సంకలనాలు
Telugu

మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా మొదలైన కెరీర్ రూ.900 కోట్ల సామ్రాజ్యానికి అధిపతిని చేసింది

Nagendra sai
10th Jul 2016
Add to
Shares
9
Comments
Share This
Add to
Shares
9
Comments
Share


పుట్టింది వరంగల్ జిల్లా హన్మకొండ, పెరిగింది కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, పాలిటెక్నిక్‌ చదివింది మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి. ఉద్యోగాన్వేషణ హైదరాబాద్‌లో. విస్తరించింది మాత్రం ఆంధ్రా, తెలంగాణ, బీహార్ రాష్ట్రాలతోపాటు శ్రీలంక, కిర్గిస్తాన్‌ వంటి దేశాల్లో. ఓ సాధారణ కుటుంబంలో పుట్టి మామూలు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఆ కుర్రాడు ఇప్పుడు రూ. 900 కోట్ల ఆస్తికి అధిపతి. వందల మంది ఉద్యోగులకు ఉపాధిని చూపిస్తూ, ఎంతో మందికి సాయం చేసే స్వచ్ఛంద సంస్థలకు సారధి. అతడే యెదుగిరి కిరణ్. సుచిర్ ఇండియా సిఈఓ.

సుచిర్ ఇండియా సంస్థ విలువ ప్రస్తుతం సుమారు రూ. 900 కోట్లపైగానే ఉంటుంది. కర్నాటక, తమిళాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 2000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్. వందల మంది ఉద్యోగులు. హనీబర్గ్, ప్యాపిరస్ ఫోర్ట్ వంటి థీమ్ బేస్డ్ కాన్సెప్ట్ రిసార్టులు. క్లబ్ రిపబ్లిక్ అనే పబ్.. అన్నీ గ్రూపులోని సంస్థలే. ఇదీ సింపుల్‌గా ఈ సంస్థ హిస్టరీ. అయితే ఈ సంస్థకు దశాబ్దాల చరిత్ర మాత్రం లేదు. రూ. 12 లక్షల పెట్టుబడితో మొదలైన ఈ కంపెనీ కేవలం 10 సంవత్సరాల్లోనే ఇప్పుడీ స్థాయికి చేరింది. రియల్ ఎస్టేట్ బూమ్‌, ఈ రంగంలో భారీ పెట్టుబడుల వల్ల కాదు.. ఓ వ్యక్తికి ఉన్న దూరాలోచన, తాను చేయాలనుకున్న దానిపై స్పష్టతే అతి తక్కువ సమయంలో విత్తనాన్ని వృక్షంలా మార్చింది.

వై. కిరణ్, సుచిర్ ఇండియా సిఈఓ

వై. కిరణ్, సుచిర్ ఇండియా సిఈఓఇదీ నేపధ్యం

కిరణ్‌ది వరంగల్ జిల్లా హన్మకొండ. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. కొద్దోగొప్పో స్థిరపడిన కుటుంబం. స్కూలింగ్ వరకూ వరంగల్, కరీంనగర్‌, అదిలాబాద్ జిల్లాల్లో సాగింది. వనపర్తి పాలిటెక్నిక్‌ కాలేజీలో డిప్లమో ఇన్ కామర్స్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్ - డిసిసిపి పూర్తైంది. అక్కడి నుంచి మళ్లీ వరంగల్ వచ్చి బికాం. ఈలోపు టైపింగ్, షార్ట్ హ్యాండ్‌లో కూడా ప్రవేశం. ఇదీ సింపుల్ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్.

చదువుతో సూపర్ స్టూడెంట్ అని చెప్పలేం కానీ.. ఫర్వాలేదు. కానీ కల్చరల్ యాక్టివిటీస్, ఫ్రెండ్స్, సర్కిల్‌ విషయంలో మాత్రం ఆ కుర్రాడికి వీర లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్. సీనియర్, జూనియర్లు, లెక్చరర్లు.. ఇలా తన,మన, వయోబేధమేదీ లేకుండా అందరితోనూ స్నేహాలే. ఒక్కోసారి పెద్దవాళ్ల ప్రోగ్రామ్స్‌కు కూడా ఇతగాడే ఆర్గనైజర్. వివిధ కార్యక్రమాలతో నెట్వర్క్ పెరిగింది. జానపద నృత్యాలు, స్టేజ్ నాటికలు, పద్యాలు వంటి వాటిల్లో చాలా అవార్డులూ వచ్చాయి. జిల్లా స్థాయిలో మంచి సర్కిల్ ఏర్పడింది. 'వాడు మనోడేరా బాబూ.. ! ' అనే స్థాయిలో చాలా మందిని తనతో కలుపుకుపోయాడు. కుర్రాడు బుద్ధిమంతుడులా ఉన్నాడంటూ స్నేహితుల తల్లిదండ్రులు కూడా మంచి మార్కులే వేశారు.

ఉద్యోగాల వేట

బికాం పూర్తైంది కానీ... దాంతో ఉద్యోగం రాదనిపించింది. పాత పాలిటెక్నిక్ డిగ్రీనే పెట్టుకుని హైదరాబాద్ డిఆర్‌డిఎల్‌లో అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అనుకోకుండా అక్కడి నుంచి పిలుపురావడంతో కొద్దికాలం డిఆర్‌డిఎల్‌లోని క్వాలిటీ కంట్రోల్ - అస్యూరెన్స్ విభాగంలో అప్రెంటిస్‌గా పనిచేశాడు. అక్కడ కలాం లాంటి వాళ్లను దగ్గరి నుంచి అప్పుడే స్ఫూర్తి పొందాడు. ఆ పని పూర్తైపోవడంతో మళ్లీ ఉద్యోగాల ప్రయత్నాలు. ఓ మూడు నెలల పాటు యునైటెడ్ బ్రువరీస్‌లో సేల్స్‌మెన్ ఉద్యోగం.

కానీ గ్రూప్స్, సివిల్స్ లాంటివి కొట్టి ఉన్నత స్థాయికి చేరాలనే తాపత్రయం. మళ్లీ ఊరెళ్తే ఏదో చిన్నతనంగా ఉంటుందనే భావన. మనోడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాడురా.. అంటూ సర్కిల్‌లో పేరొచ్చింది. ఇప్పుడెళితే వాళ్లందరి ముందూ వెయిట్ తగ్గుతుందేమోనని వెయ్యి లెక్కలు. కెరీర్‌లో ఇన్ని మార్పులు చేసుకుంటున్నా తల్లిదండ్రులు మాత్రం ఏమీ అడ్డుచెప్పలేదు. ఈ లోపు హైదరాబాద్ ఇమ్లిబన్ బస్టాండ్ దగ్గర ఓ చిన్న రూం తీసుకుని స్నేహితులతో కలిసి సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. మొదటి అటెంప్ట్‌లో ప్రిలిమ్స్ క్రాస్ అయ్యాడు. అయితే మెయిన్స్ దగ్గర బండి బోల్తా పడింది.

ఎల్ ఐ సి ..లైఫ్‌నే మార్చింది

ఇలా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న టైంలో ఎల్.ఐ.సి. ఎగ్జామ్స్ రాసి డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా సెలక్ట్ అయ్యారు. ఇంట్లో, ఊళ్లో ఒకటే సందడి. లైఫ్ సెటిల్ అయితే లైఫ్ ఇన్సూరెన్స్ జాబ్ వచ్చిందని. ఇక మరికాసేపట్లో జాయినింగ్ రిపోర్ట్ ఇద్దామనుకున్న తరుణంలో ఏదో గందరగోళం. 'పెద్ద పెద్ద ఆలోచనలతో ఉన్నత స్థాయికి ఎదగాలనుకునే నాకు ఈ ఉద్యోగం సరిపోతుందా ? ఇక్కడ చేరితే ఇక ఇలానే ఉండిపోతానా ? ప్రపంచాన్ని చూసే అవకాశం మిస్ అవుతానా ? ఇక నా జీవితం వరంగల్‌కే పరిమితం కావాలా ? ' అంటూ వంద ప్రశ్నలు. మదిని తొలిచేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేకపోయాడు.. ఇక అంతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.. జాయినింగ్ రిపోర్ట్ కవర్ అక్కడి రిసెప్షనిస్ట్ చేతిలో పెట్టి పరుగో.. పరుగు.. ఇప్పుడే వస్తానంటూ.. !

అయితే పెద్ద ఉద్యోగాన్ని వదులుకున్నాననే మాట తల్లిదండ్రులకు ఎలా చెప్పాలి, ఊళ్లో ఏ మొహం పెట్టుకుని తిరగాలి అని లోలోపల టెన్షన్. కానీ అయిందేదో అయిపోయింది.. మనకు అది రాసిపెట్టలేదేమో అనే ఊరడింపు. ఇదంతా 1996 వ్యవహారం. మళ్లీ సివిల్స్ ప్రిపరేషన్. అయితే ఈ సారి కఠోరమైన శిక్షణ అవసరమనే సంకల్పంతో అయ్యప్ప దీక్షను తీసుకున్నట్టు చెబ్తారు కిరణ్. అప్పుడైతే మనసు చంచలానికి గురికాకుండా ఉంటుందనే అప్పట్లో తనకు అనిపించడం వల్లే అలా చేశానంటారు. సివిల్స్‌లో రెండో అటెంప్ట్‌లోనూ ఫెయిల్.

రియల్ ఎస్టేట్‌లో సేల్స్ జాబ్ 

సివిల్స్ వైఫల్యం నుంచి తేరుకునేందుకు జనచైతన్య అనే రియల్ ఎస్టేట్ సంస్థలో హైదరాబాద్‌లో సేల్స్ ఆఫీసర్‌గా చేరారు. నెలకు రూ. 2000 జీతం, అది కూడా నాలుగు ప్లాట్లు అమ్మితేనే. చేతిలో డబ్బు లేదు. ఇంట్లో వాళ్లను అడుగుదామంటే ఎక్కడలేని నామోషీ. ఫ్రెండ్స్‌ను అడిగితే ఎక్కడ పరపతి తగ్గిపోతుందేమోననే భయం.

'' ఆఫీసుకు వెళ్లగానే అక్కడ బోర్డుపై ఓ వ్యక్తి ఫోటోపై టాపర్ అని ఉంది. దాన్ని చూసి నేను కూడా ఆ స్థానంలో ఉండాలనుకున్నా. ఎక్కడ చేరినా, ఏ పని చేసినా మనమే బెస్ట్ అనిపించుకోవాలనిపించింది. అందుకే మొదటి రోజు ఏమీ ఆలోచించకుండా హైదరాబాద్‌లో ఉన్న మా బాబాయి దగ్గరికి వెళ్లి రూ.4500 అడిగా. ఎందుకు ఏమిటి అని ప్రశ్నించినా ఏదో అవసరమని చెప్పా. చేతిలో రూ.4500 పడింది. అది మొదటి బుకింగ్. ఇంతకీ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి. స్క్వేర్ ఫూట్, స్క్వేర్ యార్డ్.. అంటే ఏంటో కూడా నాకు తెలియదు అప్పటికి. కానీ నేను నెంబర్ ఒన్ ఉండాలని తాపత్రయం. మా బాబాయికి చెప్పకుండా ఆయన పేరు మీద బుకింగ్ రాసేశా. వరంగల్‌లోని మా స్నేహితుడిని అన్నకు ఫోన్ చేసి తెగ సతాయించేశా. వాళ్లూ కాదనలేక ఇక్కడి వాళ్లకు ఫోన్ చేసి డబ్బు ఇప్పించారు. అది రెండో బుకింగ్. వాళ్లకూ ఏమీ చెప్పలేదు. వాళ్ల పేరు మీద ప్లాట్ బుకింగ్ రాసేశా'' అంటూ అప్పటి రోజులు గుర్తుచేసుకుంటారు కిరణ్.

ఆఫీస్ రాగానే అందరిలోనూ ఆశ్చర్యం. మొదటి రోజే ఈ కుర్రాడు రెండు బుకింగ్స్ ఎలా చేశాడు ? సైట్ చూడలేదు, బార్గైనింగ్ లేదు.. అంటూ ఎన్నో ప్రశ్నలు. అయితే ఇవేవీ పట్టించుకోలేదు. సంస్థ గురించి కొద్దో గొప్పో తెలుసుకున్నాడు. హైదరాబాద్ ఆదిభట్లలో ఆ వెంచర్ ఉందని చూశాడు. మొదట రూ.4500 కట్టి ఆ తర్వాత కంతుల వారీగా మిగతా మొత్తాన్ని కట్టాల్సి ఉందని లెక్కలు వేసుకున్నాడు. వెంటనే ఊరెళ్లిపోయాడు. అక్కడి స్నేహితులు, తల్లిదండ్రులు, తెలిసిన వాళ్లందరికీ వెళ్లి భూముల గురించి చెప్పి బుకింగ్ చేసుకొచ్చేశాడు. మొదటి నెలలోనే 45 బుకింగ్స్. వాళ్లలో చాలా మంది భూమిని చూడకుండా కేవలం.. ఆ కుర్రాడిపై నమ్మకంతో డబ్బు కట్టేశారు.

ఇక అప్పటి నుంచి ప్రతీ నెలా టాపర్‌గా బోర్డుకెక్కాడు. తనకు పట్టున్న వరంగల్, కరీనంగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో తిరుగుతూ ప్లాట్ల అమ్మకాలను పెంచాడు. కుర్రాడి జోరు చూసి సంస్థ అతి కొద్దికాలంలోనే డెవలప్‌మెంట్ మేనేజర్‌గా ప్రమోట్ చేసింది. వాస్తవంగా రియల్ ఎస్టేట్ అప్పటికి పెద్దగా అభివృద్ధి చెందలేదు. అధిక శాతం అవ్యవస్థీకృతంగా ఉండేది. ఒక ప్రొసీజర్ ఫాలో అయిన సంస్థలు బాగా తక్కువ. రియల్ ఎస్టేట్ అనగానే అదో మాస్ ఏరియాలాగా.. వాటిని నిర్వహించే వాళ్లను గుండాల్లాగా చూస్తున్న రోజులవి. ఇందులో మార్పు తీసుకురావాలని కిరణ్ బలంగా నిశ్చయించుకున్నారు. తానే సొంతంగా తన ఆధ్వర్యంలో స్నేహితులను ట్రైనీలుగా చేర్చుకున్నాడు. వాళ్లకు తనే ట్రైనింగ్ ఇచ్చాడు. కస్టమర్లకు డిటిపి చేయించిన న్యూస్ లెటర్స్ పంపడం, బ్రోచర్లు తయారు చేయించడం వంటివి చేశాడు. అన్నీ సొంత ఖర్చులతోనే. యురేకా ఫోర్బ్స్, ఎల్ ఐ సి వంటి వాటిల్లో ఉన్న మార్కెటింగ్ కాన్సెప్టులను తెలుసుకుని, వాటిని రియల్ ఎస్టేట్‌లో అమలు చేయడం మొదలుపెట్టాడు. చిన్న వయస్సులోనే బ్రాండింగ్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ వంటివాటిపై అవగాహన వచ్చేసింది. ఇక్కడే మెల్లిగా తన కంపెనీని ప్రమోట్ చేసుకుంటూ తానూ ఎదగడం మొదలుపెట్టాడు.

ఎదుగుతున్న క్రమంలో జనచైతన్య సంస్థలో యాజమాన్యం మధ్య గొడవలొచ్చి డైరెక్టర్లంతా విడిపోయారు. వాళ్లలో ఒకరితో కలిసి శ్రీమిత్ర అనే సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. ఇదే తన లైఫ్‌లో మేజర్ టర్నింగ్ పాయింట్.

రియల్ ఎస్టేట్‌కు కార్పొరేట్ హంగులు

శ్రీమిత్రలో ఉండగా రియల్ ఎస్టేట్‌పై మరింత అవగాహన పెంచుకున్నారు. వివిధ ప్రాంతాలు తిరిగి వాళ్లు అవలంభిస్తున్న విధానాలను ఇక్కడా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. కేవలం ప్లాట్ల కొనుగోళ్లు - అమ్మకాలకు పరిమితం కాకుండా హాస్పిటాలిటీ, టూరిజం వైపు అడుగులు వేశారు. మౌంట్ ఒపెరా వంటి వాటికి శ్రీకారం చుట్టారు.

image


సొంత వెంచర్ టైమొచ్చింది !

రియల్ ఎస్టేట్ రంగంలో సుమారు ఏడేళ్ల అనుభవం పొందాక సొంత వెంచర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. తన దగ్గర దాచుకున్న రూ.12 లక్షల డబ్బుతో 2006లో సుచిర్ ఇండియా అనే సంస్థను స్థాపించారు. ఐఐఎం గ్రాడ్యుయేట్లు స్థాపించిన మొబిస్ అనే సంస్థతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తయారు చేయించుకున్నారు. కంపెనీని ఒక స్థాయికి తీసుకెళ్లి ఐపిఓకు వెళ్లాలనేది అప్పట్లో కిరణ్ ఆలోచన. మొదటి ఏడాదిలో కంపెనీ ఏర్పాటులో నిమగ్నమై.. రెండో ఏడాదికల్లా బెంగళూరు, విశాఖ, విజయవాడ ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లు చేపట్టారు. మూడో ఏడాది బీహార్‌లో ఓ ఇన్ఫ్రా ప్రాజెక్టును కొనుగోలు చేశారు. మైనింగ్ సంస్థనూ స్వాధీనం చేసుకున్నారు. మొదటి మూడేళ్లలోనే సంస్థ టర్నోవర్ రూ.240 కోట్లు దాటిందని చెప్తారు కిరణ్.

అప్పట్లో రియల్ బూమ్ పీక్స్ ఉండడంతో 70 ఎకరాలున్న ల్యాండ్ బ్యాంక్‌ను ఏకంగా 1000 ఎకరాలకు పెంచుకున్నారు. శ్రీలంకలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్యాపిరస్ ఫోర్ట్, హనీబర్గ్ రిసార్ట్ వంటి థీమ్ బేస్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులను ఏర్పాటు చేసుకున్నారు. అన్నీ ఒకేసారి కలిసిరావడంతో ఇక మాత్రం వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోయారు.

''నేను జనచైతన్యలో చేస్తున్నప్పుడు ట్రైన్ పాస్ ఉండేది. మా ఆఫీస్ దిల్‌సుఖ్‌నగర్. చేతుల్లో డబ్బులు లేకపోతే చాలా సార్లు దిల్‌సుఖ్‌నగర్ నుండి సికింద్రాబాద్‌కు నడిచి వెళ్లాను. ఉన్న డబ్బులతో టీ తాగాలో, బిస్కట్ తినాలో తెలియక సతమతమైన సందర్భాలు ఎన్నో లెక్కచెప్పలేను. అలాంటి నేను పదేళ్లలో ఊహించనంత మార్పు చూశాను. టాప్ మోడల్ ప్రతీ కార్‌ను కొన్నాను'' అంటూ గతాన్ని గుర్తుచేసుకుని కొద్దిగా చలిస్తారు.

బ్రాండింగ్‌లో కింగ్ !

రియల్ ఎస్టేట్‌కు సైతం కార్పొరేట్ హంగులు పదేళ్ల క్రితం తీసుకురావొచ్చని ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి సమయంలో జాతీయ స్థాయి గుర్తింపు రావాలనే ఉద్దేశంలో చక్కటి స్ట్రాటజీ ఫాలో అయ్యారు. ట్వంటీ ట్వంటీ కప్ గెలిచిన క్రికెటర్లు అందరికీ తన వెంచర్‌లో ఉచితంగా ఫ్లాట్లను అనౌన్స్ చేశారు. వాళ్లందరినీ హైదరాబాద్ పిలిపించి మరీ ప్లాట్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. అదే సమయంలో ఇతర క్రీడాకారుల నుంచి కొద్దిగా అసంతృప్తి వెల్లడవడంతో ప్రపంచ కప్ గెలిచిన హాకీ క్రీడాకారులకు కూడా స్థలాలను ఇచ్చారు.

image


ఇక్కడ ఎవరికెంత భూమినిచ్చారు అనే సంగతి పక్కకుబెడితే ఆ దెబ్బకు సుచిర్ ఇండియా సంస్థకు వచ్చిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు.

''ఇది మా స్ట్రాటజీలో భాగం కావొచ్చు. బ్రాండింగ్‌కు ఈ పబ్లిసిటీ పనికొచ్చింది. దాన్ని మేం పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నాం. సేల్స్ మెన్ దగ్గరి నుంచి కస్టమర్ల వరకూ ఇది అందరికీ కలిసొచ్చింది '' - కిరణ్.

బూమ్ బద్దలయ్యాక వాస్తవం తెలిసొచ్చింది !

అంత వరకూ ఎదురులేకుండా వెళ్లిన కిరణ్‌కు 2009-10 క్రైసిస్ కోలుకోలేనంత షాక్ ఇచ్చింది. అనూహ్యమైన డైవర్సిఫికేషన్‌తో వివిధ ప్రాంతాల్లో భూములు, వివిధ రంగాల్లోకి వెళ్లడం భారమైంది. ఏటా రూ. 200-300 కోట్ల టర్నోవర్ సాధించే కంపెనీకి కొన్ని నెలల పాటు జీరో రెవన్యూ స్థాయికి పడిపోయింది. ఇది నిజం. భూముల అమ్మకాలు పడిపోవడం, క్యాపిటల్ అంతా బ్లాక్ అయిపోవడంతో కష్టాలన్నీ ఒకే సారి కలిసొచ్చాయి. వివిధ శాఖల నుంచి డిమాండ్ నోటీసులు, ఉద్యోగుల జీతాలు, నిర్వాహణ, అప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలు.. ఇలా ఒకదానిపై ఒకటి నెత్తిన పడే సరికి ఊపిరాడని స్థితి వచ్చింది. అలా నాలుగైదేళ్ల పాటు నిత్యనరకం అనుభవించానని లోలోపల బాధను పంచుకున్నారు కిరణ్.

''కుదుర్చుకున్న ఒప్పందాలను నెరవేర్చలేకపోయాను. కస్టమర్లకు ఇబ్బందులు కలిగాయి. రిజిస్ట్రేషన్ల దగ్గర పనులు ఆగిపోయాయి. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ తీవ్రంగా ప్రభావితం కావడంతో నేను, నా కంపెనీ అందుకు మినహాయింపు కాదని అర్థమైంది. అప్పట్లో నేను చేసిన చాలా పొరపాట్లు తెలిసొచ్చాయి. ఒకసారి ఐటి నుంచి రూ. 17 కోట్ల డిమాండ్ నోటీస్ వస్తే.. అప్పుడు నా దగ్గర రూ.17 లక్షలు కూడా లేవు. చాలా చోట్ల భూములను నేను కొన్న ధర కంటే తక్కువకే అమ్ముకుని పరిస్థితుల నుంచి కంపెనీని గట్టెక్కించుకున్నాను. నా లైఫ్ స్టైల్ చూసి నేను చెప్పేది అబద్ధమని చాలా మంది అనుకున్నారు. కానీ వాస్తవాలేంటో నా ఒక్కిడికి మాత్రమే తెలుసు '' - కిరణ్.

ఏం నేర్చుకున్నా -

మెంటర్ లేకపోవడం చాలా పెద్ద మైనస్.

నా ఆలోచనలతో సంస్థను ఒక స్థాయికి వరకే తీసుకెళ్లగలిగా.

నా జోరుకు అడ్డువేసే స్పీడ్ బ్రేకర్ ఏదైనా ఉండి ఉంటే.. బాగుండేదనిపించింది.

గ్రోత్ రూఫ్ హిట్ అయ్యాక.. అక్కడే నిలబడిపోయాను. ఎవరైనా హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి గైడ్ చేయగలగి ఉంటే క్రైసిస్ నుంచి ఇంకా త్వరగా కోలుకుని ఉండే వాడిని.

హోలిస్టిక్ పర్‌స్పెక్టివ్‌తో పాటు 360 డిగ్రీ వ్యూలో మన గురించి అన్నీ తెలిసిన వ్యక్తుల సలహాలు మనకు ఉపయోగపడ్తాయి.

ఇప్పుడేంటి ?

నాలుగైదేళ్ల క్రైసిస్‌ను తట్టుకుని సుచిర్ ఇండియాను నిలబెట్టారు కిరణ్. రియల్ ఎస్టేట్‌లో మొదటి ఐఎస్ఓ సర్టిఫైడ్ సంస్థగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఎన్నో వినూత్న బ్రాండింగ్, మార్కెటింగ్ కాన్సెప్టులను తీసుకొచ్చిన సుచిర్ ఇండియాను కన్సాలిడేషన్ టైంలో మెరుగ్గానే హ్యాండిల్ చేశానంటారు కిరణ్. అయితే ఐపిఓకు వచ్చి తాను అనుకున్నంత వేగంగా పనులు చేయలేకపోయినందుకు కొద్దిగా ఆవేదన పడ్తారు. ఇప్పుడు హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మెల్లిగా కోలుకోవడంతో మళ్లీ కొత్త ప్రాజెక్టుల దిశగా సుచిర్ అడుగులు వేస్తోంది. పాత జ్ఞాపకాల నుంచి చాలా విషయాలు నేర్చుకుని మళ్లీ అలాంటి తప్పిదాలు చేయకుండా జాగ్రత్తపడ్తోంది.

సోషలైటే కాదు.. సోషల్ యాంగిలూ ఉంది -

పోస్టర్ బాయ్‌గా పేజ్ త్రీ సర్కిల్‌లో చాలా మందికి బాగా పరిచయం ఉన్న కిరణ్ గురించి చాలా మందికి తెలియదు. చాయ్, బిస్కెట్ కోసం కూడా చాలాసార్లు ఆలోచించిన తను హైఫై స్టైల్‌లో సెలబ్రిటీ పార్టీలూ ఇచ్చారు. కానీ ఇదే జీవితం కాదనుకుని విశ్వభారతి ఫౌండేషన్‌ను స్థాపించి రెండు గ్రామాలను ఏడెనిమిదేళ్ల క్రితమే దత్తతు తీసుకున్నారు. ప్రతీ ఏటా వందల మంది విద్యార్థులకు సుచిర్ ఫౌండేషన్ కింద స్కాలర్‌షిప్పులనూ ఇస్తున్నారు. కిరణ్‌లోని విభిన్న కోణాలను గుర్తించిన బల్గేరియా దేశం అతడిని తమ దేశానికి హానరరీ కాన్సుల్ హోదానిచ్చింది.

వివిధ దేశాలు తిరిగి అక్కటి టూరిజం, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీపై అధ్యయనం చేసిన కిరణ్.. ఈ రంగంపై తన పట్టును చాటే విధంగా మూడు పుస్తకాలను కూడా రచించారు.

ఔత్సాహికులకు ఏం చెబుతారు ?

ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలని అనకున్నప్పుడు, అందులోని కేస్ స్టడీస్‌ తీసుకుని క్షుణ్ణంగా అధ్యయనం చేయండి.

అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా నిలదొక్కుకోవాలో ముందే ప్లాన్ చేసుకోండి.

పర్ఫెక్ట్ ఎడ్వైజరీ సర్వీసెస్‌ను ఉపయోగించుకోండి. మన కామన్ సెన్స్ ఒక్కటే కంపెనీని నిలబెట్టలేదు.

మెంటర్స్‌ను వెతికిపట్టుకుని వాళ్ల సలహాలు తీసుకోండి.

ఫండమెంటల్స్, ఫౌండేషన్ ఎప్పుడూ మరిచిపోవద్దు. తెలిసి ఎలాంటి తప్పూ చేయొద్దు.

మనం వేసుకునే పునాదే మనల్ని, మన సంస్థని, మన ఉద్యోగులను, మనపై ఇతరులు పెట్టుకున్న నమ్మకాలను నిలబెడ్తుంది. 

Add to
Shares
9
Comments
Share This
Add to
Shares
9
Comments
Share
Report an issue
Authors

Related Tags