జైపూర్ ఫుట్ ముందు వైకల్యమూ పాదాక్రాంతమే

0 CLAPS
0

1969లో ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన జైసల్మేర్ కలెక్టర్ దేవేందర్ రాజ్ మెహతా, 5 నెలల పాటు అసుపత్రిలో ఉండాల్సిన పరిస్ధితి ఏర్పడింది. సుమారు 43 ముక్కలైన ఆయన కాలి ఎముకను చూసి, ఆయన బతకడం కూడా కష్టమని అనుకున్నారు డాక్టర్లు. కాని ఆయనతో సమాజ సేవ చేయించాలని అనుకున్న దేవుడు ఆయనకు మళ్లీ ప్రాణం పోసాడు.


జైపూర్ ఫుట్‌తో డాక్టర్ దేవేంద్ర మెహతా

కాస్త కోలుకున్న దేవేందర్ మెహతాని తదుపరి ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లాలని సూచించారు డాక్టర్లు. అయితే అమెరికా లో వైద్య ఖర్చులు భరించలేని వారి పరిస్ధితి ఏంటని ఆలోచించారు. ఆ ఆలోచనతోనే పేద వికలాంగుల సహాయం కోసం ‘భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయతా సమితి’ (BMVSS) స్ధాపించారు.


అప్పటి రాష్ట్రపతి నుచి పద్మభూషణ్ సత్కారం పొందుతున్న దేవేందర్ రాజ్ మెహతా

“ఓ మంచి ఉద్దేశంతో 1975 లో ప్రారంభమైన BMVSS కేవలం వికలాంగులకు శారీరకరంగానే కాకుండా సామాజిక మరియు ఆర్ధికంగా కూడా వారిని స్ధిరపరచాలనే ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు దేవేందర్ మెహతా”. అలాంటి వారిలో చైతన్యంతో పాటు స్వీయ గౌరవం పెరిగే విధంగా కృషి చేస్తూ, ఆర్ధికంగా స్థిరపడే విధంగా వారి జీవితాన్ని మార్చాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచనతోనే వీలైనంత మందికి ఉచితంగా కృత్రిమ అవయవాలను అమర్చాలనే ఉద్దేశంతో ముందుకు కదిలాము. నోబెల్ గ్రహిత డాక్టర్ అల్బర్ట్ స్వేట్జర్‌తో ప్రభావితమైన దేవేందర్ మెహతా, సమాజం కోసం ఏదైన చేయాలని ఆలోచించేవారు.

‘జైపూర్ ఫుట్’

BMVSS స్ధాపించిన ఏడేళ్ల ముందే ‘జైపూర్ ఫుట్’ అక్కడి ‘సవాయి మాన్ సింగ్’ అసుపత్రిలో అందుబాటులో ఉంది. ఈ జైపూర్ కాలు BMVSS సంస్ధ తరపున ఉచితంగా అమర్చబడుతుంది.

“ జైపూర్ కాలుతో ఓ వ్యక్తి నడవడం, పరిగెత్తడం, సరిగ్గా కూర్చోవడం, తన రోజు వారి అవసరాలు సులువుగా చేసుకోవచ్చు, దాని పనితీరు కారణంగా ప్రపంచంలోనే ఎక్కువ వాడే ప్రాస్ధెటిక్ ఫుట్‌గా పేరుపొందింది.”- డాక్టర్ దేవేందర్ మెహతా.

పేద కుటుంబాలు ఏ కులం, మతం, జాతీ తేడా లేకుండా వారికి ఉచితంగా ఈ సేవలను అందిస్తుంది BMVSS, పేషెంట్‌ని దృష్టిలో పెట్టుకుని చేసే వీరి సేవలు, కొత్తగా కృత్రిమ అవయవాలు పెట్టుకున్న వారికి ఒకేషనల్‌ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. వారికి స్వయం ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తుంది. మారుమూల గ్రామాల్లో కూడా వెళ్లి సేవలు అందిస్తున్న BMVSS, దేశ వ్యాప్తంగా 22 సెంటర్లతో తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.


జైపూర్ కాలును బిగిస్తున్న వైద్యుడు

పేదలకు ఇలాంటి సేవలు అందించడంతో పాటు కృత్రిమ అవయవాలను తక్కువ ఖర్చుతో మరింత బాగా సర్విస్ ఇచ్చే విధంగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇండియాతో పాటు విదేశాల్లో ఉన్న ప్రముఖ కంపెనీలతో పొత్తు పెట్టుకున్న BMVSS, తమ సంస్ధలో ఈ అజెండాపై పని చేసే ఆర్ ఆండ్ డీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంతే కాకుండా క్యాలిఫోర్నియాలోని స్టాండ్‌ఫర్డ్‌ యూనివర్సిటి, కేంబ్రిడ్జ్‌లోని ఎంఐటీ, వర్జీనియా టెక్ యునివర్సిటీ, మన దేశంలోని ఐఐటీలు, ఇస్రో వంటి ప్రముఖ సంస్ధలతో భాగస్వామ్యాన్ని పెట్టుకున్నారు.

“ప్రస్తుతానికి మా కృషి ఫండింగ్ పై ఉంది, ప్రభుత్వం ఇచ్చే ఫండింగ్ ఏ మాత్రం సరిపోదు, అందుకు ఆర్థికంగా బలంగా ఉన్న పేషెంట్ల విరాళాలు కూడా ఉపయోగపడుతాయి”- మెహతా

ఇక మీ సక్సెస్ స్టోరీస్ ఎంటని అడగగా, అంగ వైకల్యం నుండి బయటపడి, తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ, ఆర్ధికంగా కూడా తమ పేషేంట్లు స్ధిరపడటమే మా సక్సెస్ స్టోరీలని అంటున్నారు దేవేందర్ మెహతా. అంతే కాకుండా ఓ రోడ్డు ప్రమాదంలో తన కాలు పోగొట్టుకున్న నటి, డాన్సర్ సుధా చంద్రన్ కూడా జైపూర్ ఫుట్ పెట్టుకుని తన కేరీర్ ఓ డాన్సర్‌గా, ఓ నటిగా కంటిన్యూ చేసారు, ఆమె అందరికి ఓ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటారు మెహతా.

అవార్డులు, ప్రశంసలు

ఇక సంస్దతో పాటు సంస్ధ నిర్వహకులకు కూడా అనేక అవార్డులు దక్కాయి, 2008లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మ భూషణ‌తో సత్కరించింది. 1982 లోBMVSS కు ఉత్తమ సంస్ధగా జాతీయ అవార్డుతో సత్కరించారు.

ప్రస్తుత భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత సమితి, వికలాంగుల కోసం ప్రత్యేకంగా సేవ చేస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద సంస్ధ, 1975లో సంస్ధ ప్రారంభం నుండి, సుమారు 14.5 లక్షల పేషేంట్లకు అండగా నిలిచింది.

ఇక సమాజానికి డాక్టర్ మెహతా ఇచ్చే సందేశం ఏంటంటే.. ఇతరుల బాధను సొంతంగా భావించి వారికి సహాయపడితే అందులో దక్కే సంతోషాన్ని దేనితో కూడా పోల్చలేమని అంటున్నారు.