్చుకోవాలనే బలీయమైన కాంక్షకు నిరంతర సాధనతోడైతేనే ఇది సాధ్యపడ్తుంది. ''ఎవరికి వారు వాళ్లలోని ఆ గానామృతాన్ని ఆస్వాదిస్తేనే దాన్ని ఇతరులకు పంచేందుకు వీలవుతుంది. కళాకారుడికి, ప్రేక్షకుడికి మధ్య బంధాన్ని పెంచేది కూడా ఇదే. ప్రేక్షకుల హర్షధ్వానాల్లో ఏవి నిజమైనవో.. కళాకారుడు గమనించగలడు. విజయాన్ని పొగరుగా తీసుకోకుండా.. ఓ ఆశీర్వచనంలా భావిస్తేనే ఎక్కువ కాలం మనుగడ సాధించగలం'' అని సూచిస్తున్నారు రంజీత్.

image


రంజీత్ ఇంకా యువకుడే. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు అతడిని ఆదరంగా ఆహ్వానిస్తోంది. గులామ్ అలీ, మెహద్ హసన్, జగ్‌జీత్ సింగ్ వంటి వాళ్లను ఆదర్శంగా భావిస్తారు. ఆశ్చర్యం ఏంటంటే జగ్‌జీత్ సింగ్, గులామ్ అలీ వంటి వాళ్ల తర్వాత ఆ స్థానాన్ని భర్తీచేయగల వాళ్లెవరూ ఇంతవరకూ పెద్దగా కనిపించలేదు. సమర్థులైన వాళ్ల కొరత ఈ రంగంలో ఇప్పటికీ ఉంది. కొత్త వాళ్లు ఇందులోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతగానో కనిపిస్తోంది.

''నిరంతర సాధన వల్ల సంగీతం నా జీవితంలో భాగమైపోయిందనిపిస్తోంది''.

'తేరే ఖయాల్ సే' అనే ఆల్బమ్ తర్వాత మరో ఆల్బమ్‌ తయారీలో బిజీగా ఉన్నారు రంజీత్. గజళ్లను ఆస్వాదించే ఎంతో మంది ఈ యువ గాయకుడి నుంచి ఎంతో ఆశిస్తున్నారు. ప్రిన్స్‌ ఆఫ్ గజల్స్‌గా పేరుతెచ్చుకున్న ఈ ఔత్సాహికుడు మరింత ఉన్నత శిఖరాలకు చేరి.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ.. వీనుల విందైన సంగీతాన్ని అందించాలని మనమూ ఆకాంక్షిద్దాం !

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags